దార్శనికుడు నానాజీ దేశ్‌ముఖ్‌ | Nanaji Deshmukh

Vishwa Bhaarath
0
దార్శనికుడు నానాజీ దేశ్‌ముఖ్‌ | Nanaji Deshmukh
నానాజీ దేశ్‌ముఖ్‌

దార్శనికుడు నానాజీ దేశ్‌ముఖ్‌ | Nanaji Deshmukh

నానాజీ దేశ్‌ముఖ్‌.. ‌నైతిక విలువలకు, నమ్మిన సిద్ధాంతాలకు జీవితకాలం కట్టుబడిన నేతగా అందరికీ సుపరిచితం. ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన, నిరాడంబర జీవనం గడిపిన నాయకుడిగా పేరొందారు. 
   పార్టీతో పాటు పేద ప్రజల అభ్యున్నతి, పల్లె ప్రాంతాల ప్రగతి, ఆరోగ్యం, తాగునీరు, కుటీర పరిశ్రమల ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించిన నేతగా నానాజీ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. నేడు ఆయన మనముందు లేనప్పటికీ ఆయన పాటించిన విలువలు, మార్గాలు మన కళ్ల ముందున్నాయి. నానాజీ బాటలో నడవటమే ఆయనకు మనం సమర్పించే ఘననివాళి అవుతుంది.

నానాజీ దేశ్‌ముఖ్‌గా పేరొందిన ఆయన అసలు పేరు.. చండీకాదాన్‌ అమృతరావు దేశ్‌ముఖ్‌. ‌మన పొరుగున ఉన్న మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో అక్టోబర్‌ 11, 1916‌నలో జన్మించారు. బాల్యంలో విద్య కోసం నానా ఇబ్బందులు పడ్డారు. ఇందుకోసం ఆయన కొంతకాలం కూరగాయలు అమ్మారు. బాల్యం నుంచే ఆర్‌.ఎస్‌.ఎస్‌. (‌రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌) ‌సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరిచారు. 13 ఏళ్ల ప్రాయంలోనే ఆ సంస్థలో కార్యకర్తగా చేరారు. అదే సమయంలో స్వాతంత్య్ర పోరాటంపైనా ఆసక్తి ప్రదర్శించారు. మహారాష్ట్ర నేత బాలగంగాధర్‌ ‌తిలక్‌ ‌ప్రేరణతో స్వాతంత్య్ర ఉద్యమం లోకి దూకారు. ఉద్యమంలో భాగంగా జైలుకెళ్లారు. 
  ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌భావజాలాన్ని ప్రజల్లో వ్యాప్తి చేసేందుకు పత్రికలు స్థాపించారు. 1947లో సంఘ్‌ ‌తరఫున రాష్ట్రధర్మ, పాంచజన్య పత్రికలను ప్రారంభించారు. వీటి సంపాదక బాధ్యతలను అప్పట్లో యువకుడైన అటల్‌ ‌బిహారీ వాజపేయికి అప్పగించారు. కొంతకాలం ‘మంథన్‌’ (ఆత్మ పరిశీలన) పత్రికను నడిపారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. అ‌గ్ర నేతలు హెడ్గేవార్‌, ‌గోళ్వాల్కర్‌.. ‌నానాజీని అమితంగా అభిమానించేవారు. సంస్థ పట్ల ఆయన చిత్తశుద్ధిని, అనురక్తిని అభినందించేవారు. నానాజీ ప్రతిఒక్కరితో స్నేహపూరితంగా వ్యవహరించేవారు. ఆయన రాజకీయ ప్రత్యర్థులు సైతం నానాజీని అభిమానించే వారు. వ్యక్తులతో తనకు ఎలాంటి వైరం లేదని, వారి భావజాలాన్ని, సిద్ధాంతాలను మాత్రమే వ్యతిరేకిస్తానని నానాజీ తరచూ చెప్పేవారు.

నానాజీ పేరుకు రాజకీయ నాయకుడు అయినప్పటికీ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరిచేవారు. రాజకీయ పరమార్థం అధికారం కాదని ప్రజలకు సేవ చేయడమేనని ఆయన ప్రబలంగా నమ్మేవారు. తొలి రోజుల్లో నాటి భారతీయ జనసంఘ్‌లో క్రియాశీలకంగా ఉన్నప్పటికి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ద్వారా ప్రజలకు సేవలు అందించడం పైనే ఎక్కువగా ఆసక్తి చూపేవారు. అక్షరాస్యత, కుటీర పరిశ్రమలు, పల్లె ప్రజలకు మెరుగైన ఆరోగ్యం, విద్య, పారిశుద్ధ్యం, సేవలు అందించడం ద్వారా దేశ రూపురేఖలు మార్చవచ్చని విశ్వసించేవారు. భారీ పరిశ్రమలు ఇతర ప్రాజెక్టులకు పెద్దయెత్తున నిధులు అవసరమని, అదే కుటీర పరిశ్రమలను చిన్న మొత్తంలో పెట్టుబడులు సరిపోతాయని తద్వారా ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయని నానాజీ చెప్పేవారు. 
   కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణకు ఆయన పూనుకున్నారు. మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌‌ప్రదేశ్‌, ‌మహారాష్ట్రల్లోని మారుమూల పల్లెలకు వెళ్లి సేవా కార్యక్రమాలు చేపట్టారు. గ్రామాలను దత్తత తీసుకోవడం, వాటిల్లో మౌలిక వసతుల కల్పనకు పాటుపడటం, అక్షరాస్యత కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. మహారాష్ట్రలోని బీడ్‌, ‌యూపీలోని గోండా ప్రాంతాల్లో సేవలందించారు. పల్లెల ప్రగతిపైనే దేశ ప్రగతి ఆధార పడి ఉందని ఆయన బలంగా విశ్వసించేవారు. ఆ దిశగా అడుగులు వేశారు. యూపీ, మధ్యప్రదేశ్‌ ‌సరిహద్దుల్లోని చిత్రకూట్‌లో తన సారథ్యంలో గ్రామోదయ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. 1950లో యూపీలోని గోరఖ్‌పూర్‌లో స్వయంగా తొలి ‘సరస్వతీ శిశుమందిర్‌’‌ను ప్రారంభించి ఆదర్శంగా నిలిచారు. నాడు వేసిన బీజం నేడు శాఖోపశాఖలుగా విస్తరించాయి. నేడు దేశవ్యాప్తంగా సరస్వతీ శిశుమందిర్‌లు విద్యాసేవలు అందిస్తు న్నాయి. వినోబాభావే ప్రారంభించిన భూదాన్‌ ఉద్యమంలో పాల్గొన్నారు. 70వ దశకంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ నిరంకుశ పోకడలకు లోక్‌నాయక్‌ ‌జయప్రకాశ్‌ ‌నారాయణ్‌ ‌సారథ్యంలోని సంపూర్ణ విప్లవం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు.

1977లో నాటి జనతా ప్రభుత్వ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ ‌మంత్రివర్గలో చేరాలని నానాజీని కోరారు. పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని కోరినా సున్నితంగా తిరస్కరించారు. రాజకీయాలు తన బాట కాదని సేవామార్గమే తనకు ముఖ్యమని చెప్పారు. నాటి సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని బలరాంపూర్‌ ‌స్థానం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 1999లో నాటి వాజపేయి సర్కారు ఆయనను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసింది. అదే ఏడాది దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారం ‘పద్మ విభూషణ్‌’ ఆయనను వరించింది. మరణానంతరం 2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘భారత రత్న’తో నానాజీ దేశ్‌ముఖ్‌ను గౌరవించింది. సుదీర్ఘ కాలం ప్రజలకు సేవలందించిన నానాజీ 2010 ఫిబ్రవరిలో పరమపదించారు. మరణా నంతరం కూడా తాను ఏదోరకంగా సమాజానికి ఉపయోగపడాలని ఆయన భావించారు. అందుకే ఆయన కోరిక మేరకు భౌతిక కాయాన్ని ‘దధీచి దేహదాన్‌’ అనే సంస్థకు అప్పగించారు. తాను నమ్మిన విలువలకు జీవితాంతం కట్టుబడి సేవామార్గంలో నడిచిన నానాజీ దేశ్‌ముఖ్‌ ‌ప్రస్థానం నేటితరం నాయకులకు విలువైన పాఠమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన మార్గం పార్టీలకు అతీతంగా అందరికీ అనుసరణీయం.

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్జా - జాగృతి సౌజ‌న్యంతో…

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top