హైదరాబాద్: ఇస్లామిక్ దండయాత్రలు, క్రైస్తవ మిషనరీల కుట్రలతో శతాబ్దాలుగా భారత్ భౌతిక, మేధోపరమైన దాడులను ఎదుర్కొంటున్నదని, అయినప్పటికీ భారత నాగరికత మూలాలు మాత్రం నిలకడగా ఉన్నాయని ధర్మ జాగరణ విభాగం దక్షిణ మధ్య క్షేత్ర ప్రముఖ్ శ్రీ అమర లింగన్న తెలియజేశారు. ప్రముఖ జాతీయవాద రచయిత శ్రీ మైలవరపు సుధా మోహన్ రచించిన తెలుగు పుస్తకం 'మిషనరీ మాయాజాలం' ఆవిష్కరణ కార్యక్రమం జూన్ 30న హైదరాబాద్లో జరిగింది. పుస్తక ప్రచురణ సంస్థ సంవిత్ ప్రకాశన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమరలింగన్న ముఖ్య వక్తగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేవుడి పట్ల భయం కల్పించి, మత సిద్ధాంతాల పేరుతో ఇస్లాం, క్రైస్తవ మతాలు సాగించిన యుద్ధాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. మనపై ఎన్నో దాడులు జరిగాయని, ఎన్నో కష్టాలను అనుభవించామని, అయినప్పటికీ హిందూ సమాజం ఓడిపోలేదని తెలిపారు. భారత చరిత్ర, సంస్కృతీ సాంప్రదాయాల వక్రీకరణలను అడ్డుకునేందుకు చేస్తున్న మేధోపరమైన పోరాటం నేటికీ కొనసాగుతోందని చెప్పారు.
భారత నాగరికత, చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు శతాబ్దాలుగా కొనసాగుతున్నప్పటికీ, గ్రామీణ సంప్రదాయాలు, జానపద సంస్కృతి, సామాజిక జీవన విధానాల ద్వారా ధర్మం యొక్క సారాంశం తరతరాలకు అందుతోందని పేర్కొన్నారు. ఈ సంప్రదాయాల కారణంగానే సాధారణ ప్రజలు సైతం అనేక దండయాత్రలు, సైద్ధాంతిక సవాళ్ల మధ్య కూడా ధార్మిక విలువలను అర్థం చేసుకుని ఆచరించగలిగారని చెప్పారు.
ప్రస్తుతం సమాజానికి తన నాగరికత మూలాలతో ఉన్న అనుబంధం క్రమంగా తగ్గిపోతుందని అమర లింగన్న ఆందోళన వ్యక్తం చేశారు. హిందుత్వాన్ని నిర్మూలించడం సాధ్యం కాకపోయినా, హిందూ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లు మాత్రం వాస్తవమని, వాటిని నిర్లక్ష్యం చేయడం లేదా వాటిపై మౌనం వహించడం తగదని హెచ్చరించారు. హిందూ సమాజాన్ని రక్షించే బాధ్యత ప్రభుత్వాలపై మాత్రమే లేదని, అది ప్రధానంగా ఈ సమాజానిదేనని హితవు పలికారు.
'మిషనరీ మాయాజాలం' పుస్తకం గురించి ప్రస్తావిస్తూ.. ఇటువంటి సాహిత్యాన్ని సమాజంలోని ప్రతి వర్గానికి చేరవేయాలని అమర లింగన్న పిలుపునిచ్చారు. భారత చరిత్ర, నాగరికత వారసత్వాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించే ఈ తరహా గ్రంథాలు ప్రజలకు చేరడం ద్వారా ఆధారాలతో కూడిన అధ్యయనం జరిగి భావితరాలు తమ సాంస్కృతిక మూలాలను అర్థం చేసుకోగలుగుతారని ఆకాంక్షించారు.
'మిషనరీ మాయాజాలం' రచయిత్రి శ్రీ మైలవరపు సుధా మోహన్ మాట్లాడుతూ, వలసవాద పాలనా కాలంలో పాశ్చాత్య పండితులు భారతదేశ చరిత్ర, నాగరికత మరియు సంస్కృతి గురించి తగిన ఆధారాలు, లోతైన పరిశోధన లేకుండా ప్రచారం చేసిన కథనాలే నిజాలుగా ఎలా చెలామణి అవుతున్నాయో ఈ పుస్తకం విస్తరిస్తుందని తెలిపారు. అటువంటి అనేక అసత్య కధనాలను ఆ తర్వాతి కాలంలో స్వయంగా భారతీయ విద్యావేత్తలతో పాటు సమాజంలోని మరికొన్ని వర్గాలు స్వీకరించడంతో అదంతా ఒక "మిషనరీ మాయాజాలం"గా రూపుదిద్దుకుందని అన్నారు. ఈ పుస్తకం అటువంటి లోతైన సమస్యలను స్పృశిస్తూ పాఠకులు ఈ అంశాలపై సమగ్రమైన పరిశోధన చేపట్టడానికి, సరైన ఆధారాలను పరిశీలించడానికి, తద్వారా చారిత్రక వక్రీకరణలను సరిదిద్దడానికి దోహదపడేలా ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు.
పుస్తక ప్రచురణ సంస్థ సంవిత్ ప్రకాశన్ డైరెక్టర్ పి. శైలజ మాట్లాడుతూ, భారతీయ దృష్టికోణం, సంప్రదాయం, నాగరికత, చరిత్ర, తత్వశాస్త్రంపై గ్రంథాలను ప్రచురించడంలో సంస్థ చేస్తున్న కృషిని వివరించారు. తమ ప్రచురణల ద్వారా ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో అనేక గ్రంథాలను ప్రచురించడం ద్వారా భారతీయ విజ్ఞాన, సంప్రదాయాలకు సంబంధించిన సాహిత్యాన్ని దేశవ్యాప్తంగా పాఠకులకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆమె తెలిపారు.
'మిషనరీ మాయాజాలం' పుస్తకం హిందూ ఈషాప్ వెబ్సైట్ నందు అందుబాటులో ఉంది. పాఠకులు ఈ క్రింది లింక్ ద్వారా పుస్తకాన్ని కొనుగోలు చేయవచ్చు.

