![]() |
| Vishwa Hindu Parishad Joint Secretary - Surendra Jain |
హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను వదిలి ఇతర (క్రైస్తవం, ఇస్లాం తదితర..) మతాలలోకి మారిన వారు తమ షెడ్యూల్డ్ కులాల (SC) హోదాను కోల్పోతారని సుప్రీంకోర్టు తీర్పును విశ్వహిందూ పరిషత్ స్వాగతించింది. ఈ నిర్ణయం రాజ్యాంగ మౌలిక స్ఫూర్తిని, సామాజిక న్యాయాన్ని బలోపేతం చేస్తుందని విశ్వహిందూ పరిషత్ సంయుక్త కార్యదర్శి సురేంద్ర జైన్ పేర్కొన్నారు.
ఇతర మతంలోకి వెళ్లిన తర్వాత కూడా కొందరు తమ కులాల ఆధారంగా రాజ్యాంగపరమైన ప్రయోజనాలను పొందేందుకు ప్రయత్నించే ధోరణికి ఈ తీర్పు కళ్లెం వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.మత మార్పిడి మాఫియాకు ఈ తీర్పుతో తీవ్రమైన ఎదురు దెబ్బ తగిలిందన్నారు.
తమ మతం అందర్నీ సమానంగా చూస్తుందని, కుల వ్యవస్థకు తావు లేదని కొందరు తెగ వాదిస్తుంటారని, కానీ వారే దళిత క్రైస్తవుడు, దళిత ముస్లిం వంటి పదాలను సృష్టిస్తుంటారని చురకలంటించారు.అలాగే ఇలాంటి వారు మత మార్పిళ్లకు మరింత ఊతమిస్తారని మండిపడ్డారు.
షెడ్డూల్ కులాల వారికి కల్పించిన హక్కులు, రక్షణలు ఎందుకంటే.. హిందూ సమాజంలో జరిగిన చారిత్రక సామాజిక అన్యాయాన్ని సరిదిద్దడానికే అని అన్నారు. అయితే ఓ వ్యక్తి స్వచ్ఛందంగా తన మతాన్ని మార్చుకున్నప్పుడు సహజంగానే తన సామాజిక కులం నుంచి వేరుగా అయిపోతారన్నారు.ఒక వ్యక్తి తిరిగి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాన్ని స్వీకరించి, ఆయా సమాజాలచే ఆమోదించబడితే తప్ప వారు షెడ్యూల్డ్ కులాలకు కల్పించిన హక్కులకు తిరిగి అర్హత పొందలేరన్నారు.

