పార్సీలు |
భారత్‌లో పార్సీలు పాల్గొనని లేదా రాణించని కార్యక్షేత్రం గాని, మానవ ప్రయత్నం గాని లేవు. సాయుధ దళాలు, పరిశ్రమలు, శాస్త్రవిజ్ఞానం, వైద్యరంగం, లలిత కళలు, దాతృత్వం – ఇలా ఏ రంగం చూసినా పార్సీల గణనీయ భాగస్వామ్యం కనిపిస్తుంది. ఆ రంగంలో అభివృద్ధికి వారు చేసిన కృషి ఎంతో ఉంది.
గొప్ప ఉదారత
గొప్ప ఆలోచనలు చేయాలని, ఆచరణ వాటికంటే గొప్పగా ఉండాలని జొరాతుస్ట్రా బోధించాడు. జొరాష్ట్రియన్‌లకు ఆచరణే ప్రధానం. ఈ ఆచరణ మూడు ప్రధాన సిద్ధాంతాలపై ఆధారపడి ఉంటుంది. అవి – ‘హుమాత, హుకాత, హువ రాష్ట్రా’ (మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి చర్యలు). ‘మీ దేశం మీ కొరకు ఏమి చేయగలదో అడగొద్దు. మీ దేశం కొరకు మీరు ఏమి చేయగలరో అడగండి’ అనే జాన్ ఎఫ్ కెన్నెడి ప్రసిద్ధ వాక్యాలకు పార్సీలు ఉత్తమ ఉదాహరణ. పార్సీలు జన్మతః సామాజిక సంక్షేమాన్ని కోరేవారు. సమాజ సంక్షేమం కోసం పార్సీలు భారత్‌లో ఎన్నో సంస్థలను స్థాపించారు. సర్ దొరబ్జి టాటా ట్రస్టు వారు బెంగళూరులో భారత దేశంలోని మొదటి విజ్ఞానశాస్త్ర సంస్థను, ముంబాయిలో మొదటి క్యాన్సర్ వైద్యశాలను, మొదటి సాంఘికశాస్త్ర సంస్థను, మొదటి మౌలిక పరిశోధనా సంస్థను, మొదటి కళల అనుష్టాన కేంద్రాన్నీ స్థాపించారు.
పార్సీలు వివిధ సంస్కృతులు, మతాలు, ప్రదేశాలు, సాంప్రదాయాలలోని మంచిని గ్రహించి, వారికే సాధ్యమైన ప్రత్యేకతను జోడించి ఒక అందమైన, సుందరమైన చిత్తరువును సృష్టిస్తున్నారు. మార్పుకి, అవిచ్ఛిన్నానికి వీరు సజీవ తార్కాణాలు. వారు తమ చుట్టూ ఉండే జీవితాలను, జీవన ప్రమాణాలను వృద్ధి చేస్తారు. స్త్రీ విద్య, మహిళల ఉపాధి విషయంలో కాని, సరికొత్త కీలక సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో కాని పార్సీలు ముందంజలో ఉన్నారు. మొదటి మహిళా ఫోటో జర్నలిస్టు హోమయ్ వ్యారావాల, ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పాలని నిశ్చయించిన జమ్‌షెడ్జీ టాటాలు అందుకు ఉదాహరణలు.
జమ్‌షెడ్జీ టాటా |
దేశ ప్రగతిలో..
భారత్‌లో పార్సీలు పాల్గొనని లేదా రాణించని కార్యక్షేత్రం గాని, మానవ ప్రయత్నం గాని లేవు. సాయుధ దళాలు, పరిశ్రమలు, శాస్త్రవిజ్ఞానం, వైద్యరంగం, లలిత కళలు, దాతృత్వం – ఇలా ఏ రంగం చూసినా పార్సీల గణనీయ భాగస్వామ్యం కనిపిస్తుంది. ఆ రంగంలో అభివృద్ధికి వారు చేసిన కృషి ఎంతో ఉంది. వివిధ క్షేత్రాలలో రాణించిన పార్సీ సాధకుల జాబితా సుదీర్ఘంగా ఉంటుంది.
➣ స్వాతంత్య్ర పోరాటంలో దాదాభాయ్ నౌరోజి, ఫిరోజ్‌షా మెహతా, మేడం భికాజి కామాల తోడ్పాటు స్పష్టంగా లిఖితమైంది. స్వాతంత్య్రానికి ముందు, ఆ తరువాత టాటాల సహకారం అందరికీ తెలిసిందే. వాడియాలు, పెటిట్‌లు, పూనావాలాలు, గోద్రెజ్‌లు తక్కువ వారేం కాదు.
➣ పార్సీ శాస్త్రవేత్త డా.హోమి జహంగీర్ భాభా భారత అణు కార్యక్రమ పితగా ఖ్యాతి గడించారు. న్యాయ, మీమాంస రంగంలో నాని పాల్కీవాల, పాలీ నారిమన్ వంటి నిష్ణాతులు ప్రావీణ్యంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పారు. కళలు, సంస్కృతి రంగంలో కేకి దారువాల, స్వరకర్త జుబిన్ మెహతా, గజల్ విద్వాంసుడు పెనాజ్ మెసాని వంటివారు తమ ప్రతిభతో ప్రజలను అలరించారు.
➣ 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధంలో శామ్ మానెక్ షా సాధించిన చారిత్రాత్మక విజయం ప్రేరణాత్మక గాథలలో స్థానం పొందింది. ఆకర్షణ, వినోద రంగాల్లో ప్రమాణాలను పెంచిన అందాల రాణులు, మోడళ్ళు, కళాకారులను ఈ సమాజం అందించింది. బొమ్మన్ ఇరాని, రాజ్‌జుట్షి వంటి బహుముఖ నటులు ‘బహుముఖ’ పదానికే కొత్త అర్థాన్నిచ్చారు. జొరాబియాన్ వంటి సుందరులు వేలాది ఉత్పత్తులను ప్రారంభించారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఇది ఒక అంతులేని జాబితా అవుతుంది. సరిగ్గా చెప్పాలంటే పార్సీలది నిజమైన ‘సాధకుల’ సమాజం.
ప్రమాదంలో ఉనికి
ఇంతటి మేధావులైన పార్సీలు వారి జనాభా పరంగా తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొంటున్నారు. ఒకవంక స్వాతంత్య్రం తరువాత భారతదేశ జనాభా మూడింతలవగా, పార్సీల జనాభా 30% కంటే తగ్గింది. వారు ఖచ్చితంగా పాటించే ఏక వివాహ పద్ధతి, అంతర్వివాహ పద్ధతులు దీనికి కారణం. ‘జాతి స్వచ్ఛత’కు వీరు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సహచరుల ఎంపిక దగ్గర రక్తసంబంధీకులు, వివాహరీత్యా బంధువులకు మాత్రమే పరిమితమవు తున్నారు. మిశ్రమ వివాహాలలో జన్మించిన బిడ్డ తండ్రి పార్సీ అయినప్పుడే ఆ బిడ్డను పార్సీగా అంగీకరించాలని 1908 నాటి బాంబే ఉన్నత న్యాయస్థానం తీర్పు ప్రకటించింది.
జియో పార్సి
ప్రతి దశాబ్దానికి 10 శాతం కంటే ఎక్కువ క్షీణించిపోతున్న ఫలితంగా పార్సీల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. జనన మరణాల వ్యత్యాసం ప్రతి కూలంగా ఉంటోంది. భారత ప్రభుత్వం మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ; బొంబే పార్సీ పంచా యత్, టాటా సాంఘిక విజ్ఞాన సంస్థ వంటి ప్రైవేటు సంస్థలు కలసి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రారంభించిన ‘జియోపార్సీ’ పథకం ప్రస్తుత పరిస్థితిని మార్చడానికి చేస్తున్న ప్రయత్నం. భారత్‌లో పార్సీల సంఖ్యను పెంచడం ఈ పథకం లక్ష్యం.
ఈ పథకంలో ప్రేరణ విభాగం, వైద్యవిభాగం అనే రెండు విభాగాలున్నాయి. ప్రేరణ విభాగం వివాహ వయస్సులోని యువ పార్సీలు వివాహం చేసుకొని కుటుంబాన్ని ప్రారంభించేందుకు స్ఫూర్తినిస్తుంది. వైద్యవిభాగం కాబోయే దంపతుల జన్యు నిర్మాణంలో హానికారకమైన పరివర్తనలను, వైద్య పరమైన సమస్యలను పరిశీలిస్తుంది. మొత్తానికి యుద్ధ ప్రాతిపదికన పార్సీల జనాభాను పెంచడానికే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అసమాన మైనారిటీ
భారతదేశంలో పార్సీల జనాభా 1941లో 1,15,000 ఉండగా ప్రస్తుతం 70,000 కంటే తక్కువకు పడిపోయింది. అయినప్పటికీ జాతి నిర్మాణంలో వివిధ రంగాలలో వారి జనసంఖ్య కంటే చాలా ఎక్కువగా దోహదపడ్డారు. వారెన్నడూ మైనారిటీ హోదా కోసం పాకులాడలేదు. సమాజంలో గౌరవప్రదమైన వారి స్వంత స్థానాన్ని చక్కగా మలచుకున్నారు. పీడన, వంచనలకు గురైన వారి మనస్తత్వాన్ని పెంచిపోషించకుండా, పార్సీలు తమ వలసను తమ వ్యవస్థాపక నైపుణ్యాలను పెంచుకునే అవకాశంగా భావించి, అందుకు అనుగుణంగా మలచుకున్నారు. దాంతో పార్సీలు తమ ఏకైక సాంస్కృతిక గుర్తింపును నీరు గార్చకుండానే మెజారిటీలో భాగంగా ఉండేందుకు ఇష్టపడిన ఒక అసమాన మైనారిటీగా రూపొందారు.
‘మైనారిటి’గా ఉండటానికీ, ఆ హోదా వలన వచ్చే సౌకర్యాలను ఉపయోగించుకోవడానికీ ఇష్టపడని ఈ ఉదారమైన పార్సీ అల్పసంఖ్యాక వర్గీయులు వారి పరిమాణంలోను, బలంలోను అభివృద్ధి చెందాలని, అనంతకాలం మనుగడ సాగించాలని ప్రార్ధిద్దాం.
ఎప్పుడూ వ్యాపారమే కాదు
ఒక ఆర్మీ అధికారి అనుభవం
గణతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొనడానికి తాత్కాలిక విధుల్లో భాగంగా దిల్లీలో నేను రెండు రాత్రులు గడపాల్సి వచ్చింది. ఉండడానికి టాటా గ్రూప్‌కు చెందిన తాజ్ హోటల్‌ను ఎంచుకున్నాను.
ఆ రోజు సాయంత్రం. రిసెప్షన్‌తో మాట్లాడి నా దుస్తులు ఇస్త్రీ చేయించాలని కోరాను. కొద్దిసేపటికి గదుల సేవకుడు నా దుస్తులు తీసుకెళ్ళడానికి వచ్చాడు. నేను ఇస్త్రీ కోసం నా యూనిఫాం అందించాను. నా యూనిఫాం చూడగానే ఆ సేవకుడు ఆశ్చర్యంగా ‘సార్ ! మీరు సైన్యంలో ఉన్నారా ?’ అని వినయంగా అడిగాడు. అవునన్నాను. వెంటనే అతడు తన మొబైల్ తీసుకొని నాతో సెల్ఫీ తీసుకున్నాడు. ‘సర్ ! నేను సైనికాధికారిని మొదటిసారి చూస్తున్నాను. వారిని సినిమాల్లో మాత్రమే చూశాను’ అన్న అతడు కాలిని గట్టిగా కొట్టి ‘శల్యూట్’ చేసి, ‘జై హింద్ సర్ !’ అని వెళ్ళిపోయాడు.
రాత్రి 9 గంటలు. రిసెప్షన్ నుంచి పిలుపొచ్చింది. రాత్రి భోజనం కోసం క్రింది రాగలరా ! అని ఎంతో వినయంగా అడిగారు. నా గదిలోనే వడ్డించడం వీలు కాదని తెలిపారు. నేను అంగీకరించి క్రిందికి వెళ్ళాను. భోజనశాల చాలా అందంగా, అలంకరించబడి ఉంది. కశ్మీర్ అడవుల నుంచి వచ్చిన నన్ను అక్కడి వాతావరణం ఆకట్టుకుంది. ప్రధాన ఆవరణలోకి నేను ప్రవేశించే సరికి మొత్తం సిబ్బంది అక్కడ నిలబడి ఉన్నారు.
మేనేజర్ నేతృత్వంలో సిబ్బంది నా వద్దకు వచ్చారు. మేనేజరు ‘సర్ ! మా హోటల్‌కు స్వాగతం. మిమ్ములను అతిథిగా పొందడం మాకు ఆనందకరం’ అంటూ పుష్పగుచ్ఛం అందించారు. మేనేజర్ కూడా నాతో కలసి భోజనం చేశారు.
మర్నాడు
ఆశ్చర్యకరంగా, నేను ‘రాష్ట్రపతి భవన్’ కి వెళ్ళడానికి నా కోసం ఒక బి.ఎం.డబ్ల్యు. కారు ఏర్పాటు చేశారు. నిజం చెప్పాలంటే, ఇటువంటి ‘ప్రముఖ వ్యక్తి’ మర్యాదలు నాకు అలవాటు లేవు. మా వంటి సైనికులకు మా జిప్సీనే సౌకర్యంగా ఉంటుంది. గది ఖాళీ చేసి వెళ్ళే సమయం వచ్చింది. నేను రిసెప్షన్ వద్దకు వెళ్ళి నా కార్డు చూపించాను. అప్పుడు జరిగిన సంభాషణ..
రిసెప్షనిస్టు : మీ బసకు ధన్యవాదాలు సర్ ! మీ విడిది ఎలా ఉంది ?
నేను : చాలా సౌకర్యవంతంగా ఉంది. నా బిల్లు ఇస్తారా ?
రిసెప్షనిస్టు : మీ బిల్లును మా హోటలే చెల్లించేస్తోంది. మీరు మన దేశాన్ని కాపాడుతున్నారు. ఇది మా కృతజ్ఞతా చిహ్నం. మీ అభిమానాన్ని మేము గౌరవిస్తాము. డబ్బు ఆదా అయిందని కాదు, ‘ఆలివ్ గ్రీన్’ (ఆర్మీ దుస్తుల రంగు) పట్ల వారు చూపిన గౌరవం నాకు మంచి అనుభూతిని కలిగించింది. వారు చూపిన కృతజ్ఞత నన్నెంతో కదిలించింది. మనది ఎంత గొప్ప దేశం !
ఈ సంఘటన గురించి వివరిస్తూ తాజ్-దిల్లీ మేనేజరు చూపిన ఆదరణను ప్రశంశిస్తూ తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, ముఖ్య కార్యనిర్వహణాధికారికి (సిఇఒ) ఉత్తరం వ్రాశాను. ఆశ్చర్యకరంగా, సిఇఒ నుండి నాకు ప్రత్యుత్తరం వచ్చింది. దేశవ్యాప్తంగా తాజ్‌హోటళ్ళలో బస చేసే ఆర్మీ అధికారులకు రాయితీ ఇచ్చేందుకు తాజ్ హోటళ్ళ సముదాయం నిర్ణయించిందని అందులో తెలిపారు.
ఆహా ! సైనికులకు కృతజ్ఞత తెలిపే ఈ విధానం ఎంతో గొప్పది ! అందుకు కారణం ‘టాటా’ సంస్థల్లో ఉండే మంచి పని సంస్కృతే.
_జాగృతి సౌజన్యం తో