: అన్ని రంగాలలోనూ అనుకూల పరివర్తన తీసికొనిరావడానికే సంఘం తని ఎవంంవబడంది :
సమాజంలోని విభిన్న భాగాలలో, అంగాలలో, రంగాలలో అనుకూల పరివర్తన తీసికొని రావడానికే సంఘం ఉదయించింది. కాబట్టి సంఘ స్వయంసేవకులు సమాజంలోని ప్రతియొక్క క్షేత్రంలోకి వ్యాపించవలసి ఉంది. అన్ని వైపులా ప్రభావం విస్తరించాలి. మనం ఎప్పటికీ సంఘస్థానంలో దక్ష-ఆరమ చేస్తూ ఉండిపోవటంకొరకే సంఘం ఏర్పరచబడలేదు సంఘంలోని వ్యక్తులు యావత్తు సమాజంమీద తమ ప్రభావం కలిగిఉండాలన్నదే మొదటినుండి కూడా డాక్టర్జీ కల్పన. సంఘస్థానము, శాఖలూ లేని సమయంలో ఏ గుణగణాలు నిర్మాణం కావాలని ఆశిస్తున్నామో అవి నిర్మాణమయ్యే ప్రక్రియ లేనపుడు ఇదంతా ఆలోచించ వలసిన అవసరం లేదు. కాగా ఈనాటి పరిస్థితులు భిన్నమైనవి. సంఘం శాఖవరకే పరిమితమై లేదు.
సంఘస్థానము, సంఘశాఖ- ఇవి ఆధారభూతమైనవి. అత్యంత ప్రాథమికమైనవి వీటి ఆధారంగా మనం యావత్తు సమాజంలోకి వ్యాపించవలసి ఉన్నది. ఈనాటి పరిస్థితులలో అన్ని రంగా లగురించి సరియైన దృష్టితో ఆలోచించటం అనివార్యమవుతున్నది. దైనికశాఖ అనే విశిష్ట కార్యపద్ధతిద్వారా నిర్మాణమయ్యే నిత్యసిద్ధశక్తి ఆధారంగానో, లేక సంఘంనుండి పొందిన ప్రేరణతోనో స్వయంసేవకులు యావత్తుసమాజంలోని అన్ని రంగాలలోకి వ్యాపించవలసి ఉంది. సంఘస్థానంలో మన అంతఃకరణంలో ఏ భావాలను నింపుకొంటున్నామో, అవి సంపూర్ణ సమాజంలోకి ప్రసరించాలి. సంఘమంటే సమాజమే, సమాజమంతా సంఘమే అన్న తీరున సంఘమూ సమాజమూ ఏకరూపులు కావాలి. ఒక విశిష్టమైన శిక్షణపొందిన వ్యక్తులు పెద్దసంఖ్యలో సమాజంలో వ్యాపించియున్నపుడు, వారిలోని సుగుణాలు సమాజంలో కూడా వ్యాపించుతాయన్నది మనోవైజ్ఞానికంగా చెప్పబడే విషయం. సమాజంలో పరివర్తన తీసికొనిరావడానికి మనం అనుసరిస్తున్న విధానమిదే.