మహా దార్శనికుడు లలితాదిత్యుడు - The great philosopher King Lalitaditya

0
మహా దార్శనికుడు లలితాదిత్యుడు -  The great philosopher King Lalitaditya
మహా దార్శనికుడు లలితాదిత్యుడు -  The great philosopher King Lalitaditya
మూడువేల ఆరువందల కిలోల బంగారంతో తయారు చేసిన పరిహాస కేశవమూర్తి విగ్రహం, 979 కిలోల బంగారంతో తయారు చేసిన ముక్త కేశవ మూర్తి విగ్రహం, అష్ట దిక్కుల నుంచి ఎటూ నేలకు ఆనకుండా ఉన్న నరహరి విగ్రహం, యాభై నాలుగు అడుగుల విష్ణు స్తంభం, అరవై రెండు వేల కిలోల రాగితో తయారు చేసిన బుద్ధ విగ్రహం ఇవన్నీ ఆయన నిర్మించినవే.

పటంలో లలితాదిత్యుని రాజ్యం!
 పటంలో లలితాదిత్యుని రాజ్యం!
ప్రపంచాన్ని జయించాలన్న నిర్ణయం తీసుకున్న ప్పుడు సునిశ్చితపురం అనే పట్టణాన్ని నిర్మించాడు. ఆయనకు ఫలం లభించిన చోట ఫలపురమనే పట్టణాన్ని నిర్మించాడు. పత్రం లభించిన చోట పర్ణోత్సనగరం నిర్మించాడు. ప్రజల బాగు కోసం లోకపుణ్య నగరాన్ని నిర్మించాడు. ఆయన గర్వాతి రేకంతో నిర్మించిన నగరం దర్పితపురం. ఇంద్రుడినే పరిహసించేలా ఆయన నిర్మించిన రాజధాని పేరు పరిహాసపురం. పరిహాసపురంలో నాలుగు పెద్ద విష్ణు మందిరాలున్నాయి. ఒకటి పరిహాస కేశవుడి మందిరం. మరొకటి ముక్త కేశవ మందిరం. ఇంకొ కటి మహా వరాహ మందిరం, నాలుగోది గోవర్ధన ధారా మందిరం. ఇవన్నీ ఆయన కట్టించినవే. చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూ ఈ మందిరాలు, ఈ నిర్మాణాల గురించి వినలేదు కదూ ! ఏ చరిత్ర పుస్తకం ఈ రాజు గురించి చెప్పలేదు కదూ !

పటంలో లలితాదిత్యుని రాజ్యం!
పటంలో లలితాదిత్యుని రాజ్యం!
కాబూల్‌ సరిహద్దుల నుంచి బంగాళాఖాతం వరకూ ఆయన రాజ్యం విస్తరించింది. చైనాతో చెలిమి చేసి అరబ్బులతో యుద్ధం చేసి, ఓటమికి చిహ్నంగా అరబ్బులను గడ్డం గీయించిన రాజాయన. తురుష్కుల నుంచి నేటి అఫ్గనిస్తాన్‌, నాటి గాంధారాన్ని విముక్తం చేసిన వాడాయన. ఆయన సైన్యంలో ఎంతో మంది చైనీయులుండేవారు. ఆయన ముఖ్య వ్యూహకర్త పేరు చానక్యున్‌. ఇతను చైనీయుడే. సమస్త భారతావనిని ఒక్క గొడుగు కిందకి తెచ్చేందుకు పూనుకుని బంగాళాఖాతం వరకూ, ఇటు సింధు నది, అటు కాబూల్‌ వరకూ రాజ్యాన్ని విస్తరించాడు. దక్షిణాపథాన్ని తన గొడుగు కిందకు తెచ్చేందుకు పల్లవులను ఓడించాడు. మధ్య ఆసియాపై దండయాత్రలు చేశాడు. చైనాలోని సింకియాంగ్‌ రాష్ట్రంలోని తుర్ఫన్‌, కుంచన్‌ సహా అనేక నగరాలను జయించాడు.

పటంలో లలితాదిత్యుని రాజ్యం!
 పటంలో లలితాదిత్యుని రాజ్యం!
సంస్కత సాహిత్యంలో భౌట్ట దేశంగా పేరు పొందిన టిబెట్‌పై ఆయన విజయం సాధించాడు. టిబెట్‌ను హస్తగతం చేసుకునేందుకు చైనా సామ్రాట్టును వ్యక్తిగతంగా కలిశాడు. చైనా చరిత్రలో ఆయనను ముతోపీ (ఇది ముక్తాపీడకు అపభ్రంశం అయి ఉండొచ్చు) అని పేర్కొన్నారు. అంటే ఆ రోజుల్లోనే చైనాతో చేతులు కలిపి అరబ్బులు, తుర్కులను ఓడించి ఒక వ్యూహాత్మక మైత్రితో అటు గాంధారం నుంచి త్రివిష్టపం (టిబెట్‌) దాకా, ఇటు మధ్య ఆసియా నుంచి హిందూ మహాసముద్రం దాకా ఒకే సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ఆయన స్వప్నించాడు. ఆయన విజయయాత్రలను కొందరు చరిత్రకారులు అలెగ్జాండర్‌ విజయయాత్రలతో పోలుస్తారు. ఆయనను కశ్మీర్‌ అలెగ్జాండర్‌ అని కూడా అంటారు. కాని, ఆయన గురించి మనదేశంలో ఎవరూ పెద్దగా మాట్లాడరు. పాఠ్య పుస్తకాల్లో ఆయనకు చోటుండదు. జాతి స్మతిపథం నుంచి ప్రయత్న పూర్వకంగా తొలగించేసిన ఆ రాజు పేరు లలితాదిత్య ముక్తాపీడ. ఆయన కశ్మీరానికి చెందిన కర్కోట వంశ రాజు.
   అతని పాలన బంగారు పాలన. అతని యుగం స్వర్ణయుగం. క్రీ.శ. 724 నుంచి 760 వరకు దాదాపు 36 సంవత్సరాల ఏడు నెలల పదకొండు రోజుల పాటు ఆయన పరిపాలించాడు. కాలువలు తవ్వించాడు, పూడికలు తీయించాడు, కరకట్టలు నిర్మించి భూములను వ్యవసాయయోగ్యం చేశాడు. ఆయన కాలంలోనే నీటిని పొలాలకు పారించేందుకు చక్రాలను తిప్పి ఎత్తిపోతలు చేసే ప్రక్రియ ప్రారంభ మైంది. ధర్మాన్ని కాపాడటం, దేశ సరిహద్దులను కాపాడటం, ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండేలా చేయడం ద్వారా ఆయన తన పాలనాకాలాన్ని స్వర్ణయుగంగా మార్చాడు.

నేటి కశ్మీర భూమిలోని మార్తాండ మందిరం ఆయన కాలంలోనే స్థాపించారు. అనంతనాగ్‌కి అయిదు కిలోమీటర్ల దూరంలో మొత్తం కశ్మీర్‌ లోయను, పీర్‌ పంజాల్‌ పర్వతమాలికను చూడగలిగే ఎత్తైన పర్వతాగ్ర పీఠభూమిపై ఆయన ఈ సువిశాల మందిరాన్ని నిర్మించాడు. ఈ మందిర నిర్మాణంలో నేటి అఫ్గనిస్తాన్‌కు చెందిన గాంధార శైలి, గంగా నదీ పరివాహక ప్రాంతాన్ని ప్రభావితం చేసిన గుప్త సామ్రాజ్య నిర్మాణ శైలి, చైనా నిర్మాణ శైలుల సమ మేళవింపు కనిపిస్తుంది. మార్తాండ మందిరం ఎంత సువిశాలమైదంటే ఇందులో 84 దేవతా మందిరాలుండేవి. పదిహేనవ శతాబ్దంలో సికందర్‌ బుత్‌షికన్‌ (బుత్‌షికన్‌ అంటే విగ్రహాలను విధ్వంసం చేసిన వాడని అర్థం) ఈ మందిరాలన్నిటినీ ధ్వంసం చేశాడు. పరిహాసపురంలో రాజ భవనం భగ్నావశేషాలు, ముక్క చెక్కలుగా మిగిలిన మార్తాండ మందిరం మాత్రమే నేడు లలితాదిత్యుని కథకు గురుతుగా మిగిలుంది.
   ఆయన పోరాడుతూ ముందుకు వెళ్తూ వెళ్తూ తన సైనికులను పిలిచి, తానిక రాజ్యానికి తిరిగి రానని, తన కుమారుడు కువలయాపీడుడిని రాజుగా ప్రకటించి, ఆయనకు రాజ్యపాలనా సూత్రాలను వివరించి వెళ్లిపోయాడని చెబుతారు. ఇలా కశ్మీర చరిత్రను ఆయన వెళ్లిపోయినా శతాబ్దాల పాటు ప్రభావితం చేశాడు లలితాదిత్యుడు. అందుకే లలితాదిత్యుడు ప్రాతస్మరణీయుడు.

అయితే ఆయన గురించిన చరిత్రను మరుగునపరిచేందుకు పనిగట్టుకుని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన టిబెట్‌లో చనిపోయాడని, అరేబియాలో చనిపోయాడని కథలు చెప్పారు. అదే విధంగా ఆయన చైనా చక్రవర్తికి సామంతుడనీ చెబుతున్నారు. ఉదాహరణకు ఇటీవల ఒక సదస్సులో ఐసిహెచ్‌ఆర్‌కు చెందిన రజనీశ్‌ శుక్ల లలితాదిత్యుడి గురించి ప్రశంసిస్తూ పది వాక్యాలు చెప్పగానే, వామపక్ష చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌ కల్హణ రాజతరంగిణి కట్టుకథ అని ప్రకటించాడు. కాని అదే కల్హణ రాజతరంగిణి ఆధారంగా కశ్మీర చరిత్ర రూపొందిందన్న విషయాన్ని ఆయన చాపకిందకి తోసే ప్రయత్నం చేశాడు. కల్హణ రాజతరంగిణి కొన్ని విషయాల్లో ప్రామాణికంగానూ, కొన్నిటిలో అప్రామాణికంగానూ ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఆయన జవాబివ్వలేకపోయాడు.

ఏది ఏమైనా దేశమంతా గర్వించదగ్గ మహా పాలకుడాయన. కశ్మీర్‌ చరిత్రను నేటికి ప్రభావితం చేస్తున్న మహా దార్శనికుడు లలితాదిత్యుడు.

– ప్రభాత్‌ _జాగృతి సౌజన్యం తో {full_page}

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top