సంఘకార్యాన్ని అత్యంత ప్రభావవంతమైనదిగా చేయాలి!
మనం పనిచేస్తూ ఉండగా, సంఘంలో లేని వ్యక్తులతో కలసి మాట్లాడే సందర్భాలలో వారు అంటూ ఉంటారు గదా- ఈ దేశంలో బలంపుంజుకొంటున్న శక్తులలో నిస్సందేహంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కూడా ఒకటి, దేశంలో ఉన్న అనేక శక్తులు ప్రభుత్వం మీద తమ ప్రభావాన్ని చూపిస్తున్నా, అవి కాలక్రమంలో విచ్ఛిన్నమైపోయినపుడు-సమాజంలో అరాజకత్వం వ్యాపించకుండా, సమాజం తప్పుదారిలో పోకుండా ప్రయత్నం చేయవలసినది సంఘమే, అందుకు తగిన శక్తి సంఘంవద్దనే ఉంది. అందువల్ల అటువంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేవరకు వేచి ఉండక అధికాధికంగా పరిశ్రమచేసి, సంఘకార్యాన్ని అత్యధిక శక్తిశాలిగా, ప్రభావశాలిగా సిద్ధపరచుకోవటంలో నిమగ్నమై ఉండటం కార్యకుశలురైన వారియొక్క కర్తవ్యం.
ఇప్పుడు కూడా సంఘంవద్ద ఎటువంటి శక్తి ఉన్నదో, ఎంత శక్తి ఉన్నదో, అంత శక్తిని సమకూర్చుకొని సమాజంలో నిలబడినవారు మరెవరూ లేరు. ఈ శక్తిని ఇంకా వృద్ధి చేయవలసి ఉంది. ప్రజలందరితో సముచితరీతిలో సంఘకార్యకర్తలు సంపర్కం కలిగియుండి పని చేస్తున్నట్లయితే, విభిన్న శక్తులు ఒక దగ్గరచేరి ఒక కేంద్రంచుట్టూ అల్లుకొనే ప్రయత్నం జరిగే సమయంలో, సంఘం తప్పక ఒక శక్తి కేంద్రంగా అవతరించి, వారిని ఆకట్టుకొని, సమాజమంతటికీ స్థిరత్వాన్ని అందించే సామర్థ్యశాలి అవుతుంది. ముందు ముందు రూపుదిద్దుకోబోతున్న అనుకూల పరిస్థితులను ఆకళించుకొని, సంఘకార్యం చేసేందుకు ప్రేరితులై అధికాధిక సంఖ్యలో కార్యకర్తలు ముందుకు రావలసి ఉంది. ఎక్కడైతే శాఖలున్నవో, అవి బాగా జరగాలి. శాఖలులేనిచోట్ల శాఖలు ఆరంభించాలి, నడిచేటట్లుగా చూడాలి. ఎక్కడ మన (సంఘ) కార్యకర్తలు లేరో, అక్కడ సంఘకార్యకర్తలను తయారుచేసుకొనడానికి, మన కార్యకర్తలు ఉన్నచోట వారిలోని శిథిలతను, బద్ధకాన్ని వదలగొట్టి, వారిని చైతన్యవంతులుగా, కార్యశీలురుగా మలచుకొనడానికి సఫల ప్రయత్నాలు జరగాలి. ఈ స్థితిని వీలైనంత త్వరగా సాధించాలి.
ఈ నాడున్న పరిస్థితులను ఆకళించుకోవాలి, రాబోయే రోజుల్లో ఎదురుకానున్న పరిస్థితులపై దృష్టి ఉంచాలి. ఇప్పటివరకు కాంగ్రెసు పార్టీ సంఘంపై మతతత్వ సంస్థగా, మతోన్మాదసంస్థగా ముద్రవేస్తూ, సంఘం గురించి రకరకాల భ్రాంతితో కూడిన అభిప్రాయాలను వ్యాపింపజేసేందుకు యోజనాపూర్వకంగా పనిచేస్తున్నది. ఇదేగాక, సంఘానికి వ్యతిరేకంగా అపప్రచారం చేస్తున్న మరో ఆలోచనాధారకూడా ఉంది. అది కమ్యూనిస్టుల భావజాలం. మనదేశంలోనూ, కొన్ని ఇతర దేశాలలోనూ కమ్యూనిస్టు భావజాలం ఎలా వ్యాపిస్తున్నదో అధ్యయనం చేసినట్లయితే, కమ్యూనిజంచేత ప్రభావితులైన వారందరివెనుక తాత్కాలిక ఆవేశం ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఆ ఆవేశం ఎక్కువకాలం నిలవలేదు, చప్పబడిపోయింది. సమాజంలోని అన్ని సమస్యలను పరిష్కరించేస్తామని డంబాలు పలుకుతూ బయలుదేరిన కమ్యూనిజం విఫలమైనట్లుగా నేడు ప్రపంచం ముందు వెల్లడైపోయింది. ఇప్పుడు దాని శక్తి పతనోన్ముఖమైంది. తూర్పు బెర్లిన్ కి, పశ్చిమ బెర్లిన్ కి మధ్య గోడకట్టవలసి రావటం ఏమి తెలియజేస్తుంది? ఇతర ఆలోచనా విధాలతో తాము ప్రత్యక్షంగా సంఘర్షించవలసి వచ్చినపుడు, కమ్యూనిజం తమ పిల్లకాయలను రక్షించుకొనడానికి స్వయంగా ఒక గోడను నిర్మించుకోవలసి వచ్చింది. గోడకట్టటం వెనుక మరికొన్ని కారణాలు కూడా ఉండియుండవచ్చు. అయినా, వీటన్నింటిలోనూ స్పష్టంగా కానవచ్చేది కమ్యూనిజం యొక్క పరాజయమే.
అయితే నవీనమైన ఈ భావజాలం చదువుకొన్నవారిని చాలామందిని ప్రభావితం చేసింది. దీనిద్వారా ప్రపంచంలోని సమస్యలన్నీ చిటికెలు వేసినంత సులభంగా పరిష్కారమై పోగలవనివారు అనుకున్నారు. అన్ని రోగాలు, అన్ని కష్టాలూ మాయమైపోగలవని ఆశించారు. చదువుకొంటున్న క్రొత్తతరంపై కమ్యూనిజం ప్రభావం ఎలాంటిదంటే, వారందరికీ అది ఒక ఫ్యాషన్‌గా తోచింది. ఇది ఒక క్రొత్త ఆలోచనా విధానం, ఒక క్రొత్త మందు అనుకున్నారు. దానిపట్ల ఆకర్షితులై, దానిని భుజాన వేసుకొని తిరిగేవారిని ప్రగతిశీలురుగా ప్రస్తుతించటమేగాక, దానికి భిన్నంగా ఆలోచిస్తూ, దూరంగా ఉండే వివేకశీలురను ప్రతిక్రియావాదులుగా మతత్త్వవాదులుగా చెప్పుతూవారిపట్ల దురభిప్రాయాలను వ్యాపింపజేయటం జరిగింది. అయితే యావత్తు ప్రపంచంలో ఇప్పుడు ఒక పెద్ద మలుపు వస్తున్నది. ఈ భావజాలంతోనే అంతా అయిపోతుందని చెప్పటం ఒక పెద్ద అబద్ధమని, కపటమని, మోసమని ప్రజలు అనుభవపూర్వకంగా గ్రహిస్తున్నారు. ఈ విధమైన గ్రహింపు అనేక దేశాలలో వ్యాప్తమవుతూ, మనదేశంలోకి కూడా వచ్చి చేరింది.
సంఘ ఆలోచన సరైనది-అనే భావాన్ని మేల్కొలపాలి
ఇప్పుడు ఇటువంటి తరుణంలో మనం సంఘటిత సమాజంలో ఉండే శాశ్వత జీవనశక్తిన గురించి, అత్యంత ప్రాచీనకాలనుండి సాగివస్తున్న మన పరంపర గురించి, మన సమాజంలో తీసికొనిరాదలుస్తున్న పరివర్తన (మంచి మార్పు) గురించి మన ప్రజలకు తెలియజెప్పాలి. మనలను 'పాతకాలం మనుషులు' అని కొట్టిపారవేయడానికి అవకాశంలేని పద్ధతిలో మన ఆలోచనలను మనం ప్రకటించాలి. సంఘం ఆలోచనలు సరైనవి, యోగ్యమైనవి, సముచితమైనవి, వీటి ఆధారంగానే సమాజం సంఘటితమూ, శక్తిమంతమూ అవుతుంది. ఈ శక్తి ఆధారంగానే మన సమాజం తన సమస్యలన్నింటినీ పరిష్కరించుకోగల్గుతుంది. ఈ విధంగా ఆలోచించటం మతతత్త్వమూకాదు, పాత చింతకాయ పచ్చడీ కాదు - అన్న ఆలోచనలను సమాజంలో మేల్కొలుపవలసి ఉంది.