![]() |
| Karyakarta Mandal Baithak: Special discussion on household contact: Sunil Ambekar |
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి మండల్ బైఠక్ ఈ నెల 30 నుంచి నవంబర్ ఒకటో తేదీ వరకూ జబల్ పూర్ కేంద్రంగా జరుగుతాయని అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ ప్రకటించారు. ఇందులో ఆరెస్సెస్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళేతో పాటు ఆరుగురు సహ సర్ కార్యవాహలతో పాటు అఖిల భారతీయ కార్యవిభాగ్ ప్రముఖులు, కార్యకారిణి సదస్యులతో పాటు ప్రాంత ప్రచారకులు, సహ ప్రాంత ప్రచారకులు హాజరవుతారని తెలిపారు. మొత్తం 407 మంది హాజరవుతారని వెల్లడించారు.
అఖిల భారతీయ కార్యకారిణి మండల్ బైఠక్ నేపథ్యంలో సునీల్ అంబేకర్ మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ప్రాంతాలలో 25 రోజుల నుంచి 40 రోజుల పాటు కొనసాగే గృహ సంపర్క్ అభియాన్ తో పాటు దేశ వ్యాప్తంగా ప్రారంభమైన సంఘ కార్య శతాబ్ది కార్యక్రమాలపై కూడా చర్చిస్తామని పేర్కొన్నారు.
అక్టోబర్ 2 విజయ దశమి నాటికి సంఘ్ తన 100 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుందని, ఈ సందర్భంగా విజయ దశమి ఉత్సవం సందర్భంగా సరసంఘచాలక్ మోహన్ భాగవత్ ప్రసంగంలో లేవనెత్తిన అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తామని వెల్లడించారు. విజయ దశమి ఉత్సవం నాగపూర్ కేంద్రంగా జరిగిందని, దీనికి మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారని అంబేకర్ గుర్తు చేశారు. అలాగే విదేశీ ప్రముఖులు కూడా అతిథులుగా హాజరయ్యారన్నారు.నాగ్‌పూర్‌కు చెందిన 14,101 మంది స్వయంసేవకులు పథసంచలన్ లో పాల్గొన్నారని, దేశవ్యాప్తంగా కూడా ఈ పథ సంచలన్ లు జరుగుతాయన్నారు.
మరో వైపు సంఘ కార్య శతాబ్దిలో భాగంగా స్వయంసేవకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటారని (గృహ సంపర్క్ అభియాన్) సంఘ కార్యాన్ని పరిచయం చేయడంతో పాటు పంచ పరివర్తన్ ను వివరిస్తారని అలాగే వారికి సంఘసాహిత్యాన్ని అందజేస్తారని తెలిపారు. దేశంలోని చాలా చోట్ల ఇప్పటికే ఈ కార్యక్రమం మొదలైందన్నారు. అలాగే బస్తీ, మండల స్థాయిలో జరిగే హిందూ సమ్మేళనాలపై కూడా ఈ కార్యకారిణి బైఠక్ లో చర్చిస్తామని, దీనితో పాటు ప్రముఖ నాగరిక్ గోష్ఠి, యువకుల కోసం రూపొందించిన కార్యక్రమాలపై కూడా చర్చిస్తామని తెలిపారు.
ఢిల్లీ కేంద్రంగా జరిగిన వ్యాఖ్యాన మాల లాగే.. నవంబర్ 7,8 తేదీల్లో బెంగళూరు కేంద్రంగా, డిసెంబర్ 21 న కలకత్తా కేంద్రంగా, ఫిబ్రవరి 6,7 తేదీల్లో ముంబైలో ఉపన్యాస మాలిక నిర్వహిస్తామని అంబేకర్ ప్రకటించారు. దీనికి తోడు సరసంఘచాలక్ మోహన్ భాగవత్ తో పాటు సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్ని ప్రాంతాల్లోనూ పర్యటిస్తారని, సంఘ కార్య శతాబ్దికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
అలాగే ఈ కార్యకారిణి మండల్ బైఠక్ లో కార్య శతాబ్ది సందర్భంగా యోజన చేసిన అన్ని కార్యక్రమాలపై సమీక్ష వుంటుందని అలాగే ఆయా ప్రాంతాల్లో వీటిపై చేసిన యోజనను ప్రవేశపెట్టడంతో పాటు వీటిపై చర్చ, నివేదికలు కూడా వుంటాయన్నారు.
నవంబర్ 24న జరిగే గురు తేగ్ బహదూర్ జీ 350వ బలిదానం రోజున ఓ ప్రకటన విడుదల చేస్తామని అంబేకర్ ప్రకటించారు. 1675 లో గురుతేజ బహదూర్ ధర్మం కోసం త్యాగం చేశారని, దీనికి సంబంధించి దేశ వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతాయని, దీనిలో సంఘ స్వయంసేవకులు విస్తృతంగా పాల్గొంటారని ప్రకటించారు.నవంబర్ 15న వచ్చే భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని కూడా జరుపుకుంటారని, దీనికి సంబంధించి ప్రకటనలు కూడా జారీ చేస్తామని తెలిపారు.
అలాగే ఈ బైఠక్ లో దేశంలోని వివిధ సమకాలనీ అంశాలు, సామాజిక అంశాలపై కూడా చర్చలు వుంటాయన్నారు. 2025–26 వార్షిక ప్రణాళికతో పాటు, సంఘ్ పని పురోగతి మరియు విస్తరణను కూడా సమీక్షిస్తారని తెలిపారు.2026 విజయదశమి నాటికి సంఘ శతాబ్ది ఉత్సవాలకు నిర్దేశించిన సంస్థాగత లక్ష్యాలను నెరవేర్చడంపై ప్రత్యేక చర్చలు జరుగుతాయన్నారు.

