సేవా కార్యకర్తల వ్యవహారశైలి - కార్యకర్త యొక్క దృష్టి - RSS Seva

సేవా కార్యకర్తల వ్యవహారశైలి - కార్యకర్త యొక్క దృష్టి - RSS Seva
సేవా కార్యకర్తల వ్యవహారశైలి

మార్గదర్శనం: కీ.శే. కృ.సూర్యనారాయణరావు

సేవా కార్యకర్తల వ్యవహారశైలి

భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు.
అధిష్టానం తథా కర్తా కరణంచ పృథగ్విధమ్
వివిధాశ్చ వృథక్చేష్ణా దైవం చైవాత్ర పంచమమ్ ||
ఏ పని అయినా సఫలం కావడానికి అయిదు విషయాలు అవసరం. 
అధిష్ఠానము, కర్తా, ఉపకరణము, ప్రయత్నము మరియు దేవుడు. 
అయితే వీరందరిలో కార్యకర్త ముఖ్యము. 
అతని నడవడి ఎంతో ప్రాధాన్యత గలది. 
తన వ్యవహారం ద్వారా అసాధ్యమును కూడా సుసాధ్యము చేయగలుగుతాడు. 
అతను కార్యములో ప్రాణాన్ని నింపగల సంజీవని.

కార్యకర్త యొక్క దృష్టి :
కొన్నిసార్లు కార్యకర్త ఒంటరిగానే చక్కగా పనిచేస్తుంటాడు. కాని ఇది మంచిదికాదు. అందరిని వెంట తీసుకొని పనిచేసేవాడు, చాలా మందిని కార్యముతో జతచేసేవాడు మరియు ఆ కార్యకర్త అక్కడనుండి వెళ్ళిపోయినా కూడా కార్యము నిరంతరం క్రమంగా నడుస్తుండేట్లు వ్యవస్థను ఏర్పాటు చేయగలిగిన వాడే మంచి కార్యకర్త అని అనబడతాడు. 
  కేవలం జట్టుగా పనిచేయడంతోనే సంతృప్తి పడకుండా కార్యకర్తలలో కుటుంబభావనను నిర్మాణం చేయగల దృష్టిని పెట్టడమే కార్యము సఫలము కావడానికి అవసరం. కుటుంబ భావనలో ప్రతీ ఒక్కరి మనసులో ప్రతి ఒక్కరి గురించిన ఆలోచన సహజంగానే ఉంటుంది. కార్యకర్తలలో పరస్పరం ఈ బంధుత్వ భావన ఉండాలి అనేది మన కల్పన. అందువలన సంఘంలో వివిధ క్షేత్రాలను కూడా బయటివారు సంఘపరివారం అని పిలుస్తుంటారు. ఒక మంచి కార్యకర్త తన తోటివారిని ఏదైనా నిర్ణయ ప్రక్రియలో భాగస్వాములను చేస్తాడు. తోటి కార్యకర్తల సామర్ధ్యాన్ని  అందరికీ పరిచయం (Project) చేసే ప్రయత్నం చేస్తాడు.అంతా చేస్తూ కూడా చూడడానికి తాను ఏమి చేయటం లేదు అనేవిధంగా పనిచేస్తుంటాడు. ఈ విధంగా కార్యకర్తల బృందాన్ని తయారుచేస్తాడు. దీనినే నిష్క్రియప్రేరణ అని అంటారు. నిష్క్రియప్రేరణకు మంచి  ఉదాహరణ : ఒకానొక సమయంలో రాక్షసులను నాశనం చేస్తూ కాళీమాత ఉన్మత్తురాలై వినాశాన్ని సృష్టిస్తుంటుంది. ఎంతకూ శాంతింపక పోవడంతో శివుడే ఆమె ముందర పడుకొన్నాడు. కాళీమాత పాదము అతనిపై పడగానే ఆమె వెంటనే ఆగిపోయింది. శివుడు కేవలం ఆగడానికి ప్రేరణ ఇచ్చాడు, కానీ శివుడు ఏమి చేయలేదనిపించింది.

ప్రేమతో గెలవాలి:
   సేవా బస్తీలో పనిచేస్తున్నప్పుడు తల్లి వంటి మనసు కలిగి ఉండడమే యోగ్యంగా ఉంటుంది. తనకు తెలియకుండా ఏదైనా చెడుపని చేస్తుంటే తల్లి ప్రేమతో ఛీ ఛీ అంటూ ధైర్యంగా అది తప్పు అని వివరిస్తుంది. అతని దుస్తులు మారుస్తుంది. శుభ్రం చేస్తుంది. అలాంటి భావనతోనే సేవాబస్తీలలోని అనేక లోటుపాట్లను దూరం చేయడం, వారికి ప్రేమతో నేర్పడం మంచి కార్యకర్త యొక్క లక్షణాలు.
    ఒక కుటుంబంలోని వారు తమ కుటుంబంలోని బలహీనుడైన పిల్లవాని గురించి సహజంగా విశేషంగా ఎలా ఆలోచిస్తారో అలాగే మనము కూడా ఈ బలహీన వర్గాలలో సేవచేస్తున్నప్పుడు అలాంటి కుటుంబ భావన అలవాటు చేసుకోవాలి.
సేవలో ఆర్ యస్ యస్ కార్యకర్తలు
మనః స్థితిని అర్థం చేసుకోవాలి:
   శతాబ్దాలుగా ఉపేక్ష మరియు శోషణలకు గురైనందున మనం సేవాబస్తీలలోకి వెళ్ళినప్పుడు వారివల్ల అప్రియమైన వ్యవహారం కూడా కలుగవచ్చు. వారి స్థితిలో మనం ఉండి వారి మన:స్థితిని అర్థం చేసుకునే ధైర్యంకూడా మనకు అవసరం. సేవలో మానావమానాల ఆలోచన ఏమాత్రం
ఉండకూడదు. తమిళనాడులో కురయూర్ గ్రామానికి చెందిన షెడ్యూల్డు కులాలవారు ముస్లింలుగా మారారు. అదే గ్రామానికి చెందిన డాక్టర్ మనోహర్ మొట్టమొదట ముస్లింగా మారాడు. ఆయన ప్రేరణతోనే ఆ గ్రామంలోని షెడ్యూలు కులాలవారందరూ ఇస్లాం స్వీకరించారు. 
   మన కార్యకర్తలు అతన్ని పరిచయం చేసుకొని 'మీరు చదువుకున్న జ్ఞానవంతులు ముస్లింగా ఎందుకు మారారు? అని అడిగారు. అది విని అతడు మన కార్యకర్తలతో మాట్లాడుతూ నాకు మరోదారి లేదు. చూడండి. మా గ్రామంలో మా కులంవారికి చెప్పులు వేసుకునే అధికారము లేదు. పైన అంగవస్త్రం వేసుకోవడం కూడా నిషిద్దము. టీ దుకాణంలో బయటనే ఉండి కొబ్బరి చిప్పలో టీ త్రాగాల్సి వస్తుంది. నేను బాగా చదివి ఎం.బి.బి.ఎస్ డాక్టర్నయ్యాను. ఉద్యోగం దొరికింది. ఆరోగ్య అధికారిగా నియమితుడ నయ్యాను ఊరిలో అద్దె ఇల్లుకొరకు వెదికాను. ఇల్లు ఖాళీగా ఉన్నది
కానీ హరిజనుడనైన కారణంగా నాకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి తిరస్కరించారు. 
   ఊరిబయట ఏదోవిధంగా ఒక యిల్లు దొరికింది. త్రాగునీటికొరకు దూరంగా అందరికి కలిపి ఒక
కుళాయి (నల్లా) ఉండేది. దాని నుండి ముందుగా అగ్రవర్ణాల మహిళలు నీరు పట్టుకునేవారు. చివరగా నా భార్యకు అవకాశం దొరికేది. ఒకరోజు చివరగా ఒక మహిళ కుళాయిక్రింద తన
కడవను పెట్టివెళ్ళిపోయింది. కుండ నీటితో నిండిపోయింది. ఆ మహిళ వచ్చి కుండను ఎప్పుడు తీసుకుపోతుందా అని నా భార్య ఎదురుచూస్తూ నిలబడింది. చాలా సేపైంది కానీ ఆమె రాలేదు. అప్పుడు నా భార్య ఆమె కుండను తీసి తన బిందెను కుళాయి కింద ఉంచింది. ఇంతలో ఆమహిళ వచ్చి ఈ విషయంపై నా భార్యను నానా మాటలు తిడుతూ అవమానించింది. 
   ఒక సభ్యతగల వ్యక్తి ఇలా మాట్లాడగలదా అన్నంత నీచంగా తిట్టింది. ఆ సవర్ణురాలైన స్త్రీ ఇతర మహిళలు కూడా ఆమెనే బలపరిచారు. ఈ అవమానాలను ఎంతకాలం సహించాలి? ఇప్పుడు నేను ముస్లింగా మారాను. నా భార్యకు కూడా అందరితోపాటు నీరు పట్టుకునే అధికారం వచ్చింది అన్నాడు. 

   ఇలాంటి సందర్భాలలో వారిని ప్రేమతో ఆత్మీయతతో స్పృశించి ఎలా గెలవాలని సేవా కార్యకర్తలు ఆలోచించాలి. అట్టి ప్రత్యేక సందర్భాన్ని లోతుగా పరిశీలించడం మరియు తన మానావమానములను పక్కనబెట్టి వారి మనసు గెలవాలనే ఉద్దేశ్యంతో సేవాకార్యములో లీనము కావడమే విజయానికి ఏకైక సూత్రము. ఇలాంటి ఉదాహరణలు మహాత్ముల విషయంలో చాలా ఉన్నాయి. సమర్థ రామదాసు హిందూ సమాజ సంఘటన కొరకు 1100 మఠాలను స్థాపించారు. ప్రతిమఠంలోనూ 11మంది సాధువులను ఉంచడానికియోజన చేశాడు. ఐదు ఇళ్లలోనుండి తనకు సరిపోయేటంత మాత్రమే భిక్షస్వీకరించి జీవితాన్ని గడిపే నియమాన్ని ఏర్పాటు చేశాడు. 
   ఒకరోజు సమర్థ రామదాసు భిక్షకొరకు వెళ్లాడు. ఒక ఇంటిముందు ఆగాడు. 'జయ జయ రఘువీర సమర్థ' అని పలికాడు. సాధారణంగా గృహిణులు వారియొక్క ఈ పిలుపువిని ఎంతో ప్రేమతో వారి జోలెలో భిక్ష వేసేవారు. కానీ ఆరోజు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఏ ఇంటిముందు సమర్థ రామదాసస్వామి నిలబడ్డాడో ఆ గృహిణి ఒక చిరిగిన పాత గుడ్డను ఎర్రమట్టిలో ముంచి గడపక్రింద అలుకుతున్నది. ఆమె ఆ చిరిగిన పాత గుడ్డను భిక్షకొరకు నిలబడిన సమర్థ రామదాసువైపు విసిరికొట్టింది. మట్టితో తడిసిన బట్ట స్వామి భుజానికి తగిలింది. ఊహించని సంఘటన జరిగింది. ఆ మహిళ ఏ బాధలో ఉందోతెలియదు శివాజీ రాజ్యంలో శివాజీ గురువు సమర్థరామదాసును మట్టితో తడిసిన గుడ్డతో కొట్టడం ఎంత విస్మయం కలిగించే విషయం
కానీ స్వామీజీ ధైర్యంను కోల్పోకుండా ఎంతో వినయంతో క్రిందికి వంగి ఆ గుడ్డ తీసుకొని మఠానికి తిరిగివచ్చాడు.
  ఎంతో శాంతంగా ఆ గుడ్డను ఉతికి శుభ్రంచేసి ఎండలో ఆరబెట్టాడు. దానిని పీలికలుగా చేసి వత్తులుగా తయారుచేశాడు. తన ఇష్టదైవమైన శ్రీరామచంద్ర ప్రభువు మందిరంలోకి వచ్చి ప్రమిదలలో నూనె వేసి ఆ వత్తులతోనే దీపాలు వెలిగించాడు. చేతులు జోడించి 'ఓ భగవంతుడా
ఎప్పుడు కూడా ఏ గృహిణి నాపట్ల ఇలా ప్రవర్తించలేదు. ఆ మహిళ మనసులో తప్పకుండా ఎంతో పెద్ద బాధ ఉండి  ఉంటుంది, ఆ ఆందోళనతోనే ఆమె ఇలా ప్రవర్తించి ఉంటుంది. ఓ ప్రభూ! ఆమె బాధను దూరం చెయ్యి' అని ప్రార్థించాడు. సేవ చేయడానికి ఇలాంటి ఉదారమైన మనసు మనకు చాలా అవసరం.

ఇదీ చదవండి: 
ప్రకటన : “సంఘ "సేవా కార్యము" ఎందుకు? ఎలా?”  గత భాగాల కోసం క్లిక్ చేయండి:
➣ నాల్గవ భాగంఆర్ఎస్ఎస్ సేవాదృష్టి
➣ ఎనిమిదవ భాగంసంఘ సేవా భావన నిర్మాణం

తరువాతి భాగంలో: సేవాకార్యంలో సహనము అవసరం 
{full_page}
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top