ఖిలాఫత్ ఉద్యమం: బెదిరింపులు.. మారణకాండ - Khilafat Movement: Threats .. Massacre

Vishwa Bhaarath
Khilafat Movement: Threats .. Massacre
Khilafat Movement: Threats .. Massacre

- డా. శ్రీరంగ గోడ్బోలే
ఖిలాఫత్ ఉద్యమం రెండవ దశ (ఆగస్ట్, 1920 – మార్చ్,1922) పూర్తిగా బెదిరింపులు, మారణకాండతో సాగింది. సహాయనిరాకరణ అందులోని బెదిరింపుల భాగం కాగా, దానికి అనుబంధంగా సాగిన హింస మరోభాగం.

ఖిలాఫత్, సహాయనిరాకరణ – అవిభక్త కవలలు
సహాయనిరాకరణోద్యమం తరువాత ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభమైందని లేదా రెండు ఒకేసారి ప్రారంభమయ్యాయని చాలామంది పొరబడతారు. అలాగే మొదటిది దేశ స్వాతంత్ర్య సాధన కోసం సాగిన ఉద్యమమని కూడా అనుకుంటారు. కానీ డా. అంబేద్కర్ ఈ అపోహలను ఇలా దూరం చేశారు – ‘’…ఖిలాఫత్ ఉద్యమం, సహాయనిరాకరణోద్యమం మధ్య సంబంధం ఏమిటన్నది చాలమందికి స్పష్టత లేదు. ఎందుకంటే స్వరాజ్య సాధన కోసం సహాయనిరాకరణోద్యమాన్ని కాంగ్రెస్ ప్రారంభించిందని వారనుకుంటారు. దానికి కారణం ఏమిటంటే వాళ్ళు 1920 సెప్టంబర్ 7,8 లలో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశాలకు, సహాయనిరాకరణోద్యమానికి సంబంధం ఉందని భావిస్తారు. అంతేకాని సెప్టెంబర్ కు ముందు ఏంజరిగిందన్నది ఎవరు పట్టించుకోరు, పరిశీలించరు. అలా చేస్తే తమ అభిప్రాయం తప్పని వారికి తెలుస్తుంది. సత్యమేమిటంటే సహాయనిరాకరణోద్యమపు మూలాలు ఖిలాఫత్ ఆందోళనలో ఉన్నాయి. అంతేకానీ కాంగ్రెస్ స్వరాజ్య ఉద్యమంలో లేవు. టర్కీకి సహాయం అందించడం కోసం ఖిలాఫత్ వాదులు ఈ సహాయనిరాకరణ నినాదాన్ని అందుకున్నారు. ఆ ఖిలాఫత్ వాదులకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. ఖిలాఫత్ వాదుల ప్రాధమిక లక్ష్యం స్వరాజ్ కానేకాదు. వారి ప్రధాన లక్ష్యం ఖిలాఫత్ సాధన. హిందువులను తమ ఉద్యమంలో చేర్చుకునేందుకు స్వరాజ్ ను రెండవ అంశంగా తరువాత చేర్చారు. ఈ విషయం క్రింది అంశాలను పరిశీలిస్తే తెలుస్తుంది –
    “ఖిలాఫత్ దినంగా పరిగణించిన 1919 అక్టోబర్ 27న ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభమైందని చెపుతున్నారు. 1919 నవంబర్ 23న మొదటి ఖిలాఫత్ సమావేశం ఢిల్లీలో జరిగింది. ఖిలాఫత్ విషయంలో తాము చేసిన తప్పిదాన్ని తెలుసుకుని బ్రిటిష్ వాళ్ళు దానిని సరిచేసుకునే విధంగా చేయడానికి సహాయనిరాకరణ మంచి మార్గమని ముస్లింలు ఆ సమావేశంలోనే అనుకున్నారు. అలాగే 1920 మార్చ్ 10న కలకత్తాలో జరిగిన ఖిలాఫత్ సమావేశంలో తమ లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు సహాయనిరాకరణే మంచి ఆయుధమని నిర్ణయించారు..1920 ఆగస్ట్ 1న సహాయనిరాకరణ ప్రారంభమయింది.’’
    “దీనినిబట్టి ఖిలాఫత్ సమావేశం అప్పటికే నిర్ణయించిన ఉద్యమాన్ని ఆ ముస్లింల కోసం కాంగ్రెస్ కలకత్తా ప్రత్యేక సమావేశాల్లో తలకెత్తుకుందేతప్ప స్వరాజ్ కోసం కాదని తెలుస్తోంది. అందుకు తగినట్లుగా ఆ సమావేశాల్లో కాంగ్రెస్ తీర్మానం కూడా ఆమోదించింది.’’ (Pakistan or the Partition of India, B. R. Ambedkar, Thacker and Company Limited, 1945, PP. 137-139).

ఖిలాఫత్ వాదుల సహాయనిరాకరణ వ్యూహం
కలకత్తాలో 1920 ఫిబ్రవరి 28,29లలో జరిగిన ఖిలాఫత్ సమావేశాలకు మౌలానా ఆజాద్ అధ్యక్షత వహించారు. ఏ ముస్లిమేతర `ఇస్లాం శత్రువులతో’ (ఈ శత్రు వర్గంలో హిందువులను చేర్చకుండా జాగ్రత్తపడ్డారు) మవాల(సహకారం) పాపమని షరియత్ స్పష్టం చేసిందని ఆయన అన్నారు. సహాయనిరాకరణ ఇస్లాంలో తర్క్ ఇ – మవాలత్(సామాజిక బహిష్కరణ)అని నిర్వచించిన ఆయన, ముస్లింలకు మిగిలిన ఏకైక పరిష్కార మార్గమని ఆయన అన్నారు. (The Khilafat Movement in India, 1919-1924, Muhammad Naeem Qureshi, dissertation submitted to University of London, 1973, PP. 88).
    టర్కీ స్వాతంత్ర్యంతో సంబంధం లేకుండా టర్కీ సామ్రాజ్యాన్ని రద్దుచేసే శాంతి ఒప్పందం 1920 మే, 11న ప్రకటించారు. కాంగ్రెస్ లోని హిందూ నాయకుల మద్దతు కూడగట్టేందుకు ఖిలాఫత్ వాదులు గాంధీ గారిని సంప్రదించి 1920 జూన్ మొదటివారంలో అలహాబాద్ లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు (డా. అంబేద్కర్ పేర్కొన్న సమావేశం ఇదే). ఆ సమావేశంలోనే సహాయనిరాకరణోద్యమ రూపురేఖలను నిర్ధారించారు. అవి –
  1. ప్రభుత్వ బిరుదులు, గౌరవ పదవులను తిరస్కరించడం
  2. ప్రభుత్వ సివిల్ సర్వీస్ లలో ఉద్యోగాలకు రాజీనామా చేయడం.
  3. పోలీసు, సైనిక దళాల నుండి వైదొలగడం
  4. పన్నులు కట్టడానికి నిరాకరించడం.
ఆందోళన తీవ్రతరం చేయడం
ఖిలాఫత్ కోసమే 1919 డిసెంబర్ లో ప్రభుత్వం తలపెట్టిన శాంతి ఉత్సవాలను బహిష్కరించాలని గాంధీజీ అభిప్రాయపడ్డారు. ఆ బహిష్కరణ కారణాల్లో పంజాబ్ విషయాన్ని (జలియన్ వాలాబాగ్ మారణకాండ, సైనిక చట్టాన్ని)చేర్చడానికి ఆయన సుముఖంగా లేరు. ఖిలాఫత్ సమావేశంలో(1919 నవంబర్, 24) హిందువులు, ముస్లింలను ఉద్దేశించి మాట్లాడుతూ “పంజాబ్ వంటి స్థానిక విషయాన్ని తీసుకుని మొత్తం సామ్రాజ్యానికి సంబంధించిన శాంతి ఉత్సవాలను బహిష్కరించలేము. కాబట్టి ఖిలాఫత్ ఒక్కటే అటువంటి బహిష్కరణకు తగిన కారణం’’ అని అన్నారు. కానీ సర్వత్ర ఆగ్రహాన్ని, నిరసనను కలిగించిన పంజాబ్ విషయాన్ని మాత్రం ఖిలాఫత్ వాదులు ఉపయోగించుకున్నారు. గాంధీగారు కూడా హిందువులను సహాయనిరాకరణ ఉద్యమం వైపు ఆకర్షించడానికి పంజాబ్ సంఘటనను ఉపయోగించడం మొదలుపెట్టారు. (The Khilafat Movement in India, 1919-1924, Muhammad Naeem Qureshi, dissertation submitted to University of London, 1973, PP. 112,113). ఇలా సంప్రదాయ, రాజ్యాంగ విధానాల నుంచి దూరమైన కాంగ్రెస్ 1920 సెప్టెంబర్ 4-9 కలకత్తాలో ప్రత్యేక సమావేశాలను నిర్వహించింది. (The History of the Indian National Congress, PattabhiSitaramayya, CWC, Madras, 1935, P. 336).

సహాయనిరాకరణను వ్యతిరేకించిన హిందూ నాయకులు
అనేకమంది హిందూ నాయకులు సహాయనిరాకరణోద్యమాన్ని వ్యతిరేకించడం ఖిలాఫత్ వాదులకు ఆందోళన కలిగించింది. నిజమైన భారత జాతిని రూపొందించడానికి హిందువులతో విభేదాలను పక్కనపెట్టి వారితో కలిసి పనిచేయాలని ముస్లింలకు ఎప్పుడూ లేదు.(History of the Freedom Movement in India, R.C. Majumdar, Vol.3, p. 64). ఖిలాఫత్ నిధులతో ఖిలాఫత్ వాదిలా దేశం మొత్తం పర్యటిస్తున్న గాంధీగారి దగ్గర హిందూ నాయకులు తమ అభిప్రాయాలను కుండబద్దలుకొట్టినట్లు చెప్పారు.
     ఇది ఏమాత్రం ఆచరణ యోగ్యమైన ఆలోచన కాదని మితవాదులు మండిపడ్డారు. హోమ్ రూల్ ఉద్యమ స్థాపకురాలు అనిబిసెంట్ (1933) ఇది `జాతీయ ఆత్మహత్య’ అంటూ అభివర్ణించారు. సహాయనిరాకరణ `ఆలోచనలేని’, `దేశానికి ఎంతో నష్టం తెచ్చే’ ఉద్యమమని పి.ఎస్. శ్రీనివాస అయ్యర్ (1864-1946; మద్రాస్ ప్రెసిడెన్సీ అడ్వకేట్ జనరల్) అన్నారు. వి ఎస్ శ్రీనివాస శాస్త్రి (1869 – 1946) అయితే ఈ ఉద్యమం హింసాత్మకంగా మారుతుందని 1920 ఏప్రిల్ లోనే చెప్పారు. ఇది అసంబద్ధమైన, హానికమైన ఉద్యమమని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమపు మూడు, నాలుగు దశలు `పూర్తిగా చట్టవిరుద్ధం, రాజ్యాంగవిరుద్ధం’ అని శ్రీనివాస అయ్యంగార్ (1874-1941; మద్రాస్ ప్రెసిడెన్సీ అడ్వకేట్ జనరల్) అన్నారు. ఇదే అభిప్రాయాన్ని మదన్ మోహన్ మాలవ్యా కూడా వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని నిరాకరిస్తూ సురేంద్రనాధ్ బెనర్జీ (1848-1925) ఒక బహిరంగ ప్రకటనను విడుదల చేశారు. (Qureshi, The Khilafat Movement in India, 1919-1924, p. 154-155).
    ఇక `అతివాదులు’ ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశారు. బాలగంగాధర తిలక్ మనస్సులో ఖిలాఫత్ ఉద్యమం పట్ల ఎలాంటి సానుకూల అభిప్రాయం లేదని చాలామంది అనుకుంటారు. కానీ ఆయన స్థాపించిన ప్రజాస్వామ్య స్వరాజ్య పార్టీ ఎన్నికల ప్రణాళికలో (1920) ఇలా ఉంది – “తమ విశ్వాసాలు, ఖురాన్ సూత్రాల ప్రకారం ఖిలాఫత్ సాధనకు ముస్లింలు అనుసరించే ఏ మార్గన్నైనా ఈ పార్టీ సమర్ధిస్తుంది.’’ (The History of the Indian National Congress, PattabhiSitaramayya, CWC, Madras, 1935, P. 154-156).

స్వరాజ్ కంటే ఖిలాఫత్ ఎక్కువ
హిదువులకు తమ బలాన్ని తెలియచెప్పడం కోసం ఖిలాఫత్ వాదులు కాంగ్రెస్ కంటే ముందే తమ సమావేశాన్ని (1919 సెప్టంబర్, 5) నిర్వహించారు. చివరికి షౌకత్ అలీ, ఇతర ఖిలాఫత్ వాదుల ఒత్తిడి మేరకు సహాయనిరాకరణ నిర్ణయాన్ని ఒప్పుకోవాలని ముస్లింలు నిర్ణయించారు. కానీ వాళ్ళని జిన్నా మాత్రం హెచ్చరించారు.
   “కాంగ్రెస్ ను తన చెప్పుచేతల్లో ఉంచుకోవడమే గాంధీ గారి ప్రధాన లక్ష్యం…అందుకోసం ఆయన గట్టి ప్రయత్నమే చేశారు. బొంబాయి, మద్రాస్ ల నుంచి వచ్చిన ఖిలాఫత్ వాదులు ఈ విషయమై ఓటింగ్ జరిగితే గాంధీని సమర్ధిస్తామని హామీ ఇచ్చారు. చెప్పిన విధంగానే ఖిలాఫత్ వాదులు తమవారిని సమావేశాల్లో నింపి, మెజారిటీ సాధించారని జాతీయవాదులు ఆరోపించారు…’’(Speeches and Writings of M.K. Gandhi, introduction by C.F. Andrews, Madras, 1922, pp. 46- 48). సబ్జక్ట్ కమిటీ మూడురోజులపాటు సహాయనిరాకరణ అంశాన్ని చర్చించింది. చివరికి 144 ఓట్లు అనుకూల, 132 వ్యతిరేక ఓట్లతో నిరాకరణ ఉద్యమ నిర్ణయం తీసుకుంది. ముస్లిం ఆధిక్యత మూలంగా సహాయనిరాకరణకు అనుకూలంగా నిర్ణయం వచ్చింది. (Qureshi , The Khilafat Movement in India, 1919-1924, p. 158).
     సహాయనిరాకరణ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ గాంధీ గారు ‘’తమ మతపు గౌరవప్రతిష్టలను నిలుపుకోకుండా ప్రవక్త అనుయాయులుగా భారతీయ ముస్లిములు తలెత్తుకు తిరగలేరు. (ప్రభుత్వం) పంజాబ్ పట్ల చాలా క్రూరంగా, అమానుషంగా వ్యవహరించారు. ఈ రెండు తప్పులను సరిచేయడానికే నేను ఈ దేశ ప్రజల ముందు సహాయనిరాకరణ ఆలోచనను ఉంచుతున్నాను’’అని అన్నారు. అప్పటివరకూ లేని పంజాబ్ (జలియన్ వాలాబాగ్ దురంతం)ను ఆఖరి నిముషంలో చేర్చారు. ఎందుకంటే రౌలత్ చట్ట అమలు, జలియన్ వాలాబాగ్ మారణకాండ తరువాత 1919 డిసెంబర్ అమృత్ సర్ లో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో కూడా గాంధీజీ సహాయనిరాకరణకు ఒప్పుకోలేదు. అలాగే ప్రభుత్వం తలపెట్టిన శాంతి ఉత్సవాలను బహిష్కరించడానికి కూడా అంగీకరించలేదు. కానీ ఆ తరువాత ఏడాది కూడా గడవకుండానే సహాయనిరాకరణకై గట్టిగా పట్టుబట్టడమేకాక పంజాబ్ విషయాన్ని కూడా ప్రస్తావించారు. (Majumdar, History of the Freedom Movement in India, Vol. 3, P. 89).
     సహాయనిరాకరణ తీర్మానాన్ని గెలిపించేందుకు ఏకంగా కలకత్తా నుంచి టాక్సీ డ్రైవర్ లను తరలించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. సమావేశాలకు 5వేలమంది ప్రతినిధులు హాజరయ్యారు. వారిలో సగం మంది కూడా ఓటింగ్ లో పాల్గొనలేదు. తీర్మానానికి అనుకూలంగా 1,826 ఓట్లు, వ్యతిరేకంగా 804ఓట్లు పడ్డాయి. (The Khilafat Movement in India 1919 – 1924, A.C. Niemeijer, MartinusNijhoff, 1972, P. 109).
   ఏప్రిల్, 1920లో ఖిలాఫత్ వాదులు తయారుచేసిన (దీనిని కూడా గాంధీ గారే రూపొందించారు) తీర్మానం, సెప్టెంబర్ లో కాంగ్రెస్ ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానం పోల్చి చూస్తే ఖిలాఫత్ వాదులు కాంగ్రెస్ కంటే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
   ఏడాది తరువాత సహాయనిరాకరణోద్యమం విఫలమై ముస్లింల కోరికలు నెరవేరనప్పుడు గాంధీ గారు ఇలా వ్రాసారు – “తమ అసహనం, ఆతృత అణచుకోలేని ముస్లింలు కాంగ్రెస్, ఖిలాఫత్ సంస్థలు మరింత వేగంగా, దృఢంగా వ్యవహరించాలని కోరుకున్నారు…స్వరాజ్ సాధన కోసం వేచి చూడటానికి వాళ్ళు అంగీకరించలేదు..ఖిలాఫత్ సాధన కోసం అవసరమైతే స్వరాజ్య సాధన కార్యకలాపాలను వాయిదా వేయాలని నేను కోరతాను.’’(Majumdar, History of the Freedom Movement in India, Vol. 3, P.96).

బయటపడ్డ ఇస్లాంవాదుల ఆలోచనలు
ప్రచారం బాగా సాగించడం కోసం కేంద్ర ఖిలాఫత్ కమిటీ (CKC) శిక్షణ ఇచ్చి కొందరు ఉపన్యాసకులను, రహస్య కార్యకర్తలను నియమించింది. ప్రధాన పట్టణాలలో ముస్లిం కార్యకర్తలు కవాతు నిర్వహించేవారు. ఖాకీ దుస్తులు వేసుకుని చేతిలో కత్తులు, బల్లాలు పట్టుకుని ఖిలాఫత్ కార్యకర్తలు రాజకీయ సభలు నిర్వహించేవారు. హింసను ప్రోత్సహించే సహాయనిరాకరణను వాళ్ళు ప్రచారం చేసేవారు. `ఇస్లాం ప్రమాదంలో పడింది’, `క్రైస్తవ శక్తుల కుట్రలు’ అనే నినాదాలతో కూడిన కరపత్రాలు, పద్యాలు, కవితలు మొదలైనవి ప్రజలలో ఉద్రిక్తభావాలను రెచ్చగొట్టేవి. నేరుగా విరాళాలు అడగడంతోపాటు ఖిలాఫత్ కమిటీ రూపాయి నోటు మాదిరిగానే ఉన్న ఒక రూపాయి విరాళపు రసీదులను, ఉర్దూలో ఉన్న ఖురాన్ సూక్తులతో విడుదల చేసింది.
    పెరుగుతున్న సెక్యులరిజానికి వ్యతిరేకంగా సహాయనిరాకరణను ఉపయోగించాలని ఉలేమాలు భావించారు. అదెలాగంటే శాసన సంస్థల స్థానంలో ఉలమా కమిటీలు ఏర్పాటుచేయాలి. `అవిశ్వాసుల’ న్యాయస్థానాలకు బదులు షరియా కోర్ట్ లు, ప్రభుత్వ పాఠశాలల స్థానంలో దార్ – ఉల్ – ఉలుమ్ లు రావాలన్నది వారి ఆలోచన. సహాయనిరాకరణ తీర్మానానికి మద్దతు తెలుపుతూ జమియత్ – ఉల్ – ఉలమా – ఈ –హింద్ ఏకంగా ఒక సామూహిక ముత్తఫిక(ఫత్వా) జారీచేసింది. అందులో తీర్మానంలోని ప్రతి అంశానికి ఖురాన్, ప్రవక్త సందేశాల సమర్ధన ఎలా ఉందో పేర్కొంది. (Qureshi , The Khilafat Movement in India, 1919-1924, p. 160-177). (The Khilafat Movement; Religious Symbolism and Political Mobilization in India, Gail Minault, Oxford University Press, 1982, P. 146). సహాయనిరాకరణను వ్యతిరేకించేవారిని మతపరమైన ట్రిబ్యూనల్ ల ద్వారా శిక్షించాలని 1921 మార్చ్ లో జమియత్ – ఉల్ – ఉలామా తీర్మానించింది. (Qureshi , The Khilafat Movement in India, 1919-1924, p. 191).
   ఖిలాఫత్ వాదులు కాంగ్రెస్ కు ఉన్న అపారమైన నిధులు, బలమైన వ్యవస్థతోపాటు కోటి ఐదు లక్షల తిలక్ స్వరాజ్య ఫండ్ ను కూడా చేజిక్కించుకున్నారు. (Qureshi , The Khilafat Movement in India, 1919-1924, p. 178; The Khilafat Movement; Religious Symbolism and Political Mobilization in India, Gail Minault, Oxford University Press, 1982, P. 126, 132). ఖిలాఫత్ నిదుల లెక్కలు తేల్చాలని 1920 మార్చ్ నుంచే పలువురు డిమాండ్ చేసిన 1920 జులై వరకు ఎలాంటి లెక్కలు చూపించలేదు. ఖిలాఫత్ ప్రతినిధులు యూరోప్ లో చేసిన భారీ ఖర్చులు, అనుభవించిన విలాసాలు చూసి అనేకమంది ఆశ్చర్యపోయారు. (The Khilafat Movement; Religious Symbolism and Political Mobilization in India, Gail Minault, Oxford University Press, 1982, P. 137)

అమీర్ కు ఆహ్వానం
1921 వేసవినాటికి ఖిలాఫత్ వాదుల ఉపన్యాసాల్లో కూడా వేడి పెరిగింది. అవి హింసను ప్రేరేపించేవిధంగా మారాయి. సైన్యంలో పనిచేయడం హరామ్ (పాపం) అనే ముత్తఫిక్ ఫత్వా కాపీలు 1921 ఫిబ్రవరి నుంచి మే వరకు రహస్యంగా పంచారు. ప్రభుత్వం నిషేధించిన ఈ ఫత్వాను కరపత్రాల రూపంలో భారత సైనికులకు పంచారు. సైనికులకు లంచం ఇవ్వడం కోసం భారీ మొత్తంలో ఖిలాఫత్ నిధులను వినియోగించారు. (Qureshi , The Khilafat Movement in India, 1919-1924, p. 205)
    భారత్ పై దాడి చేయమని ఆఫ్ఘనిస్తాన్ అమీర్ ను ఆహ్వానించాలనే కుట్ర 1920-21లో జరిగింది. అమీర్ తమ ఆహ్వానాన్ని మన్నించి భారత్ పై దాడి చేస్తే భారతీయ ముస్లింలు ఎలా తమ `కర్తవ్యాన్ని’ నిర్వర్తించాలో 1921 ఏప్రిల్ 18నాటి తన ఉపన్యాసంలో మహమ్మద్ అలీ వివరించాడు. “భారత్ ను ఆక్రమించుకునేందుకు అమీర్ దండెత్తితే భారతీయ ముస్లింలు అతన్ని ఎదిరించాలి. అలా కాకుండా ఇస్లాంను, ఖలీఫత్ ను అణచివేయడానికి చూస్తున్న శక్తులను ఓడించాలనే ఉద్దేశ్యంతో వస్తే అప్పుడు భారతీయ ముస్లింలు ఇస్లాం కోసం ఆఫ్ఘన్ ల వైపు పోరాడాలి’’అని ఆలీ అన్నాడు. ముస్లిం నాయకుల ఈ మాటలు హిందువులను బాగా ఇబ్బంది పెట్టాయి. యంగ్ ఇండియా లో గాంధీజీ ఇలా వ్రాసారు – “బ్రిటిష్ ప్రభుత్వంపై యుద్ధానికి వస్తే నేను కూడా తప్పకుండా ఆఫ్ఘనిస్తాన్ అమీర్ కు సహకరిస్తాను. ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిన ఈ ప్రభుత్వానికి సహకరించడం నేరమవుతుందని నేను నా ప్రజలకు బాహాటంగా చెపుతున్నాను’’ (The Khilafat Movement in India 1919 – 1924, A.C. Niemeijer, MartinusNijhoff, 1972, P. 129, 130).
    వైస్రాయ్ కు వ్రాసిన ఒక లేఖలో అప్పటి యూపీ గవర్నర్ బట్లర్ ఇలా పేర్కొన్నాడు – “ముస్లిములలోని రౌడీలు హత్యలు, హింసకు పాల్పడటానికి సిద్ధమవుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు’’.  అనేక చోట్ల, ముఖ్యంగా యూపీ లో, పోలీసులు, మూకల మధ్య ఘర్షణలు జరిగాయి. పోలీస్ స్టేషన్ లు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు జరిగాయి. (Qureshi , The Khilafat Movement in India, 1919-1924, p. 221)

చౌరీచౌర దాడి
1922 ఫిబ్రవరి 4న 3 నుంచి 5వేలమంది ప్రదర్శనకారులు యూపీ  గోరఖ్ పూర్ జిల్లాలోని చౌరీచౌరా థానా (పోలీస్ స్టేషన్)ను ముట్టడించారు. వాళ్ళు పోలీసులపై రాళ్ళు రువ్వడం ప్రారంభించారు. దానితో పోలీసులు మొదట గాలిలోకి, ఆ తరువాత నేరుగా ప్రదర్శనకారులపైకి కాల్పులు జరిపారు. పోలీసుల దగ్గర తుపాకి గుళ్ళు అయిపోయాయని గ్రహించిన మూకలు నేరుగా వారిపై దాడికి దిగాయి. దానితో పోలీసులు కొందరు పక్కనే ఉన్న పొలాల్లోకి పారిపోతే, కొందరు పోలీస్ స్టేషన్ లోకి వెళ్లారు. అప్పుడు ప్రదర్శనకారులు పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టారు. ఆ ప్రమాదంలో 21మంది పోలీసులు చనిపోయారు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ చిన్న కొడుకు కూడా చనిపోయినవారిలో ఉన్నాడు. ప్రదర్శన కారులు రాళ్ళు, కర్రలతో కొట్టడంతో చాలామంది పోలీసులు చనిపోయారు. కొందరి శరీరాలపై ఈటెలతో పొడిచిన గాయాలు కూడా ఉన్నాయి. ఈ హింసాత్మక సంఘటనల పట్ల బహిరంగంగా విచారం వ్యక్తం చేసిన గాంధీజీ ఉద్యమాన్ని వెంటనే ఆపివేస్తున్నట్లు ప్రకటించారు. (Qureshi , The Khilafat Movement in India, 1919-1924, p. 223)
    చరిత్రను మసిపూసి మార్చే ప్రయత్నంలో చౌరీచౌరా సంఘటన రైతుల తిరుగుబాటు అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు (Event, Metaphor, Memory : Chauri Chaura, 1922-1992, Shahid Amin, Oxford University Press, 1995). చౌరీచౌరా దాడికి పాల్పడిన వారి మతపరమైన లక్ష్యాలు, ఉద్దేశ్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం అది. కానీ దాచినా దాగని నిజాలు అమీన్ పుస్తకంలోనే చాలాచోట్ల బయటపడిపోయాయి.
    1921-22 శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్, ఖిలాఫత్ స్వచ్ఛంద కార్యకర్తల సంస్థలను జాతీయ స్వచ్ఛంద సేన పేర ఒకటిగా కలిపారు. 1921 మధ్య నాటికి చౌరీచౌరా పోలీస్ స్టేషన్ కు మైలు దూరంలో ఉన్న చొట్కిదుమ్రీ అనే గ్రామంలో ఈ సంస్థ గ్రామీణ (మండల)కార్యలయం ఏర్పాటయింది. ఈ కార్యాలయాన్ని ప్రారంభించడానికి చౌరాకు చెందిన లాల్ మహమ్మద్ సైన్ అనే వ్యక్తి గోరఖ్ పూర్ కాంగ్రెస్, ఖిలాఫత్ కమిటీల అధికారులు కొందరిని ఆహ్వానించాడు. ప్రముఖ ఖిలాఫత్ ఉద్యమకారుడైన మౌల్వీ సుబానుల్లా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా ఉండేవాడు. ఈ దుమ్రీ కార్యాలయాన్ని గోరఖ్ పూర్ ఖిలాఫత్ కమిటీ ఉపాధ్యక్షుడు హకీం ఆరిఫ్ అధికారికంగా ప్రారంభించాడు. (Event, Metaphor, Memory : Chauri Chaura, 1922-1992, Shahid Amin, Oxford University Press, 1995, P. 14-16)
      అక్కడ కొందరు `అధికారులను’నియమించి, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఆరిఫ్ సాయంత్రానికి తిరిగి జిల్లా కార్యాలయానికి వచ్చేశాడు. 1922 ఫిబ్రవరి, 4న దుమ్రీలో కార్యకర్తలు సమావేశం కావాలని సూచించారు. దాడి జరిగిన రోజు ఉదయం దుమ్రీలో జరిగిన సమావేశంలో `పచ్చని కళ్ళద్దాలు’ ధరించిన ఒక వ్యక్తి `వేషధారణను బట్టి ముస్లిం’ ఒక పత్రాన్ని చదివాడు. ఆ తరువాత మహమ్మద్, షౌకత్ అలీల మాదిరిగా జైలుకు వెళ్లడానికి కూడా వెనుకాడవద్దంటూ ఒక పాట పాడాడు. ఆ పాట తరువాత ఆ వ్యక్తి అక్కడ కనిపించలేదు. ఆ తరువాత అక్కడ పోగైన గుంపు పోలీస్ స్టేషన్ వైపు కదిలారు. వాళ్ళు థానేదార్ గుప్తెశ్వర్ సింగ్ ను నిలదీశారు. (Event, Metaphor, Memory : Chauri Chaura, 1922-1992, Shahid Amin, Oxford University Press, 1995, P. 14-16, 171)
     ఒక కధనం ప్రకారం పోలీస్ స్టేషన్ దాడిలో మాదంపూర్ కు చెందినవారు పాల్గొన్నారు. చౌరీచౌరాకు 20 మైళ్ళ దూరంలో ఉన్న ఈ గ్రామంలో అంతా పఠాన్ వ్యాపారులే. రైలుపట్టాల చుట్టూ ఉండే రాళ్ళనే పోలీసులపైకి విసిరారాణి మాదంపూర్ కు చెందిన బళ్ళవాళ్లు చెప్పారు. వీళ్ళే పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టడానికి అవసరమైన కిరోసిన్ ను నిరసనకారులకు అందించారు. గొడవ ప్రారంభం కాగానే వీళ్ళు అక్కడ నుంచి చల్లగా జారుకున్నారు. (Event, Metaphor, Memory : Chauri Chaura, 1922-1992, Shahid Amin, Oxford University Press, 1995, P. 34, 132)
      పోలీస్ స్టేషన్ పొగతో నిండిపోవడంలో పోలీసులందరు బయటకు వచ్చారు. అప్పుడు అక్కడే ఉన్న మాదంపూర్ కు చెందిన నాజర్ ఆలీ, షికారి వంటి నాలుగురైదుగురు పఠాన్ లు ` ఒక్కడు కూడా పారిపోకుండా జాగ్రత్తగా చూడండి.’ అంటూ తమ అనుచరులను హెచ్చరించారు. (Event, Metaphor, Memory : Chauri Chaura, 1922-1992, Shahid Amin, Oxford University Press, 1995, P. 231)
     ఆ కాలంలో బెదిరింపులు, మారణకాండకు సంబంధించిన రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. పెద్ద ఎత్తున ముస్లిములు ఆఫ్ఘనిస్తాన్ కు తరలిపోవడం, మోప్లా మారణకాండ. వీటి గురించి వివరంగా పరిశీలించాలి.

(రచయిత ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధ – ఇస్లాం సంబంధాలు, శుద్ధి ఉద్యమం, మతపరమైన జనాభా మొదలైన అనేక అంశాలపై పుస్తకాలు వ్రాసారు)

మూలము: విశ్వ సంవాద కేంద్రము

{full_page}

Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top