కొత్త అనాథలుగా బాలబాలికల దయనీయ స్థితి - Miserable condition of boys and girls as new orphans

Vishwa Bhaarath
0
కొత్త అనాథలుగా బాలబాలికల దయనీయ స్థితి - Miserable condition of boys and girls as new orphans -
క మహా యుద్ధం, ఒక మహా ప్రకృతి విలయం, భూకంప బీభత్సం మానవాళిని భయానకంగా గాయపరిచి వెళ్తాయి. కొవిడ్‌ 19 ‌కూడా అంతటి లోతైన గాయమే చేసింది. కొవిడ్‌తో జరుగుతున్న ఈ భీకర సమరంలో చుక్క రక్తం కూడా చిందలేదు. కానీ కొన్ని లక్షల మంది వారాల వ్యవధిలో ఆ యుద్ధంలోనే నేలకొరిగిపోయారు. పెనుగాలి సవ్వడి లేదు, వానలేదు. పిడుగులు లేవు. ఇళ్లు కూలలేదు. కానీ వందల తుపానుల శక్తితో కొవిడ్‌ ‌మహమ్మారి కుటుంబాలను విచ్ఛిన్నం చేసింది. ఆర్థిక వ్యవస్థను ఒక దశాబ్దం వెనక్కి విసిరేసింది. 
    ఐదారు రోజుల వ్యవధిలో వేలాది కుటుంబాలను దారిద్య్ర రేఖ దిగువకు ఈడ్చేసింది. ఇప్పుడు భారతీయ సమాజం ముందు నిలిచిన అతి పెద్ద ప్రశ్న- కొవిడ్‌ ‌మిగిల్చిన అనాథ బాలబాలికల రక్షణ. శతాబ్దాల పాటు భారతీ యులను కబళించిన అంటు వ్యాధులూ, యుద్ధాలూ, దుర్భిక్షాలూ అవి మిగిల్చిన అమానవీయ అనుభవాను మనం చదువు కున్నాం. వాటికి ఏమీ తీసిపోని భయానక దృశ్యాలను కరోనా కారణంగా ఈ తరం వారమంతా చూస్తున్నాం. మిగిలిన విషాదాల మాట ఎలా ఉన్నా ఆ దృశ్యా లన్నింటిలోను మనసులను విచలితం చేస్తూ ఆ బాలబాలికల దయనీయ స్థితి కనిపి స్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వీరంతా కరోనా చేసిన కన్నీటి బొమ్మలు. వేయీ రెండు వేలూ కాదు, దాదాపు 30,000.

మార్చి, 2020లో భారతదేశం కరోనాతో పోరాటం ఆరంభించింది. కంటికి కనిపించని ఈ శత్రువుతో సమరం సాగే కొద్దీ, కొత్త కొత్త సమస్యలు వెలుగు చూస్తున్నాయి. హఠాత్తుగా తెర మీదకు వస్తున్నాయి. మొదటిగా బయటపడిన సమస్య ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు కనుమరుగు కావడం. ఆపై వలస కార్మికుల సమస్య, అత్యంత సహజంగా కొనుగోలు శక్తి పడిపోవడం, స్మశానాలలో సమస్యలు, అద్దె ఇళ్ల సమస్యలు, ఆసుపత్రుల ఆశక్తత…. ఇలా. వీటి మధ్య కనిపించే మరొక పెద్ద సమస్య – కొవిడ్‌ ‌కారణంగా అమ్మానాన్నా ఇద్దరూ లేదా వారిలో ఒకరిని కోల్పోయి దిక్కు తోచకుండా ఉన్న బాల బాలికల భవిష్యత్తు. అదే సమయంలో వారి రక్షణ. నిరుడు ఏప్రిల్‌ ‌నుంచి ఈ సంవత్సరం జూన్‌ ఆరంభం వరకు అందిన సమాచారం మేరకు ఇలాంటి బాలబాలికల వివరాలు నిస్సందేహంగా కలవర పరిచేవిగానే ఉన్నాయి. ఈ కలవరానికి రెండు మూడు క్రూరమైన చీకటికోణాలు ఉన్న సంగతిని విస్మరించలేం. వీరి పెంపకం బాధ్యత, చదువు సంధ్యలు, భవిష్యత్తు ఒక కోణమైతే, అక్రమ రవాణా, శ్రమ దోపిడీ దేశం ముందు ఉన్న అతి పెద్ద సవాళ్లు. దీని మీద సుప్రీంకోర్టు సైతం సందేహాలు, భయాందోళనలు వ్యక్తం చేయడం అందుకే. క్రైస్తవ మిషనరీల కన్ను కూడా వీరి మీద పడిందంటూ కొన్ని హిందూ ధార్మిక సంస్థలు ఆరోపిస్తున్న సంగతిని పరిగణనలోనికి తీసుకోవలసిందే.

రెండోదశ కొవిడ్‌ ‌తెచ్చిన ఉత్పాతం 
  దేశంలో అనాథల సంఖ్యను కొవిడ్‌ ‌రెండోదశ దారుణంగా పెంచిందని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ‌ఢిల్లీ శాఖ అధ్యక్షుడు అనురాగ్‌ ‌కుందు అన్నారు. ఇంత స్వల్ప వ్యవధిలో ఇన్ని చావులు తాను ఎన్నడూ చూడలేదని, మృతులంతా తమ తమ సంతానాన్ని అలా వదిలి నిస్సహాయంగా వెళ్లిపోవలసి వచ్చిందని కుందు చెప్పారు. ఇవాళ ఈ అనాథలు ఎదుర్కొంటున్న వాతావరణాన్ని అత్యవసర పరిస్థితిగా పరిగణించాలని కూడా ఆయన సూచించారు. శ్రీలంక దేశ జనాభా కంటే మన దేశంలో ఉన్న అనాథలు, దిక్కులేని పిల్లలే ఎక్కువ. యునెసెఫ్‌ ‌లెక్కలు చూస్తే హృదయం ద్రవిస్తుంది. రెండోదశ కొవిడ్‌ ఆ ‌విషాదాన్ని ఇంకాస్త పెంచింది.

దిక్కు తోచని బాల్యం
  బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) ‌జూన్‌ ‌రెండోవారంలో సుప్రీం కోర్టుకు అందించిన వివరాల ప్రకారం ఏప్రిల్‌ 2020- ‌జూన్‌ 5, 2021 ‌మధ్య కొవిడ్‌ ‌కారణంగా 30,071 మంది బాలలు అనాథలయ్యారు. వీరిలో అత్యధికంగా 8-13 సంవత్సరాల వయసుల వారే 39 శాతం ఉన్నారు. కొవిడ్‌ ‌బాధల కారణంగా కొన్ని కుటుంబాలు వదిలించుకున్న బాలలు కూడా వీరిలో ఉండడం విషాదం. ఇంకొంచెం వివరాలలోకి వెళితే, అమ్మ, నాన్న ఇద్దరినీ కోల్పోయిన వారు 3,621 మంది అని సుప్రీంకోర్టుకు కమిషన్‌ ‌తెలియచేసింది. అమ్మ లేదా నాన్నలలో ఒకరిని కోల్పోయిన వారే ఎక్కువ. వీరు 26,176 మంది. 274 మంది మరీ దురదృష్టవంతులు. వీరిని వారి పెద్దలు వదిలి పెట్టేశారు. అయితే వీరంతా కరోనా చావుల కారణంగానే అనాథలైనారని చెప్పడం కాదు. ఆ మహమ్మారి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వీరందరినీ ఇలాంటి దుస్థితిలోకి నెట్టేసింది. ఈ 30,000 మందిలో బాలురు 15,620. బాలికలు 14,447. ట్రాన్స్‌జెండర్లు నలుగురు.

అదేం చిత్రమో, 8-13 వయసు ఉన్న బాల బాలికలే ఈ పరిస్థితికి బలి కావడం కనిపిస్తున్నది. ఈ వయసుల వారే 11,815 మంది ఉన్నారు. 16-18 వయసుల వారు 5,339 మంది. మూడేళ్ల లోపు చిన్నారులు 2,900 మంది ఉన్నారు. 4-7 సంవత్సరాల వయసుల వారు 5,107 మంది. ఇక 14-15 ఏళ్ల వారు 4,908 మంది. ఇప్పటికీ ఈ గణాంకాలు సంపూర్ణమని చెప్పడం సాధ్యం కాదు. అప్పటికి అందిన సమాచారం మేరకు సుప్రీంకోర్టుకు సమర్పించినవి మాత్రమే.

కరోనా వైరస్‌ ‌మొత్తం ప్రపంచాన్ని బాధించింది. కుటుంబాలను విచ్ఛిన్నం చేసి, అనాథల సంఖ్య పెంచింది. భారతదేశం వరకు ఈ సమస్య మరింత జటిలమైనది. ముఖ్యంగా కొవిడ్‌ ‌పేద పిల్లలను మరింత ప్రమాదంలోకి నెట్టింది. 130 కోట్లకు పైగా ఉన్న భారత జనాభాలో 27 శాతం 14 ఏళ్ల లోపువారే. రెండోదశ కరోనా ఈ వయసు వారి భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేసింది. అందుకే మన దేశంలో రెండోదశ కొవిడ్‌ ‌బాలలకు తెచ్చిన ముప్పు మరెక్కడా లేనంత క్రూరంగా ఉందంటే అతిశయోక్తి కాదు.

మహారాష్ట్రదే అగ్రస్థానం
  దేశం మొత్తం మీద కరోనా తీవ్రంగా తాకిన రాష్ట్రం మహారాష్ట్ర. అనాథ బాలల సంఖ్య కూడా అక్కడే ఎక్కువగా ఉన్నట్టు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ‌సుప్రీంకోర్టుకు నివేదించింది. అక్కడ కరోనా కారణంగా అనాథలైన బాలబాలికలు 7,084. అంటే దేశం మొత్తం మీద అనాథలైన వారిలో 24 శాతం. వీరిలో 217 మంది తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయారు. తల్లి లేదా తండ్రిని కోల్పోయిన వారు 6,865. తరువాత స్థానంలో ఉత్తరప్రదేశ్‌ ‌నిలిచింది. రాష్ట్రంలో 3,172 మంది అనాథలుగా ఉన్నారు.  కుటుంబీకులు వదిలేసిన బాలలు ఇద్దరు. రాజస్తాన్‌ (2,482), ‌హరియాణా (2,438), మధ్యప్రదేశ్‌ (2,243), ఆం‌ధప్రదేశ్‌ (2,089), ‌కేరళ (2,002), బిహార్‌ (1,634), ఒడిశా (1,073)ల లోను కరోనా బాధిత బాలబాలికలు ఉన్నట్టు తేలింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, బాల స్వరాజ్‌ ‌పోర్టల్‌ అం‌దించిన సమాచారం మేరకు కమిషన్‌ ‌సుప్రీంకోర్టుకు ఈ గణాంకాలతో నివేదికను సమర్పించింది. తరువాత కాలంలో అంటే జూన్‌ 5 ‌తరువాత కూడా తల్లిదండ్రులను కోల్పోయిన బాలబాలికల వివరాలనూ విస్మరించలేం. కారణాలు ఏమిటో తెలియకున్నా, అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల సమాచారం ఇందులో లేదు. కాబట్టి ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని అనుకోవడమే వాస్తవికత అనిపించు కుంటుంది. జూన్‌ 19 ‌నాటికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 29,823,546. కోలుకుని బయటపడినవారు 28,678,390. మృతులు 3,85,167 (ఒక శాతం). కాబట్టి కరోనా కారణంగా నష్టపోయిన బాలల సంఖ్య ఇంకాస్త ఎక్కువే ఉంటుందన్న అంచనాను నిరాకరించలేం. కరోనాతో మరణించిన పిల్లలు కూడా లేకపోలేదు.

ఎంతమంది ఆకలితో అలమటిస్తున్నారో!
  కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఎంతమంది ఇంత సువిశాల దేశంలో వీధులలో ఆకలితో అలమటిస్తూ సంచరిస్తున్నారో మాకు తెలియదు అంటూ మే మాసాంతంలో భారత అత్యున్నత న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి పిల్లలను తక్షణం గుర్తించి వారికి అన్ని వసతులు కల్పించాలని సుప్రీంకోర్టు జిల్లాల అధికారులను ఆదేశించింది. తిండీతిప్పలు లేకుండా వారు రోజుల తరబడి ఉండడం ఎంత దుర్భరమో గ్రహించాలని కోరింది. అలాంటి వారి క్షోభను గుర్తు చేసుకుంటే గుండె తరుక్కుపోతున్నదని జస్టిస్‌ ఎల్‌ ‌నాగేశ్వరరావు, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి పిల్లల సంఖ్య పత్రికలు ఇస్తున్న దాని కంటే, అధికారులు ఇస్తున్న సంఖ్య కంటే ఎక్కువే ఉండవచ్చునని జస్టిస్‌ ‌రావు అభిప్రాయపడ్డారు. 2020 మార్చి తరువాత నుంచి ఇలా అనాథలుగా మిగిలిన వారి బాగోగులు వెంటనే పట్టించుకోవాలని కోర్టు కోరింది. ఈ నేపథ్యంలోనే బాలికల అక్రమ రవాణా అధికమైందని వార్తలు వస్తున్నాయని అమికస్‌ ‌క్యూరీ, న్యాయవాది గౌరవ్‌ అగర్వాల్‌ ‌కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇలా అక్రమ రవాణాకు బలి కావడానికి ఎక్కువ అవకాశం ఉన్న బాలబాలికలను వెంటనే గుర్తించి రక్షించడానికి, తక్షణమే వారికి సదుపాయాలు అందేలా చూడడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్సులు అవసరమవుతాయని అగర్వాల్‌ ‌కోర్టుకు సూచించారు.

నిజానికి కొవిడ్‌ ‌రాకకు పూర్వమే దేశంలో అనాథ బాలల సమస్య తీవ్రంగానే ఉంది. 2019 అక్టోబర్‌లో ప్రభుత్వ చైల్డ్‌లైన్‌ ‌పోర్టల్‌ అం‌దించిన వివరాల ప్రకారం దేశంలో 25 మిలియన్లు (2007 గణాంకాల ప్రకారం, యునెసెఫ్‌ ‌సేకరించినది), అంటే రెండుకోట్ల యాభయ్‌ ‌లక్షల మంది అనాథ బాలలున్నారు. ఇప్పుడు కొవిడ్‌ ఆ ‌సమస్యను ఇంకాస్త తీవ్రం చేసింది. మరొక అధ్యయనం ప్రకారం నాలుగున్నర కోట్ల దిక్కులేని పిల్లలు ఉన్నారు. ఇన్ని లెక్కలు ఎందుకంటే అప్పుడు ఉన్న ప్రణాళికా సంఘం వీరి గురించి ఎలాంటి గణాంకాలు సేకరించలేదు. ఏమైనప్పటికి ఈ దేశంలో కొన్నికోట్ల మంది అనాథలు ఉన్నారు. కొవిడ్‌ ‌కారణంగా అనాథలైన పిల్లల గణాంకాలు కూడా వేర్వేరు అంకెలనే చూపుతున్నాయి. అయినా కొవిడ్‌ ‌వేల సంఖ్యలో అనాథలను మిగిల్చిన మాట నిజం.

మోయలేని బాధ్యత?
 కొవిడ్‌ ‌నేపథ్యంలో తల్లో, తండ్రో, లేదా ఇద్దరూ కరోనాతో కన్నుమూసి కొన్ని వారాలు గడిచి పోయినప్పటికి ఆ సమాచారం తెలియని అమాయక బాలల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఏదో ఒకరోజు అమ్మ/నాన్న మళ్లీ వస్తారనే వారి నమ్మకం. ఇలాంటి పిల్లలను కొందరు తాత్కాలికంగా చేరదీస్తున్నారు. కానీ ఎవరి పరిస్థితులు వారివి. దీనికి తోడు కరోనా తెచ్చిన విపత్కర పరిస్థితులు ఉన్నాయి. కొన్ని కుటుంబాల వారు ఇలాంటి పిల్లలను సాకే ఆశ్రమాలు, ప్రభుత్వ/ ప్రభుత్వేతర సంస్థల కోసం వాకబు చేయడం కూడా మొదలయింది. ఆ పిల్లల సమీప బంధువులు కూడా ఇదే బాటలో ఉన్నారని కొన్ని నివేదికలు వస్తున్నాయి. కొంత జ్ఞానం తెలిసిన పిల్లల పరిస్థితి మరొక రకం. వీరికి పరిస్థితి గురించి కొంత అవగాహన ఉంటుంది కాబట్టి భవిష్యత్తు గురించి తీవ్రమైన బెంగతో ఉంటున్నారు. కౌన్సిలింగ్‌ ‌కోసం ఫోన్లు చేస్తే పది నిమిషాలకీ, పదిహేను నిమిషాలకీ కూడా వీరి నోటి నుంచి మాటరావడం లేదని మనస్తత్త్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొందరు స్తోమత లేక, కొందరు చిరకాలం అనాథల బాధ్యతను స్వీకరించే ధైర్యం, వాతావరణం లేక ఆశ్రమాల వైపు చూస్తున్నారు. ‘ఈ పిల్లలను పెంచే తాహతు లేదు. కానీ మా పిల్లల పిల్లలే వీళ్లు. కుటుంబ వారసులు కూడా. అయినా పెంచుకోలేం. అలా అని వదిలి పెట్టలేం.’ ఇదీ కొందరు వృద్ధుల పరిస్థితి. కాటికి కాళ్లు చాచ•కున్న మా సంరక్షణలో పిల్లలు ఉంటే, మా తరువాత ఎలా? అన్నది ఇంకొందరి ప్రశ్న. ఈ దుస్థితి, అది తెచ్చిన విషాదం హద్దులు లేనివని అర్ధమవుతుంది. తెలుగు టీవీ చానళ్లు కూడా ఇలాంటి కుటుంబాలు, బాలల గురించి వందలాది ఘట్టాలను వీక్షకుల ముందుకు తెస్తున్నాయి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికీ, దాతలూ, నిజమైన స్వచ్ఛంద సంస్థల దృష్టికి వెళితే గొప్ప మేలే జరుగుతుంది. వీరికి అండగా ఉండడం సామాజిక బాధ్యత, సమష్టి బాధ్యత అన్న విషయాన్ని చక్కగానే తెలియచేస్తున్నాయి.

దత్తత స్వీకారానికి వెనుకంజ
 ఇలాంటి పిల్లలను తాత్కాలికంగా ఆదుకునే వారు కనిపిస్తున్నారు కానీ, శాశ్వత ప్రాతిపదికన దత్తత చేసుకోవడానికి ముందుకు వస్తున్నవారు చాలా తక్కువని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ‌ఢిల్లీ శాఖ అధ్యక్షుడు కుందు అంటున్నారు. దత్తత స్వీకారం కాకుండా పెంపకానికే ఎక్కువ మంది బంధువులు ముందుకు వస్తున్నారు. నిజానికి దేశంలో దత్తత చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. చట్టాలలో ఈ కాఠిన్యం అనివార్యమే కూడా. ప్రతి రాష్ట్రంలోను బాలల పరిరక్షణ, సంక్షేమం కోసం ఉద్దేశించిన కమిషన్‌లు ఉన్నాయి. ఇవే జిల్లా స్థాయిలో అధికారులను నియమిస్తాయి. రకరకాలుగా ఇబ్బందుల పాలవుతున్న చిన్నారుల గురించి వీరే సమాచారం అందిస్తారు. పిల్లలను దత్తత తీసుకోవాలంటే ఇందుకు ఉద్దేశించిన ఒక జాతీయ స్థాయి పోర్టల్‌ ‌ద్వారానే సాధ్యం. కారణాలు ఏమైనా దేశంలో దత్తత విధానం చాలా మందకొడిగా ఉంది. మార్చి 2020 నాటి గణాంకాలు చూస్తే ఆ నెలలో కేవలం 3,351 మంది చిన్నారులే దత్తత వెళ్లారు (అదే అమెరికాలో అయితే 2019, మార్చిలో దత్తత వెళ్లిన బాలల సంఖ్య 66,000).

సామాజిక మాధ్యమాలతో మోసం
నిజానికి ఇప్పుడు ఈ అనాథలకు తాము సాయం చేస్తామంటూ, లేదా ప్రజలు వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సామాజిక మాధ్యమాలలో చాలా ప్రకటనలు కనిపిస్తున్నాయి. ఇక్కడే ప్రమాదం పొంచి ఉందని కుందు గట్టిగా అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ పేరుతో డబ్బులు వసూలు చేసేవాళ్లు కూడా తయారయ్యారు. ఫేస్‌బుక్‌లో వచ్చిన ఇలాంటి నంబర్‌ను పట్టుకుని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌, ‌ఢిల్లీ శాఖ హెచ్చరించవలసి వచ్చింది. ఒక చిన్నారి సాయం కోసం ఏడువేల రూపాయలు పంపించాలని అందులో ఉంది. దీనితో వారికి ఫోన్‌ ‌చేసి పోలీసులకు పట్టిస్తామని కమిషన్‌ ‌చెప్పింది. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ప్రభుత్వేతర సంస్థ ప్రోట్‌సహాన్‌ ‌సీఈఓ సోనాల్‌ ‌కపూర్‌ ‌తన దృష్టికి వచ్చిన మరొక ప్రమాదకర కోణాన్ని వెల్లడించారు. తల్లి పోయిన పిల్లలను ఎక్కువ మంది తండ్రులు కూలి పనికి వెళ్లమని బలవంతం చేస్తున్నారు. ఇంకొందరు ఇలాంటి బాలలను సెక్స్ ‌వర్కర్లుగా మార్చాలని చూస్తున్నారు. బాలికలకు కుటుంబ సభ్యుల నుంచే లైంగిక వేధింపులు వస్తున్న ఉదంతాలు కూడా నమోదవుతున్నాయి. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల నుంచి తమ సంస్థకు హృదయ విదారకమైన సమాచారంతో ఫోన్‌ ‌కాల్స్ ‌వచ్చాయని సోనాల్‌ ‌వెల్లడించారు. తండ్రి పోతే రెండు మూడు రోజులు అన్నం దొరకని పరిస్థితి, తల్లిపోతే ఆ బాధ నుంచి కోలుకోని తండ్రి అంత్యక్రియలు కూడా జరపకుండా ఉండిపోవడం వంటి బాధాకరమైన ఉదంతాలు పిల్లలు చెప్పారు. తమ తమ ప్రాంతాలలో అనాథ బాలబాలి కలకు ప్రమాదం పొంచి ఉందంటూ ప్రోట్‌సహాన్‌ ‌సంస్థకు అప్పుడు నిత్యం మూడు నుంచి నాలుగు వేల మెసేజ్‌లు కూడా వచ్చేవని ఆమె గుర్తు చేశారు.ఉత్తర ప్రదేశ్‌లో ఇలాంటి బాలలను అదుకోవడానికి ప్రభుత్వం వెంటనే స్పందించిందని ఆమె చెప్పారు. ‘ఇలాంటి పిల్లలు ఒక ఉద్వేగ పూరిత విషాదంలో మునిగిపోతున్నారు. అంతేకాదు, నిరాదరణ అనే ప్రమాదకర భావన అంచుకు చేరుకుంటున్నారు. ఇక రకరకాల దోపిడీలకు గురికావడం సరేసరి’ అని యునెసెఫ్‌ ఇం‌డియా అధిపతి యాస్మిన్‌ ‌హక్‌ ‌వ్యాఖ్యానించారు. నిజంగానే ఈ దుస్థితి ఇవాళ్టి భారతీయులు చూడవలసి వచ్చిన విషాదయోగం. అంటే సాధారణ పరిస్థితులలో పేద బాలబాలికలు, అనాథలు ఎదుర్కొనే పరిస్థితుల కంటే ఇవాళ ఎన్నో రెట్లు అదనపు దుఃఖంలో వారు కూరుకుపోతున్నారు.

ప్రభుత్వానిదే బాధ్యత
భారతదేశంలో ఒక అనాథను ఎవరూ సాకడానికి ముందుకు రాకపోతే వారి బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించాలని చట్టం చెబుతోంది. సంబంధిత ఉద్యోగులే అలాంటి వారిని గుర్తించి ఏదైనా సంస్థలో ఆశ్రయం కల్పించాలి. ఇంతటి రక్షణ కవచ•ం ఉన్నప్పటికీ దత్తత వంటి పేర్లతో పిల్లలను ఎత్తుకు పోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉన్న పరిస్థితులలో పిల్లలను ట్రాఫికింగ్‌ ‌రాకెట్‌లో లేదా దత్తత రాకెట్‌లో పావులుగా చేయడం పెద్ద కష్టం కూడా కాదని సైబర్‌ ‌క్రైమ్‌ ‌నిపుణురాలు ఆకాంక్షా శ్రీవాస్తవ చెబుతున్నారు. ఇలాంటి పిల్లల కోసం ఆమె ఒక హెల్ప్‌లైన్‌ ‌ప్రారంభించారు.ఆ హెల్ప్‌లైన్‌ ఇప్పటి దాకా మూడు వందల వరకు కాల్స్ అం‌దుకుందని ఆమె చెప్పారు. ఇందులో మళ్లీ ఉన్నత కులాల బాలల పేరుతోనూ అక్రమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

అప్రమత్తమైన పాలకులు
ఈ మానవీయ సంక్షోభంలో కేంద్రం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగానే స్పందించాయి. మే 31 తేదీకి ముందే ఇలాంటి అభాగ్యుల గురించి ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు, రక్షణ చర్యలు ప్రకటించడం స్వాగతించదగినది. కేంద్రం ప్రతి చిన్నారికి రూ.10 లక్షలు ఫిక్స్‌డ్‌ ‌డిపాజిట్‌ ‌చేయనుంది. దీని మీద వచ్చే ఆదాయాన్ని 18-23 సంవత్సరాల మధ్య స్టయ్‌పెండ్‌గా అందిస్తారు. అయితే అంతకంటే చిన్న వయసు బాలలకు ఎలాంటి ఏర్పాటు చేశారు అన్న అంశం ఇంకా స్పష్టత రావాలి.

    కర్ణాటక ప్రభుత్వం పిల్లల కోసం వసతి గృహాలు ఏర్పాటు చేసింది. 18 ఏళ్లు వచ్చే వరకు వారు ఈ సదుపాయానికి అర్హులు. ఇందుకోసం 1098 నంబర్‌తో ఒక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసి, ఈ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఐఏఎస్‌ అధికారిని నియమించింది.అవసరమైతే వీరికి వైద్య సహాయం కూడా అందిస్తారు. ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం ఈ అనాథల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తోంది. పౌష్టికాహారం ఇచ్చి, విద్య నేర్పిస్తారు. దీని హెల్ప్‌లైన్‌ ‌నంబర్‌ 181, 1098. ఇవన్నీ జరిగిన తరువాత వారి సమీప బంధువులకు లేదా దత్తతకు ఇస్తారు. ఇదే కాకుండా ఫిక్స్‌డ్‌ ‌డిపాజిట్‌ ‌కింద ఒక్కొక్క అనాథకు రూ.10 లక్షలు జమ చేస్తున్నారు. ఇది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు వర్తిస్తుంది. ఆ మొత్తం అనాథలకు వారి 25వ ఏట చేతికి వస్తుంది.

అత్యధిక అనాథలు ఉన్న మహారాష్ట్ర కూడా వారి కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. 36 జిల్లాల కోసం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. సంఘ వ్యతిరేక శక్తుల నుంచి వీరిని రక్షించడానికి అన్ని ఏర్పాట్లు ఈ టాస్క్‌ఫోర్స్ ‌చూస్తుంది. ఇలాంటి చిన్నారుల బాధ్యత తామే స్వీకరిస్తామని ఉత్తర ప్రదేశ్‌ ‌ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇలాంటి చిన్నారులను గుర్తించేందుకు ఇక్కడ కూడా ఒక టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్‌ ‌ప్రభుత్వం ముఖ్యమంత్రి వాత్సల్య యోజన ప్రవేశపెట్టింది. మే 30 నుంచి ఇది అమలవుతోంది. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లు గడచిన సందర్భంగా ఈ యోజన ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఇలాంటి పిల్లలకు 21 ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ. 3000 వంతున భత్యం అందచేస్తారు. మధ్యప్రదేశ్‌ ‌కూడా ఇలాంటి పిల్లలకు నెలకు రూ. 5000 వంతున అందించే పథకం ప్రవేశపెట్టింది. చత్తీస్‌గఢ్‌ ‌నెలవారి విద్యార్థి వేతనం అందించే ఏర్పాటు చేసింది.

ఒడిశా ఇలాంటి అనాథలకు జాప్యం లేకుండా 32 జిల్లాలలోను ప్రత్యేక వసతి ఏర్పాటు చేసింది. హెల్ప్‌లైన్‌ ‌నంబర్లు ఇచ్చి వీరిని వెంటనే గుర్తించే ఏర్పాటు చేసింది. ప్రభుత్వ అధికారి ప్రమేయం లేకుండా పెంపకం, దత్తత వంటి పక్రియలు చేపట్టకూడదు. నెలవారి విద్యార్థి వేతనంతో వీరి చదువుకు ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం కూడా నెలవారి వేతనం ఇవ్వడానికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసింది.

కొవిడ్‌ ‌కారణంగా అనాథలైన బాలబాలికల మానసిక స్థితి కల్లోల సాగరంలా ఉంటుంది.ఇదే అదనుగా నేరగాళ్లు చెలరేగిపోవాలని అనుకుంటు న్నారు. ఒక ఉదాహరణ ఇటీవల (బ్లూమ్‌బెర్గ్ ‌బిజినెస్‌వీక్‌ ‌మే 27, 2021) బయటకు వచ్చింది. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన పీపుల్స్ ఆర్గనైజేషన్‌ ‌ఫర్‌ ‌రూరల్‌ ‌డెవలప్‌మెంట్‌కు చెందిన జల్లా లలితమ్మ ఈ వివరాలు ఇచ్చారు. కేవలం రెండు లక్షల లోపు జనాభా ఉన్న మదనపల్లె పట్టణంలోనే కొవిడ్‌ ‌సమయంలో జరిగిన కొన్ని డజన్ల బాలల హక్కుల ఉల్లంఘన ఘట్టాలను ఆమె నమోదు చేశారు. నాటుసారా సరఫరా వంటి ఘోరనేరాల కోసం దిక్కులేని పిల్లలను నియమించుకుంటున్నారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి కొవిడ్‌తో మరణిస్తే, వారింటి పిల్లలను కర్మాగారాలలో పని ఇప్పిస్తామంటూ తీసుకువెళ్లి తరువాత అక్రమంగా రవాణా చేస్తున్నారు. కొవిడ్‌ ఆర్ఫన్‌ ‌హ్యాష్‌ట్యాగ్‌తో పెంపకానికి పిల్లలు ఉన్నారంటూ సమాచారం వస్తోంది. నిజానికి ఇలాంటి సమాచారం ఇస్తున్నవారి ఉద్దేశం మంచిదే అయినా, ఇది అక్రమ రవాణా చేసే నేరగాళ్లకి వనరుగా మారుతోందన్న అనుమానాలు ఉన్నాయి. ఇవేకాదు, కొన్ని దశాబ్దాలుగా కొన్ని ప్రాంతాలలో పిల్లల సంక్షేమం కోసం, ఆరోగ్యం కోసం చేపట్టిన పథకాలన్నీ కొవిడ్‌తో బూడిదలో పోసిన పన్నీరయ్యాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. పేదపిల్లలు, అనాథ పిల్లల కోసం అందించిన చదువు, పౌష్టికాహారం, ఆరోగ్యం అన్నీ వృధా అయ్యాయని చెబుతున్నారు. ఈ పిల్లలలో అధిక సంఖ్యాకులు బడుగులే. అంటే పేదరిక నిర్మూలనకు చేసిన కృషి భగ్నమైంది. అయినా మళ్లీ ఆ సంక్షేమ చర్యలన్నీ పునః ప్రారంభం కావాలి. అనాథలను భారతీయ సమాజం ఆదుకోవాలి. అదే మనలోని మానవతా దృష్టిని నిగ్గు తేల్చే గీటురాయి.

– జాగృతి డెస్క్

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top