బహుముఖ ప్రజ్ఞాశాలి… జాతీయోద్యమ నాయకుడు.. లోకమాన్య శ్రీ బాలగంగాధర్ తిలక్ - Sri Bal Gangadhar Tilak

Vishwa Bhaarath
Sri Bal Gangadhar Tilak
Sri Bal Gangadhar Tilak
`స్వరాజ్యం నా జన్మహక్కు, అది నేను సాధించి తీరుతాను; నా విశ్వాసాలను ఏ అస్త్రము ఛేధింపజాలదు, ఏ అగ్ని దహింపజాలదు, ఏ ప్రవాహం కొట్టుకునిపోజాలదు, ఏ ప్రభంజనం పెకిలిoపజాలదు’ అని గర్జించిన స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీ బాలగంగాధర్ తిలక్. ఆయన అనుయాయులు, ప్రజలు `లోకమాన్య’ అని గౌరవించారు. ఆయన బహుముఖ ప్రజ్ఞ్యాశాలి. జాతీయోద్యమ నాయకుడు, సంఘ సంస్కర్త, సంస్కృత పండితుడు, గణిత శాస్త్రజ్ఞ్యుడు, చరిత్రకారుడు, విద్వాంసుడు.  అప్పటి జాతీయ నాయకులు శ్రీ లాలా లాజపత్ రాయ్, శ్రీ బిపిన్చంద్రపాల్, శ్రీ అరవిందో ఘోస్ (తర్వాతి కాలంలో మహర్షి అరవిందులు)లతో కలసి  స్వదేశీ ఉద్యమాన్ని 1905లో కలకత్తాలో తీవ్రతరం చేసారు. విదేశీవస్తు బహిష్కరణ చేస్తూ, చేనేత మొదలైన దేశీయ ఉత్పత్తులను తిరిగి పునరుద్ధరించి, ప్రజలు భారతీయ జాతీయతను పెంపొందించుకోవాలని స్వదేశీ ఉద్యమ ముఖ్య ఉద్దేశం.
    బాలగంగాధర్ (కేశవ్) తిలక్ 23జులై1856లో మహారాష్ట్ర రత్నగిరిలో చిత్పావన్ బ్రాహ్మణ కుటుంబంలో  పార్వతీబాయి, గంగాధర్ తిలక్ లకు జన్మించారు, తండ్రి సంస్కృత పండితుడు. తరువాత ఆ కుటుంబం పూణే నగరంలో స్థిరపడ్డారు. డెక్కన్ కాలేజీనుంచి 1877సం.లో ఆయన గణితం, సంస్కృతంలో ప్రథమశ్రేణి పట్టభద్రులు.  1879లో ముంబై ప్రభుత్వ లా కాలేజి నుంచి న్యాయశాస్త్రంలో కూడా పట్టభద్రులైయారు.
 ఆయన చిన్నతనంనుంచీ స్వతంత్ర భావాలతో ఉండేవాడు, అన్యాయాన్ని ఎంతమాత్రం సహించేవారు కాదు. ఒక కాలేజిలో అధ్యాపకుడిగా ఉద్యోగం మొదలుపెట్టి, బ్రిటిషువారి విద్యావిధానం, భారత సంస్కృతిని, భారతీయులను చిన్నచూపు చూడడం నచ్చక, ఆయన తన స్నేహితులు విష్ణుశాస్త్రి చిప్లుంకర్, గోపాల్ గణేష్ ఆగర్కర్ లతో కలిసి 1880లో డెక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించి, జాతీయభావాలతో విద్యను బోధించే  పాఠశాలను  ప్రారంభించారు.
   ఆయన చిన్నతనంనుంచీ స్వతంత్ర భావాలతో ఉండేవాడు, అన్యాయాన్ని ఎంతమాత్రం సహించేవారు కాదు. ఒక కాలేజిలో అధ్యాపకుడిగా ఉద్యోగం మొదలుపెట్టి, బ్రిటిషువారి విద్యావిధానం, భారత సంస్కృతిని, భారతీయులను చిన్నచూపు చూడడం నచ్చక, ఆయన తన స్నేహితులు విష్ణుశాస్త్రి చిప్లుంకర్, గోపాల్ గణేష్ ఆగర్కర్ లతో కలిసి 1880లో డెక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించి, జాతీయభావాలతో విద్యను బోధించే  పాఠశాలను  ప్రారంభించారు.

స్వాతంత్ర్య ఉద్యమాన్ని వృద్ధిచేసే దిశలో ఆయన రెండు పత్రికలు కూడా ప్రారంభించారు, ఇంగ్లీషులో `మరాఠా’, మరాఠీలో `కేసరి’, 30 సంవత్సరాలు ఆయన నిరంతరం వీటిని నిర్వహించారు. వీటిల్లో ఎన్నో ఉత్తేజపూరితమైన రచనలు వచ్చేవి, ప్రజా సమస్యలకు పత్రికలు వేదిక కావాలని ఆయన ధ్యేయం. `కేసరి’ దినపత్రికగా నేటికీ వెలువడుతుండడం విశేషం.
   1890లోనే తిలక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మితవాదులైన గోపాలకృష్ణ గోఖలే వంటి అప్పటి కాంగ్రెస్ నాయకులు, బ్రిటిషు వారి ఆధీనంలోనే ఉంటూ,  బారతదేశ పరిమిత స్వయంప్రతిపత్తి కోసం పాలకులకు విజ్ఞ్యప్తి చేస్తుండేవారు. తిలక్ వారి పంథాను వ్యతిరేకించి పూర్ణస్వరాజ్యం కోసం పిలుపునిచ్చారు. లార్డ్ కర్జన్ 1905లో బెంగాల్ విభజన చేసినపుడు, లాల్-బాల్-పాల్ కలిసి `వందేమాతరం’ మరియు `స్వదేశి’ ఉద్యమాలను చేపట్టారు, అవి ఉధృతమైన ప్రజా ఉద్యమాలుగా వెల్లువెత్తి, బ్రిటిషువారు 1911లో తిరిగి బెంగాల్ ఏకీకరణ జరిపించేలా చేసింది.  బెంగాల్ విభజన ఉద్యమ నేపధ్యంలో జరిగిన 1907 సూరత్ కాంగ్రెస్ సమావేశంలో, మితవాదులకి- జాతీయవాదులకి (అతివాదులు) జరిగిన వివాదంలో కాంగ్రెస్ రెండు ముక్కలైంది. స్వదేశి ఉద్యమ విజయంతో ప్రజలు `లోకమాన్య’ తిలక్ ను గౌరవించి బ్రహ్మరథం పట్టారు.
జైలు జీవితం
1896లో దేశంలో భయంకరమైన కరువు పరిస్థితులు, ప్రభుత్వం కరువునివారణ చర్యలు ఏమీ చేపట్టలేదు. ముంబై పూణేల్లో   ప్లేగు వ్యాధి వ్యాపించినపుడు, అప్పటి కమిషనర్ `రాండ్’, సైన్యం సహాయంతో ప్రజలపై విపరీతమైన అణచివేత చర్యలతో వ్యాధి నివారణ ప్రయత్నాలు చేసాడు; ఈ చర్యలకు వ్యతిరేకంగా తిలక్ `కేసరి’ లోని రచనల స్ఫూర్తితో `చాపేకర్ సోదరులు’ రాండ్ ను హత్య చేసారు. దీనిపై 1897లో రాజద్రోహo నేరంకింద తిలక్ కు 18నెలల కఠిన కారాగార శిక్ష వేసారు.
   బెంగాల్ స్వదేశీ ఉద్యమంలో యువ విప్లవవీరులు ఖుదీరాం బోస్, ప్రఫుల్ల చాకి మాజిస్త్రేట్ కింగ్స్ఫోర్డ్ ను హత్య చేసే ప్రయత్నంలో, ఇద్దరు బ్రిటిషు వనితలు చంపబడ్డారు. `చాకి’ ఆత్మహత్యకు పాల్పడగా, అతి పిన్న వయసులోనే  ఖుదీరాం బోస్ ను ప్రభుత్వం ఉరితీసిoది. బ్రిటిషువారి  చర్యలను ఖండిస్తూ తిలక్ `కేసరి’లో రచన చేయగా, ఆయనకు తిరిగి రాజద్రోహo నేరంకింద, బర్మాలోని `మాండలే’ జైలులో1908-1914మధ్య,  6 సంవత్సరాల  కఠిన కారాగార శిక్ష వేసారు. `నేను నిర్దోషినని నా ధృఢ విశ్వాసం. నా కలం, ఉపన్యాసాలకన్నా, నా దుర్భర జైలు జీవితం వల్ల, నా దేశానికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందేమో. ఇదే దైవ నిర్ణయమైతే, అలాగే కానీయండి’ అని తన వాదన వినిపించిన ధీశాలి తిలక్.  ఆ జైలు కాలంలోనే ఆయన భార్య పుణేలో మరణించింది.
   6సం. తరువాత 1915లో ఆయన జైలునుంచి తిరిగి వచ్చినపుడు ప్రజలు ఆయనకీ ఘనస్వాగతం పలికారు. అప్పటికి ప్రపంచ పరిస్థితులు కూడా త్వరగా మారిపోతున్నాయి, మొదటి ప్రపంచయుద్ధం మొదలవుతోంది. ఆయన ఇతర జాతీయవాదులైన `ఆనీ బెసెoట్’ మొదలైన వారితో కలిసి 1916లో `అఖిల భారత హోం-రూల్ లీగ్’ స్థాపించి `హోంరూల్’ ఉద్యమాన్ని ప్రారoభించారు. అతి త్వరలోనే ఆ ఉద్యమం దేశమంతా వ్యాపించింది.  హిందూ-ముస్లిం ఐక్యత కోసం `లక్నో ఒప్పందం’ మీద జిన్నాతో కలిసి సంతకం చేసారు.
సాంఘిక సంస్కరణ
ఉన్నత ఉద్యోగాలను తిరస్కరించి అహర్నిశలు దేశంకోసం పాటుపడ్డ సమరయోధుడు వీర తిలక్. స్త్రీ విద్య గురించి ఉద్భోదిస్తూ జీవితమంతా శ్రమించాడు. 16సం వస్తేగాని స్త్రీలకు వివాహం చేయరాదని, తమ కుమార్తెలకు ఆ వయసు వచ్చాకే ఆయన వివాహం జరిపించాడు.  దేశభక్తి, సంస్కృతిమీద గౌరవం కలిగిస్తూ, ప్రజలను ఏకం చేస్తూ ఒక్క తాటి మీద నడిపించడానికి, ఆయన సార్వజనికoగా `గణేష్ చతుర్థి’ ఉత్సవాలు, `శివాజీ జయంతి’ ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించి, స్వాతంత్ర్య ఉద్యమంలో కొత్త ఒరవడిని సృష్టించారు. అవి ఈనాడు దేశంలో చాలా ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. 
రచనలు
జైల్లో కఠిన శిక్ష అనుభవిస్తూ ఆయన ఎన్నో మహద్గ్రంధాలు వ్రాసారు. ఆయన భగవద్గీత వ్యాఖ్యానం `గీతా రహస్యం’ నిగూఢమైన నిర్వచనాలు ఎన్నో తెలిపింది; కర్మయోగానికి, మనిషి క్రియాశీలతకి కొత్త నిర్వచనం చెప్పింది. `ఆర్కిటిక్ హోం అఫ్ వేదాస్’, `ఓరియన్’ (నక్షత్ర సమూహం) ఆయన ఇతర రచనలు.
  1918లో ఇంగ్లాండ్ యాత్రలో అక్కడి `లేబర్ పార్టీ’ బలపడుతుండడం గమనించి, భారత దేశ ప్రయోజనాలు భవిష్యత్తులో వారివల్ల నెరవేరవచ్చనే ఊహతో వారిని కలిసారు. తిరిగి మాతృదేశం చేరుకున్న కొద్ది కాలంలోనే,  1919 వైశాఖి పండుగరోజు పంజాబ్ జలియన్వాలా ఊచకోత ఘోరకృత్యాన్ని విని ఆయన తట్టుకోలేకపోయారు.  మరొక ఉద్యమానికై పిలుపునిచ్చారు. అంతకుముందు జైలు జీవితంలో క్షీణించిన ఆరోగ్యం కుదుటపడలేదు. స్వయంగా వెళ్లలేకపోయారు. 1ఆగస్ట్1920 తేదీన స్వాతంత్ర్య సమరయోధుడు, తరువాతి తరం నాయకులకు స్ఫూర్తిప్రదాత లోకమాన్య తిలక్ మరణించారు. ఆయన మరణవార్త తెలియగానే, రెండులక్షలమందికి పైగా ప్రజలు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడానికి ముంబైలో ఆయన ఇంటికి వచ్చేసారు. మహాత్మాగాంధీ కూడా ఆయన శవావాహకులయారు, `నవభారత నిర్మాత’ గా ఆయన తిలక్ ని అభివర్ణించారు.

తిలక్ `సంపూర్ణ రచనలు’ గ్రంథానికి ముందు మాట వ్రాస్తూ మహర్షి శ్రీ అరవింద ఇలా అంటారు.`తిలక్ పరబ్రహ్మ స్వరూపం లాగా స్వయంప్రకాకులు, ఆయన ప్రసంగాలు సూటిగా స్వచ్చంగా ఉంటాయి. దేశ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ఆయన జీవితం, ఆయన వ్యక్తిత్వం, ఆయన ప్రతిభ, ఆయన కార్యాచరణ, ఆయనపట్ల ప్రజలకున్న విశ్వాసం కారణంగా, పేరు `స్వదేశి-స్వరాజ్య-హోం రూల్’ ఏమైనా కావచ్చు, తిలక్ ప్రథమశ్రేణి దేశ నాయకులవడం అనివార్యం. వాదనలు ప్రసంగాలు దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టవు, కాని దేశానికి స్వేఛ్చ కావాలని సంకల్పం ఉంటే, ప్రతిక్షణం, ప్రతి చర్య ఆ సంకల్పం కోసం అహర్నిశలు దీక్షతో శ్రమిస్తున్న క్రియారూపమే తిలక్. దేశ మనః-సంకల్పానికి ఉన్న ధ్యేయ రూపమే తిలక్. అందుకే ప్రజలకు ఆయనంటే అంత గురి, అది చాలామంది నాయకులలాగా, పరపతి, కుటుంబం, సంపద, ప్రభుత్వ గుర్తింపు నుంచి వచ్చినవి కావు, ఆయన మనసా వాచా నమ్మిన జీవన లక్ష్యం నుంచి వచ్చినవి. ఆయన జీవితమే దేశానిది.
   తిలక్ బహుముఖ ప్రజ్ఞ్య ఆయన ఏ రంగం ఎంచుకున్నా అందులో నిష్ణాతుడిగా పేరు, ఆదాయం వచ్చి ఉండేది. ఆయన ఎపుడూ న్యాయవాది వృత్తి చేపట్టకున్నా, సంపూర్ణమైన చట్ట పరిజ్ఞ్యానం ఉన్నవాడు. నిశితమైన మేధస్సు ఉన్న సంస్కృత విద్వాంసుడు, ఆయన రచనలు`ఆర్కిటిక్ హోం అఫ్ వేదాస్’, `ఓరియన్’ ప్రాచ్య గ్రంథాల పరిశోధనలో ఆయనకు ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చాయి. ఆయన `గీతా రహస్యం’ మూల రచన, నైతిక సత్యాలను తెలిపిన ఉద్గ్రంథం. ఆయన తత్త్వవేత్తగా స్థిరపడి ఉండవచ్చు, కాని ఆయన తన ప్రతిభను దేశంకోసం పత్రికా రచనలు చేయడంలో ధార పోశారు.
    తిలక్ చేసిన ఉత్కృష్ట కార్యం, ప్రజల రాజకీయ మేధస్సును తట్టిలేపడo మాత్రమే కాదు; దేశ భవిష్యత్తును, గడిచిపోయిన గతాన్ని కలుపుతూ,  ప్రజల ఆత్మను ఆయన జాగృతం చేసారు.  శివాజీ, గణపతి ఉత్సవాలు నిర్వహిస్తూ, ధార్మిక దేశాన్ని ప్రజాస్వామ్య రాజకీయాలకు అనుసంధించారు. పాశ్చాత్య విద్య- ఆదార్శాలు- పద్ధతులకి, ఇంగ్లీషు విద్య తెలిసినవారికి మాత్రమే కాంగ్రెస్ ప్రతిఘటన పరిమితమైపోయింది. కాంగ్రెస్ ప్రతిఘటనకి,  ఈ దేశ సంస్కృతిక మూలాలకి- అంతర్గత చైతన్యానికి ఏమాత్రం సంబంధం ఉండేది కాదు.  గతానికి –ప్రస్తుతానికి వారధిని నిర్మించి, మన జాతి రాజకీయ ప్రస్థానాన్ని గతంనుంచి భవిష్యత్తులోకి కొనసాగించినవారు తిలక్. నూతన చైతన్యాన్ని, ఒరవడిని, దానికి కావలసిన భాషను సమకూర్చుకుని, కొత్త పద్ధతుల ద్వారా స్వాతంత్ర్య ఉద్యమానికి  భారతీయతను ఆపాదించి, దానిని తిలక్ ప్రజలపరం చేసారు.”      
__విశ్వ సంవాద కేంద్రము
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top