గోవా చరిత్ర, పురాతన ఇతిహాసం – రాజవంశాల చరిత్ర : History of Goa, Ancient Epic - Dynastic History in Telugu

Vishwa Bhaarath
0
గోవా చరిత్ర, పురాతన ఇతిహాసం – రాజవంశాల చరిత్ర : History of Goa, Ancient Epic - Dynastic History in Telugu
-ప్రదక్షిణ

పురాతన ఇతిహాసం – రాజవంశాల చరిత్ర

గోవా కొంకణ ప్రాంతం, ఇది హిందూ పురాణాల ప్రకారం `పరశురామ క్షేత్రం’ గా పిలవబడుతుంది. శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడు, కన్యాకుమారి నుంచి సప్తకొంకణ వరకు గల భూమిని, సముద్రం నుంచి వెలికితీసాడని సహ్యాద్రిఖండం పురాణగాథ, అందుకే ఇది పరశురామభూమిగా ప్రసిద్ధి పొందింది. దాదాపు 12౦౦౦ సంవత్సరాల క్రితం, భూమి టెక్టానిక్ కదలికల మూలంగా సముద్రంనుంచే భారత పశ్చిమ తీరం, దక్ఖన్ పీఠభూమి ఏర్పడ్డాయని  భూగర్భ శాస్త్రం నిర్ధారించింది.  సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో, మాండవి కుశావతి నదుల పరివాహక ప్రాంతాల్లో పురాతన రాతియుగానికి సంబంధించి ఎన్నో అవశేషాలు, ఆధారాలు లభించాయి. 

ఈ గోవాప్రాంతం, వరుసగా మౌర్యులు, శాతవాహనులు, గోవా భోజరాజులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, శిలాహరులు, యాదవులు, కదంబ రాజ్యo, విజయనగర సామ్రాజ్యం తరువాత, ఈ రాజ్యం బీజాపూర్ సుల్తానుల అధీనంలోకి వెళ్ళింది.  చంద్రగుప్త మౌర్యుడి కాలంలో సౌరాష్ట్ర, సింధు ప్రాంతాలతో పాటు, కొంకణ కూడా మౌర్య సామ్రాజ్య `అపరాంత’ ప్రాంతంలో భాగంగా ఉండేది. శాతవాహన చక్రవర్తుల (200BCE-200CE) సామ్రాజ్యం సౌరాష్ట్ర, సింధు ప్రాంతాలకి విస్తరించినపుడు, గోవాతో సహా పశ్చిమ తీరం, రోమన్ గ్రీకు సామ్రాజ్యాలతో వర్తక, వాణిజ్య సంబంధాలు కలిగి, సుసంపన్న క్షేత్రంగా ఉండేది. చక్రవర్తి వాసిష్టిపుత్ర శాతకర్ణిని ఆయన అల్లుడు క్షాత్రప రాజు రుద్రదమన్ ఓడించి 250CE దాకా రాజ్యపాలన చేసాడు. ఆ తరువాత గోవా యాదవ భోజవంశం, పురాతన చంద్రగిరి/ చందోర్ రాజధానిగా దాదాపు 500 సంవత్సరాలు గోవాని పరిపాలించారు. వీరి శాసనకాలానికి సంబంధించి ఎన్నో శిలాశాసనాలు, నాణాలు, రాగిరేకులు లభ్యమయాయి. రాష్ట్రకూటులు, వారి సామంతులు శిలాహరులు,  ఆ తరువాత కాదంబ వంశం (10-14 శతాబ్దాలు) గోవాపురిని పరిపాలించాయి. కాదంబ రాజు శష్టదేవుడి కాలంలో రాజ్యం ఎంతో అభివృద్ధి చెంది, గోపకపట్టణ రేవు పాత వైభవాన్ని తిరిగి పొంది, ఎన్నో దూరతీరాలతో వాణిజ్య సంబంధాలతో సమృద్ధిగా ఉండేది. శైవులైన రాజులు ఎన్నో శైవక్షేత్రాలు, దేవాలయాలు కట్టించారు. వైదిక సంప్రదాయాలకి అనుగుణంగా అశ్వమేధయాగాలు కూడా చేసేవారు. సుసంపన్నమైన గోవా రాజ్యాన్ని ఖిల్జీ సేనాని `మాలిక్ కఫుర్’ 14వ శతాబ్దంలో ధ్వంసం చేసి, కొల్లగొట్టాడు.( మిగిలిన అతి కొద్ది దేవాలయాల్లో  సుర్లాలోని మహాదేవ గుడి ఒకటి). ముస్లిం ఆక్రమణదారులు కాదంబ రాజు సూర్యదేవని 1345సం.లో హత్య చేసారు.  బహమనీ సుల్తానుల పాలైన గోవాపురిని తిరిగి విజయనగర సామ్రాజ్యం గెలిచి, వంద సంవత్సరాలు విజయవంతంగా పాలించిన తరువాత, అది బీజాపూర్ సుల్తానుల వశమైంది.

పోర్చుగీస్ వలస పాలన – కాథలిక్ చర్చ్ క్రూరత్వం – హిందువుల అణచివేత : 1510-1961 CE

భారతదేశ సంపద గురించి తెలిసి, దానిని కొల్లగొట్టడానికి, తక్కువ సమయంలో భారత్  చేరడానికి సముద్రమార్గం కనిపెట్టాలని చూసిన చాలామందిలో వాస్కో-డ-గామా ఒకడు. 1498లో అతను భారత్ పశ్చిమ తీరం చేరుకోవడంతో, పోర్చుగీస్ తో పాటు ఇతర యూరోపియన్ దేశాల వలస పాలనకి, భారత సాంస్కృతిక జీవన అణచివేతకి, మతమార్పిడులకి, దేశ సంపద కొల్లగొట్టడానికి మార్గం ఏర్పడింది.  25ఓడలు, వేలాదిమంది సైన్యం, పెద్ద ఫిరంగులతో 1502లో అతను రెండవసారి భారత్ కి వచ్చినప్పుడు, కాలికట్ (నేటి కోజికోడ్) తీరం సమీపం నుంచి, ఆ రాజ్యంపై తుపాకులతో దాడి చేసాడు. రాజు జామోరిన్ పంపించిన దూత చెవులు పెదవులు కోసి, కుక్క చెవులు అతికించి పంపించాడు. ఆ సమయం నుంచి భారతీయులపై పోర్చుగీస్ రాజ్యం క్రూరత్వం మరింతగా పెరుగుతూ వచ్చింది. అక్కడినుంచి వారు  గోవా చేరుకున్నారు. ఆదిల్ షా బహమనీలను పోర్చుగీస్ సైన్యం ఓడించింది, వారి విదేశీ వలసపాలన అక్కడ అప్రతిహతంగా 450 సంవత్సరాలు కొనసాగింది.

సంపద 

గోవా ఎంత సుసంపన్న౦గా ఉండేదంటే, యాత్రికులు దానిని `స్వర్ణ గోవా’ గా అభివర్ణించారు. పశ్చిమ దేశాలకు, దినుసులు, సుగంధ ద్రవ్యాల ఎగుమతులకు గోవా ముఖ్యమైన రేవు పట్టణం.

గోవా మత మార్పిడుల చరిత్ర

తరువాత వచ్చిన ఫ్రాన్సిస్ క్జేవియర్ (సెయింట్  క్జేవియర్), గోవా హిందువుల మతం మార్పించడానికి విశ్వప్రయత్నం చేసి, `చర్చ్ మతవిచారణలు-శిక్షలు’ (Inquisition) ఆదేశించాడు, ఆ క్రూర దమనకాండ దాదాపు ౩౦౦సంవత్సరాలు సాగింది. 1534నాటికి `డయోసీస్’, 14 చర్చిలు గోవాలో నిర్మించి, ఎన్నో శివాలయాలను ధ్వంసం చేసారు. పొప్ నికొలాస్ Vకి, 1546లో బిషప్ ఆల్బకర్క్ గోవా క్రైస్తవంగా మారుతుందని హామీ ఇచ్చాడు. 1549 నాటికే, వందలాది దేవాలయాలు ధ్వంసం చేసి, వాటి సామగ్రిని, దేవాలయ ఆస్తులను అక్కడ కట్టిన చర్చ్’లకు అప్పగించారు. కొన్ని దేవాలయాలను భక్తులు వేరే చోట్లకి తరలించుకున్నారు. `సెయింట్ పాల్’ కాలేజీలో కొత్త మత బోధన ప్రారంభమైంది. హిందువులు ఎవరూ ఏ ప్రభుత్వ పదవిలో ఉండకుండా నిషేధించారు.

పద్ధతి ప్రకారం, వివిధ రకాలుగా మతమార్పిడి అమలు చేసారు. హిందువుల దుస్తులు, సంప్రదాయాలు, కళలు, దేవాలయ శిల్పాలు, గ్రంథాలు, ఆహారాలు, అన్నీ నిషేధించబడ్డాయి. బలవంతంగా గోమాంసం తినిపించి హింసించి మతం మార్పించేవారు. పిల్లలందరూ క్రిస్టియన్ బోధనలు మాత్రమే నేర్చుకోవాలి. వారి ఇళ్ళల్లో కూడా హిందూ బోధనలు ఉండకూడదు, అలా ఎవరైనా కనిపిస్తే వారిని బలవంతంగా మతం మార్చేవారు. సంస్కృతం, మరాఠి భాషల గ్రంథాలు దోచుకుని తగలబెట్టేవారు. ఎవరు మతం మారుతారో వారికి కుటుంబ ఉమ్మడి ఆస్తి, భూములు లభిస్తాయని రాజు ఆజ్ఞ్య జారీ చేయడంతో, కొందరు దురాశతో మతం మారారు. 1659లో పోర్చుగీస్ రాజు అనాధ పిల్లలు, లేక తల్లిదండ్రుల్లో ఒకరు లేకపోయినా, వారిని క్రిస్తియన్లుగా మార్చాలని ఆదేశాలు జారీ చేసాడు.
(16వ శతాబ్దంలో `రిచర్డ్ బర్టన్’ తన గ్రంథంలో కొన్ని విషయాలు వివరించారు).

హిందువులు వారి అస్తిత్వo, ధర్మం కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడ్డారు; ఒక కుటుంబంలో అన్నదమ్ములుంటే, ఒకరు బలవంత మతమార్పిడికి గురైనా, ఇంకొకరు దూర ప్రదేశాలకు తరలిపోయి తమ హిందూ సంప్రదాయాన్ని కాపాడుకునేవారు. 1560 సమయంలో, కొంకణీలు దాదాపు 20వేల కుటుంబాలు, కర్నాటక, కేరళ `కొంకణి తీర’ ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయాయి. అయితే వారు, పోర్చుగీస్ భారత్ వదిలి వెళ్ళిపోతారు, తమ జీవితకాలంలో తాము తిరిగి స్వస్థలం చేరుకొని ఒకే కుటుంబంగా జీవించవచ్చని భావించారు. కాని  పోర్చ్యుగీస్ వారి పాలన  ఆ తరువాత కూడా 400 సంవత్సరాలు సాగింది.

ఒక దశలో 1583లో, బలవంతపు మతమార్పిడులు, దేవాలయాల విధ్వంసం భరించలేక కొందరు చిన్న క్షత్రియ దొరలు, చర్చ్ మిషనరీలను చంపేశారు, అపుడు పోర్చుగీస్ ప్రభుత్వం, ఆ దొరలందరినీ ఏరి ఏరి హత్య చేసింది. దీనినే `కొంకల్లి/కంకోలిమ్ తిరుగుబాటు’గా పిలుస్తారు. ప్రపంచంలో తెల్లదొరలకి వ్యతిరేకంగా జరిగిన తొలి తిరుగుబాటు ఇది. 

చర్చ్ మతవిచారణలు-శిక్షలు (Inquisition) 1516-1812CE

హిందువులను అణచివేయడానికి, శిక్షించడానికి పోర్చుగీస్ రాజ్యం, ప్రతీకారంగా `మత విచారణలు-శిక్షలు’ మొదలుపెట్టారు. 1545లో `ఫ్రాన్సిస్ క్జేవియర్’ రాజుకి లేఖ వ్రాస్తూ, `మతవిచారణలకు’ కోర్టులను ఏర్పాటు చేయాలని, `ఏ చేతులైతే భగవంతుడిని ప్రార్థించాయో, ఆ చేతులే విగ్రహాలను పగలగొట్టాలి’ అని వ్రాసాడు. హిందువులకు అత్యంత క్రూరమైన శిక్షలు వేసి, చిత్రహింసలకు గురిచేసి చంపేవారు- నాలికలు కోసేయడం, మండుతున్న ఇనప చువ్వలతో కళ్ళు పొడవడం, శరీర భాగాలను కాల్చి చర్మం ఒలిచేయడం, సజీవ దహనం, ప్రేగులు పొడిచి బయటకి లాగడం,  మనిషి శరీరాన్ని కొయ్యకు మేకులతో కొట్టగా, మెల్లిగా కొన్ని గంటలు లేక రోజులో నరకయాతన అనుభవించి వారు దారుణంగా మరణించడం జరుగుతుంది. ఇటువంటి శిక్షలకు గురై, నమోదు కాబడిన వారి సంఖ్య 16712. అయితే ఇంతకన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా జరిగాయని అంచనా.

ఎంత అణచివేయబడినా, క్రూరంగా హింసించి హిందువులను ఊచకోత కోసినా, గోవా హిందువులు ప్రతిఘటించి, వారి ధర్మాన్ని సంస్కృతిని కొంతవరకు నిలబెట్టుకున్నారు. ఈనాటికి కూడా కాథలిక్ చర్చ్, భారత దేశాన్ని, ముఖ్యంగా హిందువులని క్షమాపణ కోరలేదు.   ఏకే ప్రియోల్కర్ వ్రాసిన `ది గోవా ఇన్క్విసిషన్’ గ్రంథం, ఇతర పుస్తకాలలో ఈ వివరాలు ఉన్నాయి.  

ఆధారం: https://arisebharat.com; వికీపీడియా, బ్లాగ్స్ - Vishwa Samvadam

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top