6 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు సంఘటనలు - 6 August 1947: Incident's 15 days before partition

Vishwa Bhaarath
6 ఆగస్ట్ 1947:  దేశ విభజనకు 15 రోజుల ముందు సంఘటనలు - 6 August 1947: Incident's 15 days before partition
దేశ విభజన

— ప్రశాంత్ పోల్
బుధవారం.. 6 ఆగస్ట్, 1947: అలవాటు ప్రకారం గాంధీజీ తెల్లవారకుండానే నిద్ర లేచారు. బయట ఇంకా చీకటిగా ఉంది. వాఘా శరణార్ధి శిబిరాలకు దగ్గరగానే గాంధీజీ వసతి కూడా ఉంది. అది పెద్ద పట్టణమేమికాదు. చిన్న గ్రామం. కానీ ఆంగ్లేయులు అక్కడ తమ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందుకనే వాఘా గ్రామానికి గుర్తింపు వచ్చింది. ఈ వాఘాలోని శరణార్ధి శిబిరాలకు పక్కనే ఉన్న బంగాళాలో గాంధీజీ నివాసం. అందువల్ల ఆ శిబిరం నుంచి వచ్చే దుర్గంధం అక్కడ కూడా వ్యాపించింది. ఆ దుర్గంధపూరిత వాతావరణంలోనే ఆయన ప్రార్ధనా సమావేశం ముగిసింది. ఈరోజు గాంధీజీ లాహోర్ వెళ్లాల్సిఉంది. దాదాపు 150 మైళ్ళ దూరం. ఏడు, ఎనిమిది గంటలైనా పడుతుంది. అందుకనే వాఘా నుంచి త్వరగా బయలుదేరాలనుకున్నారు. ఆ ప్రకారమే తెల్లవారగానే అక్కడ నుంచి బయలుదేరి రావల్పిండి మార్గంలో లాహోర్ కు ప్రయాణమయ్యారు.

లాహోర్ …..
రావి నది ఒడ్డున ఉన్న ఈ నగరం సిఖ్ చరిత్రలో చాలా ముఖ్యమైనది. ప్రాచీనకాలంలో దీనిని `లవపూర్’ లేదా `లవపురి’ అని పిలిచేవారు. ఈ నగరంలో 40 శాతం హిందూ, సిఖ్ జనాభాయే. మార్చ్ నెలలో ముస్లిం లీగ్ పాల్పడిన అల్లర్ల తరువాత పెద్ద సంఖ్యలో హిందువులు, సిక్కులు ఇళ్ళువాకిళ్ళు వదిలిపెట్టి వెళిపోవడం ప్రారంభించారు.
  లాహోర్ ఆర్యసమాజ్ కు కూడా కేంద్రం. ప్రముఖ ఆర్యసమాజీలు లాహోర్ నుండి వచ్చినవారే. వీరు సంస్కృత భాషను ఎంతో వ్యాప్తి చేశారు. లాహోర్ లో ఎన్నో సంస్కృత పాఠశాలలు ఉన్నాయి. సంస్కృత భాషా పండితుడు, భారతీయ విద్యల గురించి పుస్తకాల ద్వారా ప్రచారం చేసిన మోతీలాల్ బనార్సీదాస్ లాహోర్ వారే. కానీ ఇప్పుడు ముస్లిం లీగ్ సాగిస్తున్న దురాగతాల కారణంగా భారత్ వెళ్లిపోవాలని ఆయన నిర్ణయించుకున్నారు.
  లాహోర్ నగర్ పాకిస్థాన్ లో భాగమవుతుందని స్పష్టంగా తెలిసిపోయింది. రాజ రంజిత్ సింగ్ రాజధాని, ఆయన సమాధి ఉన్న ఈ నగరాన్ని శాశ్వతంగా విడిచిపెట్టాలంటే సిక్కులకు చాలా కష్టంగా ఉంది. శీతల దేవి మందిరం, భైరవ మందిరం, శ్రీకృష్ణ మందిరం, శ్వేతాంబర్, దిగంబర్ పంథ్ ల జైన్ మందిరం, ఆర్యసమాజ్ మందిర్ మొదలైన ప్రసిద్ధ మందిరాల సంగతేమిటి? అని ప్రతి హిందువు, సిక్కు ఆవేదన చెందుతున్నాడు. ప్రభు శ్రీ రామచంద్రుని కుమారుడైన లవుడు ఈ నగరాన్ని నిర్మించాడు. ఆ లవుని మందిరం కోట లోపల ఉంది. ఇక ఈ మందిరం, తమ భవిష్యత్తు ఏమవుతుందని మందిర పూజారి చింతిస్తున్నారు.
 అలాంటి చారిత్రాత్మక లాహోర్ నగరంలో గాంధీజీ కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం అవుతారు. కాంగ్రెస్ కార్యకర్తలంటే హిందువులు, సిక్కులే. ఎందుకంటే లాహోర్ లోని కాంగ్రెస్ లో ఒక్క ముస్లిం కూడా మిగలలేదు. అంతా ముస్లిం లీగ్ లో చేరిపోయారు. పాకిస్థాన్ ఏర్పడటం ఖాయమైపోయిన తరువాత ఈ కాంగ్రెస్ బరువును ఊరికే మోయడం ఎందుకని ముస్లిములంతా లీగ్ పంచన చేరిపోయారు. అందుకని కాంగ్రెస్ లో మిగిలిన హిందువు, సిక్క్ కార్యకర్తలు గాంధీజీతో సమావేశం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

గాంధీజీ లాహోర్ కు బయలుదేరిన సమయంలోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ శ్రీ గురూజీ కూడా సింద్ ప్రాంతంలోని రెండవ పెద్ద నగరమైన హైదారాబాద్ కు ప్రయాణమయ్యారు. గాంధీజీ లాగానే ఆయన కూడా తెల్లవారుఝామున 4 గం.లకే నిద్ర లేచారు. అది ఆయనకు అలవాటు. ఆరుగంటలకు శాఖలో ప్రార్ధన చేశారు. తరువాత చిన్న బైఠక్ తీసుకున్నారు. సింధ్ ప్రాంతపు ప్రముఖులు, సంఘచాలక్, కార్యకర్తలు, ప్రచారకులు ఆ బైఠక్ లో ఉన్నారు. వీళ్ళంతా గురూజీ నిన్న పాల్గొన్న కార్యక్రమంలో కూడా ఉన్నారు. ఈ బైఠక్ లో పాకిస్థాన్ లోని హిందువులు, సిక్కులను సురక్షితంగా భారత్ చేర్చడం ఎలాగ అని ఆలోచించారు.
  కార్యకర్తల చెపుతున్న వేదనాభరిత సంఘటనలను ఆయన వింటున్నారు. వాళ్ళ సమస్యలను అర్ధం చేసుకుంటున్నారు. గురూజీ పక్కనే కూర్చున్నా డా. ఆబాజీ థత్తే కార్యకర్తలు చెపుతున్న విషయాలను శ్రద్ధగా విని నోట్స్ వ్రాస్తున్నారు. నిన్న బహిరంగ సభలో గురూజీ చెప్పిన విషయాలను జ్యేష్ట కార్యకర్తలకు మరొకసారి వివరించారు. `హిందువుల రక్షణ బాధ్యత సహజంగానే సంఘ భుజస్కందాలపైకి వచ్చింది.’ కార్యకర్తలకు ధైర్యాన్ని కలిగిస్తూ గురూజీ `సంఘటనా కౌశలం, సామర్ధ్యం ద్వారా మనం అసాధ్యమనుకున్న పనులను కూడా సులభంగా చేయగలుగుతాము’ అని అన్నారు.
  బైఠక్ తరువాత అందరితో కలిసి గురుజి అల్పాహారం తీసుకున్నారు. 9 గం.లకు హైదరబాద్ కు ప్రయాణమయ్యారు. కరాచికి చెందిన కొంతమంది స్వయంసేవకుల దగ్గర కార్లు ఉన్నాయి. వాటిలో ఒక కారులో గురూజీ, ఆబాజీ, ప్రాంతప్రచారక్ రాజ్ పాల్ జీ పూరి, రక్షణ దృష్ట్యా ఒక స్వయంసేవక్ బయలుదేరారు.
  కారు డ్రైవర్ దగ్గర కూడా ఆయుధం ఉంది. కానీ పైకి కనిపించడంలేదు. మరొక కారు కూడా గురూజీ ప్రయాణిస్తున్న కారును వెంబడించింది. అందులో కొందరు జ్యేష్ఠ కార్యకర్తలు ఉన్నారు. వారి దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి. ఎలాంటి సమస్య రాకుండా ఈ కార్లకు, ముందు వెనుక కొందరు స్వయంసేవకులు మోటార్ సైకిళ్లపై వస్తున్నారు. అత్యంత కల్లోలిత, ఉద్రిక్త పరిస్థితుల్లో స్వయంసేవకులు ఒక సేనాపతి లేదా దేశాధ్యక్షుడిని తీసుకువెళ్ళినట్లుగా సురక్షితంగా హైదరబాద్ వైపు తీసుకువెళుతున్నారు.
  కరాచీ నుంచి హైదారాబాద్ దాదాపు 94 మైళ్ళు ఉంటుంది. కానీ రహదారి బాగుంటుంది. అందువల్ల మధ్యాహ్న భోజన సమయానికి గురూజీ హైదారాబాద్ చేరుకుంటారని అనుకున్నారు. వెలుతున్నప్పుడు దారిలోనే అక్కడి భీతావహ పరిస్తితి గురించి ప్రాంత ప్రచారక్ రాజ్ పాల్ జీ వివరించారు.

`17 ఆర్క్ రోడ్, …నెహ్రూజీ నివాసం ….
నెహ్రూకు ముందు 5ఆగస్ట్ న మౌంట్ బాటన్ వ్రాసిన లేఖ ఉంది. ఆ ఉత్తరానికి సమాధానం ఇవ్వాలి. తన లేఖలో మౌంట్ బాటన్ ఒక విచిత్రమైన కోరిక కోరారు. చాలాసేపు ఆలోచించిన తరువాత నెహ్రూ ఆ లేఖకు సమాధానాన్ని తన వ్యక్తిగత సహాయకుడికి డిక్టేట్ చేయడం ప్రారంభించారు….
“ప్రియమైన లార్డ్ మౌంట్ బాటన్ ‘’,
మీరు వ్రాసిన 5ఆగస్ట్ లేఖ కు కృతజ్ఞున్ని. ఏ రోజుల్లో పరిపాలన భవనాలపై బ్రిటిష్ పతాకమైన యూనియన్ జాక్ ను ఎగురవేయాలో మీరు ఆ లేఖలో సూచించారు. దీనినిబట్టి నాకు అర్ధమైనదేమిటంటే ఈ భవనాలపై భారత జాతీయ జెండాతోపాటు యూనియన్ జాక్ కూడా ఎగురవేయాల్సి ఉంటుంది. అయితే మీరు సూచించిన తేదీలలో ఒక్కదాని గురించి మాత్రం నాకు కొంత అభ్యంతరం ఉంది. అది భారత స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే 15 ఆగస్ట్. ఆ రోజున కూడా యూనియన్ జాక్ ఎగురవేయడం బాగుండదని నా అభిప్రాయం. కానీ లండన్ లోని ఇండియన్ హౌస్ పై మీరు ఆ రోజున యూనియన్ జాక్ ఎగరవేస్తే నాకెలాంటి అభ్యంతరం ఉండదు.
   మీరు సూచించిన మిగిలిన తేదీలు…1 జనవరి – సైనిక దినోత్సవం, 1 ఏప్రిల్ – వాయుసేన దేనోత్సవం, 12 జూన్ –(బ్రిటన్ ) రాజుగారి జన్మదినోత్సవం, 14 జూన్ – ఐక్యరాజ్య సమితి ద్వజోత్సవం, 4 ఆగస్ట్ – (బ్రిటిష్)మహారాణి జన్మదినం, 7 నవంబర్ – నావికాదళ దినోత్సవం, 11 నవంబర్ – ప్రపంచ యుద్ధంలో చనిపోయిన సైనికుల సంస్మరణ దినం మొదలైనవాటి సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలపై, బహిరంగ ప్రదేశాలలో యూనియన్ జాక్ ఎగురవేయడం జరుగుతుంది.’
  డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అప్పుడు ముంబైలో ఉన్నారు. స్వతంత్ర భారత ప్రధమ మంత్రి మండలి ప్రకటించి అప్పటికి కేవలం రెండు రోజులే అయింది. ఆయనకు న్యాయశాఖ అప్పచెపుతారని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. దీని మూలంగా ముంబైలో ఆయన్ని కలుసుకునేందుకు వస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది. ముఖ్యంగా షెడ్యూల్ కులాల ఫెడరేషన్ కు చెందిన కార్యకర్తలు ఎక్కువగా ఉన్నారు.
  ఈ సందడి మధ్య బాబాసాహెబ్ కు కాస్త ఏకాంతం కావాలనిపించింది. ఆయన మనస్సులో అనేక ఆలోచనలు మెదలుతున్నాయి. ముఖ్యంగా దేశపు పశ్చిమ ప్రాంతంలో హిందూ-ముస్లిం గొడవలకు సంబంధించిన వార్తలు ఆయనకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ విషయంలో ఆయనకు దృఢమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన దేశవిభజకు అనుకూలంగానే ఉన్నారు. ఎందుకంటే హిందువులు, ముస్లింలు కలిసి జీవించడం సాధ్యపడదని ఆయన దృఢ అభిప్రాయం. అయితే దేశ విభజన చేసేటప్పుడు జనాభా బదిలీ కూడా జరగాలని ఆయన గట్టిగా కోరారు. విభజన మతప్రాతిపదికన జరుగుతోంది కాబట్టి పాకిస్థాన్ లో ఉన్న హిందూ, సిక్కులను భారత్ కు, భారత్ లోని ముస్లింలను పాకిస్థాన్ కు తరలించాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. ఈ జనాభా బదలాయింపు జరిగితేనే భారత్ భవిష్యత్తులో శాంతిగా ఉంటుందని ఆయన అన్నారు.
   కానీ గాంధీజీ, నెహ్రూ మొదలైన మిగిలిన కాంగ్రెస్ నాయకులు ఒప్పుకోకపోవడంతో అంబేడ్కర్ ప్రస్తావన వీగిపోయింది. ఇది ఆయనకు ఎంతో బాధ కలిగించింది. పద్దతి ప్రకారం హిందూ, ముస్లింల తరలింపు జరిగిఉంటే అనేక లక్షల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిఉండేవారుకాదని ఆయనకు అనిపించింది. `భారత్ లో హిందూ, ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉంటారు’అంటూ గాంధీజీ చేసిన ప్రకటన ఆయనకు చాలా కోపం తెప్పించేది.
   కార్యకర్తల గుంపు నుంచి ఎలాగోలా బయటపడిన బాబాసాహెబ్ తన గదిలో కూర్చున్నారు. తన చేపట్టనున్న మంత్రిత్వ శాఖలో ఏఏ పనులు చేయాలో ఆయన ఆలోచిస్తున్నారు. అంతలోనే అది హీరోషిమా రోజని ఆయనకు గుర్తుకువచ్చింది. ఇదే రోజు అమెరికా జపాన్ లోని హీరోషిమాపై అణుబాంబు వేసింది. ఆ సంఘటన జరిగి ఇప్పటికీ రెండేళ్ళు గడిచాయి. అణుబాంబు మూలంగా ప్రాణాలు కోల్పోయిన వేలాదిమంది అమాయక జపాన్ వాసులను తలచుకుంటే ఆయనకు ఎంతో బాధ కలిగింది. ముంబైలోని న్యాయవాదుల సంస్థ ఆ రోజు బాబాసాహెబ్ సన్మానసభ ఒకటి ఏర్పాటు చేసింది. ఆ సభలో ఏం మాట్లాడాలన్నది కూడా ఆయన ఆలోచిస్తున్నారు.
  ఇవాళ 6గం. 17 నిముషాలకు సూర్యోదయమయింది. కానీ అంతకంటే ముందే గాంధీజీ లాహోర్ వైపుగా ప్రయాణం సాగించారు. ఒక గంట తరువాత రావల్పిండిలో ఆయన కొద్దిసేపు ఆగుతారు. అక్కడి కార్యకర్తలు బలవంతంగా ఆయనను అక్కడ ఆపారు. అక్కడ కొద్దిగా అల్పాహారం ఏర్పాటుచేశారు. కానీ గాంధీజీ మాత్రం నిమ్మరసం మాత్రం తీసుకున్నారు. మధ్యాహ్నం దాదాపు ఒకటిన్నరకు గాంధీజీ లాహోర్ చేరుకున్నారు. ఇక్కడ భోజనం చేసిన వెంటనే ఆయన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.

గాంధీజీ భోజన ఏర్పాటు జరిగిన కాంగ్రెస్ నాయకుడి ఇల్లు హిందువులు అధికంగా ఉండే ప్రాంతంలోనే ఉంది. అయినా అక్కడ కనిపించిన దృశ్యం గాంధీజీని నొప్పించింది. కాంగ్రెస్ నాయకుడి ఇంటికి వెలుతున్న దారిలో ఆయనకు తగలబడిన ఇల్లు, దుకాణాలు కనిపించాయి. హనుమాన్ మందిరపు తలుపులను ఎవరో ఊడబెరికి అవతల పారేశారు. ఒక రకంగా ఆ ప్రాంతమంతటా భయం కలిగించే వాతావరణం నెలకొని ఉంది.
   గాంధీజీ చాలా తక్కువ ఆహారం తీసుకునేవారు. కొద్దిగా మేకపాలు, ఎండు ద్రాక్షలు, ఏదైనా పండు. ఇదే ఆయన ఆహారం. ఆయన భోజన వ్యవస్థ ముందుగానే చేశారు. గాంధీజీతో పాటు వచ్చినవారికి కూడా అక్కడే భోజనం ఏర్పాటు చేశారు. భోజనం పూర్తిచేసుకుని గాంధీజీ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి వచ్చారు.
   ఎప్పటిలాగానే ప్రార్ధన తరువాత సమావేశం మొదలైంది. పెదవులపై చిరునవ్వుతో గాంధీజీ కార్యకర్తలను ఉద్దేశించి ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి అన్నారు. అంతే ఆనకట్ట తెగినట్లుగా కార్యకర్తలంతా తాము చెప్పదలుచుకున్నది గబగబా చెప్పడం ప్రారంభించారు. అక్కడ కేవలం హిందూ, సిక్కు కార్యకర్తలే ఉన్నారు. వారికి తమ నాయకుల ధోరణి ఏమాత్రం నచ్చలేదు. వాళ్ళంతా బాగా కోపంగా ఉన్నారు. “దేశ విభజన జరగదు. అది జరగాలంటే ముందు నా శరీరం రెండు ముక్కలు కావాలి’’ అంటూ గాంధీజీ గతంలో ప్రకటించేసరికి అందరిలో నమ్మకం మొలకెత్తింది. ఏమి జరగదని కాంగ్రెస్ కార్యకర్తలంతా భావించారు.
  కానీ వాళ్ళ ఆశాలన్నీ ఆవిరయ్యాయి. జూన్ 3 నాటికే అంతా మారిపోయింది. అదే రోజు విభజన ప్రకటన వెలువడింది. ఆ ప్రకటన కూడా కాంగ్రెస్ సమితి విడుదల చేసింది. `రాగల ఏడెనిమిది రోజుల్లో మనమంతా తట్టాబుట్టా సర్దుకుని భారత్ కు శరణార్ధుల్లాగా వెళ్ళాలి. జీవితాలు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి. వాళ్ళంతా కాంగ్రెస్ కార్యకర్తలే.’
  కార్యకర్తలంతా గాంధీజీని తమ ప్రశ్నలతో ముంచెత్తారు. ఆయన కూడా శాంతంగా వారు చెప్పినవన్నీ మౌనంగా విన్నారు. చివరికి పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కార్యకర్తలను వారించారు. `గాంధీజీ ఏం చెపుతారో వినండి’ అన్నారు. అక్కడ సమావేశమైన ఏడెనిమిది వందలమంది కార్యకర్తలు ఒక్కసారిగా మౌనం వహించారు. గాంధీజీ తమ గురించి ఏం చెపుతారోనని ఆసక్తిగా, ఆశగా ఎదురుచూశారు.

సింధ్ ప్రాంతంలోని హైదరబాద్ లో పర్యటిస్తున్న గురూజీ మధ్యాహ్న భోజనం పూర్తిచేశారు. ఆయన కూడా స్వయంసేవకులతో మాట్లాడుతున్నారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవలసిందిగా ఆబాజీ ఒకటి రెండుసార్లు ఆయన్ని కోరారు. సింధ్ ప్రాంతంలో నెలకొన్న విపత్కర పరిస్థితులను చూసిన తరువాత గురుజికి విశ్రాంతి తీసుకోవడం సాధ్యంకాలేదు. గత సంవత్సరం నెహ్రూ ఇక్కడ జరిపిన పర్యటన గురించి హైదరబాద్ స్వయంసేవకులు గురుజికి చెపుతున్నారు.
 గత సంవత్సరం, అంటే, 1946లో హైదరబాద్ లో ఒక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలని నెహ్రూ అనుకున్నారు. అప్పుడు విభజ వార్తలు ఏవి లేవు. సింధ్ ప్రాంతంలోని గ్రామాల్లో ముస్లింల సంఖ్య అధికం. కరాచీ మినహాయిస్తే మిగిలిన నగర ప్రాంతాల్లో హిందువులే అధికంగా ఉంటారు. లర్కానా, షికార్పూర్ లలో హిందువుల జనాభా 63శాతం ఉంటుంది. ఇక హైదరబాద్ లో లక్షమంది హిందువులు ఉన్నారు. అంటే మొత్తం జనాభాలో 70శాతానికి పైగా. అయినా దేశాన్ని విభజించాలని ముస్లింలు గట్టిగా కోరుతునేఉన్నారు. వాళ్ళు చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారింది. దీనివల్ల 30శాతం మాత్రమే ఉన్న ముస్లింలదే ఆధిపత్యం. అన్నీ చోట్ల హిందువులకు వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. సింధ్ ప్రాంతపు మంత్రిమండలిలో ఉన్న ముస్లిం లీగ్ మంత్రి ఖుర్రం అయితే హిందూ యువతులను అపహరిస్తామంటూ బాహాటంగానే హెచ్చరికలు చేస్తున్నాడు.
  ఈ ముస్లిముల గూండాగిరిని ఎదుర్కోగలిగిన సంస్థ ఒక్కటే కనిపించింది. అది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. హైదరబాద్ లోని సంఘ శాఖల్లో సంఖ్య బాగా ఉండేది. ప్రాంత ప్రచారక్ రాజ్ పాల్ పూరీ ఈ నగరంలో తరచూ పర్యటించేవారు.
   ఇలాంటి పరిస్థితిలో హైదరబాద్ లో నెహ్రూ సభ జరపడం అసంభవంగా కనిపించింది. అంతేకాదు నెహ్రూ హత్యకు ముస్లిం లీగ్ పధకం వేసిందన్న వార్తలు కాంగ్రెస్ కార్యకర్తలకు ఆందోళన కలిగించాయి. ఏం చేయాలో దిక్కుతోచలేదు. అప్పుడు కాంగ్రెస్ జ్యేష్ట నేత చిమన్ దాస్, లాలా కృష్ణచంద్ లు సంఘ ప్రాంత ప్రచారక్ రాజ్ పాల్ పూరీని సంప్రదించారు. నెహ్రూకు భద్రత కల్పించడంలో స్వయంసేవకుల సహాయం అర్ధించారు. వారి విజ్ఞప్తిని మన్నించిన రాజ్ పాల్ పూరీ కాంగ్రెస్ నేతలు కోరినది చేయడానికి అంగీకరించారు.
  ఆ తరువాతనే హైదారాబాద్ లో నెహ్రూ భారీ బహిరంగ సభలో పాల్గొనగలిగారు. అందులో సంఘ స్వయంసేవకులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. దీని వల్లనే ఆ సభ ఎలాంటి గొడవలు, అల్లరి లేకుండా సజావుగా జరిగింది. (‘Hindus in Partition – During and After’ , www.revitalization.blogspot.in – V. Sundaram, Retd IAS Officer)

హైదారాబాద్ లో గురూజీ రాక సందర్భంగా పెద్ద సాంఘిక్ (కార్యక్రమం) జరిగింది. ఇందులో రెండువేలమందికి పైగా స్వయంసేవకులు పాల్గొన్నారు. పూర్ణ గణవేష్ (యూనిఫాం) ధరించి వాళ్ళంతా పాల్గొన్నారు. అందులో గురూజీ మాట్లాడారు. ఆయన ప్రసంగంలో ప్రస్తావించిన విషయాలు కరాచీలో చెప్పినవే. అవి కాకుండా గురుజీ ప్రత్యేకంగా ఇలా ఒక విషయం ప్రస్తావించారు – `మన భుజస్కంధాలపై పెద్ద బాధ్యత ఉంది. రాజా దాహిర్ వంటి వీరులకు చెందిన ఈ సింధ్ ప్రాంతం నుంచి తాత్కాలికంగా తప్పుకోవలసి వస్తోంది. కాబట్టి ఇక్కడ ఉన్న హిందువులు, సిక్కులను సురక్షితంగా భారత్ కు చేర్చడం కోసం మనం అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధపడాలి’’.
“గూండాగిరి, హింసాలకు భయపడి, లొంగి అంగీకరించిన ఈ విభజన కృత్రిమమైనదని మనకు తెలుసు. ఇవాళకాకపోతే రేపైనా అఖండ భారతాన్ని సాధిస్తాం. అన్నింటికంటే ముందు హిందువులను రక్షించడం ముఖ్యమైన, సవాళ్ళతో కూడుకున్న పని.’’ తన బౌద్ధిక్ (ఉపన్యాసం) ముగిస్తూ గురూజీ సంఘటన ప్రాధాన్యతను గుర్తుచేశారు. “మన సంఘటనా శక్తి మూలంగా ఇలాంటి అసాధ్యమైన కార్యాలను మనం పూర్తిచేయగలుగుతాం. అందువల్ల ధైర్యంగా ఉండండి. సంఘటన ద్వారా మనం మన పురుషార్ధాన్ని సాధించాలి…’’
   ఈ బౌద్ధిక్ తరువాత గురూజీ స్వయంసేవకులతో మాట్లాడుతూ ముందుకు వెళుతున్నారు. వారి యోగక్షేమాలు అడుగుతున్నారు. అలాంటి విపత్కర, హింసా వాతావరణంలో ఉన్న వారికి గురూజీ మాటలు ఎంతో ధైర్యాన్ని, మనోబలాన్ని ఇచ్చాయి. అక్కడ లాహోర్ లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో గాంధీజీ మెల్లగా తన ఉపన్యాసం మొదలు పెట్టారు..
  “…పశ్చిమ పంజాబ్ ప్రాంతం నుంచి ముస్లిమేతరులు ఇతర ప్రాంతాలకు తరలిపోతుండడం నాకు చాలా బాధ కలిగింది. నిన్న వాఘా శిబిరంలో కూడా నేను ఇదే విషయం విన్నాను. ఈరోజు ఇక్కడ లాహోర్ లోనూ వింటున్నాను. ఇలా జరగకూడదు. మీ లాహోర్ నగరం నాశనమవుతోందని మీకు అనిపిస్తే దూరంగా పారిపోవడం కాకుండా ఇక్కడే ఉంది ఆత్మబలిదానానికి సిద్ధం కండి. భయం మిమ్మల్ని కమ్ముకున్నప్పుడు నిజంగా చావు రావడానికంటే ముందే మరణిస్తారు. ఇలా జరగకూడదు. పంజాబ్ ప్రజానీకం భయంతో చనిపోకుండా, మృత్యువుతో పోరాడారనే వార్త వినాలనుకుంటాను…’’
  గాంధీజీ అన్న మాటలు విన్న తరువాత కాంగ్రెస్ కార్యకర్తలకు రెండు నిముషాలపాటు ఏం మాట్లాడాలో అర్ధంకాలేదు. తమ చెవుల్లో వేడి వేడి లోహాన్ని పోస్తున్నట్లు వారికి అనిపించింది. “ముస్లిం గూండాలు సాగిస్తున్న మారణకాండకు తలవంచి ధైర్యంగా మృత్యువును ఆహ్వానించండి.’’అనేది గాంధీజీ సందేశం! ఇదేమి సలహా?

లాహోర్ కు వస్తున్నప్పుడే దారిలో ఒక కార్యకర్త గాంధీజీతో “భారత్ జాతీయపతాకం దాదాపు ఖరారు అయిపోయింది. కేవలం దాని మధ్యలో ఇప్పుడు ఉన్న చర్ఖా స్థానంలో అశోకుని `ధర్మ చక్రం’ ఇంచడమే మిగిలింది’’అని తెలియజేశాడు.
  ఇది వినగానే గాంధీజీకి కోపం వచ్చింది. చర్ఖా స్థానంలో అశోక చక్రమా? అశోక చక్రవర్తి అనేక యుద్ధాలు చేసి హింసకు పాల్పడ్డాడు. ఆ తరువాత అతను బౌద్ధం స్వీకరించిన మాట నిజమే. కానీ అంతకుముందు పాల్పడిన హింస సంగతి ఏమిటి? అలాంటి రాజుకు చెందిన చిహ్నం జాతీయ పతాకంలోనా? లేదు, వీల్లేదు…అందుకనే కార్యకర్తల సమావేశం పూర్తయిన వెంటనే ఒక పత్రికా ప్రకటన తయారుచేయాలని మహదేవ్ భాయ్ కి చెప్పారు గాంధీజీ.
   గాంధీజీ ఆ ప్రకటన ఇలా వ్రాయించారు – “భారత జాతీయ పతాకానికి సంబంధించి తుది నిర్ణయం ఇప్పటికే తీసేసుకున్నారని నాకు తెలిసింది. కానీ మధ్యలో చర్ఖా గుర్తు లేకపోతే అలాంటి జెండాకు నేను ఎలాంటి పరిస్థితిలోను వందనం చేయను. జాతీయ పతాకం గురించి మొట్టమొదట ఆలోచించినది నేనేనని మీ అందరికీ తెలుసు. అలాంటిది చర్ఖా లేని జెండాను నేను అసలు ఊహించలేను…’’
  6 ఆగస్ట్, సాయంత్రం…ముంబై…ఆకాశంలో అక్కడక్కడ మబ్బులు…వర్షం పడే సూచనలు ఏమి లేవు.  మధ్య ముంబై లోని ఒక హాలులో ఒక కార్యక్రమం ఏర్పాటయింది. అందులో స్వతంత్ర భారత ప్రధమ న్యాయ మంత్రి బాబాసాహెబ్ అంబేడ్కర్ కు ఘనస్వాగతం, సత్కారాలు జరగనున్నాయి. కార్యక్రమం చాలా బాగా జరిగింది. బాబాసాహెబ్ కూడా తాము అనుకున్నది చెప్పారు. తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్ల గురించి కూడా ఆయన మాట్లాడారు. పాకిస్తాన్ గురించిన తన అభిప్రాయాలను మరోసారి గట్టిగా వినిపించారు. శాంతియుతంగా జనాభా బదిలీ జరగాలని అన్నారు. మొత్తానికి ఈ కార్యక్రమం సజావుగా సాగింది. పాకిస్థాన్, ముస్లింల గురించి బాబాసాహెబ్ కు స్పష్టమైన అవగాహన ఉంది.

6 ఆగస్ట్ రాత్రి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ గురూజీ సింధ్ లోని హైదరబాద్ నుంచి హిందువులను సురక్షితంగా భారత్ చేర్చడంపై స్వయంసేవకులతో మాట్లాడుతున్నారు. బాగా పొద్దుపోయింది. అయినా నిద్రకు ఉపక్రమించలేదు. మరోవైపు గాంధీజీ లాహోర్ పర్యటన ముగించుకుని గంట క్రితమే పాట్నా మీదుగా కలకత్తా చేరుకోవడానికి ప్రయాణమయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న రైలు అమృత్సర్ – అంబాలా – మురాదాబాద్ – వారణాసి మీదుగా 30 గంటల తరువాత పాట్నా చేరుతుంది.
  స్వతంత్ర, ఖండిత భారత్ ప్రప్రధమ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే జవహర్ లాల్ నెహ్రూ 17 ఆర్క్ రోడ్ లోని తన నివాసంలో కూర్చుని లేఖలు వ్రాస్తున్నారు. కొద్దిసేపట్లో ఆయన నిద్రకు ఉపక్రమిస్తారు. డిల్లీలోనే ఉన్న భావి గృహామంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ దేశంలోని వివిధ సంస్థానాలకు సంబంధించిన వివరాలున్న ఫైళ్లను పరిశీలిస్తున్నారు. సమయం చాలా తక్కువగా ఉంది. ఈ సంస్థానాలను భారత్ లో విలీనం చేయాలి.
  6 ఆగస్ట్ రాత్రి గడుస్తున్నకొద్ది పశ్చిమ పంజాబ్, తూర్పు బెంగాల్, సింధ్, బలూచిస్తాన్ మొదలైన ప్రాంతాల్లో హిందువులు, సిక్కుల ఇళ్ళలో విచారం, భయపు ఛాయలు కమ్ముకున్నాయి. హిందువుల ఇళ్లపై, ముఖ్యంగా హిందూ యువతులపై, దాడులు పెరుగుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లోని హిందువుల ఇళ్లకు ముష్కరులు పెట్టిన మంటలు సుదూర ప్రాంతాలకు కూడా కనిపిస్తున్నాయి…స్వాతంత్ర్య ప్రకటన వైపుగా మరో రోజు గడిచిపోయింది.

క్రితం సంచికల కోసం ఈ క్రింది లింకులను క్లిక్ చేయండి:

మూలము: విశ్వ సంవాద కేంద్రము {full_page}
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top