![]() |
| Ramnath Kovind Ji |
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్ది వేడుకలు, విజయ దశమి ఉత్సవం నాగపూర్ లోని రేషింబాగ్ లో జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ హాజరవ్వగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ విజయ దశమి ఉత్సవ ప్రసంగం చేశారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ముందుగా రేషింబాగ్ లోని ఆధ్య సర్సంఘ్చాలక్ డాక్టర్ హెడ్గేవార్, ద్వితీయ సర్సంఘ్చాలక్ గోళ్వాల్కర్ (గురూజీ) స్మృతి మందిరాల వద్ద పుష్పాంజలి ఘటించారు. తదనంతరం పరంపరగా వస్తున్న శస్త్ర పూజను మోహన్ భాగవత్ తో కలిసి నిర్వహించారు.
ఈ సందర్బంగా రాంనాథ్ కోవింద్ మాట్లాడుతూ రైతుల నుంచి మొదలు పెడితే, విద్యార్థులు, శాస్త్రవేత్తలు, కళాకారులు, వనవాసుల వరకూ సమాజంలోని అన్ని రంగాల్లో సంఘ్ పనిచేస్తూ సమాజాన్ని ఏకం చేయడానికి నిరంతరం కృషి చేస్తూనే వుందన్నారు. హెడ్గేవార్ సంఘ్ అన్న మొక్కను నాటితే, గురూజీ దానిని విస్తరించి, దాని మూలాలను బలోపేతం చేశారన్నారు.
సంఘ్ ఓ పవిత్రమైన, విశాలమైన మర్రిచెట్టు లాంటిదని, ఇది భారత ప్రజలను ఒక చోట చేర్చి, వారందరికీ గర్వాన్ని, కీర్తిని, పురోగతిని అందిస్తోందన్నారు. ఈ రోజు అనేక యాదృచ్ఛిక సంఘటనలు జరిగాయని, ఎందుకంటే ఈ రోజే సంఘ్ శత వత్సరాలను పూర్తి చేసుకుందని, అలాగే గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతులు కూడా నేడే అని గుర్తు చేశారు.
ప్రపంచంలోని పురాతన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లే, ప్రపంచంలోనే అతి పెద్ద స్వచ్ఛంద సంస్థ శతాబ్ది ఉత్సవాలు నేడు జరుగుతున్నాయని ప్రకటించారు. నాగపూర్ అనే పవిత్రమైన భూమి ఆధునిక భారత వాస్తు శిల్పులతో ముడిపడి వుందని, వారిలో తన జీవితాన్ని తీర్చిదిద్దడంలో గణనీయమైన పాత్ర పోషించిన ఇద్దరు వైద్యులున్నారని గుర్తు చేసుకున్నారు. ఆ ఇద్దరు మహానుభావలే సంఘ సంస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్, మరొకరు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అని పేర్కొన్నారు.
అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన సామాజిక న్యాయ వ్యవస్థ బలంతోనే తన లాంటి ఆర్థికంగా, సామాజికంగా సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవికి చేరుకోగలిగాడని తెలిపారు.ఇక.. డాక్టర్ హెడ్గేవార్ లోతైన ఆలోచనలు సమాజం, దేశం పట్ల తన దృక్పథాన్ని స్పష్టతను ఇచ్చాయన్నారు.ఈ ఇద్దరు గొప్ప వ్యక్తులు స్థాపించిన జాతీయ ఐక్యత మరియు సామాజిక సామరస్యం యొక్క ఆదర్శాల నుండి తన ప్రజా సేవా స్ఫూర్తి ప్రేరణ పొందిందని రాంనాథ్ ప్రకటించారు.



