భారత రాజ్యాంగం హిందూ హృదయం - The Constitution of India is the heart of Hinduism

భారత రాజ్యాంగం హిందూ హృదయం - The Constitution of India is the heart of Hinduism
భారత రాజ్యాంగం హిందూ హృదయం - The Constitution of India is the heart of Hinduism
వ్యక్తులు, వర్గాల స్వేచ్ఛాయుతమైన సమ్మతిపై ఆధారపడిన ఏ ప్రజాస్వామిక వ్యవస్థ అయినా స్వీయ నాగరకతా విలువలను ప్రతిబింబించాలి. శతాబ్దాలుగా భారత్‌లో విలసిల్లిన సామాజిక, సాంస్కృతిక విలువలు, విధానాలను హిందుత్వంగా సాక్షాత్తు సుప్రీంకోర్టు గుర్తించడం సాధారణమైన విషయం కాదు.
     దేశపు సామాజిక, రాజకీయ, ఆర్థిక, ధార్మిక వ్యవస్థకు మూలం హిందుత్వం అని ప్రతి నిత్యం నిర్థారణ అవుతున్నా దానిని కాదనడం సెక్యులరిస్టులమని చెప్పుకునే వారికి అలవాటు. అయితే హిందుత్వపు ప్రాతిపదికను స్వాతంత్య్రోద్యమ నాయకులు అందరూ గుర్తించారు, గౌరవించారు. అందువల్లనే స్వతంత్ర భారతంలో రూపుదిద్దుకొనే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ విలువలను ఇమిడ్చారు. ప్రజాస్వామిక, సహనశీల హిందుత్వ విలువలే ఈ దేశపు భిన్నత్వాన్ని కాపాడి ప్రజాస్వామిక రాజ్య వ్యవస్థను ఏర్పరచగలవని వారు నమ్మారు.  హిందువులు
అధికసంఖ్యాకులుగా ఉన్నా ఇతర మతాలవారి హక్కులకు ఎలాంటి ముప్పు ఏర్పడదని విశ్వసించారు. అందుకనే రాజ్యాంగంలో ఎక్కడా ‘సెక్యులర్‌’ అనే పదాన్ని చేర్చలేదు, వాడలేదు. (1977 ఇందిరాగాంధీ కాలంలో రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులర్‌, సోషలిస్ట్‌ అనే రెండుపదాల్ని మూల పీఠికలో చేర్చారు. అప్పటి వరకు ఆ పదాలు రాజ్యాంగంలో లేవు). ప్రపంచంలో ఎక్కడైనా ముస్లిముల సంఖ్య పెరిగినప్పుడు అక్కడ ఇస్లామీకరణ, మతరాజ్య స్థాపన జరిగాయన్నది అందరికీ తెలిసిన సత్యం. అలాగే హిందువులు ఎక్కువగా ఉన్నచోట్ల ప్రజాస్వామ్య విలువలు, స్వేచ్ఛ, రాజకీయ సెక్యులరిజానికి పూర్తి అవకాశం ఉంటుందన్నది కూడా నిరూపితమైన నిజం. అందుకు కారణం ఆయా నాగరకతలకు చెందిన ఆదర్శాలు, లక్ష్యాలే తప్ప సంపద, పాశ్చాత్య జోక్యం వంటివి కాదు. రాజ్యాంగ సభ ఆమోదించిన రాజ్యాంగపు తుది ప్రతిని పరిశీలిస్తే హిందూ వారసత్వాన్ని రూపకర్తలు గుర్తించినట్లే కనిపిస్తుంది. రాజ్యాంగంలో ఇరవై రెండు రేఖా చిత్రాలు ఉన్నాయి. వాటి జాబితాను చూస్తే ఆసక్తికరమైన అనేక విషయాలు తెలుస్తాయి.
    ముస్లిం యుగానికి ముందు కాలానికి సంబంధించిన చిత్రాల్లో మొహంజొదారో ముద్ర, వైదిక ఆశ్రమం (గురుకులం), లంకపై రాముని యుద్ధం, గీతోపదేశం, బుద్ధభగవానుడు, మహావీరుడు, ధర్మప్రచారం, హనుమంతుడు, విక్రమాదిత్యుని ఆస్థానం, నలందా విశ్వ విద్యాలయం, ఒరిస్సాకు చెందిన శిల్పం, నటరాజ విగ్రహం, గంగావతరణ దృశ్యం మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ హిందూ సాంస్కృతిక విలువల్ని ప్రతిబింబించే చిత్రాలే. ఇవన్నీ దుష్టశిక్షణ, కర్తవ్యపరాయణత్వం, సేవాభావం, మానవత్వం, జ్ఞానం, ధర్మపరాయణత్వం వంటి హిందూ జీవన విలువల్ని చూపుతాయి. మధ్యయుగానికి ప్రతీకగా ఒరిస్సాకు చెందిన హిందూ శిల్పం, నటరాజ విగ్రహం, భగీరధుని తపస్సు, గంగావతరణాల చిత్రాలు తీసుకున్నారు. అంటే అప్పటి వరకు హిందూ పరంపర, సంస్కృతి అవిచ్ఛిన్నంగా సాగాయని రాజ్యాంగకర్తలు గుర్తించారు. ఆ తరువాత ముస్లిం యుగం ఈ అవిచ్ఛిన్న పరంపరను అడ్డుకుందని కూడా వాళ్ళు సూచించారు.

ఈ సాంస్కృతిక భావనే వివిధ రాజ్యాంగపు గుర్తులు, ప్రభుత్వ సంస్థల ఆదర్శ వాక్యాలలోనూ కనిపిస్తుంది. 
  • - పార్లమెంటులో స్పీకర్‌ కుర్చీకి పైన ‘ధర్మచక్ర ప్రవర్తనాయ’ (ధర్మచక్రాన్ని తిప్పుటకొరకు) అని చెక్కి ఉంటుంది. 
  • - ‘ధర్మ’ భావన హిందూ సంస్కృతిలో తప్ప మరెక్కడా కనిపించదు. (దీనిని మతంగా పొరబడు తుంటారు). 
  • - అలాగే  ‘లోక ద్వార మపావార్ను పశ్యేమ వయం త్వా’ (ఛాందోగ్యోపనిషత్తు) (ప్రజాశ్రేయస్సు కొరకు ద్వారాన్ని తెరచి వారికి ఉదాత్తమైన సార్వభౌమత్వ పథాన్ని చూపించు) అని ప్రవేశ ద్వారం వద్ద రాసి ఉంటుంది. 
  • - ఇక సెంట్రల్‌ హాల్‌ దగ్గర ‘అయం నిజ| పరోవేతి గణనా లఘు చేతసాం, ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం (పంచతంత్రం) (నావాళ్ళు, ఇతరులు అంటూ ఆలోచించటం సంకుచిత మార్గం. ఉదారశీలురైన వారికి సమస్త జగత్తు ఒకటే కుటుంబం) అని ఉంటుంది. 
  • - సభలోని ఒక గుమ్మటం లోపలి వైపున ‘న సా సభా యత్ర న సంతి వద్ధా| , వృద్ధా| న తే యే న వదంతి ధర్మం, ధర్మ| స నో యత్ర న సత్యమస్తి, సత్యం న తద్‌ యచ్ఛలమభ్యుపైతి (మహాభారతం) (పెద్దలు లేని సభ సభ కానేకాదు, ధర్మానికి అనుగుణంగా మాట్లాడనివారు వృద్ధుడే కాదు. సత్యం లేనిదే ధర్మం నిలువజాలదు. ఏ సత్యమైనా సరే వంచనకు, కపటత్వానికి తావు లేనిదిగా ఉండాలి) అని రాసి ఉంటుంది. 
  • - ఇక రెండవ గుమ్మటం లోపల ‘సభా వా న ప్రవేష్టాయ వక్తవ్యం వా సమంజసం, అబ్రువన్‌ విబ్రువన్‌ వాపి, నరో భవతి కిల్విషి (మనుస్మృతి) (సభలో ప్రవేశించకుండా ఉండడమో, లేక అందులో ఉంటే ధర్మానుగుణంగా మాట్లాడటమో చేయాలి. అసలు మాట్లాడనివారు, లేదా అసత్యంగాను, అధర్మంగానూ మాట్లాడేవారు పాపం చేస్తున్నట్లే) అని ఉంటుంది. 
ఇవే కాక అనేక ఆదర్శవాక్యాలు, సూక్తులు పార్లమెంటు గోడలపై కనిపిస్తాయి. ఇవన్నీ హిందూ సాంస్కృతిక విలువలేనని వేరే చెప్పక్కరలేదు.

__లోకహితం సౌజన్యం తో - విశ్వ సంవాద కేంద్రము
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top