Dattatreya Hosabale |
హిందువులందరూ ఐకమత్యంగా వుండాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమం కోసం, హిందూ సమాజ ఐక్యత కోసం ఈ సంఘటన అత్యావశ్యకమని అన్నారు. హిందువులను కులం, భావజాలం ఆధారంగా విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిపై హిందూ సమాజం అప్రమత్తంగా వుండాలని సూచించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి మండల్ బైఠక్ ముగింపుకి ముందు దత్తాత్రేయ హోసబళే మీడియాతో మాట్లాడారు.
ఈ రెండు రోజుల సమావేశాల్లో సంఘ్ విస్తరణ, దాని కార్యకలాపాలతో పాటు సంఘ్ ప్రేరేపిత సంస్థల కార్యవిస్తరణ, రాబోయే ప్రణాళికలు, యోజన గురించి చర్చించామని వెల్లడించారు. వీటితో పాటు సంఘ్ శతాబ్ది సందర్భంగా విస్తరణపై కూడా చర్చించుకున్నామని తెలిపారు. అలాగే పంచపరివర్తన్ అన్న అంశంపై కూడా చర్చించామన్నారు. ఈ పంచ పరివర్తన్ లో ఐదు కీలక అంశాలున్నాయని.. సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్, పర్యావరణం, స్వ, పౌర విధులు వున్నాయన్నారు. ఈ పంచ పరివర్తన్ ను కేవలం సంఘ స్వయంసేవకులే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ఆచరించాలని పిలుపునిచ్చారు. అప్పుడే సమాజం మొత్తం ఆచరించేలా చూడగలమని, అప్పుడే ప్రోత్సహించగలమని అన్నారు.
శాఖల సంఖ్య పెరిగింది...
మరోవైపు శాఖల విస్తరణపై కూడా దత్తాత్రేయ హోసబళే వెల్లడించారు. గత యేడాదితో పోలిస్తే ఈ యేడాది దేశ వ్యాప్తంగా సంఘ శాఖలు 3,626 పెరిగాయని అన్నారు. ప్రస్తుతం 45,411 స్థానాల్లో 72,354 శాఖలు నడుస్తున్నాయని, ఈ యేడాది 6,645 శాఖలు కొత్త శాఖలు ఈ జాబితాలో చేరాయని తెలిపారు. అలాగే అదనంగా సాప్తాహిక్ మిలన్ సంఖ్య 29,084 కి పెరిగిందని, ఇది గత సంవత్సరం కంటే 3,147 ఎక్కువ అని పేర్కొన్నారు.అలాగే నెలకోసారి నిర్వహించే మాసిక్ సంఘ మండలీలు కూడా ఇప్పుడు 11,382 కి పెరిగాయని, కొత్తగా 750 ఈ జాబితాలోకి చేరాయన్నారు. సంఘ శతాబ్ది సమయంలో ఇదో మైలురాయి అని అభివర్ణించారు. రాబోయే ప్రతినిధి సభ వరకు ఈ శాఖల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తామన్నారు. అయితే కేవలం పెంచడమే కాకుండా నాణ్యతతో కూడిన పెంపుపై కూడా చర్చించామన్నారు.
సామాజిక దుస్థితిలో లేదా.. సమాజం సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు సేవ చేయడానికి స్వయంసేవకులు ఎల్లప్పుడూ ముందుంటారని అన్నారు. ఇది ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో వివిధ వ్యక్తులు, సంస్థలు కూడా పనిచేయడానికి వస్తాయని, వాటితో కలిసే తాము కూడా పనిచేస్తామన్నారు. విపత్తుల సమయాల్లో ఎల్లప్పుడూ స్వయంసేవకులు అప్రమత్తతతో వుంటారన్నారు. పశ్చిమ బెంగాల్ లని తారకేశ్వర్ నది వరదల సమయంలో 25 వేల మందికి సహాయం చేసి, ప్రాణాలు కాపాడారని, అలాగే ఆహారాన్ని కూడా అందించారన్నారు.
మరోవైపు ఒడిశాలోని పూరీ వరదల సమయంలోనూ స్వయంసేవకులు 40,000 మందికి సహాయం చేశారని దత్తాజీ గుర్తు చేశారు. తాజాగా వచ్చిన ధనా తుఫాను సమయంలోనూ స్వయంసేవకులు సహాయం అందిస్తున్నారన్నారు. కేరళలోని వాయనాడ్ లో కొండచరియలు విరిగినప్పుడు 1,000 మంది స్వయంసేవకులు ముందూ వెనుక ఆలోచించకుండా సహాయం అందించేందుకు తక్షణమే రంగంలోకి దిగారని గుర్తు చేశారు. హిందువులా? ముస్లింలా? అన్న తేడాలేమీ చూపించకుండా సహాయం చేశారని, అలాగే వాయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన సందర్భంగా మరణించిన వారికి ఆయా మతవిశ్వాసాల అనుగుణంగానే స్వయంసేవకులు అంత్యక్రియలు నిర్వహించారని వెల్లడించారు.
మొబైల్స్, OTT ప్లాట్ ఫారమ్ పై ..
మరోవైపు పిల్లలపై మొబైల్స్, ఓటీటీ ప్లాట్ ఫారములు ప్రభావంపై కూడా మాట్లాడారు. ఇప్పుడు చిన్న పిల్లల చేతుల్లోనూ మోబైల్స్ వున్నాయని, వాటి నుంచి జ్ఞానాన్ని పొందడం మంచిదే అయినా, వారు నేర్చుకునేవన్నీ ప్రయోజనకరమైనవి కావని అభిప్రాయపడ్డారు. మనస్సులను మార్చే, చెడు ప్రభావాలు చూపించే అంశాలు కూడా వున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.OTT ప్లాట్ ఫారముల విషయంపై చట్టపరమైన నియంత్రణ అవసరమన్నారు. సినిమాలకు ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డు వుందని, అలాగే OTT కి కూడా అలాంటిదే అవసరమన్నారు. సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, ఇలాంటి నియంత్రణను అమలు చేయాలని సూచించారు. తరువాతి తరాలు మంచి స్వభావంతో సమాజంలో మెసలాలని, తప్పుడు కార్యకలాపాలు చేయకుండా, మాదక ద్రవ్యాలు అలవాటు చేసుకోకుండా వుండేలా యావత్ సమాజం ఆలోచించాలని తెలిపారు. ఈ విషయంలో కుటుంబాల సహకారం అవసరమని, కుటుంబాలు కృషి చేయాలని పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ హిందువులపై....
బంగ్లాదేశ్ హిందువులు అక్కడే వుండాలని దత్తాత్రేయ హోసబళే సూచించారు. అక్కడి నుంచి ఎవ్వరూ వలస వెళ్లిపోవద్దని, అదే వారి జన్మభూమి అని అన్నారు. అక్కడి స్వాతంత్రోద్యమంలో కూడా వారిది కీలక పాత్ర అని అన్నారు. హిందువులు అక్కడే వుంటే వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మాత్రం అక్కడి ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. ప్రపంచంలోని ఏ హిందువుకైనా కష్టం వస్తే వారి చూపు భారత్ వైపే చూస్తుందన్నారు.హిందువులకు, మైనారిటీలకు రక్షణ కల్పించాలని భారత ప్రభుత్వం కూడా వారిని కోరిందని, అక్కడి హిందువుల కోసం వీహెచ్ పీ, ఆచార్య సభ తమ గళాన్ని వినిపించాయన్నారు. అక్కడే శక్తిపీఠం కూడా వుందన్నారు. 20 సంవత్సరాలుగా హిందువులు బాధలు పడుతున్నారని, వారికి మద్దతుగా హిందూ స్వయంసేవక్ సంఘ్ కూడా వుంటుందన్నారు. హిందూ సమాజం ఐక్యంగా లేకపోతే చీలిపోతుందని, కులం, భాష, మత విభజనల కారణంగా వివక్ష చూపితే చీలిపోతామని, అందుకే ఐకమత్యం అవసరమని నొక్కి చెప్పారు.
కృష్ణ జన్మభూమి కేసు విషయంపై కూడా హోసబళే స్పందించారు. ప్రస్తుతం అది న్యాయస్థానం పరిధిలో వుందన్నారు. కోర్టు త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తుందన్న ఆశాభావంతో వున్నామన్నారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం వుందన్నారు. ఇప్పటికీ ఈ సమస్య వుందని, ప్రజలు కూడా తమ గళాన్ని వినిపిస్తూనే వున్నారని పేర్కొన్నారు.
లవ్ జిహాద్ పై స్పందిస్తూ...
గత 25 సంవత్సరాలుగా ఈ సమస్యలను పరిష్కరిస్తోందని, సంఘ్ ప్రధానంగా వ్యక్తి నిర్మాణంపైనే దృష్టి పెడుతుందని పునరుద్ఘాటించారు. లవ్ జిహాద్ విషయంలో హిందూ జాగరణ్ మంచ్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ వంటి సంస్థలు ఇప్పటికే పనిచేస్తున్నాయని, స్వయంసేవకులు కూడా ఈ అంశంపై కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. లవ్ జిహాద్ కేసులో వున్న అమ్మాయికి పునరావసం గురించి కృషి చేస్తామని, వారి అభ్యున్నతి కోసం పనిచేస్తున్న సంస్థలకు తాము అండగా వుంటామని తెలిపారు. అయితే అలాంటి వారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటారో కూడా తాము గుర్తించామని అన్నారు. యువతీ, యువకులను కాపాడుకోవాల్సిన బాధ్యత వుందని, లవ్ జిహాద్ అమ్మాయిలు ఇతర అమ్మాయిలను జాగృతం చేస్తున్నారని, సంఘ్ వారికి మద్దతిస్తుందని ప్రకటించారు.
మత మార్పిళ్లపై...
ప్రజలు మతం మారకుండా స్వయంసేవకులు నిరోధించాలని అన్నారు. అయితే ఇప్పటికే మతం మారిన వారికి తిరిగి హిందూ మతంలోకి రావడానికి సహాయం కూడా చేయాలన్నారు. తాము దీనిని మత మార్పిడి అని కాకుండా సైద్ధాంతిక మార్పిడి గా చూస్తామన్నారు. ఈ మార్పిళ్లు ఆలోచనా సరళిని మార్పు చేస్తాయని, దేశంతో అనుసంధానాన్ని తెంచేస్తాయన్నారు. గాంధీజీ, స్వామి వివేకానంద మత మార్పిళ్లను వ్యతిరేకించారని, వాటిని నిరోధించడానికి తాము కూడా వారిని అనుసరిస్తామన్నారు. ఈ విషయంలో సమాజం కూడా కృషి చేయాలని కోరారు. ఆర్థికంగా బలహీనంగా వున్న వారిపై తాము దృష్టి పెట్టామని, వారికి విద్య అందించడానికి ప్రయత్నిస్తున్నామని, అలాంటి వారు తమ మతం విడిచిపెట్టాల్సిన అవసరం లేదని, సమాజం వారికి అండగా వుండాలన్నదే తమ అభిమతమని దత్తాత్రేయ హోసబళే పేర్కొన్నారు.
Courtesy : vskts