ఒడిశాలోని 40 మంది గిరిజనులు తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చేశారు. తమపై క్రిస్టియన్ పాస్టర్లు అనేక ప్రలోభాలకు గురి చేశారని, అనేక ఆశలు చూపించారని, దీంతో అందులోకి వెళ్లామని, కానీ... అసలు విషయం తెలుసుకొని, హిందూ ధర్మం గొప్పతనం తెలుసుకొని, తిరిగి సనాతన ధర్మాన్నే స్వీకరించామని ప్రకటించారు. ఈ ఘటన కియోంఝర్ జిల్లాలో ఘాసిపూరా ప్రాంతంలో జరిగింది.
తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించిన వారంతా ముండా, సంతాల్ తెగలకు సంబంధించిన వారు. వీరంతా ‘‘ధర్మ జాగరణ సమన్యాయ్’’ ఆధ్వర్యంలో హిందూ ధర్మాన్ని స్వీకరించారు. మరోవైపు స్థానిక ఎంపీ శివేంద్ర చక్ర, ధర్మ జాగరణ్ సమన్యయ్ నేతలు వీరితో సంభాషించారు. హిందూ ధర్మం గొప్పతనాన్ని, వారి పూర్వీకుల గురించి విస్తృతంగా చెప్పారు. దీంతో ఈ 40 మంది తిరిగి ఘర్ వాపసీ చేశారు.
ఘర్ వాపసీ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో కేశవ్ ముండా, గిడా హెంబ్రామ్, రవి ముండా, లాబ్ ముండా, కుష్ ముండా, హరి ముండా, దుర్గా హెంబ్రామ్ తో పాటు అనేక మంది ఉన్నారు.
ఆచారంలో భాగంగా, కుటుంబాలకు భగవాన్ జగన్నాథుడు మరియు ఇతర దేవతల చిత్రాలను బహూకరించారు. వీరంతా దీనిని ఆనందంగా స్వీకరించారు. భవిష్యత్తులో సాంప్రదాయ ఆచారాలు, ఆచారాలు మరియు పండుగలను వారి కుటుంబాలు మరియు బంధువులతో కలిసి పాటిస్తామని వారు సామూహిక ప్రమాణం చేశారు.
ఈ వేడుక సందర్భంగా వనవాసీ కుటుంబాలు క్రిస్టియన్ పాస్టర్లు తమను ఎలా ఏమార్చారో వివరించారు. తమ ఇళ్లల్లో అనారోగ్యాలున్నప్పుడు క్రైస్తవ మిషనరీలు తమ గ్రామానికి వచ్చి, యేసును మొక్కడం, క్రైస్తవాన్ని స్వీకరించడం ద్వారా అనారోగ్యం నుంచి బయటపడతారని, వ్యాధులు నయమవుతాయని తమతో చెప్పారని వెల్లడించారు.
మొదట్లో తాము అంగీకరించలేదని, అయినా క్రైస్తవ మిషనరీలు తమను అటువైపే ప్రోద్బలించాయని తెలిపారు. వారు చెప్పిన వాటికి తాము మోసోపోయి, సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి, అందులో చేరామన్నారు. అయితే.. మారిన తర్వాత తమపై తీవ్ర వివక్ష చూపించారని, తమ బంధువులు కూడా సరిగ్గా మాతో మాట్లాడలేదని, గిరిజన పండగల్లో పాల్గొనే అవకాశాలు కోల్పోయామని వాపోయారు. తమ ఆరాధనలో అంతర్భాగమైన ప్రకృతి ఆరాధన కూడా లేకపోయిందన్నారు.
ఇక.. సనాతన ధర్మాన్ని స్వీకరించిన తర్వాత ఓ బాలిక తెగ సంబరపడిపోతూ స్పందించింది. ‘‘క్రైస్తవాన్ని స్వీకరించిన తర్వాత తమ పండగలు చేసుకోలేకపోయాం. తరతరాలుగా వస్తున్న గిరిజన సంప్రదాయాలకు, పండగలకు దూరమయ్యాం. ప్రకృతిని పూజించుకోలేకపోయాం. చాలా బాధపడ్డాం. ఇప్పుడు తిరిగి హైందవ ధర్మంలోకి రావడం ఆనందంగా వుంది. ఇప్పుడు మా ప్రజలతో కలిసి పండగలను హాయిగా జరుపుకోవచ్చు. మన దేవతల్ని ఆరాధించొచ్చు’’ అని ప్రకటించింది.
సాంస్కృతిక ఆచారాల నుండి దూరం కావడం వల్ల తాము చాలా బాధపడ్డామని, ఇది ధర్మ జాగరణ్ సమన్వయ్ కార్యకర్తల మార్గదర్శకత్వాన్ని అంగీకరించడానికి వారిని ప్రేరేపించిందని కుటుంబాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ధర్మ జాగరణ సమన్వయ్ కి ధన్యవాదాలు ప్రకటించారు.

