రామాలయంలోని రామలక్ష్మణులు, సీతమ్మ విగ్రహాలను ఒక వ్యక్తి మాయం చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రేచర్లలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రేచర్లలోని తండాలో 20 సంవత్సరాల కిందట రామాలయాన్ని నిర్మించారు. ఆలయం నిర్మించిన స్థలాన్ని గ్రామానికి చెందిన ధారావతు బాలు కుటుంబసభ్యులు దానం ఇచ్చారు. పలు కారణాలతో రెండేళ్లుగా రామాలయంలో పూజలు నిర్వహించడం లేదు. ఆ స్థలం తనదని ఆలయం అక్కడ ఉండటానికి వీల్లేదని బాలు పలుమార్లు భక్తులతో వాగ్వాదానికి దిగారు.
అయిదు రోజుల కిందట ధారావతు రాము ఆలయం తాళాలు పగలగొట్టి ఆలయంలోని రామలక్ష్మణులు, సీతమ్మ విగ్రహాలను మాయం చేశాడు. తండాలోని యువకులు ఆలయం దగ్గరకి వెళ్లి చూడగా విగ్రహాలు మాయం కావడంతోపాటు గర్భ గుడి పాక్షికంగా ధ్వంసం అయినట్లు గుర్తించారు. దీంతో రేచర్లలోని రాముని భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. నిందితుని శిక్షించాలని, విగ్రహాలను తిరిగి అక్కడ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం చింతలపూడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు.

