సమాజంలో పాతుకుపోయిన కులతత్వాన్ని పూర్తిగా నిర్మూలించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు భయ్యాజీ జోషి సూచించారు. సంఘ కార్య శతాబ్ది సందర్భంగా కేరళలోని కున్నమంగళంలో పౌర సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో కులతత్వానికి విపరీతమైన ప్రాధాన్యత పెరిగిపోయిందని, సుమారు 600 కులాలు, ఉపకులాలుగా ప్రజలు విడిపోయారని, దీంతో తమను తాము ఒకరి నుంచి ఒకరు వేరుగా భావిస్తున్నామని అన్నారు.
సామాజిక జీవనానికి అనుకూలంగా లేని ఆచారాలను విడనాడటమే మన సంప్రదాయం అని, ఆధునిక సమాజంతో పొంతన లేని పద్ధతులు కచ్చితంగా తొలిగిపోవాలని నిక్కచ్చిగా చెప్పారు.సమాజంలో ఒక సైద్ధాంతిక విప్లవం రావాలని పిలుపునిస్తూ, లింగ సమానత్వానికి వ్యతిరేకంగా ఉండే సిద్ధాంతాలను నిర్మూలించాలని భయ్యాజీ జోషి పేర్కొన్నారు.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందరమూ ఒక్కటేనన్న విషయాన్ని చాటిచెబుతోందన్నారు.భాష ఆధారంగానో, ప్రాంతం ఆధారంగానో, సరిహద్దుల ఆధారంగానో ప్రత్యేక గర్వం ప్రదర్శించాల్సిన అవసరమే లేదన్నారు.దేశంలోని ప్రజలందరూ హిందువులని, మౌలికంగా వారు భారతీయులేనని తెలిపే చైతన్యం రావాలన్నారు.
వ్యక్తివాదం కారణంగా పెరుగుతున్న విడాకుల రేట్లు, విచ్ఛిన్నమవుతున్న కుటుంబాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆయన భారతీయ కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.నూతన తరంలో సరైన సాంస్కృతిక విలువలను పెంపొందించడంలో కుటుంబం మరియు విద్యా వ్యవస్థ ఈ రెండింటి కీలక పాత్రను భయ్యాజీ జోషి నొక్కి చెప్పారు. అంతేకాకుండా, పర్యావరణ పరిరక్షణను మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సాధికారతను ఇమిడ్చుకున్న జీవనశైలిని అవలంబించాలని ఆయన పిలుపునిచ్చారు.

