రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్ది నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంపును, నాణేన్ని విడుదల చేశారు. ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో ఆరెస్సెస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే, ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ సంఘ్ వందేళ్ల ప్రయాణం అద్భుతమని కొనియాడారు. సంఘ్ 100 ఏళ్ల ప్రయాణం త్యాగం, నిస్వార్థ సేవతో పాటు దేశ నిర్మాణం అన్న దానికి అద్భుతమైన ఉదాహరణ అని పేర్కొన్నారు.
విజయదశమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, 1925లో ఈ రోజున డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ సంఘాన్ని స్థాపించారని ఆయన అన్నారు. సంఘ స్థాపన అనేది యాదృచ్ఛికమేమీ కాదని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి జరిగిన ఓ సమష్టి ప్రయత్నమని అన్నారు. సమాజంలో జాతీయ చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా సద్గుణ స్వరూపంగా అవతరించిన సంస్థే సంఘ్ అని అభివర్ణించారు.ఈ సందర్భంగా, దేశ ప్రజలకు నవరాత్రి మరియు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ, సంఘ్ శతాబ్ది సంవత్సరం వంటి గొప్ప సందర్భాన్ని చూసే అవకాశం లభించడం ఈ తరం అదృష్టమని ప్రధానమంత్రి అన్నారు.
సంఘ స్వయంసేవకులు క్రమశిక్షణ, సమర్పణా భావంతో సమాజంలోని ప్రతి అంశాన్ని స్పృశించారని, వ్యవసాయం, సైన్స్, గిరిజన సంక్షేమం, మహిళా సాధికారత, సామాజిక సేవ లేదా కార్మికుల సంక్షేమం వంటి ప్రతి రంగంలో సంఘ్ ప్రభావం ప్రవహిస్తున్నదని ఆయన అన్నారు. జాతి నిర్మాణమే సంఘ్ లక్ష్యమని, దైనందిన శాఖ అన్న పద్ధతే దీనికి పునాది అని అన్నారు. ఈ సందర్భంగా స్వయంసేవకులందర్నీ గుర్తు చేసుకుంటూ, లక్షలాది మంది స్వయంసేవకులు దేశానికి సేవ చేయడానికి తమ జీవితాలనే అంకితం చేశారని పేర్కొన్నారు. డాక్టర్జీ ఆలోచనలు, దృఢ సంకల్పం భారత్ ను నూతన యుగం వైపు నడిపిస్తున్నాయని అన్నారు.
సంఘ కార్య శతాబ్ది సందర్భంగా దేశానికి మరింత సేవలు చేయాలన్న సంకల్పాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని, దేశ ప్రయోజనమే అగ్రస్థానంగా తలచి, అందరూ ముందుకు సాగాలని సూచించారు.
దేశ నిర్మాణం, క్రమశిక్షణ, నిస్వార్థ సేవే లక్ష్యంగా విశేష కృషి చేస్తోందన్నారు. ఆరెస్సెస్ కార్య శతాబ్ది అన్న మైలు రాయిలో భాగం కావడంపై గర్వంగా వుందన్నారు. ఈ సందర్భంగా ఇటీవలే మరణించిన జ్యేష్ఠ స్వయంసేవక్, బీజేపీ నేత విజయ్ కుమార్ మల్హోత్రాని గుర్తు చేసుకుంటూ శ్రద్ధాంజలి ఘటించారు.
కొత్తగా విడుదల చేసిన నాణేనికి ఓ వైపు జాతీయ చిహ్నం వుందని, మరోవైపు సింహంపై కూర్చున్న భారత మాత చిత్రం, ఆరెస్సెస్ స్వయంసేవకుల చిత్రాలు వున్నాయని ప్రధాని పేర్కొన్నారు. భారత కరెన్సీపై భారత మాత చిత్రం వుండటం ఇదే మొదటి సారి అని, అలాగే ‘‘రాష్ట్రీయ స్వాహా ఇదం నమ:’’ అని కూడా వుందన్నారు.


