కెనడా కేంద్రంగా వున్న ఖలిస్తానీ ఉగ్రవాదులు సంచలన ప్రకటన చేశారు. వాంకోవర్ లోని భారత్ కాన్సులేట్ ను సీజ్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. వాంకోవర్ లోని భారత కాన్సులేట్ ను ముట్టడిస్తామని ఖలిస్తానీ సిఖ్స్ ఫర్ జస్టిస్ ప్రకటించింది. ఈ నెల 18 న దీన్ని స్వాధీనం చేసుకుంటామని, ఆ సమయంలో ఎవ్వరూ అటు వైపు రావొద్దని హెచ్చరికలు కూడా జారీ చేసింది. అంతేకాకుండా భారత హైకమిషనర్ దినేశ్ పట్నాయక్ ను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఈ అధికారికి సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు.
కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాద గ్రూపులు చెలరేగి పోతున్నాయని భారత్ ఎప్పటి నుంచో చేస్తున్న ఆరోపణలు వాస్తవమేనని కెనడా ఎట్టకేలకు అంగీకరించింది. తమ దేశంలో ఖలిస్థానీ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తూ, నిధులు పొందుతున్నాయని కెనడా ఆర్థికశాఖ విడుదల చేసిన ఓ నివేదికలో తాజాగా వెల్లడైంది. ఖలిస్థానీ గ్రూపులను ఉగ్రవాద సంస్థలుగా ఈ నివేదికలో పేర్కొన్నారు. రాజకీయ లక్ష్యాల కోసం హింసను ప్రేరేపిస్తున్నారని స్పష్టం చేశారు.
‘కెనడా క్రిమినల్ కోడ్ జాబితాలో చేర్చిన హమాస్, హెజ్బొల్లా, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ సిఖ్ యూత్ ఫెడరేషన్ వంటి ఖలిస్థానీ అతివాద టెర్రరిస్టు గ్రూపులు కెనడాలో నిధులు సేకరిస్తున్నట్టు ఇంటెలిజెన్స్, పోలీసు వర్గాలు గుర్తించాయి’ అని నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నివేదిక ప్రకారం, ఉగ్ర సంస్థలు గతంలో కెనడాలోని తమ భారీ నెట్వర్క్ల సాయంతో నిధులు పొందేవి. ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గింది. కొద్ది మంది వ్యక్తుల ద్వారా నిధుల సమీకరణ జరుగుతోంది .

