'మత్తు’యుద్ధం - నార్కోటిక్స్ ‌జిహాద్‌ : కేరళ కామ్రేడ్లు × కేథలిక్కులు - 'Intoxication' - Narcotics 'Jihad': Kerala Comrades × Catholics

0
'మత్తు’యుద్ధం - నార్కోటిక్స్ ‌జిహాద్‌ : కేరళ కామ్రేడ్లు × కేథలిక్కులు - 'Intoxication' - Narcotics 'Jihad': Kerala Comrades × Catholics

కేరళ కామ్రేడ్లు × కేథలిక్కులు ‘మత్తు’యుద్ధం
కేరళ యువతరం ప్రస్తుతం మున్నెన్నడూ ఎదుర్కొనని తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నది. అందుకు కారణం-  కేరళలో సాగుతున్న రెండు జిహాద్‌లు. ఒకటి లవ్‌ ‌జిహాద్‌. ‌రెండు నార్కోటిక్స్ ‌జిహాద్‌. అం‌టే మత్తుమందుల జిహాద్‌. ఇది బీజేపీ సభ్యుడో, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నాయకుడో, మరో హిందూ సంస్థో వెలుబుచ్చిన అభిప్రాయం కాదు. చేసిన ఆరోపణ కూడా కాదు. పాలా బిషప్‌ ‌జోసెఫ్‌ ‌కల్లారంగాట్‌ ‌సెప్టెంబర్‌ 9‌న ఆ రెండు జిహాద్‌లతో జమిలిగా సాగిపోతున్న కేరళ గురించే ఈ ప్రకటన చేశారు. మార్తా మరియం పిలిగ్రిమ్‌ ‌చర్చ్‌లో ఒక ఉత్సవం సందర్భంగా మాట్లాడుతూ జోసెఫ్‌ ఈ ‌విషయం బయటపెట్టారు. ఆ చర్చ్ ‌కొట్టాయం జిల్లా, కురవీలంగాడ్‌ అనే చోట ఉంది. జిహాద్‌ అం‌టే పవిత్ర యుద్ధం (ఇస్లామిక్‌ ఉ‌గ్రవాదం దృష్టిలో). ముస్లిమేతరుల మీద జిహాద్‌ ఎం‌తో పాతది. ఇటీవలి కాలంలో వినిపిస్తున్న మరొక జిహాద్‌ ‌లవ్‌ ‌జిహాద్‌. ‌దీని మీద ఇంకా వివాదం కొనసాగుతుండగానే ఒక్కసారిగా వినిపించిన మాట నార్కోటిక్స్ ‌జిహాద్‌. ఇది కూడా పాత మాటే. కానీ ఇదేదో కొత్తమాట అయినట్టు, వింటున్నట్టు నటిస్తున్నారు వామపక్ష నేతలు, కాంగ్రెస్‌ ‌నాయకులు.

ఇప్పటికే ముస్లింలంటే అనుమానంగా చూస్తున్న కేరళ క్రైస్తవ సమాజంలో ఈ కేథలిక్‌ ‌బిషప్‌ ‌జోసెఫ్‌ ‌వెల్లడించిన అభిప్రాయం ప్రకంపనలే సృష్టించింది. ప్రస్తుతం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న లవ్‌ ‌జిహాద్‌కు ఇది అదనం. లవ్‌ ‌జిహాద్‌కు నార్కోటిక్స్ ‌జిహాద్‌ ‌తోడైందనే బిషప్‌ ‌తన ఉపన్యాసంలో చెప్పారు. అదేం చిత్రమో, సీపీఎం పార్టీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష కాంగ్రెస్‌ ‌కూడా జోసెఫ్‌ ‌మీద ధ్వజమెత్తుతున్నారు. ముస్లిం సంఘాలు సరే, కొన్ని క్రైస్తవ సంఘాలు కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి. జోసెఫ్‌ ‌ప్రకటనకు నిరసనగా ఇప్పటికే కొందరు ఆయన నివాసానికి ఊరేగింపుగా వెళ్లారు. ఇక రాజకీయ, సామాజిక వర్గాల సంగతి చెప్పనక్కరలేదు. ఈ దుమారాన్ని బట్టి దేశంలో లవ్‌ ‌జిహాద్‌ ‌నిరోధానికే కాకుండా, నార్కోటిక్స్ ‌జిహాద్‌ ‌నివారణకు కూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే చట్టం తీసుకురావడం అవసరమని కేరళ బీజేపీ నాయకుడు టామ్‌ ‌వడక్కన్‌ ‌కోరారు. అలాగే రోజురోజుకీ పెరుగుతున్న విమర్శలను బట్టి బిషప్‌ ‌జోసెఫ్‌కు రక్షణ కల్పించాలని కూడా బీజేపీ కోరుతోంది.

బిషప్‌ ఆరోపణ ఆవేదనతో కూడినది. మొత్తంగా కేరళ సమాజానికి ఎదురవుతున్న సవాలు గురించి హెచ్చరించేది కూడా. రెండు జిహాద్‌లు ఒక పథకం ప్రకారం సాగిస్తున్నారని ఆయన అన్నారు. నార్కోటిక్స్ ‌జిహాద్‌ ‌లేదా మత్తుమందులకు బానిసలుగా మార్చే జిహాద్‌ ‌ముస్లిమేతర జీవితాలను, ముఖ్యంగా యువత జీవితాలను ధ్వంసం చేయడానికి ఉద్దేశించినదేనని జోసెఫ్‌ ఆరోపించారు. ఐస్‌‌క్రీమ్‌ ‌పార్లర్‌లు, హోటళ్లు, పళ్ల రసాల విక్రయ కేంద్రాలను ప్రస్తుతం కొందరు జిహాదీలు ఈ మత్తుమందులు లభించే చోట్లుగా మార్చేశారని జోసెఫ్‌ ‌చెప్పారు. జోసెఫ్‌ ‌మాటలలో ఎలాంటి శషభిషలు లేవు. ముస్లిమేతరులను వ్యసనపరులుగా మార్చేందుకు మత్తుమందులను ఒక ఆయుధంగా జిహాదీలు వాడుతున్నారని ఆయన కుండబద్దలు కొట్టినట్టే చెప్పారు. రేవ్‌ ‌పార్టీలు కూడా మత్తుమందులను అందుబాటులో ఉంచడానికి ఏర్పాటు చేస్తున్నవేనని, ఆ పార్టీలు చేసుకుంటున్న వారిని పట్టుకున్నప్పుడు ఇలాంటి వాస్తవాలే వెల్లడైనట్టు మా దృష్టికి వచ్చిందని చెప్పారు. మత్తుమందులకు అలవాటుపడి ఉద్యోగాలు పోగొట్టుకున్నవారు, చదువులు పాడుచేసుకున్నవారు చాలామంది మా దృష్టికి వచ్చారని అన్నారు. నిజానికి ఇవి ఆయన సమాజానికి చూపుతున్న రుజువులే.

మనదేశం వంటి ప్రజాస్వామిక దేశాలలో జిహాద్‌, అలాంటి మార్గాలతో ఇతర వర్గాల ఉనికి లేకుండా చేయలేమని జిహాదిస్టులు ఇప్పటికే గుర్తించారని, అందుకే కొత్త మార్గాలను అన్వేషిస్తు న్నారని అంటారాయన. కానీ ఆ ఆయుధాలను గుర్తించడం దగ్గర కొందరు విఫలమవుతున్న సంగతిని కూడా చెప్పారు. అంటే జిహాదీల కుట్రలకు బలైపోతున్నది ముస్లిమేతరులే. ఇందుకు బిషప్‌ ‌దగ్గర రుజువులు ఉన్నాయా అంటూ విరుచుకుపడుతున్నాయి ముస్లిం సంఘాలు. ఆ రుజువులు చూపించాలని కేరళ జమియాతుల్‌ ఉలేమా విద్యా సంస్థ విద్యార్థులు అలజడి చేస్తున్నారు. ఇలాంటి ప్రకటన చేసినందుకు ఆయన మీద చర్య తీసుకోవాలని కూడా కోరారు. ఇప్పటికే ఆయన మీద కేసులు నమోదైనాయి కూడా. ఆఖరికి చర్చ్‌లలో పనిచేసే రిఫార్మిస్ట్ ‌బృందాలు కూడా బిషప్‌ ‌ప్రకటన వెనుక కుట్ర ఉందనే ఆరోపిస్తున్నాయి. వీళ్లే ఇంకో అడుగు ముందుకు వేసి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పనులు ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయని ఆరోపించారు. ఇంతకీ ఈ రిఫార్మిస్ట్ ‌బృందాల బాధ ఏమిటీ అంటే, ఆ మధ్య బిషప్‌ ‌జోసెఫ్‌ ‌బీజేపీకి దగ్గరవుతూ ప్రసిద్ధుడయ్యారు. నిజానికి ఇలా ముస్లింల పట్ల ప్రతికూల భావనతో ఉండడం కేరళ సైరో-మలబార్‌ ‌చర్చ్ ‌లక్షణమేనని కూడా రిఫార్మిస్ట్ ‌బృందాలు చెబుతున్నాయి.

కేరళలో పనిచేస్తున్న సైరో-మలబార్‌ ‌చర్చ్ ‌ప్రపంచంలోనే రెండో అతిపెద్ద తూర్పు కేథలిక్‌ ‌చర్చ్. ఇది లవ్‌ ‌జిహాద్‌ ‌మీద తీవ్రమైన ఆరోపణలే చేస్తున్నది. 2018 నుంచి తమ వర్గానికి చెందిన ఎందరో యువతులను ఇస్లాంలోకి మతం మార్చి సిరియా, తదితర ఇస్లామిక్‌ ‌దేశాలకు పంపించారని చెబుతున్నది. జనవరి 19,2020న ఈ చర్చ్ ‌ప్రతినిధి బృందం ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుని లవ్‌ ‌జిహాద్‌ ‌గురించి ఫిర్యాదు చేసింది. ఇటీవలి కాలంలో బిషప్‌ ‌జోసెఫ్‌ ‌ముస్లిం జిహాదీలకు వ్యతిరేకంగాను, హిందూత్వకు దగ్గరగాను మాట్లాడుతున్నారు. ఈ సంవత్సరం మార్చిలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కొట్టాయం జిల్లా కార్యదర్శిని డైకీస్‌ ‌కార్యాలయానికి పిలిచి మరీ అయోధ్య రామాలయానికి విరాళం ఇచ్చారు. దీనితో సంప్రదాయకంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే కేథలిక్‌ ‌చర్చ్ ఆ ‌పార్టీకి సవాలు విసిరినట్టయింది. నిజానికి ఆరోగ్యం, విద్య వ్యవహారాలలో కేంద్ర ప్రభుత్వంతో ఈ వ్యవస్థకు సత్సంబంధాలే ఉన్నాయి. అలాగే ఈ చర్చ్ ‌బలంగా ఉన్న కొట్టాయం జిల్లాలో బీజేపీ కూడా బలపడింది. ఇక్కడే ఉన్న పాలా పట్టణాన్ని కేరళ వాటికన్‌ అని పిలుస్తారు. ఈ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నోబెల్‌ ‌మాథ్యూ కూడా తనకు బిషప్‌ ‌జోసెఫ్‌ ఆశీస్సులు ఉన్నట్టు బహిరంగంగానే చెబుతారు. అంతమాత్రాన ఆ బిషప్‌ ‌చెప్పిన వాస్తవానికి విలువ లేకుండా పోవాలా? ముఖ్యమంత్రి పినరయ్‌ ‌వైఖరి అలాగే ఉంది. మా పోరాటం సామాన్య ముస్లింకు వ్యతిరేకంగా చేస్తున్నది కాదు. కేథలిక్‌ ‌కుటుంబాల రక్షణకు సంబంధించినది. కేవలం జిహాదిస్టులకు వ్యతిరేకంగా చేస్తున్నది మాత్రమే అని నోబెల్‌ ‌మాథ్యూ కూడా చెప్పారు. అయినా బిషప్‌ ‌చెప్పిన మాటలో తప్పేమిటని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. బిషప్‌ ‌జోసెఫ్‌ ఇచ్చిన ఉపన్యాసంలోని ఆ అంశాన్ని ఇంతగా ఖండిస్తున్నవారంతా మరొక ప్రకటనను సౌకర్యంగా పక్కన పెడుతున్నారు. అది ఇటీవలే వైరల్‌ అయిన కేరళ మాజీ పోలీస్‌ ‌చీఫ్‌ ‌లోకనాథన్‌ ‌బెహరా ప్రకటన. ఉగ్రవాదుల ఎంపికకు కేరళ కేంద్రంగా మారిందని అన్నారాయన.

బిషప్‌ ‌జోసెఫ్‌ ‌చేసిన నార్కోటిక్స్ ‌జిహాద్‌ ఆరోపణ తాను ఇప్పుడే వింటున్నానని కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ ‌విజయన్‌ అమాయకత్వం నటించడం దేశాన్ని విస్తుపోయేటట్టు చేస్తోంది. నిఘా వర్గాలు, పోలీసులు రుజువులతోనే వాస్తవాలు బయట పెడుతున్నా ముఖ్యమంత్రి అంగీకరించడానికి సిద్ధంగా లేరంటూ బీజేపీ నాయకులు చేసిన ఆరోపణే నిజమని అనిపిస్తుంది. ఉగ్రవాదుల ఎంపికకు, కార్యకలా పాలకు, మత్తుమందులకు దగ్గర సంబంధమే ఉంటుంది. అదొక విష వలయం. ఉగ్రవాదం బతికేదే మత్తుమందుల అక్రమ వ్యాపారంతో. అలాగే ఉగ్రవాదంలో యువతుల అక్రమ రవాణా కోణం కూడా ఉందన్న విషయాన్ని గుర్తించాలి. ప్రేమ పేరుతో, మత్తుమందులతో ఇక్కడి ముస్లిమేతర యువతను లొంగదీసుకుంటారు. ఇస్లామిక్‌ ‌దేశాలకు పంపుతారు. తరువాత ఇలాంటి వాళ్లంతా విదేశీ జైళ్లలో మగ్గుతున్నారు. కేరళ జిహాదీ శక్తులకు సీపీఎం, కాంగ్రెస్‌ ‌పార్టీలు బాహాటంగానే వత్తాసు పలుకుతున్నా యని ఆ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి, జాతీయ మైనారిటీల కమిషన్‌ ‌మాజీ ఉపాధ్యక్షుడు జార్జి కురియన్‌ ఆరోపిస్తున్నారు. కేరళలో ఇస్లామిక్‌ ఉ‌గ్రవాదం ఇంతగా పెచ్చరిల్లిపోవడానికి కారణం- ఆ రెండు పార్టీలోను చాలామంది క్రీయాశీలక కార్యకర్తలు జిహాదీలేనని కేరళ బీజేపీ ఆరోపణ. ఇలాంటి పరిస్థితులలో బిషప్‌ ‌జోసెఫ్‌కు, కేరళ క్రైస్తవులకు రక్షణ కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రాసిన లేఖలో కురియన్‌ ‌కోరారు.

ఇస్లామిక్‌ ఉ‌గ్రవాదం విస్తరించడానికి ఉపయోగ పడుతున్న వనరులలో ఒకటి- ‘నల్లమందుకు ముడిపదార్థం గసగసాల పంట. అలాగే ఇతర మత్తు మందుల అమ్మకాలు. పినరయ్‌ ‌విజయన్‌ ‌దీని గురించి నిజంగా విని ఉండకపోతే దానిని ఆయన అజ్ఞానంగానే పరిగణించాలి. పాకిస్తాన్‌, అఫ్ఘానిస్తాన్‌ ‌ప్రాంతాలలో వాటి ఆర్థిక లావాదేవీలు 1960 నుంచి జరుగుతున్నాయి. తాలిబన్‌కు ఇదొక ప్రధాన వనరుగా మారిన తరువాత 2001-2009 మధ్య ఆ వ్యవహారాల మీద ఉక్కుపాదం మోపడానికి చర్యలు తీసుకున్నారు. కానీ తక్కువ ఫలితమే కనిపించింది. మత్తుమందులను ఉత్పత్తి చేసే మొక్కలను నాశనం చేయడం సాధ్యం కాలేదు. వాటిద్వారా తాలిబన్‌కు వచ్చే ఆదాయం కూడా తగ్గలేదు. అంతేకాదు, కాలం గడుస్తున్న కొద్దీ ఆ మొక్కలను సాగు చేసే వాళ్లకీ, ఉగ్రవాద మూకలకీ మధ్య బంధం బలపడుతోంది. ఆ వ్యాపారంతో వచ్చే అనూహ్యమైన ధనరాశుల ప్రభావం అలాంటిది.

జోసెఫ్‌ ‌సాహసోపేతంగా చేసిన ఈ ప్రకటన ప్రకంపనలు సృష్టించకుంటే ఆశ్చర్యపడాలి. పైగా కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టులు కలసి సామాజిక, రాజకీయ వాతావరణాన్ని సంపూర్ణంగా ధ్వంసం చేసిన కేరళలో అలాంటి ప్రకటన కలకలం సృష్టించకుండా ఎలా ఉండగలదు? కమ్యూనిస్టుల విషయంలో మతం మత్తుమందు కూడా. కానీ మత్తు ఉన్న మతంగా కేవలం హిందూమతాన్ని మాత్రమే వాళ్లు చూస్తారు. మిగిలిన మతాలకి ఆ విషయం వర్తించదు. మార్కస్ ‌ప్రతి మతము మత్తేనని చెప్పి ఉండొచ్చు. కానీ దానిని మన దేశవాళీ కమ్యూనిస్టులు ఎప్పుడో సవరించేశారు. ముస్లింలను ఏ చిన్నమాట అన్నా కాంగ్రెస్‌ ‌తట్టుకోలేదు. ఇప్పుడు కేరళలో అటు అధికారంలో ఉన్న సీపీఎం, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ ‌కూడా జోసెఫ్‌ ‌మీద విరుచుకు పడుతున్నాయి. పార్టీలు వేరే కావచ్చు, విమర్శ మాత్రం ఒకరే రాసినట్టు ఉంది. ఒక క్రైస్తవ మతగురువు ఆరోపణలో ఆ రెండు పార్టీలు ‘సంఘ పరివార్‌ అజెండా అమలు ప్రయత్నం’ చూశాయి. ఇక బీజేపీ సహజంగానే ఆ రెండు పార్టీలలో జిహాదీ సమర్ధకులను చూసింది.

 ఇంతకీ కేరళలో ఒక కేథలిక్‌ ‌క్రైస్తవ మతగురువు మీద కాంగ్రెస్‌ ‌చేస్తున్న విమర్శలు ప్రహసన ప్రాయాలు కాదు కదా! ఎందుకంటే ఓట్ల కోసం ముస్లింలని ఏమీ అనకూడదన్నది ఆ పార్టీ శాశ్వత సిద్ధాంతం. ఇక క్రైస్తవం తమ అధిష్టానదేవతల మతం కాబట్టి ఆ మతాన్ని కూడా పల్లెత్తు మాట అనకూడదు. కాబట్టే ఈ అనుమానం. బిషప్‌ ‌జోసెఫ్‌ ఏ ‌వర్గాన్నీ ప్రత్యేకించి విమర్శించలేదనీ, అలాంటి పనులు చేస్తున్నవారిని గురించి చెప్పడమే ఆయన ఉద్దేశమని పాలా డైకీస్‌ ‌వ్యవస్థ ప్రకటన ఇచ్చింది. సమాజంలో ఉన్న విపరీత ధోరణుల గురించే జోసెఫ్‌ ‌వెల్లడించారని డైకీస్‌ ‌సహాయ బిషప్‌ ‌జాకబ్‌ ‌మర్కెన్‌ ‌వివరణ ఇచ్చారు. అయినా అధికార, విపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఇలాంటి ప్రకటన చేసి జోసెఫ్‌ ‘‌హద్దులు దాటేశారు’ అని రాష్ట్ర కాంగ్రెస్‌ ‌విరుచుకుపడింది. ఆధ్యాత్మిక గురువులు మాట్లాడేటప్పుడు ఈ దక్షిణాది రాష్ట్రంలో శాంతి సహనాలు నశించిపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ‌నాయకుడు, కేరళ అసెంబ్లీలో విపక్ష నాయకుడు వీడీ సతీశన్‌ ‌వ్యాఖ్యానించారు. జరుగుతున్న నేరాలకి ఒక కులాన్నో, వర్గాన్నో గీటురాయిగా చేసుకోవడం పెద్ద తప్పిదమని సతీశన్‌ ‌సిద్ధాంతీకరించారు. అసలు ముస్లిం లకూ, క్రైస్తవులకు మధ్య విభేదాలు సృష్టించడానికి, మత కల్లోలాలు సృష్టించడానికి సామాజిక మాధ్యమా లలో పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతున్నదని, ఈ ప్రయత్నం చేస్తున్నవారి వెనుక ఉన్నది సంఘ పరివారేనని కూడా తేల్చేశారు సతీశన్‌. అయినా ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు వాళ్ల ఉచ్చులో పడరని కూడా భరోసా ఇచ్చారు. బిషప్‌ ‌మీద వచ్చిన ఫిర్యాదును జాగ్రత్తగా పరిశీలించాలని వామపక్ష ప్రభుత్వానికి సలహా ఇచ్చారు.

 జోసెఫ్‌ ‌మాటలు సమాజంలో సామరస్యాన్ని పెంచేవిగా లేవని మరో కాంగ్రెస్‌ ‌నాయకుడు, ఎంఎల్‌ఏ ‌పీటీ థామస్‌ ‌కూడా చెప్పారు. ఇంకొన్ని సుద్దులు కూడా ఏకరువు పెట్టారాయన. ఎల్లవేళలా పరమత సహనంతో ఉన్న సమాజంలో అగ్నికి ఆజ్యం పోసే తీరులో ఎవరూ మాట్లాడకూడదని అన్నారు థామస్‌. అదేమీ కాదు, జోసెఫ్‌ ‌చేసినది చాలా తీవ్రమైన ఆరోపణ. కాబట్టి చర్చ జరగాలని బీజేపీ నాయకుడు సురేంద్రన్‌ ‌కోరుతున్నారు. నిజమే, జోసెఫ్‌ ఆరోపణ చిన్నది కాదు. అయినా అసలు ఇలాంటివి మాట్లాడడం ఏమిటి అంటూనే ఆయన నోరు నొక్కే యత్నం ఎంతవరకు సబబు? అలాగే చర్చకు ఎవరూ ఎందుకు సిద్ధం కావడం లేదు? ఈ అంశం మీద చర్చకు ఆ పార్టీలు ఎందుకు భయపడుతున్నాయని సురేంద్రన్‌ ‌ప్రశ్నిస్తున్నారు. కేరళలో రేవ్‌ ‌పార్టీలలో అరెస్టయిన వారికీ, జిహాదీలకు దగ్గర సంబంధాలు ఒక వాస్తవమని కూడా ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇలాంటి ఆరోపణలకు కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ ‌వాళ్లు, ఇంకా కొందరు ముస్లిం పెద్దలు గొంతు చించుకుంటూ, భుజాలు తడుముకోవడం ఎందుకో అర్ధం కావడం లేదు.

ఒక్క కేరళలోనే కాదు, మొత్తం ప్రపంచం ఇలాంటి సమస్యతో సతమతమవుతున్నది. ఉగ్రవాదులకీ, మత్తుమందుల మాఫీయాకీ మధ్య అవినాభావ సంబంధాలు ఉన్నాయని రుజువైంది. అయినా ముస్లింలను మాత్రమే జోసెఫ్‌ ‌విమర్శించినట్టు మండిపడడం కూడా సరికాదనీ, ఆయనను నాలుగు వైపుల నుంచి మాటలతో చుట్టుముట్టడం సరికాదని కూడా సురేంద్రన్‌ అన్నారు. కేంద్రమంత్రి వి.మురళీ ధరన్‌ ఇం‌కాస్త ఘాటుగానే స్పందించారు. జోసెఫ్‌ ఒక సత్యం చెప్పారు. అది సీపీఎంకీ, కాంగ్రెస్‌కీ చేదుగా ఉండొచ్చు. అయినంత మాత్రాన ఆయనని వేటాడడం ఏమి సబబు అని ఆయన ప్రశ్నించారు. అదీ కాకుండా, కేథలిక్‌ ‌బిషప్‌ ‌జోసెఫ్‌ ‌మీద విమర్శలు కురిపిస్తున్నవారు, కేరళలో ముస్లిమేతరుల ఉనికిని సహించని ఐఎస్‌ఐఎస్‌కు తాబేదార్లా? వెంటనే స్పష్టం చేయాలని ఆయన నిలదీశారు. తాము ఐఎస్‌ఐఎస్‌కు మద్దతు ఇవ్వడం లేదని రాష్ట్ర ముస్లింలు కూడా ప్రకటించాలని కేంద్రమంత్రి కోరారు. నార్కోటిక్స్ ‌జిహాద్‌ అన్న మాట తొలిసారి వింటున్నానంటూ ముఖ్యమంత్రి పినరయ్‌ ‌విజయన్‌ ‌ప్రకటించడం మరీ వికృతమని మురళీధరన్‌ అన్నారు.

 ముస్లింలలో అలాంటి అకృత్యాలకు పాల్పడేవారి గురించి ఆయన మాట్లాడారు. కొట్టాయంకు చెందిన ది ముల్లా ముస్లిం కోఆర్డినేషన్‌ ‌కమిటీ ఇప్పటికే జోసెఫ్‌ ‌మీద కేసు నమోదు చేయించింది. ఇంతకీ ఇదొక తాలూకా స్థాయి సంఘం. చిత్రంగా ముల్లాల సంఘం కూడా జోసెఫ్‌ ‌సమాజంలో చీలిక తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపిస్తున్నది.

నిజానికి కేరళలో జోసెఫ్‌ ‌మాటలు చీలికనే సూచిస్తున్నాయి. అధికార సీపీఎం, కాంగ్రెస్‌, ‌ముస్లింలీగ్‌ ‌బాహాటంగా విమర్శలకు దిగాయి. కానీ కేరళ కేథలిక్‌ ‌బిషప్స్ ‌కౌన్సిల్‌ ‌మాత్రం బిషప్‌కు మద్దతు పలికింది. ఉగ్రవాద కార్యకలాపాలకు మత్తు మందుల ద్వారా ధనం చేకూరుతున్న సంగతిని ఐక్య రాజ్యసమితి వెల్లడించిన విషయం గుర్తుంచుకోవాలని కేథలిక్‌ ‌బిషప్పుల కౌన్సిల్‌ ‌గుర్తు చేసింది. ఈ కౌన్సిల్‌ ‌కాస్త గట్టిగా హెచ్చరించింది. ఐఎస్‌ఐఎస్‌ ‌సహా అనేక ఉగ్రవాద సంస్థలకు కేరళతో సంబంధాలు ఉన్నాయని నిఘా సంస్థలు ప్రకటించాయి. అయినా కోట్లాది రూపాయల విలువ చేసే మత్తుమందులు దొరుకు తున్నాయి. నిఘా సంస్థలు ఈ విషయంలో ఎలా పనిచేస్తున్నాయో గమనించాలని కూడా సూచించింది.

బిషప్‌ ‌జోసెఫ్‌ ‌ప్రకటన కేరళలో ఇప్పుడు కొత్త సమీకరణలకు చోటిచ్చింది. ఇప్పుడు కేరళలో ఈ వివాదం బీజేపీ-ఒక వర్గం క్రైస్తవులకు; కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌, ‌జిహాదీస్టులకు, కొన్ని క్రైస్తవ వర్గాల మధ్య వివాదంగా పరిణమించింది. బీజేపీ మీద విమర్శ లతో ఏ సమస్యనైనా పెడతోవ పట్టించవచ్చునని సీపీఎం భావన. కానీ వాస్తవాలు మాట ఏమిటి? కేరళ ముస్లిం ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోతోంది. దీనినైనా పార్టీలు గుర్తించాలి కదా! లవ్‌ ‌జిహాద్‌ ‌లేదంటూనే దాని నిరోధానికి అడ్డంకులు పెడుతున్నాయి సీపీఎం, కాంగ్రెస్‌. ఇప్పుడైనా అదే ప్రయత్నం చేస్తాయి. కేరళ బీజేపీ శాఖ విన్నపాన్ని పరిశీలించి, కేంద్రం అప్రమత్తమైతే లవ్‌ ‌జిహాద్‌ ‌విషయంలో చేసిన వాదాన్నే ముందుకు తీసుకు వస్తాయి. ప్రపంచ యువతను, ఎన్నో జీవితాలను, కుటుంబాలను నాశనం చేయగా వచ్చిన ఆదాయంతో సాగించదలిచన మత రాజ్య నిర్మాణాన్ని నిజమైన ధార్మికవాదులు, వారు ఏ మతం వారైనా వ్యతిరేకించాలి.

'మత్తు’యుద్ధం - నార్కోటిక్స్ ‌జిహాద్‌ : కేరళ కామ్రేడ్లు × కేథలిక్కులు - 'Intoxication' - Narcotics 'Jihad': Kerala Comrades × Catholics

పినరయ్‌ మూర్ఖత్వ-అమాయకత్వం

వామపక్షాలకు వ్యతిరేకం, జనంలో కాస్త కదలిక తీసుకురాగల శక్తి కలిగిన మాటలు అనిపిస్తే వాటి నేతలు  రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు. ముద్రలు వేస్తూ ఉంటారు. అందులో ‘అస్పష్టత’ అన్నమాట కూడా ఉంటుంది. బిషప్‌ ‌జోసెఫ్‌ ‌ప్రకటనలో కూడా కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ ‌విజయన్‌ అలాంటి అస్పష్టతనే చూస్తున్నారు. నిజానికి మత్తుమందులు ఇచ్చి ఇస్లాం ఉగ్రవాదులు ముస్లిమేతర యువతను లొంగదీసుకుంటున్నారంటూ బిషప్‌ ‌చేసిన ఆరోపణలో అస్పష్టత ఎక్కడ ఉందో అర్ధం కాదు. అసలు అలాంటి మాటే తను తొలిసారి వింటున్నానని కూడా విలేకరుల సమావేశంలో పినరయ్‌ ‌విజయన్‌ ‌చెప్పడం మరీ వింత. అసలు మత్తుమందులు కులం లేదా మతానికే పరిమితం కావు. అవి మానవాళికి చేటు చేస్తాయి అని సుద్దులు చెప్పారు. మత్తుమందులకు మతం, వర్ణం ఉండవు అంటూ సిద్ధాంతీకరించారు కూడా. ఈ మాటలు వింటే ఆయనకు కూడా ఉగ్రవాదులు మత్తుమందులు ఇచ్చి జోకొడుతున్నారేమోనన్న అనుమానం కలుగుతుంది. అయినా బాగా చదువుకున్న క్రైస్తవ పండితుడు, పెద్ద బాధ్యతలో ఉన్న వారు ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం సరికాదని నీతులు చెప్పారు. లవ్‌ ‌జిహాద్‌ ‌బెడద గురించి గతంలోను క్రైస్తవ సంఘాల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. లవ్‌ ‌జిహాద్‌ ‌గురించి అంత కాలం పోరాడినా కదలిక రాలేదు. అలాంటిది నార్కోటిక్స్ ‌జిహాద్‌కు స్వల్ప వ్యవధిలోనే కదలిక రావడం సీపీఎంకు, ముఖ్యమంత్రికి జీర్ణం కావడం లేదు.

కానీ ముఖ్యమంత్రి పినరయ్‌,  ‌రాష్ట్ర ప్రభుత్వం, సీపీఎం, కాంగ్రెస్‌ ‌పార్టీలు బిషప్‌ ‌జోసెఫ్‌ ‌మీద విరుచుకు పడడం క్రైస్తవులంతా ఏకగ్రీవంగా ఆమోదిస్తారనుకుంటే పొరపాటే.ఆమోదించడం లేదు కూడా. కొంత సొంత కవిత్వంతోనే కావచ్చు, పరోక్షంగానే అయినా మద్దతు పలుకుతున్నారు. ఇందులో కేరళ అధికార కూటమి భాగస్వామి కేరళ కాంగ్రెస్‌ (ఎం) ‌కూడా ఉండడం చర్చనీయాంశంగా మారింది. ప్రజలను చైతన్య వంతులను చేయడానికి జోసెఫ్‌ అలాంటి ప్రకటన ఇచ్చారని కేరళ కాంగ్రెస్‌ (ఎం) ‌భాష్యం చెప్పింది. ఇది సీపీఎం అధికార కూటమిలో భాగస్వామి. ఈ ప్రకటన ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి విరుద్ధం. నీళ్లు నములుతూనే బిషప్‌ ‌ప్రకటనకు తనదైన భాష్యం చెప్పింది. ఆయన ప్రకటన వెనుక ఏదైనా ప్రత్యేక అజెండా ఉండవచ్చు. కానీ ఆయన మత్తుమందుల గురించి సమాజాన్ని హెచ్చరించ డమే ధ్యేయంగా మాట్లాడారు అంటూ కేరళ కాంగ్రెస్‌ (ఎం) ‌వ్యాఖ్యానించింది. అంటే కేరళ క్రైస్తవ సమాజంలోనే కాదు. సీపీఎం అధికార కూటమిలో కూడా దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అర్ధమవుతుంది. జోసెఫ్‌ ‌ప్రకటనను వక్రీకరించవద్దని చెప్పడం ద్వారా దూకుడు తగ్గించమని హెచ్చరించినట్టు కూడా చెప్పింది.

పెరుగుతున్న ముస్లిం జనాభా

కొన్ని నిష్టుర సత్యాలను అంగీకరించడానికి మేధావులు, ప్రధానంగా వామపక్షాలు అంగీకరించవు. ప్రపంచ మొత్తం ఆమోదించిన వాస్తవాలే అయినా వీళ్లు ఆమోదించరు. రుజువులను ఖాతరు చేయరు. కాంగ్రెస్‌ ‌కూడా అలాంటి ధోరణిలోనే ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో పలు దేశాలను భయపెడుతున్న వాస్తవం- పెరుగుతున్న ముస్లిం జనాభా. దానితో వస్తున్న విపరిణామాలు. ఇదే భయం భారత్‌లోను, కేరళలో ఇంకా ఎక్కువగాను ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారం కేరళలో హిందువులు 56.16 శాతం. ముస్లింలు 24.69 శాతం. క్రైస్తవులు 19.02 శాతం. అదే 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే- హిందువులు 54.73 శాతం. ముస్లింలు 26.56 శాతం. క్రైస్తవులు 18.38 శాతం. ఈ గణాంకాలను చూస్తే ఎవరికైనా అర్ధమవుతుంది. హిందువులు, క్రైస్తవుల జనాభా శాతం తగ్గింది. ముస్లింలు పెరిగారు. గడచిన  మూడు దశాబ్దాలుగా ముస్లిం జనాభా పెరుగుతూనే ఉంది. ఇది ఇలాగే కొనసాగే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే ముస్లిం జనాభా పెరుగుదల ఒక పథకం ప్రకారం జరుగుతున్న కార్యక్రమం. కేరళ కావచ్చు, కానీ క్రైస్తవులను రక్షించే పరిస్థితిలో కాంగ్రెస్‌ ‌పార్టీ ఇప్పుడు లేదు. నిజం చెప్పాలంటే• కాంగ్రెస్‌కే కాదు, వామపక్షాలకు, చాలా ప్రాంతీయ పార్టీలకు మైనారిటీలంటే ముస్లింలే. క్రైస్తవులు, సిక్కులు, పార్సీలు, బౌద్ధులు, జైనులు మైనారిటీలుగా వాటికి కనిపించరు. ఈ పరిస్థితిలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతు ఇవ్వడమే విజ్ఞత అని చాలామంది కేరళ క్రైస్తవులు విశ్వసిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి ఏమౌతుందో గతంలోనే వినాయక్‌ ‌దామోదర్‌ ‌సావర్కర్‌, ఎంఎస్‌ ‌గోళ్వాల్కర్‌ (‌గురూజీ) చెప్పిన మాటలు కూడా వీరు గుర్తుకు తెచ్చుకుంటున్నారు.  అయినంత మాత్రాన క్రైస్తవం చేసిన అకృత్యాలను ఎవరూ మరచిపోవలసిన అవసరం లేదు. హిందూ ధర్మానికి ఆ మతం చేసిన, చేస్తున్న చేటును మరచిపొమ్మని కాదు. ఇప్పటికీ దేశంలో కొన్ని రాష్ట్రాలలో క్రైస్తవ మిషనరీలు యథేచ్ఛగా మతాంతరీకరణలు సాగిస్తూనే ఉన్నాయి. దీనినీ విస్మరించలేం. కేరళ కేథలిక్‌ ‌చర్చ్‌కు ఉన్న మరొక భయం- కేరళ నుంచి తమ వర్గం యువకులు  చదువులకు, ఉద్యోగాల కోసం వలస వెళ్లిపోతున్నారు. ఒకవైపు  ముస్లిం యువతకు విద్యార్థి వేతనాలు వంటివి ఇవ్వడానికి చర్చ్ అభ్యంతరం చెబుతోంది. అయినా ఎల్‌డిఎఫ్‌, ‌యూడీఎఫ్‌ అదే చేస్తున్నాయి. పైగా ముస్లిం యువతను రాష్ట్రం వదలి పోకుండా జాగ్రత్త పడుతున్నాయి.

ఉగ్రవాదానికి వనరు

రెండేళ్ల క్రితం బయటకు వచ్చిన అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జరిగే మత్తుమందుల లావాదేవీల విలువ 650 బిలియన్‌ ‌డాలర్లు. అందుకే కాసుల వర్షం కురిపించే ఈ వ్యాపారాన్ని  అల్‌ ‌కాయిదా, ఐఎస్‌ఐఎస్‌ ఆదాయ వనరుగా మార్చుకున్నాయి. దీనికి పెట్టుబడి తక్కువ. ఆదాయం అంచనాకు అందదు. ఇతరత్రా ఆదాయాల మీద ప్రస్తుతం ఉగ్రవాద సంస్థలు ఆధారపడడం లేదు. ఐఎస్‌ఐఎస్‌కు సిరియా పెట్రోలు వ్యాపారం నుంచి డబ్బు అందేది. అలాగే ఇస్లామిక్‌ ‌ధార్మిక సంస్థల నుంచి అల్‌ ‌కాయిదాకు నిధులు అందేవి. ఇప్పుడు ఆగిపోయాయి. అంతిమంగా ఇలాంటి ఉగ్రసంస్థలు మత్తుమందుల రవాణాతో కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

మత్తుమందులను రెండు రకాలుగా విభజిస్తారు. నల్లమందు నుంచి వచ్చేవి, కొకెయిన్‌ ‌నుంచి తీసేవి. కొన్ని కృత్రిమ మత్తుమందులు కూడా ఉన్నాయి. నల్లమందు ఆధారంగా తయారుచేసే మందులకు అఫ్ఘానిస్తాన్‌ ‌ప్రసిద్ధి. కొకెయిన్‌ ‌మందులకు లాటిన్‌ అమెరికా దేశాలు పెట్టింది పేరు. నిఘా పెట్టి, ఉగ్రవాద సంస్థల కదలికలను ప్రభుత్వాలు పట్టించుకోవడం మొదలుపెట్టిన తరువాత అవి మత్తుమందుల రవాణా మీద ఆధారపడడం ఆరంభించాయి. నిజానికి ప్రపంచంలోని ప్రతి మారుమూలన మత్తుమందులు లభ్యతకు అవకాశాలు ఉన్నాయని ఇంటర్‌పోల్‌ ఎగ్జిక్యూటివ్‌ ‌డైరెక్టర్‌ ‌టిమ్‌ ‌మోరిస్‌ అం‌గీకరించారు. పైగా కావలసినంత దొరుకుతుంది. అత్యాధునికంగా సరఫరా చేస్తారు. ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాల నిఘా వర్గాలకు పెద్ద సవాలుగా పరిణమించింది.

...జాగృతి సౌజన్యంతో

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top