మాతృభూమి భారతదేశాన్ని ద్వేషిస్తున్నామో, రాజకీయ ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీతో విభేదిస్తున్నామో తెలియనంత మౌఢ్యంలో కూరుకుపోయి ఉన్నాయి ప్రతిపక్షాలు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మొదలు, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, డీఎంకే, ఏఐడీఎంకే, బీఆర్ఎస్ ప్రతి రాజకీయ పక్షం ఇదే జాడ్యంతో బాధపడుతున్నాయి.
ఈ పార్టీలన్నింటికీ మించినవి కమ్యూనిస్టు పార్టీలు. దేశం, దేశీయమైన చింతన అంటే మొదటి నుంచి వీటికి ద్వేషమే. ప్రపంచ కార్మికుల ఐక్యత పేరుతో ఇవి భారతీయత స్పర్శ ఉన్న ఏ సిద్ధాంతాన్నయినా ఈసడిస్తాయి. ప్రస్తుతం కేరళను కుదుపుతున్న భారతమాత పటం వివాదం కమ్యూనిస్టుల నీచ సంస్కృతికి నిదర్శనం. దేవభూమిని దెయ్యాల భూమిగా మార్చిన సీపీఎం వచ్చే ఎన్నికలలో ఓడిపోవడం ఖాయమని తేలిన తరువాత ముస్లింలను బుజ్జగించడానికి భారతమాత పటం వివాదం రగిలిస్తున్నది. అదే పనిగా భారతమాత పటం మీద దండయాత్ర చేస్తున్నది. ఓడిపోతామని తెలిసిన సీపీఎం (ఎల్డీఎఫ్), గెలుపు మీద నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్ (యూడీఎఫ్) రెండూ కూడా భారతమాత చిత్రపటాన్ని గవర్నర్ కార్యాలయంలో పెట్టినందుకు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నాయి. సంస్కృతిని కలుషితం చేసే ఈ వికృత రాజకీయ క్రీడను పర్యావరణ దినోత్సవం వేళ కేరళ కమ్యూనిస్టులు ఆరంభించారు.
కేరళ రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ సంవత్సరం పర్యావరణ దినోత్సవాన్ని తమ దేశ వ్యతిరేకతను ప్రదర్శించడానికి కమ్యూనిస్టులు ఎంచుకున్నారు. భారతమాత పటం ఏర్పాటు చేసినందుకు నిరసనగా వ్యవసాయ శాఖ మంత్రి పి. ప్రసాద్ కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఈయన లెఫ్ట్ డెమాక్రటిక్ ఫ్రంట్‌లో సీపీఐ సభ్యుడు. భారతమాత పటం తొలగించమని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను తాము కోరామని, అందుకు ఆయన నిరాకరించడం వల్లనే కార్యక్రమాన్ని బహిష్కరించామని ప్రసాద్ తరువాత తన ఘన కార్యం గురించి తెలియచేశారు. ప్రసాద్‌తో పాటు మరొక మంత్రి కూడా తన కమ్యూనిస్టు వ్రతాన్ని చక్కగా ఆచరించి, భరతమాత పటం ఉన్నందుకు గవర్నర్ కార్యక్రమాన్ని బహిష్కరించారు. ‘‘భారతాంబ’’ను వారిద్దరూ బహిష్కరించడానికి కారణం ఏమిటో తెలిస్తే విస్తుపోవాల్సిందే. రాజ్‌భవన్‌లో పెట్టిన భారతమాత ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో మాత్రమే పెడతారట. అందుకే వారు బహిష్కరించారట.
ఆర్ఎస్ఎస్ సృష్టి కాదు
ఇప్పుడు దేశంలో చాలాచోట్ల కనిపించే భారత మాత చిత్రపటాన్ని ఆర్ఎస్ఎస్ రూపొందించిందా? కాదు. భారతీయ, హిందూ వారసత్వాన్ని ఆర్ఎస్ఎస్ తన మనుగడకు పునాదిగా స్వీకరిస్తుంది. అందుకు తగ్గట్టే మౌలిక విలువలకు భంగం రాకుండా ఆధునీకరించుకుంది. భారతమాత చిత్రపటం కూడా అంతే. ఆ చిత్రపటం ఆర్ఎస్ఎస్ సృష్టి కాదు. అనేకమంది కళాకారులు గడచిన 120 ఏళ్లుగా భారతి చిత్రపటాన్ని రచిస్తూనే ఉన్నారు. ఆయా కాలాల జాడ, నీడ ఆ చిత్రపటాలలో కనిపిస్తాయి కూడా. మొదట చిత్రించినట్టు చెప్పే భారతమాత పటం 1905 నాటిది. అందుకు సంబంధించిన భావన శతాబ్దాల నాటిది. ఆ తరువాత రెండు దశాబ్దాలకు ఆర్ఎస్ఎస్ పుట్టింది. ఇప్పుడు కేరళ కేంద్రంగా సాగుతున్న భారతమాత పటం రగడ కేవలం ముస్లింలను బుజ్జ గించేందుకు కమ్యూనిస్టులు చేస్తున్న నీతిమాలిన యుద్ధం. భారత విచ్ఛిత్తికి కమ్యూనిస్టులు చేస్తున్న, అందుకు వీలు కల్పిస్తున్న ముస్లిం ఉగ్రవాద సంస్థల వికృత క్రీడ మాత్రమే దీని వెనుక ఉన్నాయి. జూన్ 5న మొదలైన ఈ వివాదం ఆ నెల 25కు తారస్థాయికి చేరుకుంది. జూన్ 25న (ఎమర్జెన్సీ 50 ఏళ్ల స్మరణ) కేరళ విశ్వవిద్యాలయంలో జరగవలసిన కార్యక్రమాన్ని రిజిస్ట్రార్ అర్థంతరంగా రద్దు చేశారు. ఇది గవర్నర్ పాల్గొనవలసిన కార్యక్రమం. పర్యావరణ దినోత్సవం లోను, ఈ కార్యక్రమంలోను ఈ అల్లరికి కారణం భారతమాత చిత్రపటాన్ని చూపిస్తున్నారు. కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలు, మతోన్మాద ఉగ్రవాద ముస్లిం సంస్థల విద్యార్థి సంఘాలు, కాంగ్రెస్ విద్యార్థి సంఘం భారతమాత చిత్రపటం విశ్వవిద్యాల యంలో, రాజ్‌భవన్‌లో పెట్టడం ఘోరమంటూ రోడ్డెక్కాయి. కాంగ్రెస్ పక్ష నేత సతీశన్ అయితే రాజ్‌భవన్‌లో అలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని, మత చిహ్నాలు ప్రదర్శించరాదని వక్కాణించారు.
విచ్ఛిన్నకరవాదుల వికృత క్రీడ
తాజా వివాదంలో కేరళ మంత్రులు అధికారిక పర్యావరణ దినోత్సవం పేరుతో సచివాలయంలో మరొక ఉత్సవం ఆదరాబాదరా నిర్వహించారు. వేదిక మీద నుంచి భారతమాత చిత్రపటం తొలగించ వలసిందిగా మంత్రులు తనను అడిగినట్టు గవర్నర్ తన ప్రారంభోపన్యాసంలో వెల్లడిరచారు కూడా.ఆ ముందురోజే మంత్రి కార్యాలయం నుంచి కూడా అనూహ్యంగా గవర్నర్‌కి తాఖీదు వెళ్లింది. ఆర్ఎస్ఎస్ ఉత్సవాలలో కనపించే ఆ భారతమాత ఫోటో ఉండరాదని దాని సారాంశం. ఆ పటంలోని భారత మాత కుడి చేతిలో కాషాయ పతాకం ఉండడమే వారి అసలు అభ్యంతరం. ఇది మనం తల్లిగా భావించే దేశమాతకు ప్రతీక అయిన చిత్రపటం. దీనిని తొలగించడం తప్ప మరేదైనా చెప్పండి అని మంత్రులకు గవర్నర్ స్పష్టం చేశారు. కానీ భారతమాత చిత్రపటం కూడా సీపీఐ ప్రసాద్‌కు మత చిహ్నం లాగే కనిపించింది. అలాంటి చిత్రం రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి అధికార నివాసంలో ఉండరాదని ప్రసాద్ తీర్పు చెప్పేశాడు. రాజ్‌భవన్ కార్యక్రమానికి హాజరు కావలసిన మరొక మంత్రి వి. శివన్కుట్టి గైర్హాజరయ్యారు. భారతమాత చిత్రపటం పెట్టడం ఆయనకు కూడా అభ్యంతరం కాబోలునని గవర్నర్ వ్యాఖ్యానించారు.
మే నెలలోనే మరొక సంఘటన కూడా జరిగింది. మే 21వ తేదీన రాజ్‌భవన్‌లో ఆపరేషన్ సిందూర్ పరిణామాల గురించి ప్రసంగించడానికి ప్రముఖ జర్నలిస్ట్, జాతీయవాది ఎస్. గురుమూర్తిని ఆహ్వానించారు. గురుమూర్తిని ఆహ్వానించడం పట్ల కాస్త ఆలస్యంగానే అయినా ముఖ్యమంత్రి పినరయి విజయన్ అసమ్మతి వ్యక్తం చేశారు. ఏమైందో మరి, గురుమూర్తి ప్రసంగించి వెళ్లిన వారానికి పినరయి నిరసన ప్రకటన చేశారు. భారతమాత పటం గురించి గవర్నర్‌తో సీపీఎం ప్రభుత్వం పెద్ద యుద్ధానికే సిద్ధమైంది. జూన్ 10వ తేదీ గోవా విమోచన దినం సందర్భంగా కూడా ఇదే రకమైన వివాదం చెలరేగింది.
భారతమాత కల్పనకు మూలాలు
ఐదారు వారాల వ్యవధిలోనే మూడుసార్లు భారతమాత పటం మీద కమ్యూనిస్టులు దండెత్తడం కేవలం రాజకీయం. నీచాతినీచ వ్యూహం. కేవలం బుజ్జగింపు రాజకీయం. కేవలం భారత, భారతీయత లపై గుడ్డి వ్యతిరేకత. భారతమాత అనే భావన ఆర్ష వాఙ్మయంలోనే దర్శనమిస్తుంది. అక్కడ నుంచి సప్తవర్ణ చిత్రంగా కాగితం మీద ఆవిష్కృతమైనది 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభంలోనే. ఆ పటం భారతీయులలో మానసిక ఏకాత్మతకు అంకురార్పణ చేసింది. బహుశా ఇదే కమ్యూనిస్టులకు కంటగింపయి ఉండవచ్చు. ఈ దేశాన్ని ఉద్యమ పరంగా ఏకత్రాటి మీదకు తీసుకువచ్చిన బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమంలోనే భారతమాత చిత్రపటం జన్మించింది. నిజానికి అంతకు దశాబ్దం క్రితమే మరొక భారతమాత చిత్రపటం ఆవిర్భవించినట్టు కూడా చెబుతారు. అది కూడా కేరళలోనే. అంటే గుడ్డిగా, మూర్ఖంగా భారతమాత పటాన్ని బహిష్క రించే పార్టీ పాలిస్తున్న కేరళలోనే. అ(వ)బనీంద్రనాథ్ టాగూర్ మొదలు, రాజా రవివర్మ వంటి ఎనిమిది మంది చిత్రకారులు భారతమాత చిత్రపటాన్ని చిత్రించారు (చరిత్ర కోసం మరొకరి పేరు పేర్కొనాలి. తన సహజ పైత్యంతో ఎంఎఫ్ హుసేన్ కూడా 2005 ప్రాంతంలో భారతమాత చిత్రం వేశాడు). ముద్రణ లేదా అచ్చు పనిలో వచ్చిన శాస్త్ర సాంకేతిక పురోగతి, ఆ కళ పట్ల ప్రజలకు ఏర్పడిన గాఢమైన అభిరుచి, కేలండర్ల మీద దేవీదేవతల చిత్రాల పట్ల పెరిగిన పూజ్యభావం, ఆకర్షణ అంతిమంగా ఇవాళ కనిపిస్తున్న భారతమాత చిత్రం ఆవిర్భావానికి వెనుక ఉన్నాయి. ఇందులో ఎక్కడా ఆర్ఎస్ఎస్, భారతీయ జనసంఫ్‌ు లేదా బీజేపీల ప్రమేయం లేనేలేదు. ఏ కోణం నుంచి వాటి ప్రభావం లేదు. ఆర్యసమాజ్, హిందూమహాసభ, రామకృష్ణ మిషన్ వంటి ‘కాషాయ’ సంబంధిత సంస్థల ఉద్దేశాలు, లక్ష్యాలు కానరావు. నేడు కేరళలో కమ్యూనిస్టులు ఆరోపిస్తున్న ‘ఆర్ఎస్ఎస్ వారి భారతమాత’ మొదటి చిత్రపటం ఆర్ఎస్ఎస్ ఆవిర్భావానికి చాలాముందే భారతీయుల హృదయ పీఠాల మీద ప్రతిష్ఠితమైంది. మొదటి భారతమాత పటంలోని భావాలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రకటిస్తాయి. ప్రతీకలు మనదైన మనదైన వాఙ్మయం నుంచి జనించినవే. రంగులు మన చరిత్రలోని చీకటివెలుగులను ప్రతిబింబిస్తాయి. గతంలో భారతదేశం ఏమిటి? చిత్రపటం రంగులద్దు కుంటున్న కాలం ఎలాంటిది? భవిష్యత్తును కుంచెకారులు ఏ విధంగా స్వప్నించారు? ఇవికూడా ఆ పటాలలో దర్శించవచ్చు. కానీ అవనీంద్రనాథ్ మొదలు, రవివర్మ నుంచి బహుశా చిట్టచివరి ఎంఎఫ్ హుసేన్ వరకు భారతి అంటే హిమాలయాలకీ, దక్షిణాదిన సాగరానికీ నడుమ ఉన్నదనే భౌతిక పరమైన భావనను మాత్రం విస్మరించలేదు. అసలు భారత్ అన్న మాటను పరిహరించడానికి ఏ కాలం లోను, ఏ నాయకుడు, ఏ ఉద్యమం ప్రయత్నించలేదు. భారతరాజ్యాంగం కూడా ఇండియా దటీజ్ భారత్ అనే సంబోధించింది. అసలు భారత రాజ్యాంగం ఆవిర్భవించడానికి శతాబ్దాల నాడే భారత్ అనే మాట ఉంది. భారతవర్ష (విష్ణుపురాణం) అని గౌరవించు కున్నారు ఇక్కడి వారు. విష్ణుపురాణం భారతభూమిని ఇలా నిర్వచించింది.
ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేశ్బైవ దక్షిణమ్।
వర్షం తద్భారతం నామ భారతీ యత్ర సంతతిః॥
భారత్ లేదా భారతవర్షం (వర్షం అంటే దేశం/ భూభాగం) అన్న భావన అంత పురాతనమైనది. భారతమాత అన్న భావన, కల్పన మాత్రం దేశం బానిసత్వం నుంచి విముక్తం కావాలన్న ఉగ్ర కామన భారతీయుల గుండెలను ఒక తుపానులా తాకిన తరువాత అంకురించింది. ఇందుకు మొదటి కారణం జాతీయవాదం, స్వదేశీ భావన. ఇలాంటివి మొదట కవులు, కళాకారులు, మేధావుల దృష్టిలో రూపుదిద్దు కుంటాయి. భారతమాత ఆకృతి కూడా అలా ఏర్పడినదే. ఈ ఆధునిక దృష్టి జనితమైన భావనలోను కళాకారులు సర్వ సమానత్వాన్నే ఆకాంక్షించారు. భేదభావాలు లేకుండా బిడ్డలందరికీ విద్యను అందించే, అందరికీ కడుపు నింపే ఒక తల్లినే భారతమాతలో ఆవాహన చేశారు వారు. ఆమెను జననిగానే భావించారు. కొందరు భారతాంబ అన్నారు. అంబ అంటే అమ్మ అనే. ఒక జాతిని ఐక్యం చేయడానికి వీలైన, ఐక్యం కావలసిన సందర్భానికి, చారిత్రక అవసరానికి బలం చేకూర్చే ఒక మూర్తిని ప్రజానీకం ముందు వారు ప్రతిష్ఠిం చారు. మరొక అంశం కూడా ఉంది. బానిసత్వంలో ఉన్న కాలం నాటి కళాకారుల ఊహలోని భారతమాత వేరు. ఆమెలో భవిష్యత్తు గురించిన కలత కనిపిస్తుంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత చిత్రించిన భారతమాతలో ధీరత్వం, ఆత్మస్థయిర్యం పొటమరిస్తూ ఉంటాయి. ఏ కాలంలో అయినా స్థానీయత విలువ తెలిసిన కళాకారులు ఆమెను కాషాయ వస్త్రాలతోనే చిత్రించారు. సింహ వాహనంతోనే ఊహించారు. అంటే సాంస్కృతిక, ఆధ్యాత్మిక, రాజకీయ ఐక్యతకు, భారత ప్రజానీకానికి ప్రతినిధిగానే ఆవిష్కరించారు. పాదాల వద్ద సాగరం, మకుటం వెనుక హిమాలయ శ్రేణులు చిత్రించి ఏకత్వాన్ని అద్దారు. భారతమాతను చిత్రించడం వెనుక ఇంతటి తాత్త్విక భూమిక ఉంది. ఇంతటి సమున్నత భావన కలిగిన చిత్రపటం మీద ఆర్ఎస్ఎస్ పేరుతో మతం రంగు చిమ్మడం ద్రోహం కాదా! జాతి వ్యతిరేక భావాలతో ముస్లిం ఉగ్రవాద మూకలు స్వైర విహారం చేస్తున్న నేల మీద, వాళ్ల ఓట్లు తప్ప జాతీయ సమైక్యత అవసరం లేని కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పాలిస్తున్న నేల మీద ఇంతకు మించి ఆశించలేం. కానీ నిరసించగలం. గర్హించగలం కదా! ఇన్నివేల మంది సానుకూల మనోభావాలను గాయపరుస్తున్న ఆ పైశాచిక దృక్పథాన్ని మట్టికరిపించగలం!
కుంచెలు తెచ్చిన సృజనాత్మక పరిణామం
భారతమాత తొలి చిత్రపటాన్ని జాతికి అందించిన ఘనత బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ స్థాపకుడు, ప్రఖ్యాత చిత్రకారుడు అవనీంద్రనాథ్ టాగూర్‌కు (1871-1951) దక్కుతుంది. ఇందుకు బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమమే (1905) కాన్వాస్‌ను సమకూర్చింది. ఆయన విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ సోదరుని కుమారుడు. అటు సౌందర్య దృష్టి, సామాజిక, ఆధ్యాత్మిక తాత్త్వికతల శోభితమైన ఆ చిత్రం ఆయన వేసిన పెయింటింగ్‌ల లోనే ఎంతో పేరు తెచ్చుకుంది. బెంగాల్లో ఆనాటి సాధ్వి రూపం ఈ చిత్రంలో చూడవచ్చు. భారతి అంటే చదువులతల్లికి మరొక పేరు. అందుకే సరస్వతి అమ్మవారి వలెన భారతమాతకు నాలుగు చేతులను చిత్రించారు. స్వదేశీ భావనను రగిలించిన ఉద్యమం నేపథ్యంలో వెలువడిన ఈ చిత్రం నాలుగు చేతులలో ఏం ఉన్నాయి? ఒక చేతిలో కంకులు ఉన్నాయి. ఇది అన్న ప్రసాదానికి ప్రతీక. ఒక చేతిలో చిన్న శ్వేతవస్త్ర ఖండం ఉంటుంది. తిండి తరువాత గుడ్డను ఇది సంకేతిస్తున్నది. ఒక చేతిలో వేదం ఉంది. అంటే జ్ఞానం పంచడం. మరొక చేతిలో రుద్రాక్షమాల. అంటే దీక్షకు ప్రతీక. వాటర్ కలర్స్‌తో చిత్రించిన ఈ పటం విక్టోరియా మెమోరియల్ హాల్లో (కోల్‌కతా)లో ఉన్నది.
ఈ చిత్రం భారతమాతగా అవతరించడం వెనుక మరొక చారిత్రక వాస్తవం ఉంది. సిస్టర్ నివేదిత ఈ చిత్రం చూశారు. అందులోని భావ గాంభీర్యాన్ని దర్శించారు. భారతమాత చిత్రమన్నారు. ఈ చిత్రం తొలిసారి మాతృమూర్తి పేరుతో ‘పర్బసి’ అనే సాహిత్య పత్రికలో అచ్చయింది. అవనీంద్రనాథ్ దానిని వంగమాతగానే చిత్రించారు. ఆమె మాటలకు తగ్గట్టుగానే బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం భారతదేశమంతటా ప్రతిధ్వనించింది. ‘పర్బసి’ పత్రిలో నివేదిత ఆ చిత్రపటాన్ని పరిచయం చేస్తూ ఇదొక కొత్త యుగానికి నాందీవాచకమని అన్నారు. ఇది పూర్తిగా భారతీయ భావనతో, వ్యక్తీకరణతో, స్థానీయత కలిగిన కళాత్మకతతో వెలువడిరదని ఆమె చెప్పారు. భారతమాత పాదాల వద్ద కమలాలను ఆమె ఎంతో ప్రశంసించారు. పద్మాల రేఖా విన్యాసాన్ని వేనోళ్ల ప్రశంసించారు. చిత్రపటంలోని నాలుగు చేతులు ఆసియా ప్రాంత చిత్రకళా ముద్రకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. భారతీయ ఆత్మతో విలసిల్లిన తొలి మాస్టర్ పీస్ అని కూడా ఆమె చెప్పారు. ఎందుకంటే మాతృభూమి అనే భావన ఈ చిత్రంలో ఉన్మీలనమైందని ఆమె నమ్మారు. మాతృభూమి భావన, జాతీయవాదం ఆధునిక యుగపు లక్షణాలని ఆమె స్పష్టం చేశారు కూడా. విభజించినది వంగదేశం. మనకేమిటి సంబంధం అని నాటి భారతావని అనుకోలేదు. అందుకే దేశమంతటా బెంగాల్ విభజనను నిరసించింది. ఆ మహత్తర జాతీయావేశమే భారతమాత చిత్రపటంగా అవతరించింది. అందుకు టాగూర్‌కు రేఖలను అందించినది మాత్రం బంకించంద్ర చటర్జీ ‘ఆనందమఠం’లోని ‘వందేమాతరం’ గేయం.
సోదరి నివేదిత వర్ణనకు కూడా ఉద్విగ్న నేపథ్యమే ఉంది. అవనీంద్ర జోరాసంకోలో పుట్టారు. సౌదామిని దేవి, గుణేంద్రనాథ్ టాగూర్ తల్లిదండ్రులు. అవనీంద్ర తన చిత్రకళ ప్రస్థానాన్ని తన ట్యూటర్ సిగ్నోర్ గిల్హార్డి దగ్గర ఆరంభించారు. వాటర్ కలర్స్ పెయింటింగ్స్ వేయడం ఆయన దగ్గరే నేర్చుకున్నారు. తరువాత ఆయిల్ పెయింటింగ్స్‌లో శిక్షణ కోసం చాల్స్ పామర్ అనే బ్రిటిష్ జాతీయుడి దగ్గర చేరారు. అందుకే ఆయన మరొక ప్రఖ్యాత పెయింటింగ్ కృష్ణలీలలో ఐరోపా`భారత సమ్మేళనం కనిపి స్తుందంటారు విమర్శకులు. అయినా భారతమాత చిత్రం విషయంలో ఆయన పూర్తి భారతీయ శైలిని ఆశ్రయించారు.
![]() |
Raja Ravi Varma bharat mata |
రాజా రవివర్మ ఆధునిక భారతీయ చిత్రకళను విశేషంగా ప్రభావితం చేసిన మరొక గొప్ప చిత్రకారుడు . భారతీయ దేవీదేవతలను ఆయన ఒకింత ఐరోపా శైలితో చిత్రించారని అంటారు. రవివర్మ 1898లో దేశాన్ని ఒక దేవతామూర్తిగా కల్పన చేశారు. అలాగే చిత్రించారు. ఆయన భావన ప్రకారం భారతమాత శాంతి సమరాల సమ్మేళనం. ఆయన కూడా నాలుగు బాహువులను చిత్రించారు. ఒక చేతిలో బాణం ఉంచారు. మరొక చేతిలో పుష్పగుచ్ఛం చిత్రించారు. ఇది కాన్వాస్ మీద వేసిన ఆయిల్ పెయింటింగ్. రవివర్మ ఆయన సోదరుడు రాజా వర్మ కలసి దేశానికి ఆధునిక ముద్రణా వ్యవస్థను అందించారు. ఆ ముద్రణశాల నుంచే 1935లో మరొక భారతమాత చిత్రాన్ని వెలువరించారు. దుర్గామాతను మరిపిస్తూ ఆమెకు నాలుగు చేతులు చిత్రించారు. ఎరుపు రంగు చీరలో ఆమె కనిపిస్తుంది. నాలుగు చేతులు కూడా అప్పటికి ఉగ్రరూపం దాల్చిన స్వరాజ్య సమరం స్వరూపానికి ప్రతీకగా ఉన్నాయి. ఇందులో మాత పాదాల దగ్గర రెండు ఆఫ్రికన్ సింహాలు కనిపిస్తాయి. ఇది ఓలియోగ్రాఫిక్ పెయింటింగ్. వర్మ చిత్రాలలో ఒకింత ఐరోపా శైలికి చొరబడి ఉండవచ్చు. కానీ ఆయన హిందూ దేవతల చిత్రాలకు విశేషమైన ఆదరణ తెచ్చారు. దైవారాధనను సులభతరం చేసిన కళాకారుడు ఆయన. ఆయన కుంచె నుంచి రామాయణం, భారతం, ఇతర పురాణాల నుంచి ఎన్నో చిత్రాలు వెలువడినాయి. ద్రౌపది, దమయంతి, శకుంతల ఊహాచిత్రాలను జాతి ముందుకు తెచ్చి నిలిపారాయన. అయితే ఒకటి. అంతకు ముందు తరం చిత్రకారులు పర్షియన్, మొగల్ చిత్రకళా శైలులను ఆశ్రయించేవారు. రవివర్మ దానికి అడ్డుకట్ట వేశారు.
![]() |
Amrita Shergill bharat mata |
అమృతా షేర్గిల్ 1935లోనే వేసిన భారతమాత చిత్రం కూడా వెలువడిరది. ఒక బాలుడు, ఒక బాలికతో పేదరాలైన దీన భారతమాత మాత్రమే అందులో కనిపిస్తుంది. అమృత ఉద్దేశం ప్రకారం ఆమె గ్రామీణ భారతానికి ప్రతీక. అక్కడి కర్షక కుటుంబానికి చెందినట్టు కనిపిస్తుంది. బ్రిటిష్ పాలనతో భారత్‌కు దాపురించిన దారిద్య్రాన్ని చూసి కలత చెందిన కళాకారిణి ఆమెలో చూడవచ్చు. ఇది ఆయిల్ పెయింటింగ్. ఒకటి వాస్తవం ఆధునిక శిల్ప శైలులతో ప్రభావితమైన అమృత తన తెలిసిన రీతిలో భారతాంబను చిత్రించారు. ఆధునిక చిత్రకళా రీతులు ఆమెను ప్రభావితం చేసినా ఆమె ఒక మాట అన్నారు. ‘కళ తను పుట్టిన మట్టిన ప్రతిబింబించాలి’ ఫలితమే దీన భారతమాత. భారతీయ మూలాల ఉన్న హంగేరియన్ కుటుంబంలో అమృత పుట్టారు. పెరిగినది మాత్రం బుడాపెస్ట్, భారత్‌లలో. ఆ ప్రభావం వల్లనే ఆమె చాలా చిత్రాలు వివాదాలు రేపాయి. అది వేరే విషయం.
![]() |
Roop Kishore Kapoor bharat mata |
రూప్ కిశోర్కపూర్ చిత్రించిన భారతమాత పెయింటింగ్ కంటికి నిండుగా ఉంటుంది. కపూర్ (1893-1978) జాతీయవాద భావనతో అనేక సంచలనాత్మక చిత్రాలు వేశారు. అవన్నీ వలస పాలకులను నిలదీశాయి. భయపెట్టాయి. 1920-1930 ప్రాంతంలో ఆయన భారతమాత చిత్రరచన చేశారు. కాన్పూర్‌కు బాబూలాల్ భార్గవ గ్లాస్ అండ్ పిక్చర్ మర్చెంట్ 1931లో ప్రచురిం చారు. తన తీవ్ర జాతీయవాద భావాలను ప్రతిబింబిస్తూ భారతమాత చేతిలో త్రిశూలాన్ని చిత్రించారు కపూర్. నిజానికి భారతమాతకు నేపథ్యం అఖండ భారత్‌ను చిత్రించారాయన. ఆధ్యాత్మికంగా, పారిశ్రామికంగా డ్యామ్‌లతో, ప్రాజెక్టులతో, ఓడలతో ఒక ధనిక దేశంగా ఆయన భారతావనిని కల్పన చేశారు. బర్మా ఆ పటంలో ఉంటుంది. కపూర్ భారతమాత పటం సార్వభౌమాధికారం అనుభవి స్తున్న, ఆత్మగౌరవం కలిగిన ఒక దేశానికి ప్రతీక కావాలన్న ఆకాంక్షను ప్రతిబింబిస్తుందని అంటారు. ఈయన చిత్రించిన మరొక పెయింటింగ్ ఏ కారణాల వల్లనో కనుమరుగైంది. అందులో భగత్‌సింగ్ తన శిరస్సును ఖండిరచి భారతమాత పాదాల ముందు పెడుతూ ఉంటాడు. వందేమాతరం అన్న వ్యాఖ్య రాశారు దాని మీద. దీనితో కపూర్‌ను జైలుకు పంపారు. కపూర్ కొద్దికాలం భారత జాతీయ కాంగ్రెస్‌లోను, తరువాత తీవ్ర జాతీయవాదులతోను కలసి పనిచేశారు. కాన్పూర్ పట్టణ చారిత్రక ప్రాముఖ్యం మీద పరిశోధన చేసిన క్రిస్టోఫర్ పిన్నె ఈ విషయాలు వెల్లడిరచారు. బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించిన కపూర్ చిత్రాలు ఇండియా ఆఫీస్ (ఇంగ్లండ్)లో ఉన్నాయి.
![]() |
ML Sharma bharat mata |
ఎంఎల్ శర్మ స్వాతంత్య్రం తెచ్చుకున్న భారతజాతిలో 1947 నాటి ఆనందోత్సాహాలను భవిష్యత్తు మీద పెట్టుకున్న ఆశలను తన భారతమాత చిత్రంలో రూపుదిద్దారు. 1947లో శర్మ (1930-1970) భారతమాతను చిత్రించారు. అప్పటికి ఆయన వయసు 17 ఏళ్లు. స్వతంత్ర భారతదేశంలో ప్రఖ్యాతమైన తొలి భారతమాత పెయిం టింగ్ ఇదేనని చరిత్రకారులు చెబుతారు. నవ యౌవనవతిగా ఇందులో మాత దర్శనమిస్తుంది. పురాణ స్త్రీలకు వర్ణించే సంపద్వంతమైన చక్కని వలువలతో కనిపిస్తుంది. వెనుక త్రివర్ణ పతాకం, భీకరంగా కనిపించే రెండు సింహాలు పూన్చిన రథాన్ని నడుపుకుంటూ వస్తున్నట్టు చిత్రించారాయన. నీలిరంగులో చిత్రించిన భూగోళం నుంచి, వెనుక సంజకెంజాయిలో వేగంగా అవతరిస్తున్న భారతీదేవి ఇందులో కనిపిస్తుంది. భూగోళం మీది భారత పటం రేఖలో దేవనాగరి లిపిలో వందేమాతరం అన్న అక్షరాలు చిత్రించారు. ఇది కాన్వాస్ ఆధారంగా చిత్రించిన ఆయిల్ పెయింటింగ్.
![]() |
Sardar Shobha Singh's portrait |
సర్దార్ శోభాసింగ్ వర్ణచిత్రం చిరకాల బానిసత్వం వదిలిపోయి, ఒక గణతంత్ర రాజ్యంగా భారతమాత అవతరించినట్టుగా ఉంటుంది . బహుశా ఇది 1950లో చిత్రించి ఉంటారని విమర్శకుల అభిప్రాయం. మూడు రంగుల చీరను రోమన్ల తరహాలో ఆమె ధరించి ఉంటుంది. ఉగ్రత్వంతో ఉన్న సింహాన్ని ఆమె ఒక చేత్తో దువ్వుతున్నట్టు ఉంటుంది. ఆ మృగరాజం బ్రిటిష్ మకుటాన్ని కాలితో తన్నుతున్నట్టు ఉంటుంది. అంటే వలసపాలన అంతమైందని చిత్రకారుడు వ్యక్తీకరిం చాడు. వెనుక అశోక స్తంభం చిత్రించాడు. అదే కొత్తగణతంత్ర రాజ్య చిహ్నమన్న సంగతి తెలిసిందే. కిరీటం పతనం కావడం, అశోక చిహ్నం ఎత్తుగా కనిపించడం చిత్రకారుడి సమున్నత దృష్టిని జాతీయవాద దృక్పథాన్ని ఆవిష్కరిస్తున్నాయి. సిక్కు మతగురువులు, ఎందరో దేశభక్తుల, స్వరాజ్య సమరయోధుల చిత్రాలను కూడా ఆయన చిత్రించారు.
![]() |
JB Dixit depicted a four-armed goddess as Mother India. |
జేబీ దీక్షిత్ చతుర్భుజి అయిన ఒక దేవతామూర్తిని భారతమాతగా చిత్రించారు జాతీయ వాదం, ఆధ్యాత్మిక దృష్టి ఇందులో కనిపిస్తాయి. 1975లో చిత్రించిన ఈ పెయింటింగ్ ఆ సంవత్సరమే వెలువడిరది. వెనుక భారతదేశ భౌగోళిక పటం చిత్రించి అందులో కశ్మీర్ భాగంలో మాత మకుటం వచ్చేలా రచించారాయన. ఒక చేతిలో కనిపించే దండం శక్తికి ప్రతీక. మరొక చేతిలో శంఖం ఉంటుంది. ఒక చేయి అభయముద్రలో ఉంటుంది. ఒక చేతిలో కలశం ఉంటుంది. ఇది సంపదకి, విజ్ఞతకి ప్రతీక. ఆమెకు ఎడమ పక్కన సింహం ఉంటుంది. ఈ చిత్రం పుణేలోని రాజా దినకర్ కేల్కర్ మ్యూజియంలో ఉంది. ఇది తైల వర్ణచిత్రం. జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చదివిన దీక్షిత్ చిత్రించిన ధ్యానేశ్వర్, వివేకానందల చిత్రపటాలకు ఎంతో ఖ్యాతి ఉంది.
2005లో ఎంఎఫ్ హుసేన్ ఒక భారతమాతను చిత్రించాడు.
మన పూర్వ కవులు, రుషుల మాదిరిగానే ఉత్తర భారతం, దక్షిణ భారతం అంటూ దేశ భౌగోళిక ఆకృతిని ఏ చిత్రకారుడు విభజించలేదు. హిమాల యాల నుంచి దక్షిణాన సాగరం వరకు అమ్మను చిత్రించారు. ఆమె విశ్వరూపం అద్భుతంగా చిత్రించారు. అంతా మాతృమూర్తి తల వెనుక వెలుగుల వలయాన్ని చిత్రించి, దేవతగా రూపుకట్టిం చారు. అలాగే చిత్రించిన కాలం నాటి సామాజిక రాజకీయ పరిస్థితులు అందులో ప్రతిబింబించినట్టే, ఆయా ప్రాంతాల వైవిధ్యభరితమైన వస్త్రధారణ, అలంకరణ కూడా ఆ పెయింటింగ్‌లలో ప్రతిఫలిం చాయి. ఇది ఒక విధంగా గర్వకారణం. స్వాతంత్య్రా నికి ముందు, తరువాత ఎన్ని వందల మంది భారతమాత చిత్రపటం రచించారో తెలియదు. ఎందరు బాలలు పాఠశాలల్లో ఈ బొమ్మ వేసి ఆనందించారో చెప్పడం కష్టం. ఇప్పుడు పేర్కొన్నవి కేవలం విఖ్యాత చిత్రకారులు కళాఖండాలు మాత్రమే.
కమ్యూనిస్టులు ఈ వాస్తవాలను గమనించాలి. భారతమాత, ఆ చిత్రణకు ప్రేరణనిచ్చిన వందేమాతరం ఒక వర్గానికి మతం కారణంగా వ్యతిరేకం. అది వేరే చర్చ. అది సహేతుకం కాదు. సాంస్కృతిక ఏకత్వం నుంచి రాజకీయ ఏకత్వం సాధించడానికి భారతమాత భావన తన వంతు సాయం చేసింది. వందేమాతరం గేయం కూడా అదే చేసింది. ఇప్పుడు వాటి స్ఫూర్తిని దెబ్బ తీసి దేశ ఐక్యతకు భంగం వాటిల్ల చేస్తున్నవారిలో కమ్యూ నిస్టులు కూడా ఉన్నారు. ఒక మత రాజ్యం కోసం ఆలోచిస్తున్న వారికి ప్రత్యక్షంగానే దోహద పడుతున్నారు.