బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందూ సమాజంపై ఛాందసుల హింస ఆగడం లేదు. తాజాగా మరో కొత్త కేసు చిట్టగాంగ్ నుంచి బయటపడింది. రావుజన్ ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు హిందూ వ్యక్తుల ఇంటికి నిప్పంటించారు. అంతేకాకుండా ఓ హెచ్చరికతో కూడిన ఓ బ్యానర్‌ను కూడా అక్కడే వేలాడదీశారు. బాబూ షుకుషీల్ అనే హిందూ కుటుంబానికి చెందిన ఇంటికి నిప్పంటించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన షుకుషీల్ తన ఇంటి కంచెను బద్దలు కొట్టి, తమ కుటుంబీకుల ప్రాణాలను కాపాడుకున్నాడు.
కానీ.. వారి కళ్ల ముందే ఇల్లు, జంతువులు కాలి, బూడిదయ్యాయి.ఈ దారుణం స్థానిక నివాసితులను, ముఖ్యంగా హిందువులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
అయితే... ‘హిందువులకు హెచ్చరిక నోటీసు’’ అన్న బ్యానర్ బెంగాలీలో రాసి వుంది. హిందువులు తమ నిఘాలో వున్నారని, వారి కార్యకలాపాలను, సమావేశాలను వెంటనే నిలిపేయాలని అందులో వుంది. ఇస్లాం మతాన్ని కించపరిస్తే ఊరుకోమని, దీనిని పాటించకపోతే, ఇళ్లు, దుకాణాలను ధ్వంసం చేస్తామని అందులో ఛాందసులు హెచ్చరించారు.
అత్యంత భయానకమైన విషయం ఏమిటంటే, బ్యానర్‌పై "మిమ్మల్ని రక్షించడానికి ఎవరూ రారు" అని కూడా రాసి వుండటం అత్యంత గర్హనీయం.

