న్యూఢిల్లీ : మూడు దేశాల పర్యటనలో భాగంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ లండన్ కి చేరుకున్నారు. ఈ సందర్భంగా 100 కి పైగా బ్రిటీష్ హిందూ సామాజిక సంస్థలు ఆయనకు స్వాగతం పలికాయి. ఆర్ఎస్ఎస్ కార్య శతాబ్ది సందర్భంగా ఈ పర్యటన చేస్తున్నారు.
డాక్టర్ భగవత్ ఈ వారం తన బ్రిటన్ పర్యటనను ప్రారంభించిన తరుణంలో, ఈ అంశంపై బ్రిటిష్ పార్లమెంటులో కూడా చర్చ జరిగింది. ఈ పర్యటన దేశ వలస విధాన నిబంధనలకు లోబడి ఉందని UK భద్రతా మంత్రి డాన్ జార్విస్ పేర్కొన్నారు.
మరో వైపు "ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ. ఇది వ్యక్తిత్వ నిర్మాణం, స్వచ్ఛంద సేవ, నాయకత్వం, సామాజిక ఐక్యత మరియు ప్రపంచ సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహించడానికి అంకితమై ఉంది," అని హిందూ కౌన్సిల్ యూకే, హిందూ ఫోరమ్ ఆఫ్ బ్రిటన్, హిందూ స్వయంసేవక్ సంఘ్ యూకే మరియు ఇన్సైట్ యూకే వంటి సంస్థలు సంయుక్త ప్రకటనను జారీ చేశాయి.
’’ఆర్ఎస్ఎస్ తన విస్తృతమైన సామాజిక సేవకు, సమానత్వాన్ని ప్రోత్సహించడానికి, మారుమూల అటవీ ప్రాంతాలలో విద్యను అందించడానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో 'మొదట స్పందించే' సంస్థగా పేరుగాంచింది. "ఆర్ఎస్ఎస్ కార్య శతాబ్ది వేడుకలలో భాగంగా, మన అన్ని వర్గాలకు సంబంధించిన పంచ పరివర్తన్ ను ప్రోత్సహించడంలో డాక్టర్ మోహన్ భాగవత్ నాయకత్వంలో సంఘ్ తీసుకున్న ప్రయత్నాలను మేము స్వాగతిస్తున్నాం: సామాజిక సమరసత సమైక్యత; సమాజంలో ఒక యూనిట్‌గా కుటుంబం యొక్క ప్రాముఖ్యత; నిస్వార్థ సేవ; పర్యావరణ పరిరక్షణ; మరియు పౌర విధులను శ్రద్ధగా నిర్వర్తించడం," అని పేర్కొన్నారు.


