వీర పురుషుడు 'చంద్రశేఖర్ ఆజాద్' - Brave man 'Chandrasekhar Azad' -

Vishwa Bhaarath
0
వీర పురుషుడు 'చంద్రశేఖర్ ఆజాద్' - Brave man 'Chandrasekhar Azad' -
ర పీడనలో నలిగిపోతున్న భారతదేశ సర్వ స్వతంత్రత కోసం అహింసా పద్ధతిలో కొంతమంది పోరాడితే, మరికొంతమంది వీరులు విప్లవ భావాలను ప్రచారం చేసి ప్రజలను చైతన్యవంతులను చెయ్యడం మాత్రమే కాక, దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా ఈ భూమి మీద వారి రక్తాన్ని చిందించి దేశ భక్తిని చాటుకున్నారు. అటువంటి వీర పురుషులు, త్యాగధనులలో చంద్ర శేఖర్ ఆజాద్ అగ్రగణ్యుడు. బాల్యదశ నుండి అతడు బ్రిటిష్ వారి మీద విప్లవ సమర శంఖం పూరించాడు.

1906లో సీతారాం తివారి, జగ్రానీ దేవి అనే నిరుపేద దంపతులకు జన్మించిన చంద్రశేఖర్ కు చిన్నతనం నుంచే సాహస కార్యాలపై మక్కువ ఎక్కువ. ఫిరంగి ఆటకు మందుగుండు కొనాలంటే చాలా ఖర్చవుతుంది. ఆ ఖర్చుకి తన తండ్రి పనిచేసే తోటలోని పండ్లు కోసి అమ్మి మందుగుండు కొన్నాడు. ఆ విషయం తెలిసిన తండ్రి చంద్రశేఖర్ ని తీవ్రంగా దండించాడు. తోట తండ్రి స్వంతం కాదని తెలుసుకున్న చంద్రశేఖర్ తను చేసినది దొంగతనం కనుక ఇకపై ఎప్పుడూ ఇటువంటి పని చెయ్యరాదని దృఢంగా నిశ్చయించుకున్నాడు. చంద్ర శేఖర్ లో దొంగతనం, అసత్యం, అవమానాలపై విపరీతమైన విముఖత ఏర్పడింది. కాశీలో ఒక విద్యా సంస్థలో చేరి సంస్కృతం మీద పట్టు సాధించాడు. అనేక ప్రాచీన గ్రంధాలను అధ్యయనం చేసిన చంద్ర శేఖర్ కు మన దేశము, సంస్కృతుల పట్ల గౌరవం పెరిగింది.

వీర పురుషుడు 'చంద్రశేఖర్ ఆజాద్' - Brave man 'Chandrasekhar Azad' -

1921లో విదేశీ వస్తు బహిష్కరణోద్యమంలో పాల్గొని 14, 15 ఏండ్ల విద్యార్థులకు నాయకత్వం వహించి ఊరేగింపు జరుపగా చంద్రశేఖర్ ను అరెస్టు చేశారు. కోర్టులో మేజిస్ట్రేటు పేరడిగితే ‘ఆజాద్” అని సమాధానమిచ్చాడు. ‘ఆజాద్’ అంటే సర్వ స్వతంత్రుడని అర్థం. మేజిస్ట్రేట్ ఆజాద్ కు పదిహేను కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు. దేశభక్తి పూరితమైన నినాదాలు చేస్తూ ఆ శిక్షను అనుభవించాడు ఆజాద్.
   కానీ కోర్టు విధించిన శిక్ష, పోలీసుల యొక్క అవమానకర ప్రవర్తనతో తీవ్రమైన ఆత్మాభిమానం కలిగిన ఆజాద్ ఇక తానెప్పుడూ పోలీసులకు చిక్కనని, అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమే తప్ప సజీవంగా మాత్రం పోలీసుల చేతికి చిక్కనని, ఆజాద్ గానే జీవిస్తానని, మరణాన్నయినా ఆజాద్ గానే స్వీకరిస్తానని ఒక బహిరంగ సభలో ప్రకటించాడు. విద్యాభ్యాసం కొనసాగించాలనుకున్న ఆజాద్ దృష్టి చదువు మీద నిలవలేదు. రష్యన్ విప్లవం, ఫ్రెంచ్ విప్లవం గురించిన సమాచారం చదివి ఉత్తేజితుడయ్యాడు.

అనేక రాష్ట్రాలు, పట్టణాలలో పర్యటిస్తూ అనేక మంది విప్లవకారుల్ని కలుసుకుని వారితో చర్చలు జరిపేవాడు. ఆ రోజుల్లో సాయుధులైన విప్లవకారులు కొందరు ఆశ్రయం కోసం, ఆహారం కోసం అమాయకులైన కొందరు సామాన్యులపై తమ ప్రతాపాన్ని చూపుతూ ఉండేవారు. విప్లవకారులు ఆకలితో అలమటించి చనిపోయినా ఫర్వాలేదు కానీ, అమాయకుల్ని ఏమీ చెయ్యకూడదని, దేశ ద్రోహుల్ని దండించడానికే సాయుధ పోరాటమని నొక్కి చెప్పేవాడు ఆజాద్. అలాంటి వారందరూ ఆయన వాదనకు తల వంచారు.
    లాలా లజపతిరాయ్ ని గాయపరచిన సాండర్స్ ని చంపడానికి చంద్ర శేఖర్ ఆజాద్, భగత్ సింగ్, జయగోపాల్ లు వ్యూహం పన్ని సాండర్స్ ను హతమార్చారు. లాహోర్లో పోలీసులు వీరికోసం అణువణువూ గాలిస్తున్నారు. 1920 అక్టోబర్ 7న భగత్ సింగ్ ప్రభృతులకు ఉరిశిక్ష విధించారు. ఈ వార్త విన్న ఆజాద్ కృంగి పోయాడు. ఈ తీర్పుకు వ్యతిరేకంగా వైశ్రాయ్ ప్రయాణం చేసే రైలు పెట్టెను పేల్చి వేసేందుకు పథకం వేశారు. కాంగ్రెస్ అభ్యర్ధన మేరకు ఆజాద్ ఆ పథకాన్ని వాయిదా వేశాడు. అయితే ఆజాద్ కు తెలియకుండా ఆయన అనుచరుడు యశ్ పాల్ రైలు పెట్టెను పేల్చివేశాడు. కానీ వైశ్రాయ్ ప్రాణాలతో బయటపడ్డాడు.

ఆ తర్వాతి రోజే ప్రారంభమైన కాంగ్రెస్ మహాసభల్లో మహాత్మా గాంధీ వైశ్రాయ్ రైలు క్రింద బాంబు ప్రేలుడును ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. చాలా మంది కాంగ్రెస్ సభ్యులకు ఆ తీర్మానం పై విముఖత ఉన్నా గాంధీజీని కాదనలేక ఓట్లేశారు. స్వల్ప మెజారిటీతో ఆ తీర్మానం నెగ్గింది. అంతే కాక గాంధీజీ విప్లవకారులను, వారి మార్గాన్ని, పద్ధతులను, వారి ఉద్దేశ్యాలను నిశితంగా విమర్శిస్తూ ‘యంగ్ ఇండియా’ పత్రికలో ఒక వ్యాసం వ్రాశారు. ఈ విషయాలు తెలిసి గాంధీజీ వంటి వారు కూడా తమ విప్లవోద్యమాన్ని అపార్థం చేసుకున్నందుకు ఆజాద్ చాలా బాధపడ్డాడు. ప్రజల మనస్సుల్లో విప్లవోద్యమం పట్ల అపోహలను కలిగించే గాంధీజీ వంటి వారి ప్రచారాన్ని త్రిప్పికొట్టడం కోసం ‘బాంబు తత్వం’ పేరుతో ఒక కరపత్రాన్ని తయారు చేసి అనుచరుల సాయంతో విస్తృతంగా పంచారు.
    కాకోరీ ఉదంతం తర్వాత ఆజాద్ కోసం పోలీసుల గాలింపు అధికమైంది. మరో వైపు ఆజాద్ అనుచరులందరూ అమరులయ్యి కొందరు, అరెస్టయ్యి కొందరు, ఆంగ్లేయులు చూపిన ఆశలకు లొంగి విప్లవ ద్రోహులుగా మారి కొందరు, సుఖ లాలసతో విలాసవంతమైన జీవితం గడుపుతూ కొందరు ఇలా చాలా మటుకు దూరమయ్యారు.

1931 ఫిబ్రవరిలో మహాత్మా గాంధీ, వైశ్రాయ్ ల మధ్య జరిగిన ఇర్విన్ ఒడంబడిక ప్రకారం స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలు పాలైన వారిని విడుదల చేయవలసి వుంది. ఈ సందర్భంగా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ప్రభృతులను కూడా విడిపించుకోవాలని ఆజాద్ తాపత్రయ పడ్డాడు. అయితే గాంధీజీ తాను అహింసా వాదిని కనుక హింసావాదులను విడిపించడం కోసం తానేమీ చేయలేనని చెప్పారు. పండిట్ నెహ్రూ నుంచి కూడా ఆజాద్ కు ఎలాంటి సహకారము లభించలేదు. వారి ధోరణి ఆజాద్ కి చాలా దుఃఖం కలిగించింది.
    మార్చి 23న భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లను ఆంగ్లేయ ప్రభుత్వం ఉరి తీసింది. ఆ సంఘటనకు 24 రోజుల ముందే చంద్ర శేఖర్ ఆజాద్ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఆపాటికే ఆజాద్ ను పట్టిచ్చిన వారికి ముప్పై వేల రూపాయల బహుమతిని ఆంగ్లేయ ప్రభుత్వం ప్రకటించి ఉంది. ఆయనను సజీవంగా లేక నిర్జీవంగా పట్టుకునే పనిని ప్రభుత్వం తన గూఢచారి విభాగంలోని సబ్ ఇన్స్పెక్టర్ రాయ్ శంభునాథ్ కు అప్పగించింది. చంద్ర శేఖర్ ఆజాద్ అనుచరుల్లో ఒకడైన వీరభద్ర తివారీ ఆంగ్లేయ ప్రభుత్వమిచ్చే నెలకు రెండు వందల రూపాయల జీతానికి ఆశ పడి ఆజాద్ కదలికలపై పోలీసులకు సమాచారమివ్వడం మొదలుపెట్టాడు.

1931 ఫిబ్రవరి 27 శుక్రవారం నాడు కొందరు అనుచరులను ఆల్ఫ్రెడ్ పార్కులో కలిసి చర్చించాలని నిర్ణయమైంది. ఈ విషయాన్ని వీరభద్ర తివారీ పసిగట్టి సబ్ ఇన్స్పెక్టర్ రాయ్ శంభునాథ్ కు సమాచారమిచ్చాడు. ఆజాద్ ఆల్ఫ్రెడ్ పార్కు వైపు వెళ్తుండడం ఒక గూఢచారి గమనించాడు. పరుగు పరుగున వెళ్ళి సబ్ ఇన్స్పెక్టర్ కు సమాచారమిచ్చాడు.
    ఆల్ఫ్రెడ్ పార్కులో సహచరుడితో సంభాషిస్తున ఆజాద్ ను 80 మంది సాయుధ పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. పోలీసు సూపరింటెండెంటు నాట్ బావర్ వచ్చీ రావడంతోటే ఆజాద్ తొడపై తుపాకితో కాల్చాడు. వెంటనే తేరుకున్న ఆజాద్ మెరుపులా తన జేబులోని రివాల్వర్ తీసి నాట్ బావర్ చేతిని కాల్చాడు. చుట్టూ మూగిన పోలీసుల కాల్పులను తప్పించుకుంటూనే తన సహచరుణ్ణి అక్కడి నుంచి తప్పించాడు. తుపాకుల మోత విని చుట్టుపక్కల వేల మంది జనం, కాలేజి విద్యార్థులు పార్కు చుట్టూ గుమికూడారు.

వీర పురుషుడు 'చంద్రశేఖర్ ఆజాద్' - Brave man 'Chandrasekhar Azad' -

హిందూస్థానీ పోలీసు బంధువుల్లారా ! నేను మీ అందరి స్వాతంత్ర్యం కోసమే పోరాడుతున్నాను. ఎందుకు మీరు కూడా నా మీద గుళ్ళు కురిపిస్తున్నారు? కొంచెం ఆలోచించండి.” అన్న ఆజాద్ విజ్ఞప్తి బ్రిటిష్ వాళ్ళు విసిరే జీతం రాళ్ళకు ఆశపడే పోలీసుల తలకెక్కలేదు. ఆజాద్ పార్కు చుట్టూ గుమికూడిన వేలాది జనం సాక్షిగా ప్రళయకాల రుద్రుడిలా విజృంభించి పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలాగా ఒంటరిగా వంద మంది శతృవులతో ముప్పై రెండు నిముషాలు సింహ పరాక్రమంతో పోరాడాడు ఆజాద్. విప్లవ చరిత్రకే మకుటాయమానమైన పోరాటమది.
   ఆజాద్ వద్దనున్న గుళ్ళన్నీ అయిపోయాయ్. చివరి గుండు. పదేళ్ళ క్రితం వారణాశిలో తాను జీవించి వుండగా పోలీసుల చేజిక్కనని, జీవితాంతం ఆజాద్ గానే జీవిస్తానని చేసిన ప్రతిన గుర్తుకొచ్చింది. ఆజాద్ చేతిలోని రివాల్వర్ తన తల దగ్గరకెళ్ళింది. ఆ చివరి గుండు 24 ఏండ్ల ఆజాద్ తలని ఛిద్రం చేసింది. ఒక వీర కిశోరం నేలరాలింది. ఒక ధృవతార నింగికేగింది.

వీర పురుషుడు 'చంద్రశేఖర్ ఆజాద్' - Brave man 'Chandrasekhar Azad' -

నేటి తరానికే కాదు భావి తరాలకు సైతం ఆదర్శం ఆజాద్. నీతి, నిజాయితీ, స్త్రీల పట్ల గౌరవం, ఆశయ సాధనకు కట్టుబడి ఉండడం ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన ఆదర్శాలు.

__విశ్వ సంవాద కేంద్రము 
జైహింద్ 

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top