![]() |
| Yoga is the foundation of world unity: Mohan Bhagwat |
యోగా కేవలం ఓ వ్యాయామం మాత్రమే కాదని, విశ్వ ఐక్యతకు మార్గమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ప్రకృతితో సామరస్యంగా, శాశ్వత జీవితానికి మార్గం చూపే పథం భారత్ సొంతమని అన్నారు. ప్రపంచ శ్రేయస్సు కోసం ఈ జ్ఞానాన్ని పంచుకోవాలని సూచించారు. లోనోవాలాలోని కైవల్య యోగా రీసర్చి ఇనిస్టిట్యూట్ 101 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మోహన్ భాగవత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భౌతికమైన పురోగతిని అనుసరించడం ద్వారా మానవాళి ప్రకృతికి తీవ్రమైన హాని కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన, స్థిరమైన అభివృద్ధి అంటే మానవత్వం, ప్రకృతికి హాని కలగకుండా వుండే అభివృద్ధే అభివృద్ధి అని వివరించారు.
సృష్టిని పోషించాలన్నదే యోగాశాస్త్రంలో వున్న సూత్రమని, ప్రకృతితో సామరస్యంగా వున్న జీవితమే అమృతత్వానికి దారితీస్తుందన్నది భారత్ విశ్వాసమని అన్నారు. ప్రపంచ శ్రేయస్సు కోసం ఈ మార్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
"యోగా అనేది కేవలం ఒక వ్యాయామం కాదు, అన్ని జీవులను అనుసంధానించే సాధనం. యోగాభ్యాసం ద్వారా శరీరం, మనస్సు, తెలివి మరియు ఆత్మల సమతుల్యతను పొందుతారు. భూమిపై శాంతి మరియు సంతోషంతో కూడిన కొత్త యుగానికి నాంది పలికే వ్యక్తులను నిర్మించడానికి కైవల్యధామం కృషి చేస్తోంది." అని ప్రశంసించారు.
సైన్స్ కి ఆధ్యాత్మికత అనేది అభిన్నమని, వాటి మధ్య ఏమీ తేడాలేదన్నారు. రుజువుల ద్వారా సైన్స్ వద్ధి చెందినట్లే, ఆధ్యాత్మికత కొన్ని అనుభవాల ద్వారా తెలుస్తుందన్నారు. భవిష్యత్ శాస్త్రీయ పరిశోధన అంతర్గత ప్రేరణ లేదా అంతర్గత శాస్త్రం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని మోహన్ భాగవత్ పేర్కొన్నారు.

