-డా.వడ్డే విజయసారధి,
‘జాగృతి’ పూర్వ సంపాదకులు, ప్రముఖ సామాజిక సేవకులు
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన 6 సంవత్సరాల తర్వాత ప్రారంభమైంది. అప్పటికి ఇరవై సంవత్సరాలుగా ‘స్వాతంత్ర్య ‘ ఉద్యమాలు లాల్, బాల్, పాల్ తదితరుల నాయకత్వంలో సాగుతున్నవి. గాంధీజీ కూడా రంగంలోకి వచ్చారు. భారతదేశం వంటి విశాలమైన ఏ దేశంలోనైనా ఇంగ్లాండు వంటి సుదూర దేశపు పెత్తనం ఎంతో కాలం సాగదని ప్రజలందరూ విశ్వసిస్తున్న తరుణమది.
‘జాగృతి’ పూర్వ సంపాదకులు, ప్రముఖ సామాజిక సేవకులు
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన 6 సంవత్సరాల తర్వాత ప్రారంభమైంది. అప్పటికి ఇరవై సంవత్సరాలుగా ‘స్వాతంత్ర్య ‘ ఉద్యమాలు లాల్, బాల్, పాల్ తదితరుల నాయకత్వంలో సాగుతున్నవి. గాంధీజీ కూడా రంగంలోకి వచ్చారు. భారతదేశం వంటి విశాలమైన ఏ దేశంలోనైనా ఇంగ్లాండు వంటి సుదూర దేశపు పెత్తనం ఎంతో కాలం సాగదని ప్రజలందరూ విశ్వసిస్తున్న తరుణమది.
కాబట్టే గాంధీగారు “ఏడాదిలో స్వరాజ్యం” అన్న నినాదం ఇవ్వగలిగారు. (ఇచ్చేందుకు సాహసించగలిగారు). సంఘాన్ని స్థాపించిన డా. కేశవరావు హెడ్గేవార్ తన బాల్యంనుండి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. బెంగాల్ లో అనుశీలన సమితి అనే రహస్య విప్లవ సంస్థలో కీలక వ్యక్తియైన శ్యామసుందర చక్రవర్తికి అత్యంత సన్నిహితంగా మెలగిన వ్యక్తి. విప్లవోద్యమంలోని అన్ని విషయాలనూ అవగతం చేసుకున్నారు.
నాగపూర్ తిరిగి వచ్చి కాంగ్రెసు కార్యకర్తగా వందల గ్రామాలు పర్యటించారు. 1920 డిసెంబర్ చివరి వారంలో కాంగ్రెస్ అఖిల భారత మహాసభలు నాగపూర్ లో జరిగి నప్పుడు వాటి ఏర్పాట్లలో, వాలెంటీర్లను సమకూర్చడంలో కీలకపాత్ర ఆయనదే. మహాసభ నడిచిన తీరుతెన్నులను సూక్ష్మంగా పరిశీలించారు.
1921లో పోలీసులు ఆయనపై రాజద్రోహం ఆరోపణ చేస్తూ కేసు నడిపారు. న్యాయస్థానం ఒక సంవత్సరం కఠిన కారాగారవాస శిక్ష విధించింది. అది పూర్తి చేసుకొని విడుదల పొందిన తర్వాత ‘స్వాతంత్ర్య’ అనే పత్రికను నడిపారు. ఇన్ని అనుభవాలనుండి ఆయన గ్రహించుకొన్నది ఒకటే. దేశానికి స్వాతంత్య్రం వచ్చి తీరుతుంది. (ఇంగ్లాండు మరోసారి యుద్ధంలో చిక్కుకొన్నపుడు మనం తగినంత బలం పుంజుకొని సంఘటితంగా ఒక్క ధక్కా ఇస్తే చాలు ఇంగ్లాండు నుండి స్వతంత్రులం కాగలం.) అందుకు మనం సంసిద్ధులం కావలసి ఉంది.
ఇక్కడ మరో విషయమూ ఉంది. ఆంగ్లేయులు నిష్క్రమించిన తర్వాత ఆ స్వాతంత్ర్యాన్ని నిలుపుకోగల స్థితిలో మనం ఉన్నామా? ఆ స్థితిని మనం ముందుగానే సాధించుకోవాలి గదా? కాని ఆ దిశలో ఆలోచిస్తున్న వారెవరు? ఈ కీలకమైన అంశంపై ఆయన దృష్టి సారించి సుదీర్ఘ కాలం తపస్సు చేసే సంసిద్ధతతో ఆయన సంఘాన్ని ఆవిష్కరించారు. సమగ్రమైన లక్ష్యంపై నిలిపిన తన (సంఘం) దృష్టిని చెదిరిపోనీయలేదు.
మధ్య మధ్య కొన్ని అవసరాలు తటస్థ పడుతుంటాయి. వాటి పరిష్కారానికి యత్నించవలసి ఉంటుంది. వాటిని వ్యక్తులుగా పూనుకొని యత్నించాలేగాని, సంఘం నేరుగా ఆ ప్రయత్నాల్లో ఇరుక్కు పోయి, “మౌలికమైన వ్యక్తి నిర్మాణం, రాష్ట్ర సంఘటన, పునర్నిర్మాణం కార్యాలను నిర్లక్ష్యం చేయకూడదు”. సంఘం స్థాపించిన తర్వాత డా. హెడ్గేవార్ దృష్టి, తర్వాత బాధ్యత వహించిన శ్రీ గురూజీ దృష్టీ ఈ తీరులోనే ఉన్నవి.
సంఘానికి ఆంగ్లేయుల గురించి ఏనాడూ భ్రమలు లేవు. ఏనాడూ రాజీ పడింది లేదు. ఆంగ్లేయుల పాలనకు సహకరించటమన్న ప్రశ్న ఉదయించదు.
వీలైనంత త్వరగా స్వాతంత్ర్యాన్ని సాధించుకోవటమే గాక దానిని యావత్తు జాతికి ప్రయోజనకరంగా మలుచుకోవాలని, శాశ్వతంగా నిలుపుకోవాలని గ్రహింపుతో శిక్షణ కార్యాన్ని ముమ్మరం చేసింది. నిరంతరంగా సాగిస్తూ ఉన్నది.

