భారత దేశ విభజన విషాద గాథ, హిందూ, సిక్కుల పై హత్యాకాండ - Tragedy of Partition in India, Massacre of Hindus and Sikhs

Vishwa Bhaarath
భారత దేశ విభజన విషాద గాథ
భారత దేశ విభజన విషాద గాథ
– – హెచ్. వి. శేషాద్రి
1703-1762 కాలంలో `షా వహియుల్లా దెహ్లవి’ భారతలో వహాబీ ఉద్యమం ప్రారంభించి, ప్రపంచంలో ముస్లిములు వేరే ప్రత్యేక సముదాయమని, భారత ముస్లిములు అందులో భాగమని మతబోధ మొదలు పెట్టాడు. 
  • అతని కొడుకు `షా అబ్దుల్ అజీజ్’(1746-1822) భారత్ ను `దార్-ఉల్-హర్బ్’ అని ప్రకటించాడు.అతను 80,000 వహాబీ సైన్యాన్ని సృష్టించి, సిక్ఖులపై దాడి చేసాడు; సిక్ఖుల చేతిలో ఓడిపోయి,బ్రిటిషువారిపై దాడికి దిగారు. బ్రిటిషువారు అప్పటినుంచి వ్యూహాత్మకంగా ముస్లిములను లోబరుచుకుని, తమవైపు తిప్పుకోసాగారు. బ్రిటిషువారి విశ్వాసపాత్రుడైన `సర్ సయెద్ అహ్మద్ ఖాన్’ 1875లో అలీగడ్ ముస్లిం విశ్వవిద్యాలయo ప్రారంభించాడు.  
  • అతను హిందువులను నమ్మించడానికి 1884లో, హిందువులు, ముస్లిములు, క్రిస్టియన్లు అందరూ హిందూదేశంలో భాగమని ప్రకటించాడు.అతనే 1888సంవత్సరానికల్లా, హిందువులు ముస్లిములు కలిసి బ్రతకలేరని,ఒకరు ఇంకొకరిపై విజయo సాధించాలని అన్నాడు.
  •  1904లో బెంగాల్ విభజన, పధకం ప్రకారం ప్రారంభమై, 1905లో విభజన జరిగింది. సర్ హెన్రీ కాటన్ “భారత ఐక్యతను చెడగొట్టడమే విభజన ప్రధాన ఉద్దేశం” అన్నాడు. నవాబ్ సలీముల్లాఖాన్ కి  రూ.1లక్ష లంచంగా ఇచ్చారు, కాని నవాబు తమ్ముడు ఖ్వాజా అతికుల్లా, ముస్లిము సముదాయం విభజనకి వ్యతిరేకమని ప్రకటించాడు.
  •  బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా `వందేమాతరం’ ఉద్యమం విస్తరించింది. 16అక్టోబర్ 1905 తేదీన, 50000 మంది ప్రజలు గంగానది తీరాన రక్షాబంధనం కార్యక్రమంలో పాల్గొన్నారు. లాల్-బాల్-పాల్ త్రిమూర్తులుగా ఉద్యమాన్ని నిర్వహించారు, రవీంద్రనాథ్ టాగోర్, ఇతర నాయకులు ముందు నడిచారు. `వందేమాతరం’ మంత్రమై దేశాన్ని ఉత్తేజపరిచింది, ప్రజల్ని మేల్కొలిపింది.
  •  కులం-మతం ప్రభావం ప్రజల్లో తగ్గుతోందని గమనించి, మింటో-మోర్లీలు 1906లో `ప్రత్యేక నియోజకవర్గం ప్రణాళిక’ సిద్ధం చేసారు.
ముస్లిం లీగ్ స్థాపన:
30 డిసెంబర్1906 తేదిన, ఆగాఖాన్ శాశ్వత అధ్యక్షతన, నవాబ్ సలీముల్లాఖాన్ నాయకత్వాన, `ముస్లిం లీగ్’ ప్రారంభమైంది. ఆగాఖాన్ షియా ఇమామ్ లలో, 48వ తరం వాడు.
ముస్లిం లీగ్ ముఖ్యోద్దేశాలు:
  • అ. బ్రిటిషువారి పట్ల అమితమైన విశ్వాసం
  • ఆ. ముస్లిముల రాజకీయ హక్కుల పరిరక్షణ
  • ఇ. పై రెండు ఉద్దేశాలకి లోబడి, ఇతర వర్గాలతో సఖ్యత.
అయితే పై ఉద్దేశాలకి సంబంధం లేకుండా, `లాల్ ఇష్తెహార్’ కరపత్రం సభ్యులకి పంచబడింది. దానిలో “ముస్లిములారా మేలుకోండి, హిందువులతో కలిసి ఒకే స్కూల్లో చదవకండి, హిందువుల దుకాణాల్లో ఏమీ కొనకండి, హిందువుల చేతులతో తయారైన ఏ వస్తువు ముట్టుకోకండి, హిందువులనిపనిలో పెట్టుకోకండి, హిందువుల కింద పనిచేయకండి. మీరు జ్ఞ్యానం పొందితే, హిందువులను నరకానికి (జెహన్నుం)పంపవచ్చు. మీ సంపద దోచుకుని హిందువులు ధనవంతులయారు. మీరు వివేకవంతులైతే, హిందువులు తిండిలేక మాడి, త్వరలో ముస్లిములు అవుతారు” నేటి బంగ్లాదేశ్ లోని కొమిల్లా ఊర్లో, 4మార్చ్ తేదీన, మతఘర్షణలు, బలాత్కారాలు, దోపిడీ మొదలయ్యాయి. లాల్-బాల్-పాల్ నేతృత్వంలోని వందేమాతరం ఉద్యమ విజయంతో, బ్రిటీషు ప్రభుత్వం వెనకడుగు వేసి, బెంగాల్ విభజన రద్దు చేయక తప్పలేదు. ముస్లింలీగ్ దిగ్బ్రమ చెందింది. ఆగాఖాన్ రికార్డు ప్రకారం,మహమ్మద్ అలీ జిన్నా అనే లాయరు `ప్రత్యేక నియోజకవర్గం ప్రణాళిక’ను వ్యతిరేకించాడు.
   ఈ దశలో భారత స్వాతంత్ర్యోద్యమo ప్రపంచవ్యాప్తమవుతోంది. శ్యాంజీ కృష్ణవర్మ, లాలా హర్దయాళ్, రాశ్ బేహారి బోస్, వీర్ సావర్కర్, మేడం కామా, ఢిoగ్రా మొదలైన భారతీయ ఉద్యమ నాయకులు, భారత స్వేచ్చాస్ఫూర్తిని ప్రపంచమంతా వినిపించారు. 1910లో ఖుదీరాంబోస్ అనే 18సం. కుర్రవాడు, బ్రిటిష్ అధికారి కింగ్స్ ఫోర్డ్ మీద బాంబు విసిరాడు. అతని తెగువకి దేశం నివ్వెరపోయింది.
  ముస్లిం వేర్పాటువాద ఖండన:
స్నేహితులు, కవులు, విప్లవకారులు బిస్మిల్- అష్ఫాక్ లను ఒకే రోజు వేర్వేరు జైళ్లలో ఉరితీశారు.  తిలక్ `గణపతి ఉత్సవ మండళ్ళు, శివాజీ జయంతి ఉత్సవాలు” ఏర్పాటుకు కాజీ సైఫుద్దీన్ మద్దతు పలికాడు. `టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక శివాజీ ముస్లిం వ్యతిరేకి అని ప్రకటించింది. ముల్లా-మౌల్వీల తీరుకు వ్యతిరేకంగా మరికొంతమంది ముస్లిములు ముందుకొచ్చారు.
  కాంగ్రెస్ పార్టీ ముస్లిం - సంతుష్టీకరణ వైఖరి:
  • 1888లోనే హిందువులు లేక ముస్లిములు వ్యతిరేకించే ఏ విధానాన్నికూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టదని అధ్యక్షుడు బద్రుద్దీన్ త్యాబ్జీ ప్రకటించాడు. కాంగ్రెస్ 1899నుంచే ముస్లిములకి ఉచిత టికెట్లు ఇచ్చేవారని స్వామీ శ్రద్ధానంద చెప్పారు.
  • 1916లో జరిగిన లక్నో-ఒప్పందం ప్రకారం “ప్రత్యేక నియోజకవర్గం ప్రణాళిక”ను తిలక్ వంటి రాజకీయ ఉద్ధండులు కూడా సమర్థించారు.  అప్పటి జాతీయ నాయకులలో మదన్ మోహన్ మాలవీయ ఒక్కరే వ్యతిరేకించారు.
  • 1919 `ఖిలాఫత్ ఉద్యమం’ టర్కీలో `కెమాల్ పాషా’ను తిరిగి ఖలిఫాను చేయడానికి ఇక్కడ భారత్ లో ఖిలాఫత్ ఉద్యమం మొదలైంది. ముస్లిం దేశాలలో ఉదారవాద సంస్కరణలు జరగాలని చెప్పిన`జమాలుద్దీన్ ఆఫ్ఘాని’కి కేమాల్ అనుచరుడు. ఈ సంగతి తెలియక, కాంగ్రెస్ పార్టీ `ఖిలాఫత్ ఉద్యమం’ లో చేరాలని, ముస్లింలీగ్ పట్టుబట్టింది. గాంధీగారు ఖిలాఫత్ కి మద్దతునిస్తూ `సహాయ నిరాకరణోద్యమాన్ని’ ప్రారంభించారు. తిలక్ లాంటి నాయకుడు కూడా దీనికి సహకరించారు.స్వామీ శ్రద్ధానంద జామామస్జిద్ నుంచి ప్రసంగించారు. ఆగాఖాన్, ఆమిర్ అలీ, కెమాల్ పాషాను కలిసినప్పుడు ఆయన “ఇస్లాం పరాజితులైన వారి మతం” అని, టర్కీని ఇస్లామిక్ మతరాజ్యంగా కాక,  `లౌకిక’ దేశంగా ప్రకటించారు!
  • మొదట్లో ముల్లాలు, మౌల్వీలు పెద్ద సంఖ్యలో గాంధీగారికి మద్దతిచ్చారు. ఇంత పెద్దసంఖ్యలో ముల్లాలు రాజకీయాల్లో చేరడంపై కొంచెం బెదిరిన జిన్నా, గాంధీగారి ఈ చర్యని వ్యతిరేకించడం ఆసక్తికరం.
ఖిలాఫత్ అనంతర పరిణామాలు
కేరళ మోప్లా ప్రాంతంలో, ముస్లింలు హిందువుల మీద పెద్దఎత్తున దాడులు, విధ్వంసం చేసారు. `సర్వెంట్స్ అఫ్ ఇండియా’ సంస్థ గణాంకాల ప్రకారం,1500మందిని ఊచకోత కోశారు, 20000మందిని మతమార్పిడి చేసారు, 1లక్షమంది ఇళ్ళనుంచి తరిమేయబడ్డారు. గర్భవతులు, ఆవులను కూడా వదిలిపెట్టలేదు. హిందూ, సిక్కు మగవాళ్ళను హత్యచేసి, ఆడవారిని పెళ్ళిళ్ళు చేసుకున్నారు. గాంధీగారిని `కాఫిర్’ అని ప్రకటించారు.
   ఈ కాలం గురించి స్వామీ శ్రద్ధానంద ఇలా వ్రాసారు “జాతీయవాద ముస్లిములు కూడా `మోప్లా’కు మద్దతిచ్చారు.  గాంధీగారు `ముస్లిములు మత-పరాయణులు, ఇస్లాం మీద వారి అవగాహన ప్రకారం వారు ప్రవర్తించారు’ అన్నారు. `అనిబిసెంట్’ గాంధీగారిని తప్పుబట్టారు. తరువాత కాంగ్రెస్ ఖిలాఫత్ కి దూరంగా జరిగింది. అయితే మార్క్సిస్టు చరిత్రకారులు మాత్రం `మోప్లా’ని `జాతీయవాద’ ఉద్యమంగా పేర్కొనగా, కేరళ ప్రభుత్వం 1971లో వారిని `స్వాతంత్ర్య యోధులు’గా గుర్తించింది”.
   ఒకప్పటి `స్వరాజ్ పార్టీ’ వ్యక్తి `సుహ్రావర్ది’ 1925లో ఇలా వ్రాసాడు – `ప్రతి సంవత్సరం ఇస్లాం వేలాదిమంది హిందువులని నామరూపాలు లేకుండా చేస్తుంది. హజ్ యాత్రకి మక్కా వెళ్ళినవారు స్వచ్చంగా తిరిగివచ్చి, అరేబియన్లలాగా జీవిస్తారు. వారికి మిగతా హిందువులకి చాలా వ్యత్యాసం అప్పుడు కనిపిస్తుంది’.
  పునరాగమనం –`ఘర్ వాపసి’:
ఇస్లామిక్ మతమార్పిడులు అరికట్టలేకపోతే, హిందువుల మనుగడ ఉండదని స్వామీ శ్రద్ధానంద గ్రహించారు. 18000 ముస్లిములను 1923లో ఆయన హిందూమతంలోకి తిరిగి రప్పించారు. `తబ్లిగ్’ ఆచరించే ముస్లిములను కాంగ్రెస్ ప్రోత్సహిస్తూ, అదే సమయంలో`శుద్ధి ఉద్యమం’లోని హిందువులను నిషిద్ధంగా పరిగణించేదని ఆయన అర్ధం చేసుకున్నారు. అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి 1926లో స్వామీజీని హత్య చేసాడు. ఒకరిపై విద్వేషం రెచ్చగొట్టే వాళ్ళే నేరస్థులని చెప్తూ, గాంధీగారు రషీద్ కి మద్దతు ప్రకటించి, `సోదరుడు’ అని సంబోధించి, కాంగ్రెస్ నాయకుడు లాయరు `అసఫ్ అలీ’కి ఈ కేసును వాదించమని అప్పచెప్పారు. భగత్ సింగ్ జీవితం కాపాడమనే అభ్యర్ధనకి గాంధీగారు సంతకం పెట్టడానికి నిరాకరించారని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్, గురుగోవింద్ సింగ్ మొదలైన వారిని `దారితప్పిన దేశభక్తులు’ అన్న గాంధీగారు, రషీద్ ని `సోదరుడు’ అని పేర్కొన్నారు.
1924లో ప్రతి హిందూ పండుగ మీద దాడి జరిగింది; `యంగ్ ఇండియా’ పత్రికలో వ్రాస్తూ గాంధీగారు ఇలా అన్నారు – “నా అనుభవంలో, సాధారణంగా ముస్లింలు ‘రౌడీల’ లాగా ప్రవర్తిస్తారు, సాధారణ హిందువులు `పిరికివారు’. హిందువులు తమ పిరికితనానికి ముస్లిములను అనడం ఏమి న్యాయం? పిరికివాళ్ళున్న చోట రౌడీలు పుట్టుకొస్తారు.”
  కోహాట్ లో హిందువుల ఊచకోత
NWFP ప్రాంతం- 5%మాత్రమే హిందూ జనాభా ఉన్న ‘కోహాట్’ అనే చిన్న ఊరులో 150మంది హిందువులను ఊచకోత కోశారు. మిగిలిన వారు కట్టుబట్టలతో 320కి.మీ దూరంలో ఉన్న రావల్పిండి పారిపోయారు. హిందూ-ముస్లిముల సఖ్యత సాధించలేక, గాంధీగారు 21 రోజులు నిరాహారదీక్ష చేసారు. మహదేవ్ దేశాయిగారు దీక్ష ఎందుకు అని అడగగా “హిందువులు నన్ను అపార్థం చేసుకోవచ్చు,  ముస్లిం గూండాలవల్ల హిందూ స్త్రీలు ప్రాణభయంతో బ్రతుకుతున్నారు. హిందువులని సహనంతో ఉండమని నేనెలా అనగలను? నా మాట ఎవరు వింటారు? అయినా నేను ఇప్పుడు కూడా మరణానికి సిద్ధపడండి కాని, ఎవరినీ చంపవద్దనే హిందువులకి చెపుతాను” అన్నారు.
   1924 ఏప్రిల్ 18 న రవీంద్రనాథ్ టాగోర్, `టైమ్స్ ఆఫ్ ఇండియా’లో వ్రాసారు “ముస్లిములు వారి దేశభక్తిని ఒక దేశానికి పరిమితం చేసుకోలేరు.” 1924లో లాలా లాజపత్ రాయ్, సిఆర్ దాస్ కి లేఖ వ్రాస్తూ అన్నారు, “7కోట్ల భారతీయ ముస్లిములంటే కాదు భయం, కానీ 7కోట్లు+సాయుధులైన ఆఫ్ఘానిస్తాన్, మధ్య ఆసియా, అరేబియా, మెసొపొటేమియా, టర్కీ అన్నీ కలిపితే వారిని ఎదుర్కోలేము. హిందూ-ముస్లిం ఐక్యత మన కోరిక, ఆవశ్యకత. ముస్లిం నాయకులను నమ్మాలనే  ఉంది, కానీ ఖొరాన్, హాదిస్ ల ఆదేశాలను ఈ నాయకులు పాటిస్తారు.మీ మేధస్సు, వివేకం దీనికి పరిష్కారం చూపిస్తుందని ఆశిస్తున్నాను.”

పెరుగుతున్న కోరికలు/డిమాండ్లు: 4 నుంచి 14 అంశాలు; విభజన ప్రణాళిక
  • అ. ముంబై నుంచి సింద్ ని వేరు చేయడం
  • ఆ. NWFP, బలూచిస్తాన్ లను పూర్తి స్థాయి గవర్నర్ల-ప్రావిన్సులను చేయడం
  • ఇ.  పంజాబ్, బెంగాల్లలో అనుపాత (జనాభాకి అనుగుణంగా) ప్రాతినిధ్యం
  • ఈ. కేంద్ర శాసనసభలో 1/3 ముస్లిములు
  • ఉ.  + 14 ఇతర అంశాలు
1930లో కాంగ్రెస్ `పూర్ణ స్వరాజ్యం’ తీర్మానం చేసింది. అదే సంవత్సరం, ముస్లింలీగ్ అధ్యక్షుడిగా `ఇక్బాల్’ దేశవిభజన గురించి ఒత్తిడి తెచ్చాడు.
  “ప్రత్యేక నియోజకవర్గం” అవార్డు- 1932-బ్రిటిష్ ప్రధాని `రామ్సే మెక్ డొనాల్డ్ ’
సిక్ఖులు, ముస్లిములు, క్రిస్టియన్లు, యూరోపియన్లు, అంగ్లోలు, అణగారిన వర్గాలకు, ప్రత్యేక నియోజకవర్గాలు ప్రకటించారు. అయితే హిందువులు `అల్పసంఖ్యాకులు’గా ఉన్న ప్రదేశాల్లో హిందువులకి మాత్రం మైనారిటీ హక్కులు లేవు. దీనిని డా. అంబేద్కర్ సమర్ధించగా, హిందూ సమాజాన్ని రక్షించడానికి గాంధీగారు వ్యతిరేకించారు. అయితే దీనిపై కాంగ్రెస్ అధికారికంగా ఏ వ్యాఖ్యానమూ చేయలేదు. కాంగ్రెస్ వైఖరికి కోపగించి, పండిత్ మాలవీయ, భాయి పరమానంద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. అయితే 1937లో అన్ని ప్రాదేశిక (Provincial) ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, లీగ్ ఓడిపోయింది.1934లో భారత్ కి తిరిగివచ్చిన జిన్నాపై ఈ ఎన్నికలు ఎంతో ప్రభావం చూపాయి, లీగ్ పూర్తిగా వేర్పాటువాదం మొదలుపెట్టింది.
`హిందూమహాసభ’ స్థాపించిన వీర్ సావర్కర్ 1937లో “భారత్ లో హిందూ-ముస్లిములు ఒకే దేశoలో పక్కపక్కనే నివసిస్తున్న భిన్న జాతులు. ఇవి రెండూ ఒకటే అనుకోవడానికి లేదు” అన్నారు.  ఇతర జాతీయవాద నాయకులు తెల్లబోయారు. హిందూ భారత్- ముస్లిం భారత్ అని రెండు ఉండడానికి వీల్లేదు. భారత్ ఒకటే, ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్  అని వేరువేరుగా ఉండవు అని సావర్కర్ గట్టిగా నమ్మారు.

జాతీయ చిహ్నాలకు ముప్పు
  • 1923 కాకినాడ కాంగ్రెస్ సమావేశంలోనే, `వందేమాతరo’ గేయాలాపనకి అధ్యక్షుడు మౌలానా మొహమ్మద్ అలీ అభ్యంతరం చెప్పినా, విష్ణు దిగంబర్ పాలుస్కర్ పాట ఆపలేదు. 1922లోనే `సారే జహాన్ సె అచ్చా’ గీతాన్ని కాంగ్రెస్ ప్రత్యామ్నాయ గీతంగా ఆమోదించింది.  1937కల్లా వందేమాతరం గేయం కుదించబడింది.
  • 1931 జాతీయపతాక కమిటీ – పటేల్, మౌలానా ఆజాద్, నెహ్రు, తారాసింగ్, కలేల్కర్, డా.హర్దికర్, డా.పట్టాభి సీతారామయ్యల `పతాక’ కమిటీ, మధ్యలో నీలంరంగు చక్రంతో కాషాయ జెండాను ఆమోదించింది. అయినా తరువాత త్రివర్ణ పతాకాన్ని ఎంచుకున్నారు.
  • 1934లో భూషణ్ గారి `శివభవాని’ నిషేధించబడింది, ప్రసిద్ధ `రఘుపతి రాఘవ రాజారాం’ భజనలో `ఈశ్వర్ అల్లా తేరే నాం’ అని మార్చి పాడటం మొదలుపెట్టారు.
  • గోవధ నిరాటంకంగా కొనసాగింది. 1938లో జిన్నాకు లేఖ వ్రాస్తూ, ముస్లిముల హక్కులకు కాంగ్రెస్ ఏ విధమైన భంగం కలిగించదని నెహ్రూ హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ రాజీనామా- లీగ్ ప్రవేశం:
  • 22డిసెంబర్ 1939- దేశనాయకులను మాటమాత్రం సంప్రదించకుండా, భారతదేశాన్ని రెండవ ప్రపంచయుద్ధంలో పాల్గొనేలా చేయడంపై నిరసనతో ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ రాజీనామా చేసింది. ముస్లింలీగ్ వెంటనే ఆ పదవులన్నిటినీ తమ మనుషులతో నింపేసింది. పెద్దసంఖ్యలోముస్లిములను అక్కడికి తరలించి, అస్సాం రాష్ట్రంలో ముస్లింలను అధికసంఖ్యాకులుగా చేసి, రాష్ట్ర జనాభా నిష్పత్తినే మార్చేసింది.
  • భారతదేశ విభజన చేసి, పాకిస్తాన్ ఏర్పరచాలని అప్పుడే ముస్లింలీగ్ వినతిపత్రం సమర్పించింది. ఈశాన్యం, తూర్పులో, ముస్లిము `రాష్ట్రాలు’ ఏర్పరచాలని కోరి, టైపింగ్ పొరపాటు దొర్లిందని చెప్పి, తరువాత పదాన్ని `రాష్ట్రం’ అని మార్పు చేసారు.
  • వీర్ సావర్కర్ పిలుపు- “సుశిక్షితులైన సైనికులుగా హిందువులు మారాలి. ప్రపంచమంతా కాగితపు తీర్మానాలు పరిచినా, స్వాతంత్ర్యం నీ దగ్గరకు నడిచిరాదు. భుజాల మీద తుపాకీలతో తీర్మానాలు చేస్తే, నువ్వు సాధిస్తావు.”
  • 1942, క్రిప్స్ మిషన్ – హైదరాబాద్ `ముస్లిం రాజ్యం’లో కలుస్తుందని క్రిప్స్ హామీ ఇచ్చాడు. కాంగ్రెస్ `క్విట్ ఇండియా(భారత్ విడిచిపెట్టు) ఉద్యమానికి పిలుపు నిచ్చింది. జాతీయ విప్లవశక్తులు సరైన పద్ధతిలో నిర్వహించలేక ఉద్యమo నీరుగారిపోయింది. (JP)
బ్రిటిష్ – ముస్లింలీగ్ - కమ్యూనిస్టుల బంధం:
మొదట్లో హిట్లర్-స్టాలిన్ ప్రపంచయుద్ధంలో కలిసినప్పుడు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ బ్రిటిషు-వ్యతిరేకతను సమర్థించారు, తరువాత 1941లో జర్మనీ రష్యామీద దాడి చేసినప్పుడు, రష్యా-బ్రిటన్ యుద్ధంలో ఒకే పక్షం అయిన తరువాత, భారత్ లో కమ్యూనిస్టులు-ముస్లింలీగ్ దగ్గరయ్యారు.
  1944 – 19 రోజుల గాంధీ-జిన్నా చర్చలు
జిన్నాతో చర్చలు చేయవద్దని శ్యామప్రసాద్ ముఖర్జీ గాంధీగారిని కోరారు. ద్విజాతీయ (రెండు దేశాల) సిద్ధాంతాన్ని గాంధి వ్యతిరేకించారు. “మతం మారిన వర్గం, వారి తర్వాతి తరాల వారు, వారి పూర్వీకులను కాదని తాము వేరే జాతి అని చెప్పుకోవడం చరిత్రలో ఎక్కడా లేదు” అన్నారు. జిన్నాని `కైద్-ఎ-ఆజం’ అని గాంధి సంబోధిస్తే, జిన్నా `మిస్టర్ గాంధి’ అనేవాడు. జిన్నాతో చర్చలు జరిపి గాంధీగారు జిన్నాకి ఒక స్థాయిని కల్పించారు.
  1945-46 ఎన్నికలు
లీగ్ పాకిస్తాన్ కోసం కోరిన 5 ప్రదేశాల్లో/రాష్ట్రాల్లో(provinces)- బలూచిస్తాన్, పంజాబ్, NWFP, సింద్, బెంగాల్ లలో – కేవలం సింద్ మరియు బెంగాల్ లు రెండు మాత్రమే లీగ్ గెలిచింది. బలహీనపడుతున్నామనే అనుమానం రావడంతో ముస్లింలీగ్ 16ఆగస్ట్ 1946 తేదిన `ప్రత్యక్షచర్య’కు పిలుపునిచ్చింది.
  16 ఆగస్ట్ 1946 – ప్రత్యక్షచర్య 
జిన్నా హిందువులమీద జిహాద్ ప్రకటించాడు. సింద్, బెంగాల్ ప్రదేశాల్లో/రాష్ట్రాల్లో, 16ఆగస్ట్ సెలవు ప్రకటించి మరీ, జిహాదీ మూకలు హిందువులను దొరికినవారిని దొరికినట్టే ఊచకోతకి గురిచేసారు. ఈ రాష్ట్రాల్లో, 70%పొలీసులు ముస్లిములైనందువల్ల, వారు ఆ మూకలతో కలిసిపోయారు. బెంగాల్లో ప్రధాని సుహ్రావర్ది పాల్గొన్న సమావేశంలో, వక్తలందరూ హిందువులపై జిహాద్ చేయమని పిలుపునిచ్చారు. హిందువులు ఎదురుతిరగగానే, సైన్యాన్ని రప్పించారు. ఒక్క కలకత్తా మహానగరంలోనే 10000 స్త్రీపురుషులని చంపేశారు, 15000మంది గాయపడ్డారు, 1లక్షకిపైగా ప్రజలు నిర్వాసితులయారు.
   తరువాత నౌఖలిలో మారణకాండ మొదలు పెట్టారు. ఒక విదేశీ వనిత మిస్ మ్యురల్ లెస్టర్ 6నవంబర్1946 ఒక క్యాంపు నుంచి వ్రాసింది, “స్త్రీలు తమ భర్తలు హత్యచేయబడటం చూడడమే కాక, ఆ స్త్రీలనే బలవంతంగా మతమార్పిడి చేసి, వారి భర్తలను చంపినవారితోనే వారికి పెళ్లిళ్లు చేసారు. ముల్లాలు, మౌల్వీలు జిహాదీలతో పాటు ఉండి, మతమార్పిడిలు చేయించారు”. సుచేత, ఆచార్య కృపలానీలు గవర్నర్ ను కలిసి సామూహిక హత్యలు, మతమార్పిడుల గురించి చెప్పగా, ముస్లిముల కన్నా హిందూ స్త్రీలు అందంగా ఉంటారు కాబట్టి అది సహజమే అన్నాడు.
   ఇట్లా ధ్వంసమైన ప్రదేశాలకు మొదట చేరుకున్నవారు శ్యామప్రసాద్ ముఖర్జీ. ఆయన హిందువుల రక్షణ కోసం పాటుపడ్డారు. అల్లర్లు బెంగాల్ నుంచి బిహార్ కు పాకాయి, అయితే వ్యత్యాసం ఏమిటoటే, బెంగాల్ ప్రభుత్వం జిహాదీలకు తోడ్పడగా, బిహార్లో అలా జరగలేదు. లీగ్ `ప్రత్యక్షచర్య’ కాశ్మీరుకి, NWFPకి చేరుకుంది. ఖాల్సా అనే గ్రామంలో, సుదీర్ఘ పోరాటం తరువాత, హిందూ-సిక్ఖు పురుషులందరూ హత్యకు గురికాగా, శ్రీమతి లాజవంతి ముందు నడవగా తమ మానరక్షణకై 74మంది స్త్రీలు బావిలో దూకి ఆత్మాహుతి చేసుకున్నారు.
  చర్చిల్ - జిన్నా కూటమి
చర్చిల్-జిన్నాలు మారుపేర్లతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపారు, అవి1982లో బయటపడ్డాయి. ఇంగ్లాండ్ రాణి, రాజు పాకిస్తాన్ ఏర్పాటుకి సుముఖంగానే ఉన్నారని తన ఇంగ్లాండ్ యాత్రలో జిన్నా గ్రహించాడు.
  22 మార్చ్ 1947, మౌంట్.బాటన్ భారత్ ఆగమనం
గాంధీగారు మౌంట్ బాటన్ తో తమ మొదటి సమావేశంలోనే దేశవిభజన వ్యతిరేకించారు. కాబినెట్ రద్దు చేసి, జిన్నా పూర్తి ముస్లిం సభ్యులతో తన సొంత కాబినెట్ ఏర్పరచుకోవచ్చని గాంధీ ప్రతిపాదించారు. కేంద్రంలో జరుగుతున్న సంఘటనలు గాంధీగారికి తెలియడంలేదని నెహ్రూ అన్నాడు. తన ప్రతిపాదనకు అంగీకారం కుదరట్లేదు కాబట్టి, తాను తప్పుకుంటానని, కాంగ్రెస్ CWCయే తదుపరి చర్చలు చేస్తుందని వైస్రాయ్ కి గాంధి లేఖ వ్రాసారు.
స్పష్టమైన విభజనతో రెండు  వేర్వేరు దేశాలు ఏర్పాటుకి తాను సుముఖమేనని సర్దార్ పటేల్ చెప్పారు, నెహ్రూ, రాజేంద్రప్రసాద్ విభజనకి అంగీకారం తెలిపారు. ముస్లిముల ప్రయోజనం దృష్ట్యా గాంధీగారి ప్రతిపాదనే సరైనదని మౌలానా అన్నారు.
   శ్యామప్రసాద్ ముఖర్జీ పశ్చిమబెంగాల్, తూర్పు పంజాబ్ భారత్ లో ఉంచడానికి, హిందువులను జాగృతపరచడానికి ఎంతో ప్రయాసపడ్డారు. ముస్లింలీగ్ లాహోర్ తీర్మానానికి అనుగుణంగానే ఈ సూచన ఉందని రాజేంద్రప్రసాద్ జిన్నాకి గుర్తు చేసారు. ఇంతలోనే, తూర్పు-పశ్చిమ పాకిస్తాన్ ను కలుపుతూ, 800మైళ్ళ కారిడార్/దారి ఉండాలని జిన్నా కొత్త డిమాండ్ లేవనెత్తాడు.
వి.పి. మీనన్ విభజనకి ముసాయిదా ప్రణాళిక తయారు చేసారు. కొద్దిరోజులముందే గాంధీగారు వైస్రాయ్ మౌంట్ బాటన్ తో, “కాంగ్రెస్ నాతో లేకపోవచ్చు, కానీ భారత ప్రజలు నాతో ఉన్నారు” అన్నారు. తరువాత ఆయనే ఒక బహిరంగ సభలో, “వైస్రాయ్ కి విభజన ఇష్టంలేదు, కానీ హిందూ-ముస్లిములు కలిసి జీవించలేకపోతున్నారు కాబట్టి, తప్పనిససరై ఒప్పుకుంటున్నారు” అన్నారు. “నన్ను ముక్కలు చేసి తరువాత దేశాన్ని ముక్కలు చేయండి” అన్న ఆయన ఆ సంగతి గుర్తు చేస్తే, “ప్రజాభిప్రాయం నాకు వ్యతిరేకంగా ఉంటే, నేను బలవంతంగా దాన్ని మార్చగలనా?” అన్నారు.
   కాంగ్రెస్ అధ్యక్షుడు మౌలానా ఆజాద్, విభజన తాత్కాలికమే అనే ఆశతో, విభజన తీర్మానం చేస్తున్నానని అన్నారు. పురుషోత్తం దాస్ టాండన్ చివరిదాకా కూడా, “ఇంకా కొంతకాలం బ్రిటిష్ పాలన ఉంటే నష్టమేమీ లేదు, కాని మన లక్ష్యమైన అఖండ భారత్ ను మనం పోగొట్టుకోలేము. అవసరం వస్తే బ్రిటిషువారితోపాటు, లీగ్ తో కూడా పోరాడుదాము, దేశాన్ని రక్షించుకుందాము” అని కరతాళధ్వనుల మధ్య అన్నారు. కానీ గాంధీగారు, విభజన వైపే మొగ్గు చూపారు. గాంధీగారు తన ప్రసంగంలో “సమయముంటే నేను మాత్రం ఒప్పుకుంటానా? వేరే ప్రత్యామ్నాయ నాయకత్వం లేనప్పుడు, ఇప్పటి కాంగ్రెస్ నాయకత్వాన్ని సవాలుచేసి, ప్రజలకు కాంగ్రెస్ పైన ఉన్న నమ్మకాన్ని చెడగొట్టలేను. ఈ రోజు నాకా శక్తి లేదు, ఉంటే తిరుగుబాటు చేసేవాడిని” అన్నారు. అయితే నెహ్రు `మోస్లి’తో అన్నమాట మనం గుర్తు తెచ్చుకోవాలి, `గాంధీగారు చెప్పిఉంటే, పోరాడుతూనే ఎదురుచూస్తూ ఉండేవాళ్ళం.’
  త్వరిత నిర్ణయం వెనుక కారణం – తిరుగుబాటు భయం
దేశవిభజన జూన్ 1948 నుంచి ఆగస్ట్1947కి, అంటే ఏకంగా పది నెలలు ముందుకి జరిపారు. దాదాపు భారతీయ అధికారులందరూ విభజనకి వ్యతిరేకులే. భారతీయ నావికాదళంలో జరిగిన తిరుగుబాటుతో, దేశంలో ఉద్రేకపూరితమైన వాతావరణం ఉంది. మోస్లీ వ్రాసారు – “మే1947లో భారతవిభజన ప్రకటించి, జూన్ దాకా సైన్యవిభజన మాట ఎత్తలేదు.  జూన్ చివరిదాకా `సరిహద్దు కమిషన్’ను ఏర్పాటు చేయలేదు. స్వాతంత్ర్యం వచ్చిన రెండు రోజులు తర్వాత దాకా, ప్రజలు ఎటువైపు ఉంటారో వారికి తెలియనియ్యకుండా అంధకారంలో ఉంచారు.”
  రాడ్ క్లిఫ్ సరిహద్దు కమిషన్
17ఆగస్ట్ దాకా తమ ఉత్తర్వులని ఇవ్వకుండా పొడిగించి, సమస్యను మరింత జటిలం చేసింది ప్రభుత్వం. సిరిల్ రాడ్ క్లిఫ్ తూర్పు-పశ్చిమ దిక్కులు రెండువైపులా సరిహద్దు కమిషన్ ఏక అధ్యక్షుడు. ఒకే సభ్యుడున్న కమిషన్ కి ఒప్పుకుని కాంగ్రెస్ మళ్ళీ పొరపాటు చేసింది. కమిషన్ లో ఇతర సభ్యులు ఎవరనేది కూడా గోప్యంగా ఉంచారు. ముస్లింలీగ్, నగరాల్లోని ముస్లిముల సంఖ్య గురించి తప్పుడు లెక్ఖలు చూపించింది. అసలుకంటే సంఖ్య ఎక్కువచేసి చూపింది. పంజాబ్ కమిషన్ సభ్యులు ఎం.సి.మహాజన్, తేజ్ సింగ్ `లాహోర్’ నగరం భారతదేశoలోనే ఉంటుందని ఎంత ధీమాగా ఉన్నారంటే, వారు స్వయంగా కూడా భారత్ కి వలసవచ్చే ఏర్పాట్ల చేసుకోలేదు. ముస్లిములు 25% మాత్రమే ఉన్న లాహోర్ పాకిస్తాన్ కి ఇచ్చేసారు. సాగునీటి కాలువల వ్యవస్థ, చాలా సారవంతమైన పంటభూములు, చారిత్రక సిక్ఖు గురుద్వారాలు ఉన్న మహాపట్టణం లాహోరును పాకిస్తాన్ కు బహుమతిగా ఇచ్చేసారు. ఒక్క దెబ్బతో 40%ప్రజలు నిర్వాసితులు అయ్యారు. హిందువులకి రూ.4000కోట్ల నష్టం జరిగితే, ముస్లిములు ఏమాత్రం నష్టపోలేదు. ఇదే విషాద కధ చిట్టగాంగ్ హిల్స్ కూడా జరిగింది, హిందువులు అత్యధిక సంఖ్యలో ఉన్న చిట్టగాంగ్, తూర్పు పాకిస్తాన్ కు ఇచ్చేసారు.  19%జనాభా నిష్పత్తి ఉంటే 23% భూభాగం పాకిస్తాన్ కు లభించింది.

మహాప్రళయం:
 “ఎటువంటి రక్తపాతం, అల్లర్లు ఉండవని నేను హామీ ఇస్తున్నాను, నేను సైనికుణ్ణి, సామాన్య పౌరుణ్ణి కాదు”అంటూ మౌంట్ బాటన్  ప్రగల్భాలు పలికాడు. భారతచరిత్రలో ఎన్నడూ ఎవరూ చూడని మహాప్రళయం సంభవించింది. కాంగ్రెస్ నిరాకరించిన జనాభా బదలాయింపు మొదలైంది. జనం కుటుంబాలతో మూటాముల్లె సర్దుకుని ఎడ్లబండ్లలో, కాలినడకన ప్రయాణమై వస్తుంటే, వేలాది మందిని చంపేసి, దోపిడీ చేసారు.  ప్రపంచచరిత్రలో అంతకుముందు కనీవినీ ఎరుగని అతిపెద్ద జనాభా మార్పిడి ఇది. రాజధాని ఢిల్లీలో అతి ప్రమాదకర పరిస్థితి ఉత్పన్నమౌతోంది. ఢిల్లీలో ప్రతి 4వ వ్యక్తి, పాకిస్తాన్ నుంచి భారతానికి  వచ్చిన హిందూ లేక సిక్ఖు కాందిశీకుడే. అలా దిక్కులేనివాళ్లైన వారు ముస్లిముల మీద, కాంగ్రెస్ మీద ఆగ్రహంగా ఉన్నారు.
   వారి సహాయానికి ఆర్ఎస్ఎస్
పోలీసుల్లో ఎక్కువ శాతం ముస్లిములే. ‘హిందూ అధికారులను హత్యచేసి, పాకిస్తాన్ జెండాను ఢిల్లీ ఎర్రకోట మీద 10సెప్టెంబర్1947నఎగరవేసే కుట్ర గురించి ఆర్ఎస్ఎస్ యువకార్యకర్తలు పటేల్, నెహ్రులకు సమయానికి హెచ్చరించగలిగారని నాకు తెలిసింది’ అని భారతరత్న భగవాన్ దాస్  చెప్పారు. లక్షలాది హిందువులను చంపి, మిగతావాళ్ళ మతంమార్చాలని కుట్ర జరిగింది. రూ.55కోట్లు అదనంగా పాకిస్తాన్ కు ఇవ్వాలని పట్టుబట్టి గాంధీగారు నిరాహారదీక్ష మొదలుపెట్టారు.
ఆ కాలంలో ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు చూపిన ధైర్యం, సేవాతత్పరత గురించి ఏ.ఎన్.బాలి ఇలా అన్నారు – “పశ్చిమ పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రతి కాందిశీకుడు, భారతలో ఎక్కడున్నా, ఆర్ఎస్ఎస్ వారికి ఎల్లప్పుడూ ఋణపడిఉంటారు. కాందిశీకులను అందరూ దిక్కులేనివారిలా వదిలేస్తే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాత్రం ఎనలేని సహాయం చేశారు.”
  విలీనం - సమీకృతం
600 రాజ్యాలు భారతరాజ్యంలో విలీనమయ్యాయి. కాశ్మీర్ ను పాకిస్తాన్ లో కలపమని మౌంట్ బాటన్, మహారాజా హరిసింగ్ కి చెప్పినా, 1947 అక్టోబర్ 17న గురూజీ గోల్వాల్కర్ కాశ్మీరును భారత్ లో విలీనం చేయమని మహారాజుని ఒప్పించారు. అక్టోబర్ 23న, జనరల్ అక్బర్ ఖాన్ సేన ముందుండి నడిపించగా, పాకిస్తాన్ తెగలు కాశ్మీరును ఆక్రమించాయి. బ్రిటిష్ సైన్యాధికారులు, మహారాజా హరిసింగ్ కు ఎదురు తిరిగి, గిల్గిట్ పర్వత ప్రాంతాన్ని పాకిస్తాన్ కు అప్పజెప్పారు. భారతీయ వాయుసేన విమానాలు దిగడానికి వీలుగా ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు సమయానికి శ్రీనగర్ విమానాశ్రయంలో మంచును తొలగించారు. నవంబర్ 21న, కాశ్మీర్ అంశాన్ని నెహ్రు ఐక్యరాజ్యసమితి (UN)కి తీసుకెళ్ళారు.
  హైదరాబాద్
రజాకార్ నాయకుడు కాసిం రిజ్వీ, భారతదేశానికి- హిందువులకి వ్యతిరేకంగా విషపూరిత ప్రచారం చేసాడు. 2లక్షల రజాకార్లు, 40,000 హైదరాబాద్ రాజ్య సైన్యంలో ఉన్నవారు కలిసి దాడికి దిగారు. రజాకార్లు కమ్యూనిష్టులలో కూడా కలిసిపోయారు.  హైదరాబాద్ లోకి ప్రవేశించిన భారతీయ సేన జరిపిన `ఆపరేషన్ పోలో’ కేవలం 108గంటల్లో ముగిసింది.
  ఉదయపూర్ మహారాజు వ్యక్తిత్వం
పశ్చిమాన జోధపుర్, తూర్పున ఇందోర్, భోపాల్ రాజ్యాలున్న ఉదయపూర్ రాజ్యం పాకిస్తాన్ లో కలిస్తే తప్ప  పాకిస్తాన్లో కలవాలన్న భోపాల్ నవాబు కోరిక తీరదు. ఉదయపూర్ రాజు, “నా పూర్వీకులే నా భవిత నిర్ణయించారు. వారే మెచ్చుకోలుకి లొంగిపోయి ఉంటే, హైదరాబాద్ అంత పెద్ద రాజ్యం మాకుండేది. వాళ్ళు లొంగలేదు, నేనూ అంతే; నేను భారత దేశంలోనే ఉంటాను” అన్నారు.

దేశ విభజన నిజంగా అనివార్యమా?
నావికాదళ తిరుగుబాటు మరియు భారత సైన్య విచారణల(INA)వల్ల, భారత సైన్యంలో, భారత అనుకూల స్పందన బాగా పెరిగింది.  ఇవన్నీ సర్వసైన్యాధికారి CIC క్లాడ్ ఆచిన్లెక్ ను పెద్ద సంశయంలో నేట్టేసాయి.
  • ➣ బ్రిటిష్ పార్లమెంట్`హౌస్ అఫ్ కామన్స్’లో స్టాఫోర్డ్ క్రిప్స్ మాట్లాడుతూ, “భారత్ వదిలిరాకపోతే, ప్రత్యామ్నాయంగా భారీ సంఖ్యలో సైన్యాన్ని, పాలనా యంత్రాంగాన్ని పెంచాలి. బ్రిటిష్ జాతీయ విధానం మరియు అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా అది రాజకీయంగా సులభం కాదు.”
  • ➣ INA విచారణలు,నావికాదళ తిరుగుబాటు వల్ల, భారత సైన్యంలో జాతీయ భావాల స్పందన బాగా పెరగడంతో, బ్రిటిషువారు ఏమవుతుందో అని భయభ్రాంతులయారు. ఏదేమైనా దేశాన్ని విభజించి వదిలి వెళ్లిపోవాలనే నిశ్చయానికొచ్చారు.
  • ➣ వైస్రాయ్ గా భారత్ రావడానికి ఎలా ఒప్పుకున్నాడో మౌంట్.బాట్టెన్ వివరిస్తూ, “భారతలో మనపని అయిపొయింది. అక్కడి పరిస్థితి గందరగోళంగా అధ్వాన్నంగా ఉంది, నువ్వు వెళ్లి అన్నీ ఒక కొలిక్కి తేవాలి” అని ప్రధాని చర్చిల్ అన్నారని చెప్పాడు.
  • ➣ ముస్లింలీగ్ కూడా బలహీనంగానే ఉండేది. ఢిల్లీ ముస్లిములు పటేల్ గారితో “మీరు లీగ్ కి వ్యతిరేకంగా ధృడంగా నిలబడండి, మీ వెనుక మేముంటాము, లీగ్ మరింత బలహీనపడుతుంది.ముస్లిములు కాంగ్రెస్ వైపే వస్తారు” అని చెప్పేవారు. ఎందుకంటే ముస్లింలీగ్లో మొదటినుంచి అష్రఫీలు బలంగా ఉండేవారు, వారికి నిమ్నవర్గాల స్థానిక ముస్లిములపట్ల చిన్నచూపు ఉండేది.
  • ➣ 1949 న్యుయోర్క్ నగరంలో నెహ్రూ ఒప్పుకున్నారు, “విభజనానంతర భయంకర పరిణామాలు తెలిసుంటే, విభజన అంగీకరించేవాళ్ళం కాదు.” కాంగ్రెస్ నాయకత్వం అప్పటికే పోరాటాలతో అలసిపోయింది. ముస్లిముల మధ్యనున్న విభేదాలను ఎలా రాజకీయంగా ఉపయోగించుకోవాలో కాంగ్రెస్ కి తెలియలేదు. గాంధేయ పద్ధతులు  బ్రిటిషువారితో కొంత సత్ఫలితాలనే ఇచ్చినా, ముస్లిం వేర్పాటువాదుల హిందూ-వ్యతిరేక క్రూర పైశాచిక దాడులముందు పనిచేయలేదు.
ఎందుకు మనం ఓడిపోయాము?
  • 1. కాంగ్రెస్ లో సైద్ధాంతిక బలం లేకపోవడం. జాతీయవాదభావం లేక, దేశం అంటే కేవలం భౌగోళిక ప్రాంతాలు, రాజకీయాలు మాత్రమే అనుకోవడం ప్రధాన కారణం.
  • 2. జాతీయ నిబద్ధత లేకపోవడం- స్వాతంత్ర్యం -స్వరాజ్యం ఎందుకు అనే విషయం మర్చిపోయారు. స్వాతంత్ర్య సమర స్ఫూర్తి, ఆదార్శాలు, ఆకాంక్షలు అన్నీ గాలికొదిలేశారు.
  • 3. అన్నదమ్ములమధ్య విబేధాలు, విభజన లాగా చూసారు. కానీ తల్లిని ముక్కలు చేస్తారా?
  • 4. జాతీయ సమైక్యత, సమగ్రతల కన్నా, ముస్లిం సంతుష్టీకరణ ఎక్కువైంది. హిందూ-ముస్లిం ఐక్యత లేకపోతే స్వాతంత్ర్యం అఖర్లేదు అన్నారు. దానికి బదులుగా, `మీరు మాతో కలిస్తే, మీతో పాటు; మీరు మాతో కలవకపోతే, మీరు లేకున్నా మేము ముందుకి వెళ్తాము; మీరు మమ్మల్ని వ్యతిరేకిస్తే, మిమ్మల్ని దాటుకుని వెళ్తాము’ అనే విధానం ఉండాల్సింది.
  • 5. ప్రఖ్యాత చరిత్రకారుడు `అర్నాల్డ్ టోయన్బీ’, “అసలు పాకిస్తాన్ ఏంటి? భారతదేశాన్ని పూర్తిగా పరాజితను చేయాలన్న 1200సంవత్సరాల ముస్లిముల కలను మొదటిసారి 20వ శతాబ్దంలో సాధించారు” అన్నారు.
  • 6. శరత్ చంద్ర చటర్జీ ఇలా వ్రాసారు – “అమెరికన్లు తమ స్వాతంత్ర్యం కోసం పోరాడినప్పుడు, సగంపైగా ప్రజలు బ్రిటిషువారితోనే ఉన్నారు. ఐరిష్ పోరాటంలో, నిజానికి ఎంతమంది పోరాటంలో పాల్గొన్నారు? ఎంతమంది ఏ పోరాటంలో ఉన్నారని సంఖ్య లెక్కపెట్టుకోవడంకాదు, ఆ ధ్యేయసాధనకై చేసిన తపస్సు, దాని తేజస్సు-తీక్షణతలపై తప్పొప్పుల నిర్ణయం జరుగుతుంది. ‘హిందూ-ముస్లిం ఐక్యత లేకుండా, స్వరాజ్యం లేదు అనడం’ హిందువులకి ఘోర అవమానం”.
  • 7. డా. రామమనోహర్ లోహియా ఇలా అంటారు, “క్షీణించిన కాంగ్రెస్ నాయకత్వం, భయంకరమైన మతఘర్షణలు, విభజనకు కారణమైనాయి. యువ నాయకత్వం ఉంటె దేశవిభజన జరిగి ఉండేది కాదు. ఆ సమయంలో ఏ ఒక్క నాయకుడు జైల్లో లేడు. విభజన కాలంలో నేను ఏమీ చేయలేదని చాలా బాధపడుతున్నాను.”
  • 8. 1960లో లియోనార్డ్ మోస్లితో మాట్లాడుతూ నెహ్రూ ఇలా అన్నారు – “ మేము అప్పటికే వృద్ధాప్యంలో ఉన్నాము, అలసిపోయాము. మళ్ళి జైలుకి వెళ్ళే ఓపికలేదు. మాకు అఖండ అవిభాజిత భారతం కావాలని అడిగితే, జైలుకి వెళ్ళేవాళ్లము.” (లియోనార్డ్ మోస్లి `ది బ్రిటిష్ రాజ్’ నుంచి).
(భారత విభజనకి దారితీసిన ఘటనల సంక్షిప్త చరిత్ర ఇది.  హెచ్. వి. శేషాద్రిగారి ఇంగ్లీషు గ్రంథం `Tragic Story of Partition’ ఆధారం. )

అనువాదం: ప్రదక్షిణ, విశ్వ సంవాద కేంద్రము
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top