మన దేశ ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక విద్యతో మేళవించే కీలక విషయాన్ని సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీ చేపట్టింది. సెంట్రల్ సంస్కృత్ యూనివర్సిటీ (CSU) 2026-27 విద్యా సంవత్సరానికి గాను 'నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ ప్రీ-ఆయుర్వేద' (NEET-PA)ను ప్రవేశపెట్టింది. ఆయుర్వేద వైద్యులు కావాలనే తపన వున్న సంస్కృత విద్యార్థులకు ఈ కోర్సు ఎంతగానో ఉపయోగంగా వుంటుంది.
సంస్కృత బోర్డులతో సహా గుర్తింపు పొందిన బోర్డుల నుండి 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BAMS) డిగ్రీని అభ్యసించి, తద్వారా ఆయుర్వేద వైద్యులుగా మారడానికి అర్హులే అని యూనివర్సిటీ ప్రకటించింది.
ఈ కార్యక్రమానికి 'నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్' (NCISM) ఆమోదం తెలిపింది. అలాగే, ఇది 'జాతీయ విద్యా విధానం (NEP) 2020' యొక్క లక్ష్యాలకు అనుగుణంగా ఉంటూ, సంస్కృత విద్య, గురుకుల సంప్రదాయాలు మరియు భారతదేశపు గొప్ప ఆయుర్వేద వారసత్వాలను ఏకం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
నీట్-పీఏ (NEET-PA) ప్రవేశపెట్టడంతో, సంస్కృత బోర్డులతో సహా ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇప్పుడు బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BAMS) డిగ్రీని అభ్యసించడానికి అర్హులే.సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ప్రీ-ఆయుర్వేద గురుకులాలలో ప్రవేశం ద్వారా, విద్యార్థులు అర్హత కలిగిన ఆయుర్వేద వైద్యులుగా కెరీర్ ప్రారంభం చేయవచ్చు.
ఈ కార్యక్రమం సంస్కృత విద్య, గురుకుల సంప్రదాయం మరియు ఆయుర్వేదాన్ని ఒకే విద్యా చట్రం కింద ఏకీకృతం చేస్తుందని వీసీ ప్రొఫెసర్ శ్రీనివాస్ వర్ఖేడీ ప్రకటించారు. ఈ చొరవ భారతదేశపు గొప్ప జ్ఞాన వారసత్వాన్ని పరిరక్షించడమే కాకుండా, విద్యార్థులు తమ సాంప్రదాయ విద్యను అర్థవంతమైన వృత్తి జీవితంగా మలచుకోవడానికి కూడా సహాయపడుతుందని ఆయన అన్నారు.
ఈ సమగ్ర (ఇంటిగ్రేటెడ్) కోర్సు కాలవ్యవధి 7.5 ఏళ్లు ఉంటుంది.
2 ఏళ్ల 'ప్రీ-ఆయుర్వేద' (Pre-Ayurveda) అధ్యయనం4.5 ఏళ్ల BAMS విద్య,
అలాగే ఏడాది తప్పనిసరి ఇంటర్న్షిప్ చేయాల్సి వుంటుంది.
ఈ కోర్సు పూర్తయ్యాక, విద్యార్థులు ఆయుర్వేద వైద్యులుగా ప్రాక్టీస్ చేయడానికి అర్హత పొందుతారు.
NEET-PA కోసం నమోదు ప్రక్రియ 2026 జూలై మూడవ వారంలో ప్రారంభమవుతుందని అంచనా. సంస్కృత బోర్డులతో సహా గుర్తింపు పొందిన బోర్డుల నుండి 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి విషయానికొస్తే, 2026 డిసెంబర్ 31 నాటికి దరఖాస్తుదారుల వయస్సు కనీసం 15 ఏళ్లు ఉండి, 25 ఏళ్లకు మించకూడదు.
విశ్వవిద్యాలయం వెల్లడించిన పరీక్షా విధానం వివరాల ప్రకారం, ఈ ప్రవేశ పరీక్ష ఆఫ్లైన్ విధానంలో (OMR ఆధారితంగా) నిర్వహించబడుతుంది. ఇందులో 120 బహుళ-ఎంపిక ప్రశ్నలు ఉంటాయి మరియు వీటిని 150 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి నెగటివ్ మార్కింగ్ ఉండదు. పరీక్షా భాష సంస్కృతం, హిందీ లేదా ఆంగ్లం కావచ్చు.
source : organiser

