![]() |
| మత బోధకుడు జకీర్ నాయక్ - Controversial religious preacher Zakir Naik to visit Bangladesh |
ఇంటర్నెట్ డెస్క్: పరారీలో ఉన్న వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్ బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. జకీర్ పర్యటనకు అనుమతించిన యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం.. ఆయనకు అధికారిక స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 20 వరకు జరగనున్న ఈ పర్యటన కోసం బంగ్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులోభాగంగా జకీర్ బంగ్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నట్లు సమాచారం.
జులై 2016లో ఢాకాలోని ఓ బేకరీపై ఉగ్రదాడి జరిగింది. దాడి అనంతరం ఉగ్రవాదుల్లో ఒకరు మాట్లాడుతూ.. యూట్యూబ్ ఛానల్ ద్వారా జకీర్ చేసిన బోధనలకు తాను ప్రభావితమయ్యానని చెప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ సమయంలో భారత్‌లో ఉన్న జకీర్ అరెస్టు భయంతో మలేసియాకు పారిపోయి తలదాచుకున్నాడు. దీంతో మనీలాండరింగ్, విద్వేష ప్రసంగాల ఆరోపణల కేసులో భారత్ జకీర్‌ను వాంటెడ్‌గా ప్రకటించింది. అనంతరం మతపరమైన బోధనలు చేసే అతడికి చెందిన పీస్ టీవీని బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా నిషేధించారు.
అటువంటి వ్యక్తికి యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారికంగా స్వాగతం పలుకుతుండడం బంగ్లా నేతల వైఖరిలో వచ్చిన స్పష్టమైన మార్పును సూచిస్తోంది. గతేడాది జకీర్ పాకిస్థాన్‌లోనూ పర్యటించారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా ఇదేవిధంగా ఆయనకు స్వాగతం పలికారు. ఆ పర్యటనలో భాగంగా జకీర్ నిషేధిత ఉగ్ర సంస్థలకు చెందిన పలువురు సభ్యులను కూడా కలిసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.

