–ఏ సూర్య ప్రకాష్
చరిత్రలో కొన్ని సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే. వాటి విశ్లేషణ చాలా ముఖ్యం. ఆ సంఘటనల కారకులు. వారి అహంకారం. కేవలం పదవిని కాపాడుకోవడం కోసం దేశ భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టే వారి స్వార్థపరత్వం. అటువంటి మూర్ఖత్వాన్ని సమర్థించిన వ్యక్తుల స్వార్థం. ఆ అరాచకాన్ని నిరసిస్తూ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన నాయకులను తలచు కోవటం చాలా అవసరం.అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ) హీరోలను గుర్తుంచుకోవడంలో విఫలమైతే, దాని విలన్లు ఎవరో మరచిపోతే, మన ప్రజాస్వామ్య జీవన విధానాన్ని పరిరక్షించలేము.
జూన్ నెల దానితో తెచ్చే భయంకరమైన వేడి కాకుండా, జూన్ 25, 1975 న కాంగ్రెస్ ప్రధాని ఇందిరా గాంధీ దేశంపై విధించిన నిరంకుశ అత్యవసర పరిస్థితి బాధాకరమైన జ్ఞాపకాలను కూడా తిరిగి తెస్తుంది. పౌరుల ప్రాథమిక హక్కులు మాత్రమే కాదు, జీవించే హక్కు కూడా కాల రాసిన కాలం అది . ప్రజాస్వామ్యం ఎలా పట్టాలు తప్పిందో, భారతదేశం ఒక నియంతృత్వ పాలనలో ఉన్నప్పుడు ఏమి జరిగిందో అర్థం చేసుకోవడానికి 1975-77 నాటి సంఘటనలను మనం గుర్తు చేసుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్య జీవన విధానాన్ని మనం కాపాడుకోగలం. అలాగే మన రాజ్యాంగంలోని ప్రధాన విలువలను కాపాడుకోవాలనుకుంటే కూడా ఇది అవసరం.
మనం ఎప్పటికీ మరచిపోకూడని హీరోలు :
- ఇందిరా గాంధీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి, చివరికి మార్చి, 1977 లో ప్రజాస్వామ్యాన్ని పట్టాలపైకి తేవడంలో రాజకీయ, సామాజిక నాయకులు, కార్మికుల త్యాగం అపూర్వమైనది. వారిలో జయప్రకాష్ నారాయణ్, అటల్ బిహారీ వాజ్‌పేయి . చంద్రశేఖర్. జార్జి ఫెర్నాండేజ్. ఎల్ కే అద్వానీ. చరణ్ సింగ్. మధు దండావతే. మొరార్జీ దేశాయి. నానాజీ దేశ్ ముఖ్. రామకృష్ణ హెగ్డే. సికిందర్ భక్త్. నరేంద్ర మోడి. హెచ్ డి దేవగౌడ. లాలూ ప్రసాద్ యాదవ్. నితీష్ కుమార్ మొదలైన అనేక నాయకులున్నారు.
- ప్రజాస్వామ్యం పునరుద్ధరణలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ (మీసా) కింద జైలు శిక్ష అనుభవించిన 6,330 మందిలో 4,026 మంది ఆర్‌ఎస్‌ఎస్, జనసంఘ్ (భారతీయ జనతా పార్టీకి పూర్వ సంస్థ ) కు చెందినవారు. వారిలో, పైన పేర్కొన్న వారిలో కొంతమందితో పాటు, అప్పటి ఆర్ఎస్ఎస్ సర్ సంఘ చాలక్ బాలసాహెబ్ దేవరస్, ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్, అనంత్ కుమార్, రామ్ విలాస్ పాశ్వాన్ మొదలైనవారు ఉన్నారు. బిజెపి ఎంపి డాక్టర్ సుబ్రమణియన్ స్వామి రెండుసార్లు ప్రభుత్వం కన్నుగప్పి విదేశాలకు వెళ్ళి అక్కడి భారతీయ సమాజాన్ని చైతన్య పరిచారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి ఆర్ఎస్ఎస్ ప్రచారక్, మారు వేషాలతో తిరుగుతూ , ఉద్యమాన్ని నిర్వహించడం, అత్యవసర పరిస్థితి వ్యతిరేక సాహిత్యాన్ని పంపిణీ చేయడం, జైలు శిక్ష అనుభవిస్తున్న నాయకుల కుటుంబాలకు సహాయం చేయడం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు.
- గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన వ్యక్తి జస్టిస్ హెచ ఆర్ ఖన్నా. సుప్రీంకోర్టులో ADM, జబల్పూర్ వర్సెస్ శివ్ కాంత్ శుక్లా కేసు (హేబియస్ కార్పస్ కేసు అని కూడా పిలుస్తారు) ను పరిష్కరించి ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ లో ఈయన ఒకరు. ఏదైనా ప్రజాస్వామ్య హక్కులు లేకపోవడం వల్ల అరాచకత్వం ఏర్పడే అవకాశం ఉంది. అటార్నీ జనరల్, నిరెన్ డే, పౌరులకు జీవించే హక్కు , వ్యక్తిగత స్వేచ్ఛ లేదని ప్రభుత్వ అభిప్రాయాన్ని అంగీకరించమని ఒత్తిడి చేశారు కూడా. ఒక పోలీసు అధికారి వ్యక్తిగత శత్రుత్వం వల్ల ఒక వ్యక్తిని చంపినట్లయితే న్యాయ పరిహారం ఉంటుందా,లేదా అని జస్టిస్ ఖన్నా ఆయనను అడిగారు.
- “అవును, న్యాయ పరిహారం ఉండదు” అని నిరెన్ డే నిర్లక్ష్యం గా అన్నారు. కోర్టు గదిలో ఉన్నవారు ఈ వాదనను చూసి ఆవాక్కైపోయారు. జస్టిస్ ఖన్నా తన ఆత్మకథలో బెంచ్‌లోని ఇతర న్యాయమూర్తులు – చీఫ్ జస్టిస్ ఎఎన్ రే మరియు జస్టిస్ ఎంహెచ్ బేగ్, వైవి చంద్రచూడ్ మరియు పిఎన్ భగవతి – ఇవన్నీ జరిగినప్పుడు ‘ బెల్లం కొట్టిన రాయిల్లా’ ఉండి పోవడం తనకు దిగ్భ్రాంతి కలిగించింది గుర్తుచేసుకున్నారు కూడా. చివరికి, జస్టిస్ ఖన్నా తప్ప మిగిలిన వారందరూ ప్రభుత్వ అభిప్రాయాన్ని సమర్థించారు. పౌరుడి జీవన హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛా హక్కును కూడా హరించేశారు. జస్టిస్ ఖన్నా అసమ్మతి స్వరం పర్యవసానం. ఆయన సీనియారిటీ పక్కన పెట్టి మరీ. ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో ని ప్రభుత్వం. జస్టిస్ బేగ్‌ను ప్రధాన న్యాయమూర్తి గా ప్రకటించింది. అందుకే ప్రజాస్వామ్యానికీ, ప్రాథమిక హక్కులకు విలువ ఇచ్చే వారందరికీ జస్టిస్ ఖన్నా హీరోగా మిగిలిపోయారు.
మనం క్షమించకూడని వ్యక్తులు మరియు మరచి పోగూడని సంఘటనలు :
- ఇందిరా గాంధీ: ప్రజాస్వామ్యాన్నినియంతృత్వంగా మార్చినందుకు; తనను తాను రక్షించుకోవడానికి రాజ్యాంగం, ఎన్నికల చట్టాలతో ఆడుకున్నందుకు; ఉన్నత న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేయడానికి 42 వ సవరణను తీసుకువచ్చినందుకు; అలాగే కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగాన్ని సవరించడానికి రాష్ట్రపతికి అధికారం ఇవ్వడం కోసం ప్రయత్నించి రాజ్యాంగ మూల స్ఫూర్తి ని అపహాస్యం చేసినందుకు ఆమెను క్షమించలేము.
- కాలికట్‌లోని ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి పి.రాజన్‌ను దారుణంగా హింసించి హత్య చేసిన కేరళ పోలీసులకు ఇప్పటికీ శిక్షపడలేదు
- లారెన్స్ ఫెర్నాండెజ్‌ను చాలా నెలలు హింసించిన కర్నాటక పోలీసులు శిక్షించబడలేదు
- సెన్సార్‌షిప్ విధించిన ఇందిరా గాంధీ ప్రభుత్వంలో సమాచార మరియు ప్రసార మంత్రి వి.సి. శుక్లా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌పై ప్రభుత్వ నియంత్రణ కోసం విశ్వప్రయత్నం చేశారు. వార్తాపత్రిక కార్యాలయాలపై దాడి చేయడానికి, మూసివేయడానికి జిల్లా న్యాయాధికారులకు అధికారం ఇచ్చే కఠినమైన ప్రెస్ వ్యతిరేక చట్టాలను ఆమోదించారు. మహాత్మా గాంధీ, ఠాగూర్ ల రచనలు కూడా ప్రచురించకూడదని వార్తాపత్రికలపై ఆంక్షలు విధించేంత మూర్ఖత్వాన్ని శుక్లా ప్రదర్శించారు. తాము కోరిన పాటను పాడలేదని . కిషోర్ కుమార్ పాడిన ఏ పాటనూ ప్రసారం చేయవద్దని ఆల్ ఇండియా రేడియోను శుక్లా గారు ఆదేశించారు.
- ఇందిరా గాంధీ రాజకీయ ఖైదీలను ‘తల్లిలా’ సంరక్షిస్తున్నారని, “మంచి ఆహారం, అవసరమైన వైద్య సదుపాయాలు కల్పిస్తూ ఖైదీలపట్ల అధికారులు చూపిన శ్రద్ధ తల్లిలా ఉన్నాయని మేము అర్థం చేసుకున్నాము” అని జస్టిస్ బేగ్, ‘హేబియాస్ కార్పస్’ తీర్పులో అన్నారు.
- నవీన్ చావ్లా, అప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యదర్శి కిషన్ చంద్, రాజ్యాంగేతర అధికారశక్తి గా అవతరించారు. చాలా మంది రాజకీయ ఖైదీలను ఉంచడానికి స్థలం లేదని తిహార్ జైలు సూపరింటెండెంట్ చెప్పినప్పుడు, వారిని రేకులతో నిర్మించిన జైలు గదుల్లో ఉంచాలని, “వేడి లో మాడనివ్వండి ” అని చావ్లా ఆదేశించాడు. “ఇంకా స్థలం సరిపోక పోతే కొంతమందిని మతి స్తిమితం తప్పిన నేరస్తుల తో కలిపి ఉంచండి” అని కూడా ఆదేశించాడు. జైళ్లలోని పరిస్థితుల గురించి జస్టిస్ బేగ్ ఎంత అనాలోచితంగా ఉన్నారో షా కమిషన్ ముందు చావ్లాకు వ్యతిరేకంగా వచ్చిన సాక్ష్యం చక్కగా నిరూపించింది.
- మధ్యయుగ నిరంకుశత్వాన్ని ప్రదర్శించడమేకాక, తన మాట విననివారి జీవితాలను, వృత్తిని నాశనం చేయడానికి ప్రయత్నించిన హర్యానా ముఖ్యమంత్రి, తరువాత ఇందిరా గాంధీ అత్యవసర మంత్రివర్గంలో రక్షణ మంత్రిగా పనిచేసిన బన్సీ లాల్ అకృత్యాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. అతను స్వయంగా సామూహిక కుటుంబానియంత్రణ శిబిరాలను పర్యవేక్షించాడు. హరియాణలో ముస్లింలు ఎక్కువగా నివసిస్తున్న ఉత్తవర్ గ్రామంపై దాడి ఆయన ఘనకార్యమే. పోలీసులు ట్రక్కులలో వచ్చారు, గ్రామాన్ని చుట్టుముట్టారు, 8 నుండి 80 సంవత్సరాల వయస్సు గల పురుషులను బయటకు పిలిచి, వారిని బలవంతంగా కుటుంబానియంత్రణ ఆపరేషన్ చేసే శిబిరానికి తీసుకువెళ్లారు. చాలావరకు ఉత్తర భారత రాష్ట్రాల్లో, పాఠశాల ఉపాధ్యాయులు, పోలీసులకు కుటుంబానియంత్రణ ఆపరేషన్ కోటాలు ఇవ్వబడ్డాయి. అనేక సందర్భాల్లో, ఉపాధ్యాయులు కూడా చేయించుకోవలసి వచ్చింది. ఆపరేషన్ కు ఒప్పుకొని వారిని భయంకరమైన MISA కింద జైలులో పెట్టారు.
ఇది పూర్తి జాబితా కాదు. కానీ, అత్యవసర పరిస్థితి విలన్లను గుర్తుంచుకోవడంలో, ఆ అణచివేత రోజుల నుండి సరైన పాఠాలు నేర్చుకోవడంలో విఫలమైతే, మన ప్రజాస్వామ్య జీవన విధానాన్ని పరిరక్షించలేము.
(రచయిత చైర్మన్, ప్రసార భారతి) __విశ్వ సంవాద కేంద్రము