పరమ ధార్మికురాలు, రాజమాత ' రాణి అహల్యాబాయి హోల్కర్ ' - Rani Ahilyabai Holkar

Vishwa Bhaarath
0
పరమ ధార్మికురాలు.. రాణి అహల్యాబాయి హోల్కర్ - Rani Ahilyabai Holkar
రాణి అహల్యాబాయి హోల్కర్ - Rani Ahilyabai Holkar


— చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి
రాజమాత రాణి అహల్యాబాయి హోల్కర్ రాజ్య పరిపాలన మొదలయింది.  బ్రహ్మ సృష్టి జరిగిన రోజుల్లో, దేశం పాలించే అర్హతతో, దైవం పంపిన అవధూత రాజమాత దేవీ అహల్య “ అంటూ ఆవిడ రాజ్యంలో ఆబాలగోపాలం ఆవిడని కీర్తిస్తారని జొన్నా బిల్లీ అనే ఆంగ్లేయుడు ( 1849 ) లో కీర్తించారు . రాజమాత దేవీ అహల్యాబాయి     18వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్త చరిత్రలో దాదాపు 30 సంవత్సరాలు  అత్యంత ప్రశాంతంగా, అత్యంత సాధికారతతో, అత్యంత వైభవంగా రాజ్యపాలన చేసిన మహారాణి.

ది రాజ్యపాలనకు సంబంధించిన విషయం అయితే, అఖండ భారతదేశంలో ప్రసిద్ది  పొందిన ఏ దేవాలయం దర్శించినా అక్కడ రాజమాత దేవీ అహల్యాబాయి జీర్ణోద్దరణ చేయించారనో,  రహదారి బాగుచేయించారనో,  సత్రాలు కట్టించారనో ఉంటుంది. దేశం నలుమూలలా ఈ మహత్కార్యాలు జరిగాయి. కాశీ విశ్వేశ్వర ఆలయం, కేదారనాథ్, గయ, ప్రయాగ, శ్రీశైలం, రామేశ్వరం, పూరి  జగన్నాథ ఆలయం, బద్రీనాథ్, బేలూరు, నాసిక్  ఇలా చెప్పుకుంటూ పోతే ఆ దైవమూర్తి చేసిన ధర్మ కార్యాలు లెక్కలేనన్ని. ఇప్పటికి దాదాపు 157పుణ్య తీర్థాలలో, ప్రసిద్ద క్షేత్రాలలో దేవీ అహల్యాబాయి ఆధ్వర్యంలో నిర్మితమైన దేవాలయాలు, సత్రాలు, ఘాట్ లు ధార్మిక కేంద్రాలు, చారిత్రక కట్టడాలను చరిత్రకారులు గుర్తించారు. ఇంకా పరిశోధన జరుగుతూ ఉంది. కేవలం 70ఏళ్ళ జీవితంలో ఒక వ్యక్తి ఇన్ని సాధించటం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది . అందుకే ఆ స్త్రీ మూర్తిని దైవంగా కొలవటం జరుగుతోంది.

దేవీ అహల్యాబాయి హోల్కర్ జననం 31 మే నెల 1725 వ సంవత్సరం ప్రస్తుతం అహ్మద్ నగర్ జిల్లా ,  జమ్ఖేడ్ తాలుకాలోని చోండిగ్రామంలో, గ్రామాధికారి మంఖోజి షిండే ఇంట జరిగింది. ఈ గారాలపట్టి తండ్రి ఒడిలో ఓనమాలు దిద్దుకుంది. తల్లి దగ్గర పురాణఇతిహాసాలు చదువుకుంది. ఎనిమిదో ఏట జరిగిన ఒక నాటకీయ పరిణామం ఆమె జీవితాన్ని మార్చేసింది. ప్రఖ్యాత మరాఠా సేనాని మల్హర్ రావు హోల్కర్ ( మాల్వా ప్రాంతాన్ని పాలించిన జాగీర్దార్ ) పేష్వాను దర్శించటానికి పూణే వెళ్ళే మార్గంలో చోండి గ్రామం సమీపంలో విశ్రాంతి తీసుకోవడం కోసం ఆగినప్పుడు దేవాలయంలో అహల్యాబాయి దైవభక్తీ, చిన్న వయస్సులోనే సేవా భావం గమనించి ముగ్ధుడై తన కుమారునికి వధువుగా సంబంధం కుదుర్చుకున్నాడు. 1733 వ సంవత్సరం ఖండేరావు హోల్కర్ తో వివాహం జరిగింది.  1745 లో పుత్రుడు మలేరావు జన్మించాడు.  మరో మూడేళ్ళ తరువాత పుత్రిక ముక్తాబాయి పుట్టింది. మామగారు ఆహల్యాబాయి ప్రతిభను గమనించి రాజ్యపాలనలో, యుద్ద వ్యుహాలలోనూ పూర్తి సలహాలు, సంప్రదింపులు జరిపేవారు. ఈ తర్ఫీదు వల్లనే అహల్యాబాయి తను రాజ్యం చేస్తున్నప్పుడు అనేక యుద్దాలలో స్వయంగా పాల్గొన్నది. ఆవిడ ఏనుగు అంబారీ నాలుగువైపులా నాలుగు ధనస్సులు బాణాలతోకూడిన తూణీరాలతో ఉండేది. ఆమె సవ్యసాచిలా బాణాలతో శత్రువులపై విరుచుకుపడేవారు. సైన్యం ఆవిడ నాయకత్వాన్ని పూర్తిగా సమర్ధించి విధేయంగా ఉండేది.

ప్రశాంతంగా సాగుతున్న ఆహల్యాబాయి జీవితంలో వరసగా జరిగిన మరణాలు, తదనంతర పరిణామాలు ఆవిడ గొప్పతనాన్ని, త్యాగాన్ని, బాధ్యతాయుతప్రవర్తనకు అద్దంపడతాయి మొదట 1754లో కుంభేర్ కోటను ముట్టడించినప్పుడు ఫిరంగిగుండు ప్రమాదవశాత్తు తగిలి  ఖండేరావు మరణిస్తారు. సహగమనం చేస్తానని అహల్యాబాయి అనుమతి అడిగినప్పుడు, మామగారు మల్హార్ రావు హోల్కర్ ఖిన్నుడై “కన్నకొడుకు దూరమై ఇప్పటికే నా కుడిబుజం విరిగిపోయింది, ఈ కష్ట సమయంలో నువ్వూ నీ దారి చూసుకుంటే ఈ రాజ్యం ఏమి కావాలి. ఈ ప్రజలను ఎవరు చూసుకోవాలి, చిన్న వయస్సులో తండ్రిని పోగొట్టుకున్న నీ పిల్లలకి కన్నతల్లిని కూడా దూరం చేస్తావా?? ఇంత కఠిన నిర్ణయం తీసుకోకు. ఇప్పుడు నువ్వే నా కొడుకులా నా తదనంతరం బాధ్యతవహించాలి”అని అన్నారు.  మనస్సు దిటవు చేసుకొన్నఅహల్యాబాయి ‘ సతీ సహగమనం ‘ విరమించుకొని మామగారి ఆజ్ఞ మేరకు రాజ్యపాలనలో సహాయ సహకారాలు అందించింది. ఆ తరువాత దాదాపు పది, పన్నెండు ఏళ్ళ వ్యవధిలో మొదట మామగారు చనిపోవటం, సింహాసనం అధిష్టించిన కొన్ని రోజులకే కుమారుడు వ్యాధిగ్రస్తుడై మరణించడం వెంటవెంటనే జరిగి పొయాయి. ఈ విషాద సమయంలో రాజ్యంలో లుకలుకలు మొదలైనాయి. ఒక స్త్రీ చేతిలో ఉన్న  రాజ్యాన్ని సులభంగా గెలవచ్చన్న అత్యుత్సాహం చూపిన రాఘోబా వంటివారికి బుద్ధిచెప్పి, అహల్యాబాయి రాజ్యాన్ని చక్కదిద్దిన తీరు రాజనీతిశాస్త్ర విద్యార్థులు తప్పక తెలుసుకోవాలి. అటు తోటి మరాఠా సేనానులకి లేఖలు వ్రాసి వారి సహాయం కోరటం ద్వారా రాఘోబాను ఒంటరిని చెయ్యడం, పీష్వా వద్దకు తన దూతను పంపి రాజ్యంపై హక్కు కోసం అనుమతిని కోరటం , ఈలోపు రాఘోబా ఎలాంటి దుస్సాహసం చెయ్యకుండా సూటిగా హెచ్చరికలు పంపడం. రాఘోబాతో యుద్దానికి సైన్యాన్ని సిద్దం చెయ్యటం వంటి చర్యలన్నీ  ఆమెలోని అపారమైన నాయకత్వ లక్షణాలను ప్రపంచానికి పరిచయం చేసాయి. అది మొదలు దాదాపు 30 సంవత్సరాలు ఆమె మాల్వా రాజ్యాన్ని పరిపాలించింది.


రాజమాత అహల్యాబాయి చాలా నిరాడంబర జీవితాన్ని గడిపింది. సుఖోజి రావు హోల్కర్ ను సేనానిగా నియమించి తాను పూర్తిగా ధార్మిక జీవితాన్ని గడుపుతూ ప్రజల బాగోగులు చూసేది. ప్రస్తుతం మనం చూస్తున్న  ఇండోర్ ఒక నగరంగా అభివృద్దిచెందటానికి ముఖ్యకారణం ఆమెనే. తన రాజ్య రాజధానిని పురాణ కాలం నుంచి ప్రసిద్ది గాంచిన మాహిష్మతీనగరం అనే పేరుగల మహేశ్వరం ప్రాంతానికి మార్చి ఆ ప్రాంతం ఆర్ధికంగా, సాంస్కృతిక పరంగా, ధార్మికంగా , పారిశ్రామికంగా అభివృద్ధి చేసింది. మహేశ్వరం చీరలకు ఎంతో ప్రసిద్ధి. భిల్లులు, గోండులు వంటి సంచార  జాతులకు స్థిరమైన నివాసం ఏర్పాటుచేయడమేకాక  వారికి కొన్ని హక్కులను కూడా ఇచ్చారు .

ఆవిడ ప్రతి రోజు నర్మదా నదిలో స్నానం ఆచరించి మట్టితో శివలింగాన్ని తయారు చేసి ఆ లింగం సాక్షిగా న్యాయనిర్ణయం చేసేవారు. సామాన్య ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను ఓపిగ్గా వినేవారు. చక్కటి నిర్ణయాలను ప్రకటించేవారు. అహల్యాబాయి పాలనలో ఖజానా నిండుగా వుండేది. ప్రజలకు ప్రణాళికబద్దమైన పన్నుల విధానం ఉండేది. వైధవ్యం పొందిన మహిళలు దత్తత తీసుకునే హక్కు , భర్తల ఆస్తిలో హక్కు మొదలైన మార్పులు అహల్యాబాయి హోల్కర్ పాలనలోనే మొదలైనాయి. ధార్మిక విషయాలలో అహల్యాబాయి సాధన వల్ల ఆమెను దైవంగా పరిగణించేవారు. అది ఇప్పటికీ  మనం గమనించ వచ్చు, స్వయంగా శివభక్తురాలు అవటం వల్ల అఖండ భారతావనిలో ఉన్న జ్యోతిర్లింగస్థానాలలో విదేశీ మ్లేచ్చుల దాడిలో ద్వంసం అయిన అనేక ప్రసిద్ద శివాలయాల గర్భాలయాలను తిరిగి పునర్నిర్మించారు. ఒక్కొక్క ధార్మిక కార్యం చూస్తే హిందూసమాజం దేవీ అహల్యాబాయి హోల్కర్ కి ఎంత ఋణపడిందో అర్ధమవుతుంది. సరిచేసి, తిరిగి వ్రాసుకోవాల్సిన మన దేశ చరిత్రలో దేవీ అహల్యాబాయి హోల్కర్ కు  ప్రముఖ స్థానం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Reference: భారతీయసంస్కృతీకోశం - విశ్వ సంవాద కేంద్రము

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top