ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. బాంబు దాడికి పాల్పడిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తీవ్ర హెచ్చరికలు పంపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం భూటాన్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భూటాన్ రాజధాని థింపులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఢిల్లీ బాంబు పేలుడు ఘటనపై స్పందించారు.
బాంబు దాడి ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ బాంబు దాడి ఘటన వెనకున్న కుట్రదారులను వదిలిపెట్టమని, బాధ్యులందర్నీ చట్టం ముందు నిలబెడతామని ప్రకటించారు. ఈ పేలుడు అత్యంత భయంకరమైందని, బాధిత కుటుంబాల దు:ఖాన్ని తాను అర్థం చేసుకున్నానని అన్నారు.
''ఈ రోజు దేశం మొత్తం బాధితుల పక్షాన నిలుస్తుంది. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్న అన్ని ఏజెన్సీలతో నేను రాత్రంతా సంప్రదిస్తూనే వున్నాను. మా ఏజెన్సీలు ఈ కుట్రను గుర్తిస్తాయి, ఛేదిస్తాయి. బాధ్యులందర్నీ చట్టం ముందు నిలబెడతాం. భారత దేశం ప్రతి ఉగ్రవాదిని, వారికి మద్దతిచ్చే వారిని గుర్తించి, ట్రాక్ చేసి, శిక్షిస్తుంది’’ అని అన్నారు.

