తమిళనాడు ముఖ్యమంత్రిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి కూడా సనాతన ధర్మం అంటే గిట్టదా? ఓ ముఖ్యమంత్రి స్థాయిలో వుంటూ, ఇతరులు ఎవరైనా ఓ ధర్మాన్ని కించపరిస్తే.. ఏం చేయాలి? ఎలా స్పందించాలి? అలా ఓ పరిణతి ప్రదర్శించలేదన్న విమర్శలు విపరీతంగా వస్తున్నాయి.
నిండు అసెంబ్లీలో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేస్తే.. అదే సభలో వున్న సీఎం విజయ్.. మౌనంగా తల ఊపారు. అంటే.. విజయ్ కి కూడా సనాతన ధర్మం అంటే గిట్టదా? సనాతన ధర్మంపై అసలు ఓ మర్యాద అంటూ లేదా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
ఇక.. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకి ప్రజలు బుద్ధి చెప్పినా, హిందువులు వ్యతిరేకించినా.. వక్ర బుద్ధి, ద్వేష బుద్ధిని మాత్రం మార్చుకోలేదని ఉదయనిధి ప్రకటనతో తేలిపోయింది. తన ఐదేళ్ల పరిపాలనలో 200 కి పైగా హిందూ దేవాలయాలను డీఎంకే కూల్చేసిందన్న ఆరోపణలు వచ్చినా.. వాటి నుంచి ఏమాత్రం పాఠాలు నేర్చుకోలేదని అర్థమైపోతోంది.2023లో ఆయన చేసిన గత ప్రసంగం మాదిరిగానే, ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రతిచర్యలను రేకెత్తించాయి.
ఉదయనిధిపై తీవ్రంగా మండిపడుతున్న నెటిజన్లు
సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై జాతీయవాదులు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా మండిపడుతున్నారు. “ఉదయనిధి స్టాలిన్ మళ్లీ అదే పాత ‘సనాతనను నిర్మూలించండి’ నినాదాన్ని జపిస్తున్నారు, ఈసారి స్వయంగా తమిళనాడు అసెంబ్లీలోనే. సనాతన ధర్మంపై బహిరంగ దాడులు సభలో ప్రతిధ్వనిస్తుండగా, సీఎం విజయ్ చేతులు కట్టుకుని మౌనంగా అక్కడే కూర్చున్నారు. కోట్లాది హిందువులను బహిరంగంగా అవమానిస్తున్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి మౌనం దేనికి సంకేతం. ఇది పూర్తిగా అవమానకరం’’ అంటూ మండిపడ్డారు.
ఇక. మరో నెటిజన్ స్పందిస్తూ ‘‘"ఈ రోజు, ఉదయనిధి స్టాలిన్ మరోసారి 'సనాతనాన్ని నిర్మూలించాలి' అని వ్యాఖ్యానించారు. అయితే, అంతకంటే ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏమిటంటే—ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఆ వ్యాఖ్యను ఏమాత్రం వ్యతిరేకించకపోవడం; పైగా, ఆయన స్టాలిన్‌కు చేతులు జోడించి ఎంతో గౌరవంగా అభివాదం చేశారు. ఒకవేళ ఉదయనిధి 'క్రైస్తవాన్ని నిర్మూలించాలి' అని వ్యాఖ్యానించి ఉంటే, విజయ్ అప్పటికీ ఇలాగే మౌనంగా ఉండిపోయేవారా? చాలామంది దృష్టిలో, ఈ రోజు విజయ్ వహించిన మౌనం ఆయన కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకేనన్న నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది." అని మండిపడ్డారు.
ఇక.. బీజేపీ నేత నారాయణన్ తిరుపతి ట్వీట్ చేస్తూ ‘‘"ఉదయనిధి స్టాలిన్, ప్రజలను విభజించే సనాతనాన్ని కచ్చితంగా నిర్మూలించాలని శాసనసభలో వ్యాఖ్యానించారు. సనాతనాన్ని నిర్మూలించడం గురించి మీరు మాట్లాడటం వల్లే ప్రజలు మిమ్మల్ని, DMKని అధికారం నుండి వేరుచేసి, బయటకు గెంటేశారని గ్రహించండి.’’అని ట్వీట్ చేశారు.

