![]() |
| కేశవరావ్ జి |
కేశవరావ్ రెండో తరహాకు చెందినవారని చెప్పుకోవచ్చు. ఆయన ఏ దేశాలకు వెళ్లకుండానే, పైతరగతులలో కూర్చొనక ముందే స్వేచ్ఛా ప్రియ త్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. కేశవరావ్లో ఎనిమిదో ఏటనే (ఆయన ఏప్రిల్ 1, 1889న పుట్టారు) ఇలాంటి లక్షణం కనిపిస్తుంది. స్వాతంత్య్ర భావాలు అంకురిస్తున్న లక్షణాలు వేరుగా ఉంటాయి. ఆ కాలంలో జన్మించిన వారి లక్షణాలు కూడా భిన్నంగా ఉంటాయి. భారతదేశాన్ని విదేశీ పాలన నుంచి విముక్తం చేయాలన్న ఆకాంక్ష అంకురించినప్పుడు, అందుకు ఉద్యుక్తులైన వారంతా సాధారణ భారతీయులు. వారి పేదరికం వారిని అలాంటి మహోన్నత దీక్ష నుంచి వైదొలగేటట్టు చేయలేక పోయింది. భారత స్వరాజ్య సమర సారథులు ఎక్కువ మంది సాధారణ లేదా నిరుపేద భారతీయులు. అలాంటి కుటుంబాలలో హెడ్గెవార్ కుటుంబం ఒకటి. ఇందూరు జిల్లా, కందకుర్తి నుంచి వీరి పూర్వీకుడు నరహరశాస్త్రి నాగ్‌పూర్ సంస్థానానికి వలస వచ్చారు. కానీ 1853లో ఈ సంస్థానం కూడా ఈస్టిండియా కంపెనీ వశమైన తరువాత, నాగ్‌పూర్‌ను ప్లేగ్ తుడిచిపెట్టిన తరువాత హెడ్గేవార్ కుటుంబ పరిస్థితి దిగజారిపోయింది. కేశవరావ్ హెడ్గెవార్ తండ్రి బలీరాంపంత్, తల్లి రేవతీబాయి ఒకే రోజు ప్లేగు వ్యాధికి బలయ్యారు. తరువాత కేశవరావ్ అన్న మహాదేవశాస్త్రి సంరక్షణలో ఉన్నారు. కానీ అది ఆయనకు పెద్ద చేదు జ్ఞాపకంగానే ఉండి పోయింది. ఆ పరిస్థితిలో, కౌమార్యంలో కూడా దేశం పట్ల తనకున్న బాధ్యతను కేశవరావ్ నిరంతరం గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. కేశవరావ్ బాల్యానికి రెండే కోణాలు – ఒకటి దారిద్య్రం. రెండు దేశ కాల పరిస్థితులకు స్పందించడం.
తొలి నిరసన
జూన్ 22, 1897వ సంవత్సరంలో విక్టోరియా మహారాణి పాలన వజ్రోత్సవాలు నిర్వహించారు. అంటే సింహాసనం అధిష్టించి అరవయ్యేళ్లు అయిన సందర్భం. ఇంగ్లండ్‌కు వలస రాజ్యమే కాబట్టి ఇక్కడ కూడా అట్టహాసంగా ఉత్సవాలు ఏర్పాటు చేశారు. పేదలకి అన్నదానం చేశారు. పాఠశాల పిల్లలకు తాయిలాలు పంచారు. నాగ్‌పూర్‌లోని నీల్సిటీ పాఠశాలలో చదువుకునేవారు కేశవరావ్. అక్కడ కూడా మిఠాయిలు పంచారు. ఉత్సవం ముగిశాక కేశవరావ్ ఇంటికి వచ్చారు. ముఖమంతా విచారం. పెద్దన్నయ్య మహదేవశాస్త్రి అడిగాడు, ‘నీకు మిఠాయిలు రాలేదా? ముఖం అలా పెట్టుకున్నావ్?’ అని. ఎప్పుడూ భయం భయంగా అన్నతో మాట్లాడే కేశవరావ్, ‘ఎవరి కోసం ఆ మిఠాయిలు? అసలు విక్టోరియా రాణి వజ్రోత్సవాలు ఇక్కడ ఎందుకు జరపాలి? భోంస్లేల అధికారమంతా లాక్కున్నది ఈ మహారాణీ కాదా!’ అని అడిగాడు. పాఠశాలలో ఇచ్చిన మిఠాయిలను విసిరేసిన తరువాత ఇంటికి వచ్చారు. ఇలాంటి మాట ఆయన నోటి నుంచి ఆ వయసులో రావడానికి తగిన నేపథ్యమే ఉంది.
అప్పటికే బాలగంగాధర తిలక్ మరాఠా ప్రజలకు జాతీయత సిద్ధాంత ప్రవక్తలా కనిపిస్తున్నారు. ఆయన పిలుపు మేరకు సామూహిక గణేశ్ ఉత్సవాలు, ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిట్నవీస్ పార్క్‌లో జరిగే ఆ కార్యక్రమాలలో జాతీయతను ప్రబోధిస్తూ డాక్టర్ ఖాన్‌ఖోజే, రాంలాల్ వాజపేయి వంటి వారి ఉపన్యాసాలు ప్రతిధ్వనించేవి. దీనికితోడు బాల కేశవరావ్ పక్కింటికి వచ్చే ‘కేసరి’ (తిలక్ సంపాదత్వంలో వెలువడేది) పత్రిక చదివే అలవాటు చేసుకున్నారు. నాగ్‌పూర్ సంస్థానాధీశుడు రఘూజీ భోంస్లే దుస్థితికి కారణం ఆంగ్లేయులేనని ఆయన విన్నారు. ఈ ఉదంతం కేశవరావ్ భావి చింతనా ధారకు బీజం వలె కనిపిస్తుంది.
ధ్వజం కోసం
బాల కేశవరావ్ నాగ్‌పూర్‌లోనే సీతాబర్డి కోటను చూస్తూ ఉండేవారు. లోగడ దాని బురుజు మీద భారతీయులంతా భగవాధ్వజంగా భావించే కాషాయ పతాకం ఎగురుతూ కనిపించేది. అప్పటికి బ్రిటన్ జాతీయ పతాకం యూనియన్ జాక్ ఎగురుతోంది. తిరిగి ఆ స్థానంలో భగవాధ్వజం ఎగురవేయాలని ఆయన సంకల్పించారు. కోటకు సమీపంలో ఉన్న వఝ్జులవార్ అనే తన ఉపాధ్యా యుడి ఇల్లును అందుకు ఉపయోగించుకోవాలని అనుకున్నారు. వారి తనయుడి సాయంతో రాత్రి వేళ ఆ ఇంటిలో చదువుకోవడానికి అనుమతి పొందారు. తన మిత్రులతో కలసి కోటలోకి సొరంగమార్గం తవ్వడం ఆరంభించారు. కానీ తవ్విన మట్టి, శబ్దాల కారణంగా పిల్లల ఆలోచన ఆ ఉపాధ్యా యుడికి తెలిసిపోయింది. మన పతాకం ఎగరవేయ డానికి మార్గం ఇది కాదని ఆయన నచ్చ చెప్పి పంపించేశారు. ఇది మట్టి వాసన వేసే స్వేచ్ఛాకాంక్ష వైపు వేసిన తొలి అడుగుగా భావించవచ్చు.
విస్తరించిన జాతీయ భావన
కేశవరావ్ మనసా వాచా తిలక్ రాజకీయ చింతనను నమ్మారు. అదే బాటలో సాగారు. ఇక, భారత స్వరాజ్య సమరంలో దేశీయమైన చింతనతో సాగి, విజయం సాధించిన తొలి రాజకీయోద్యమం బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమమే. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినవారు బాలగంగాధర తిలక్. ఇంకా బిపిన్ చంద్రపాల్, లాలా లాజ్పతిరాయ్, అరవింద్ ఘోష్, రవీంద్రనాథ్ టాగూర్.. ఎందరో మహనీయులు ఆ ఉద్యమ వేళ భుజం భుజం కలిపి కదిలారు. వీరందరిదీ ప్రధానంగా జాతీయతను ప్రబోధించే తత్త్వమే. ఆ జాతీయత వేళ్లు మన గతంలోనివి. అక్టోబర్ 16, 1905న విభజనకు వ్యతిరేకంగా బెంగాల్ అంతటా నిరసన దినం పాటించారు. నాగ్‌పూర్‌లో కూడా పాటించారు. అప్పటికే ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర కారణాలతో వచ్చిన బెంగాలీలు కొందరు ఉండేవారు. ప్రభుత్వం చట్టబద్ధంగా చేసిన విన్నపాలను స్వీకరించకుంటే, సాయుధ మార్గంలో అయినా ఉద్యమించాలన్న భావన ఉండేది. ఇలాంటి భావనే కేశవ్‌రావ్ వంటి యువకులలోను రూపుదిద్దుకోవడం ఆరంభించింది. నాగ్‌పూర్‌లోని శుక్రవారం చెరువు అనే ప్రాంతంలోనే ఒక గుట్ట ఉండేది. దానినే సీతాబర్డి కోటగా భావించి కేశవరావ్ బృదం భగవాధ్వజాన్ని ఎగరవేయడం ఆరంభించింది.
బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం లేదా వందేమాతరం ఉద్యమం కేవలం రాజకీయోద్యమం కాదు. జాతిని పునర్ నిర్మాణం చేయడం కూడా దాని ఉద్దేశం. జాతీయ కళాశాలలు, విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ పరిశ్రమలకు ప్రోత్సాహం వంటి జాతీయత పునాదిగా కలిగిన ప్రణాళిక ఆ ఉద్యమానికి ఉంది. దేశీయ పరిశ్రమల ప్రోత్సాహానికి తిలక్ ‘పైసా నిధి’ అనే ఉద్యమాన్ని ఆరంభించారు. తన పత్రిక కేసరి ద్వారా దీనిని నిర్వహించారు. కేశవరావ్ నాలుగు అణాలు (అంటే 24 పైసలు) పైసా నిధిని సమర్పించారు. పైసా నిధి ఉద్యమాన్ని భుజాన వేసుకుని తిరిగినవారే డాక్టర్ బాలకృష్ణ శివరాం మూంజే. ఈయన కూడా మహారాష్ట్ర జాతీయవాదే. ఆఫ్రికాలో బోయర్ యుద్ధం ముగిసిన తరువాత స్వదేశానికి తిరిగి వచ్చారు. కటిక పేదరికంలో మగ్గుతున్న కేశవరావ్ నాలుగు అణాలు పైసా నిధికి సమర్పించడం విశేషమే. ఇంటి పరిస్థితులను బట్టి కేశవరావ్ ట్యూషన్స్ చెప్పేవారు.
వందేమాతరం ఉద్యమ ప్రణాళికలో భాగంగా స్వదేశీ వస్తువుల గురించి ప్రచారం చేయడానికీ, అందుబాటులోకి తేవడానికీ నాగ్‌పూర్‌లో స్వదేశ్ బాంధవ్ అన్న సంస్థ ఆరంభమైంది. డాక్టర్ ఖాన్ఖోజె ప్రోద్బలంతో గణపత్రావ్ జోషి, మోరోపంత్ అభ్యంకర్, ఖరే, సప్రే, కేశవ్ హెడ్గెవార్ దీని నిర్వాహ కులు. మహల్ ప్రాంతంలో ఆర్ష బాంధవ వాటికా అనే స్వదేశీ వస్తువుల దుకాణం కూడా తెరిచారు. ఇందులో కేశవరావ్ కూర్చునేవారు.
కానీ ఇవన్నీ పెద్దన్నయ్య మహదేవశాస్త్రికి రుచించలేదు. తమ్ముడిని ఆపడానికి గట్టిగానే ప్రయత్నించాడు. ఫలితం`నాగ్‌పూర్‌కు 75 మైళ్ల దూరంలో ఉన్న రామ్పాయిలీ అనే చోటికి కేశవరావ్ వెళ్లిపోయారు. అక్కడ కేశవరావ్ పినతండ్రి మోరేశ్వర్ శ్రీధర్ హెడ్గెవార్ ఉండేవారు. ఆయన రెవెన్యూ శాఖ ఉద్యోగి. ఈయనకే ఆబాజీ అనే పేరు కూడా ఉంది. ఇదంతా ఉత్తరప్రత్యుత్తరాలతో జరిగిపోయింది. కానీ ఆబాజీ ప్రభుత్వోద్యోగి అయినా కేశవరావ్ను నిరోధించలేదు. పైగా ఠాకూర్, భగురే, డబీర్ వంటి మరికొందరు కూడా కేశవరావ్ అభిప్రాయాలతోనే ఉండేవారు. ఆ సంవత్సరం జరిగిన దసరా వేడుక లను వందేమాతర ఉద్యమ ప్రచారానికి వినియో గించారాయన. ఆ గీతం పాడించి అధికారుల ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఫలితం ఆబాజీ ఉద్యోగం పోయింది. మనకి కొంత పాడి ఉంది, దానితోనే బతుకుతానని కేశవరావ్‌కు చెప్పారా యన. కేశవరావ్ తిరిగి నాగ్‌పూర్ చేరుకున్నారు. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం పట్ల ఆంగ్లేయుల వైఖరి రోజురోజుకూ కఠినంగా మారిపోయింది.
రిస్లే సర్క్యులర్
నీల్సిటీ ఉన్నత పాఠశాలలో రిస్లే సర్క్యులర్ సిద్ధంగా ఉంది. సభలు, సమావేశాల నుంచి విద్యార్థులను వేరు చేయడమే దీని ఉద్దేశం. ఆ పాఠశాల కార్యదర్శి విపిన్ కృష్ణ, ప్రధానో పాధ్యాయుడు జనార్దన్ ఓక్. వీరితో పాటు ఇతర ఉపాధ్యాయులకు కూడా స్వదేశీ ఉద్యమం పట్ల, వందేమాతరం ఉద్యమం పట్ల సానుభూతి ఉంది. కానీ పైకి అనలేరు. అందుకే ఈ సర్క్యులర్ గురించి విద్యార్థులకు ఎలా చెప్పాలో వారికి అర్థం కాలేదు. దీనికి వ్యతిరేకంగా కూడా కేశవరావ్ విద్యార్థుల చేత నిరసన కార్యక్రమం నిర్వహింప చేశారు. దాదాపు అదే సమయంలో, అంటే 1908లో లోకమాన్య తిలక్ నాగ్‌పూర్ సందర్శించారు. స్కూళ్ల ఇన్స్పెక్టర్ నీట్సిటీ పాఠశాల తనిఖీ కోసం వచ్చాడు. ఏ తరగతికి వెళ్లినా పిల్లలు వందేమాతరం అంటూ నినదించేవారు. దీని గురించి హిందూ పత్రిక కూడా వార్త వెలువరించింది. అయితే కేశవరావ్‌కు ఆ పాఠశాలను వదలక తప్పలేదు. ఆ స్కూలు నుంచి పంపించివేయడంతో యవత్మల్ అనే చోట ఏర్పాటు చేసిన జాతీయ పాఠశాల ‘విద్యా గృహ’లో ఆయన చేరారు. స్వదేశీ ఉద్యమం ఫలితంగా అప్పటికే దేశంలో చాలా చోట్ల ఇలాంటి జాతీయ విద్యతో కూడా పాఠశాలలు నెలకొల్పారు. యవత్మల్ పాఠశాలలో తపస్వి బాబాసాహెబ్ పరాంజపే, లోకమాన్య బాపూజీ ఆణే వంటివారు పాఠాలు చెప్పేవారు. కేసరి పత్రికతో పాటు కాల్, బాలా, దేశసేవక్ వంటి పత్రికలను కూడా చదివే అవకాశం ఇక్కడ వచ్చింది. ఇక్కడే కేశవరావ్ మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఒక్క ప్రయత్నంతోనే మెట్రిక్ ఉత్తీర్ణులైనవారు ఆ కాలంలో చాలా తక్కువ. ఒక పక్క జాతీయోద్యమంలో విద్యార్థుల వైపు నుంచి చురుకుగా ఉంటూనే కేశవరావ్ విద్యా విషయకంగా కూడా ముందంజలో ఉండేవారు. బెంగాల్ జాతీయ విద్యామండలి అధ్యక్షుడు రాస్ బిహారీ ఘోష్ సంతకంతో మెట్రిక్‌లో ఉత్తీర్ణుడైనట్టు కేశవ్రావ్కు డిసెంబర్ 1, 1909న పట్టా అందింది. తరువాత జీవితం మరొక మలుపు తిరిగింది.

