రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులు నిత్యం ప్రార్థనను చేస్తారు. నిజానికి ఇది ఓ మంత్రం లాంటిది. ‘‘మననాత్ త్రాయతే ఇతి మంత్ర:’’ అని వుంటుంది. నిత్యం స్మరిస్తూ వుంటే అదే మంత్రం అవుతుందని ఆర్యోక్తి. అలా నిత్యం స్వయంసేవకులు నిత్య శాఖ సమయంలో ప్రార్థన చేసుకుంటూ తమ లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటారు. తమ లక్ష్య సాధనలో శక్తి ప్రసాదించాలని ఈశ్వరుడ్ని ప్రార్థిస్తుంటారు.
అయితే ప్రస్తుతం వున్న ప్రార్థన మొదట్లో లేదు. సంఘ ప్రార్థన తొలి రూపంపైన, వివిధ సంఘ పద్ధతులపైన సమర్థ రామదాస స్వామి ప్రభావం ఎక్కువగా వుండేది. ఆ రోజుల్లో సంఘ ప్రార్థన భారత్ మాతాకీ జై తో మొదలై, రాష్ట్ర గురు స్వామి రామదాస్ మహారాజ్ కీ జయ్’’ అనే నినాదంతో ముగిసేది. ఇది మరాఠీ, హిందీ భాషల సమ్మిళితంగా వుండేది.
సంఘ విస్తరిస్తున్న కొద్దీ, జాతీయ ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తూ ప్రార్థన సంస్కృత భాషలోకి మారిపోయింది. అలాగే భారత్ మాతాకీ జయ్’’ అన్న నినాదంతో ముగుస్తుంది. 1940 నుంచి దేశ వ్యాప్తంగా స్వయంసేవకులు ఇప్పటి ప్రార్థనను శ్రద్ధగా, భక్తితో ఆలాపిస్తూ వస్తున్నారు.
డాక్టర్జీ (డాక్టర్ హెడ్గేవార్) అనుమతితోనే ఈ మార్పులన్నీ జరిగాయి. ప్రతి పదం ఎంపికలోనూ స్పష్టమైన నిర్మాణాత్మక దృష్టికోణంతో ఎంతో శ్రద్ధ వహించారు. హిందీలో ఒక ప్రఖ్యాతి గాంచిన ప్రార్థన వుంది, దానిలో ‘‘మా తప్పుల నుంచి మిమ్మల్ని విముక్తి చేయండి’ అని వుండేది. దీనిలో ప్రతికూల అర్థం ధ్వనిస్తోందని డాక్టర్జీకి అనిపించిందట. దాన్ని ఇలా మార్చేశారు.‘‘మాలో సుగుణాలు నింపి, మిమ్మల్ని సంపూర్ణ హిందువులుగా చేయండి’ అని. వారు స్వత: సిద్ధ సంపూర్ణ అవగాహన కలిగిన స్వయంసేవకులు.
నాగపూర్ లో ప్రారంభమైనా, భారత దేశమంతా దాని నివాసమే. భారత్ లోని ప్రతీ గ్రామమూ దాని కార్యక్షేత్రమే. అని పేర్కొన్నారు డాక్టర్జీ. 1945 నాటి విజయదశమి ప్రసంగంలో గురూజీ ఇలా అన్నారు. ‘‘సంఘం విలువల మాధుర్యాన్ని కలిగి వుండడంతో ప్రశాంతంగా తన కార్యంలో తాను మునిగి వుంటుంది. సంఘ ఆలోచనలో ప్రాంతీయ భేదాలకు తావు లేదు. సంఘం మానవులను ఉన్నతులుగా తీర్చిదిద్దే ఓ కర్మాగారం’’ అన్నారు.
33 శ్లోకాలు కలిగిన ఏకాత్మతా స్తోత్రం అన్ని సంఘ కార్యాలయాల్లో, సమావేశాల్లోనూ అంటారు. భారత మాత సేవలో తరించిన ప్రతి ఒక్కరిని స్మరించే స్తోత్రమిది. వేల సంవత్సరాల చరిత్ర, రాజులు, రాణులు, వీరులు, సాదువులు, శాస్త్రవేత్తలు.... పండితులు, తత్వవేత్తలు, కవులు, భారత్ లోని పవిత్ర స్థలాలన్నింటినీ స్తుతిస్తూ అర్పించే నివాళి ఇది. దేశం పట్ల శ్రద్ధను పెంచే నిత్య స్మరణ ఇది. ఏకాత్మతా మంత్రం, భోజన మంత్రం, సంఘ ప్రార్థన.. ఇవన్నీ ప్రతి స్వయంసేవక్ నిత్ాయ జీవితంలో కీలకాంశాలు. సమాజ అభ్యున్నతికై స్వయంసేవకులు చేసే ప్రతి పనికి స్ఫూర్తినిచ్చే ఈ నైతిక సూత్రాలే.

