అడవిబిడ్డ అల్లూరి సీతారామరాజు - Alluri Sitaramaraju

Vishwa Bhaarath
0
అడవిబిడ్డ అల్లూరి సీతారామరాజు - Alluri Sitaramaraju

: అడవిబిడ్డ అల్లూరి నాయకత్వం :

(మన చరిత్రను, చరిత్ర పురుషులను స్మరించుకోవాలన్నమహోన్నత ఆశయంతో కేంద్ర ప్రభుత్వం అమృతోత్సవ్‌ ‌పిలుపునిచ్చింది. ఆ సందర్భంగా ప్రచురిస్తున్న తొలివ్యాసమిది.)

గాఢాంధకారంలో కూడా ముందుకు ఉరకాలంటే ఆకాశంలోని పెద్ద పెద్ద తారకలతో పాటు చిన్న నక్షత్రం ప్రసరించిన చిరువెలుగూ తోడైతేనే సాధ్యం. పరాయి పాలన అనే అంధకారంలో అలమటిస్తున్న దేశం దాస్య శృంఖలాలు తెంచుకుని స్వాతంత్య్రోదయం వైపు సాగించిన ప్రస్థానం అలాంటిదే. ఒక జాతి స్వేచ్ఛ కొన్ని తరాల త్యాగ ఫలం. ఆ సమాజంలోని సర్వుల సమష్టి స్వప్నం. భారత స్వరాజ్య సమరం దీనినే ప్రతిబింబిస్తుంది. కానీ ఆ మేరకు చరిత్ర రచన సమగ్రతను సంతరించు కోలేకపోతున్నది.

ఆగస్ట్ 15, 1947‌న భారతదేశానికి లభించిన స్వేచ్ఛ ఆంగ్లేయుల మీద భారతీయులు సాగించిన ప్రతిఘటనోద్యమ ఫలితం. ఇది నా దేశమన్న జాతీయతా స్ఫూర్తి ఆ ఉద్యమానికి చోదకశక్తిని ఇచ్చింది. కానీ, భారత జాతీయ కాంగ్రెస్‌తోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్న తీర్పు మొత్తం జాతీయ పోరాటాన్ని గౌరవించేది కాలేదు. ఎందరో చేసిన రక్తతర్పణలను గౌరవించడానికి నిరాకరించేదే కూడా. భారతదేశ స్వాతంత్య్ర సిద్ధి ఐదారు స్రవంతుల సమ్మేళనం.

1885 డిసెంబర్‌ ‌చివర భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భవించింది. అంతకు ముందే కొండకోనలలో గిరిపుత్రులు ఆంగ్ల పాలనే లక్ష్యంగా ఉద్యమించారు. ఉదా. ఖాసీలు, కోందులు, ముండాలు, కుకీలు వంటివారి పోరాటాలు. గిరిజనోద్యమాల మాదిరిగానే, భూమి సమస్యతో మైదాన ప్రాంతాలలో జరిగిన రైతాంగ ఉద్యమాల గురి కూడా ఆంగ్లేయుల పాలనే. ఉదా. బెంగాల్‌లో నీలిమందు రైతుల విప్లవం, ఖెడా, చంపారాన్‌ ఉద్యమం మొదలైనవి.

భారత జాతీయ కాంగ్రెస్‌ ‌పోరాటం ప్రధాన స్రవంతి అనడానికి అభ్యంతరం ఉండనక్కరలేదు.
 జాతీయ కాంగ్రెస్‌తో, గాంధీజీ సిద్ధాంతాలతో సరిపడక తీవ్ర జాతీయ వాదంతో వెల్లువెత్తిన ఆవేశం ఉంది. అవే వీర సావర్కర్‌,  ‌చంద్రశేఖర్‌ ఆజాద్‌, ‌భగత్‌సింగ్‌, ‌సుభాష్‌ ‌చంద్రబోస్‌, ‌చిట్టగాంగ్‌ ‌సూర్యసేన్‌ ‌వంటివారు, వ్యక్తిగత హోదాలో డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ ‌వంటివారు సాగించిన పోరాటాలు, అనుశీలన్‌ ‌సమితి, రామదండు వంటి సంస్థల ఉద్యమాలు కూడా.

ఇంపీరియల్‌ ‌లెజిస్లేటివ్‌ ‌కౌన్సిల్‌ ‌ద్వారా చట్టబద్ధంగా సాగిన పోరాటం ఒక స్రవంతి. దాదాభాయ్‌ ‌నౌరోజీ, మదన్‌మోహన్‌ ‌మాలవీయ, మోతీలాల్‌, ‌దిన్షా వాచా, ఫిరోజ్‌షా మెహతా, తేజ్‌బహదూర్‌ ‌సప్రూ వంటివారు ప్రతి చట్టం నిర్మాణంలోను భారతీయ ప్రయోజనాల గురించి నిలదీసేవారు. విదేశీ గడ్డ మీద నుంచి గదర్‌ ‌వీరులు, మేడం కామా వంటివారు మాతృభూమి స్వేచ్ఛ కోసం సాగించిన పోరాటాన్ని మరుగుపరచడం చరిత్రను దగా చేయడమే.

కొండకోనలలో జరిగిన గిరిజనోద్యమాలు ఈ అర్ధ శతాబ్ది కాలంలోనే గుర్తింపునకు నోచు కుంటున్నాయి. వాటి అధ్యయనం, నమోదుతోనే భారత స్వాతంత్య్ర పోరాట చరిత్ర క్రమంగా సమగ్రతను సంతరించుకుంటున్నది కూడా. అలాంటి గిరిజనోద్య మాలలో కీలకమైనది తూర్పు కనుమలలో జరిగిన విశాఖ మన్య విప్లవం. ఈ విప్లవ నాయకుడు అల్లూరి శ్రీరామరాజు. మైదాన ప్రాంతం నుంచి మన్యం వెళ్లి, గిరిజనులను ఏకం చేసి భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు ఏనాటికీ మరచిపోలేని ఒక మహోద్య మాన్ని నిర్మించారు శ్రీరామరాజు (సీతారామరాజు అంటూ ప్రసిద్ధమైనా, జాతకచక్రంలో, రికార్డులలో కనిపించేది శ్రీరామరాజు అనే).

జననం,  బాల్యం
  జూలై 4, 1897న (హేవళంబి నామ సంవ త్సరం, ఆషాఢ శుద్ధ చవితి, ఆదివారం) శ్రీరామ రాజు విశాఖ జిల్లా భీమునిపట్నానికి సమీపంలోని పాండ్రంగిలో అమ్మమ్మగారింట పుట్టాడు. వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతుల తొలి సంతానం. తరువాత సీత, సత్యనారాయణరాజు కూడా ఆ దంపతులకు కలిగారు. వీరి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు. వెంకటరామరాజు ఫోటోలు తీసేవారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోను, తరువాత రాజమహేంద్రవరంలోను స్టూడియోలు నిర్వహించారు. ఆయన జాతీయవాది. రాజమండ్రి ఇన్నిస్‌పేటలోని ఆయన స్టూడియోలో తిలక్‌, ‌లజ్‌పతిరాయ్‌ ‌వంటి మహనీయుల ఫోటోలు దర్శనమిచ్చేవి. బెంగాల్‌ ‌విభజన వ్యతిరేకోద్యమ ప్రచారం కోసం 1907లో రాజమండ్రిలో ఏర్పాటు చేసిన సభలో బిపిన్‌ ‌చంద్రపాల్‌ ‌ప్రసంగించారు. ఆ ఉపన్యాసాన్ని అనువదించినవారు చిలకమర్తి లక్ష్మీనరసింహం.‘భరత ఖండంబు చక్కని పాడియావు’ అన్న గొప్ప దేశభక్తి  పద్యాన్ని ఆ సందర్భంలోనే చిలకమర్తి ఆశువుగా చెప్పారు. ఆ చరిత్రాత్మక ఘట్టానికి ఇన్నిస్‌పే వేదికయింది.
     గోదారి తీరంలోనే 1908లో వెంకటరామరాజు కలరాతో హఠాత్తుగా మరణించారు. రాజమండ్రి జీవనం భారమై సూర్యనారాయణమ్మ పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వాడ చేరింది. అలా కొవ్వాడ, నరసాపురం టేలర్‌ ‌స్కూల్‌, ‌రామచంద్రపురం, విశాఖ ఏవీఎన్‌ ‌విద్యాసంస్థ, తునిలలో రామరాజు విద్యాభ్యాసం సాగింది. పినతండ్రి, ట్రెజరీ డిప్యూటీ కలెక్టర్‌ ‌రామకృష్ణంరాజు రామచంద్రపురానికి బదలీ అయినప్పుడు శ్రీరామరాజు కుటుంబాన్ని అక్కడికి రప్పించారు. ఆయనకు కాకినాడ బదలీ కాగా, శ్రీరామరాజును అక్కడి పిఠాపురం రాజా విద్యా సంస్థలో చేర్పించారు. ఇక్కడి రెండు పరిచయాలు చెప్పుకోదగినవి. ఆనాడు ఆ విద్యా సంస్థకు అధిపతి రఘుపతి వెంకటరత్నం నాయుడు. మూడో ఫారమ్‌లో వేర్వేరు తరగతులే అయినా మద్దూరి అన్నపూర్ణయ్యతో రామరాజుకు స్నేహం ఏర్పడింది. చిన్నతనం నుంచి రామరాజుకు ఇంగ్లిష్‌ ‌చదువు మీద గౌరవం ఉండేది కాదు. ఈ సంగతి అన్నపూర్ణయ్య జ్ఞాపకాల ద్వారా తెలిసింది. రామరాజుకు సంస్కృత విద్య పట్ల ఆసక్తి, ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. తునిలో ఉండగానే ఇంగ్లిష్‌ ‌చదివి ఉద్యోగం సంపాదించమని పోరుతున్న తల్లితో కొలువులో చేరతానని చెప్పి కొంత డబ్బు తీసుకుని 1915లో ఇల్లు విడిచి వెళ్లిపోయాడు శ్రీరామరాజు. ఉత్తర భారతమంతా తిరిగి, హరిద్వార్‌ను దర్శించు కున్నాడు. అక్కడ నుంచే అమ్మకు ఉత్తరం రాశాడు.

కృష్ణదేవిపేటకు
  అల్లూరి ఉద్యమ జీవితానికి ఊయల వంటిది కృష్ణదేవిపేట. విశాఖ మన్యానికి గుమ్మం వంటి గ్రామం. జూలై 24, 1917న శ్రీరామరాజు దేశ పర్యటనలో భాగంగానే ఆ ఊరు చేరుకున్నాడు. ఊరి పెద్ద చిటికెల భాస్కరనాయుడు  ఆశ్రయం ఇచ్చాడు. గ్రామం ఆయనను ఒక యతిలా చూసింది. ఆయన కోరిక మేరకు నీలకంఠేశ్వరస్వామి ఆలయానికి దగ్గరగా చిక్కాలగడ్డ అనే చోట ఒక పూరిపాక నిర్మించి ఇచ్చారు. ఆ ప్రాంతానికే భక్తితో శ్రీరామ విజయనగరం అన్న పేరు పెట్టారు. ఆ గ్రామంలోను, పక్కనే ఉన్న కొంగసింగి వంటి గ్రామాలలోను రామరాజు మండల దీక్షలు నిర్వహించారు.అంతా ఆధ్యాత్మిక జీవితమే. అలాంటి సమయంలో ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆయుధం కూడా స్వీకరించవలసి వచ్చింది.

మన్యం పెద్దల రాక
  మొదటి ప్రపంచ యుద్ధం తరువాత కరవు వచ్చింది. ప్రజలకు ఉపాధి కల్పించడానికి బ్రిటిష్‌ ‌ప్రభుత్వం పనులు ప్రారంభించింది. అలా మన్యంలో రోడ్ల నిర్మాణం మొదలయింది. కానీ గూడెం డిప్యూటీ తహసీల్దార్‌ అల్ఫ్ ‌బాస్టియన్‌ ‌బినామీ పేర్లతో కాంట్రాక్టు తీసుకుని, మన్యం మునసబులు, ముఠాదారులను బెదిరించి గిరిజనులను పనికి రప్పించి కూలి ఇవ్వక వేధించేవాడు. భారత దేశ చరిత్రలో ఆ రోడ్ల నిర్మాణం అమానుష ఘట్టం. నిజానికి అడవిబిడ్డలకు అడవిలో ప్రవేశం నిషేధించిన చట్టాలతో వారు కూలీలుగా మారిపోయారు. ఇలాంటి సమయంలో పెద్దవలస మాజీ ముఠాదారు కంకిపాటి బాలయ్యపడాలు (ఎండు పడాలు), బట్టిపనుకుల మునసబు గాం. గంతన్న దొర, అతని సోదరుడు గాం. మల్లు దొర, కొండసంతలలో కూలి చేసుకుని బతుకుతున్న గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు, సంకోజు ముక్కడు, కర్రి కణ్ణిగాడు వంటివారు 1922 జనవరిలో రామరాజు దగ్గరకు వచ్చి గోడు వినిపించుకున్నారు. దానితో శ్రీరామరాజు బాస్టియన్‌ ‌మీద పై అధికారులకు ఫిర్యాదు రాశారు. ఫలితం- రామరాజు మన్యంలో సహాయ నిరాకరణ ఆరంభించాడంటూ ఆ జనవరి 29న ఏజెన్సీ కమిషనర్‌ ‌స్వెయిన్‌ ‌విచారణ జరిపాడు. ఫిబ్రవరి 1- 5 మధ్య పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. ఆ ఒకటో తేదీన సహాయ నిరాకరణను తీవ్రం చేస్తున్నట్టు గాంధీజీ ప్రకటించారు. 
    దేశం నిండా తొలిసారి గొప్ప ఉద్యమ స్పృహ నెలకొంది. మూడో తేదీన ఇక్కడ రామరాజును పొలిటికల్‌ ‌సస్పెక్ట్‌గా భావించి నర్సీపట్నం జైలులో ఉంచారు. ఆ ఫిబ్రవరి 5న చౌరీచౌరా ఉదంతంతో గాంధీజీ తాను ఇచ్చిన సహాయ నిరాకరణ పిలుపును ఉపసంహరించు కున్నారు. తాను చెప్పిన పంథాలో ఉద్యమిస్తే సంవత్సరంలోనే స్వాతంత్య్రం తథ్యమన్న గాంధీజీ మాట దీనితో భగ్నమైంది. గాంధీజీ ఆకస్మిక, ఏకపక్ష నిర్ణయం ఎంతో ఆవేశంతో, ఆశతో ఉన్న దేశ యువతను ఇతర పంథాల వైపు అడుగులు వేయించింది. అలాంటి వారిలో రామరాజు కూడా ఒకరు. నర్సీపట్నంలో పదహారు రోజులు ఉంచిన తరువాత పోలవరం డిప్యూటీ తహసీల్దార్‌ ‌ఫజులుల్లా ఖాన్‌ (‌రాజు పినతండ్రి రామచంద్రరాజు స్నేహితుడు) రామరాజుకు పైడిపుట్ట వద్ద యాభయ్‌ ఎకరాల పొలం ఇచ్చి, దుచ్చెర్తి ముఠాదారు చెక్కా లింగన్న దొర అజమాయిషీలో ఉంచారు. అక్కడ నుంచే నేపాల్‌ ‌యాత్ర కోసం అనుమతి తీసుకుని మన్యంలో ఉద్యమ నిర్మాణం చేపట్టాడాయన.

మొదటి మూడుదాడులు
    మన్యవాసులలో సంస్కరణలు తెచ్చి, పంచాయతీలు నిర్వహించడంతో రాజు పట్ల ఆరాధనా భావం ఉంది. అప్పుడు వారినే ఏకం  చేసి ఉద్యమించాలని ఆయన భావించారు. విశాఖ కొండలలో తిరుగుబాట్లు కొత్తకాదు. శాంతభూపతి, ద్వారబంధాల చంద్రయ్య, రేకపల్లి అంబురెడ్డి వంటి ఎందరో అక్కడ తిరుగుబాట్లు చేశారు. నిజానికి రామరాజు కృష్ణదేవిపేటలో ప్రవేశించడానికి కొన్ని నెలల ముందే గరిమల్ల మంగడు అనే గిరిజనుడి తిరుగుబాటు జరిగింది. అవి చెదురుమదురుగా జరిగి అణగారిపోయాయి. రాజు మన్యవాసుల ఉద్యమ దృష్టిని విస్తృతం చేశారు.  గెరిల్లా యుద్ధ రీతిని ఎంచుకున్నారు. ఈ వ్యూహాలను ఆయన ఉత్తర భారత యాత్రలో ఉండగా నేర్చుకుని ఉండాలని పోలీసులు ఊహించారు. మన్య ప్రజల సంప్రదాయిక ఆయుధాలు, ఆధునిక ఆయుధాలతో ఉద్యమం జరగాలని ఆయన వ్యూహం. మన్య విప్లవ ధ్యేయం, ఈ విప్లవానికీ మైదాన ప్రాంతంలోని కాంగ్రెస్‌ ఉద్యమానికీ మధ్య ఉండవలసిన బంధం వంటి అంశాలలో శ్రీరామరాజుకు స్పష్టత ఉంది. కొన్ని సందర్భాలలో వీటి గురించి వ్యక్తం చేశారు కూడా. గెరిల్లా పోరుకు మొదట ఆయుధాలు కావాలి. అందుకు పోలీస్‌ ‌స్టేషన్లు కొట్టాలి. వలస పాలకుల తుపాకులను వాళ్ల మీదే ఎక్కుపెట్టాలి. 
    ఉద్యమ ప్రారంభ సూచకంగా ఆగస్ట్ 19, 1922‌న రామరాజు శబరి కొండ మీద రాజరాజేశ్వరి అమ్మవారికి రుద్రాభిషేకం చేశారు. ఎండు పడాలు, గంతన్న, రామరాజు-మల్లు నాయకత్వాలలో మూడు దళాలు ఏర్పాటు చేశారు. ఆ ఆగస్ట్ 22 ‌పట్టపగలు మొదట చింతపల్లి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌మీద దాడి చేశారు- దాదాపు మూడు వందల మంది. దారిలో కనిపించిన చింతపల్లి ఎస్‌ఐ ఈరెన అప్పలస్వామినాయుడుకి సంగతి చెప్పి మరీ దాడి చేశారు మన్యవాసులు. 11 తుపాకులు దొరికాయి. ఈ ఆయుధాలు తీసుకు వెళుతున్నానని ఒక లేఖ రాసి మరీ వెళ్లారు రామరాజు. నిజానికి చింతపల్లి స్టేషన్‌ ‌మీద దాడితోనే రామరాజు ఉద్యమ తత్త్వం తెలుస్తుంది. ఉద్యమకారుల చేత ‘వందేమాతరం-మనదే రాజ్యం’ అంటూ, ‘గాంధీజీకి జై’ అంటూ రామరాజు నినాదాలు చేయించారు. ఆగస్ట్ 23‌న కృష్ణదేవిపేట పోలీస్‌ ‌స్టేషన్‌ ‌మీద దాడి జరిగింది. సిబ్బంది పారిపోయారు. 7 తుపాకులు దొరికాయి. ఆగస్ట్ 24‌న రాజవొమ్మంగి స్టేషన్‌ (‌తూర్పు గోదావరి)ను ఎంచుకుని దాడి చేశారు. 8 తుపాకులు దొరికాయి. లాగరాయి ఫితూరీని సమర్ధించిన నేరానికి అరెస్టయిన మొట్టడం వీరయ్యదొర అప్పుడు ఆ స్టేషన్‌లోనే ఉన్నారు (ఈయన తండ్రి సొబిలను దొర. 1879 నాటి ఫితూరీలో ఉన్నాడు). వీరయ్యదొరను విడిపించడం కూడా ఈ దాడి ఆశయాలలో ఒకటి. ఈ దాడులలో వందలాది తూటాలు, బాయ్‌నెట్లు, యూనిఫారాలు కూడా కొండదళం స్వాధీనం చేసుకుంది. ‘ఆంధ్రపత్రిక’, ‘కృష్ణాపత్రిక’, రాజమండ్రి నుంచి వెలువడే ‘కాంగ్రెస్‌’ (‌మద్దూరి అన్నపూర్ణయ్య సంపాదకుడు)  ఆ వార్తలను ప్రచురించాయి. నిజానికి పోలీసుల బూట్ల చప్పుడుకే హడలిపోయే మన్యవాసులు వరసగా రెండు పోలీసు స్టేషన్ల మీద దాడి చేయడంతోనే మద్రాస్‌ ‌ప్రెసెడెన్సీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎ ‌గ్రాహమ్‌కు టెలిగ్రామ్‌లు వెళ్లాయి. కొన్ని రోజులలోనే నర్సీపట్నం కేంద్రంగా మన్యాన్ని ఖాకీవనంగా మార్చారు. చుట్టుపక్కల జిల్లాల పోలీసు బలగాలన్నీ చేరుకున్నాయి. ఆ వాతావరణంలోను జైపూర్‌ ‌మహారాజు ఐదు ఏనుగుల మీద పోలీసుల కోసం పంపిన సామగ్రిని సెప్టెంబర్‌ 3‌న ఒంజేరి ఘాట్‌లో  రాజుదళం వశం చేసుకుంది.

మరొక ఘన విజయం
    మూడు పోలీస్‌ ‌స్టేషన్ల మీద దక్కిన విజయం కంటే  దామనపల్లి అనే కొండమార్గంలో సెప్టెంబర్‌ 24, 1922‌న దక్కిన విజయం ఎంతో గొప్పది. దామనపల్లికి రాజు దళం వస్తున్నదన్న సమాచారం తెలిసి స్కాట్‌ ‌కవర్ట్, ‌నెవెల్లి హైటర్‌ అనే ఒరిస్సా పోలీసు అధికారుల నాయకత్వంలో రెండు పటాలాలు వెళ్లాయి. ఇందులో హైటర్‌ ‌మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. కానీ ఆ ఇద్దరినీ కూడా కొండదళం మట్టుపెట్టింది. అక్టోబర్‌ 15‌న అడ్డతీగల మీద రాజు దాడి చేశారు. కానీ ఆయుధాలు దొరకలేదు.  అక్టోబర్‌ 19‌న చోడవరం స్టేషన్‌లోను ఇదే అనుభవం. అప్పటికే స్టేషన్లలోని ఆయుధాలను ట్రెజరీలకి తరలించడం మొదలయిపోయింది.

బిగిసిన పిడికిలి
  కొండలలో పోరాడే మలబారు దళాలు వచ్చిన తరువాత డిసెంబర్‌ 6‌న పెద్దగడ్డపాలెం, లింగాపురం అనేచోట్ల రాజుదళం వారితో తలపడవలసి వచ్చింది. దళాల దగ్గర లూయీ ఫిరంగులు ఉన్నాయి. ఒక భీకర పోరాటమే జరిగింది. రెండుచోట్ల కలిపి ఎనిమిది మంది రాజు అనుచరులు వీరమరణం చెందారు. ఈ మృతదేహాలను మన్యంలో ఊరేగించి, భయానికి బీజం వేశారు. డిసెంబర్‌ 23‌న ఉద్యమ కారులను పట్టిస్తే నగదు బహుమానాలు ఇస్తామంటూ  ప్రకటన వచ్చింది. నాలుగు మాసాలు మన్యంలో మౌనం తాండవించింది.

అన్నవరంలో కనిపించిన రాజుదళం
   ఏప్రిల్‌ 17, 1923‌న రామరాజు దళం ఆకస్మాత్తుగా అన్నవరం పోలీస్‌ ‌స్టేషన్‌లో ప్రత్యక్షమై మొత్తం యంత్రాంగాన్ని కలవర పరిచింది. పైగా ప్రజలు ఆయనకు పూజలు చేశారు. ఆ సందర్భంలోనే చెరుకూరి నరసింహమూర్తికి రామరాజు ఇంటర్వ్యూ ఇచ్చారు. అదే ఏప్రిల్‌ 24‌న ఆంధ్రపత్రికలో వెలువడింది. అన్నవరం సంఘటన తరువాత మన్యవాసుల ఉద్యమంలోకి వేగిరాజు సత్యనారాయణ రాజు (అగ్గిరాజు) వచ్చారు. ఆ ఏడాది సెప్టెంబర్‌ 17 ‌రాత్రి మల్లుదొర దొరికి పోవడం ఉద్యమానికి కీడు చేసింది. ఆ సంవత్సరం డిసెంబర్‌లో కాకినాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ ‌సమావేశాలకు రామరాజు మారువేషంలో హాజరయ్యారు.

కాలం గడుస్తున్న కొద్దీ అణచివేత తీవ్రమైంది. అప్పటికే మన్యంలో ఉన్న బలగాలకు 1924 జనవరికి అస్సాం రైఫిల్స్ ‌తోడుగా వచ్చింది. వీరికి కూడా మొదటి ప్రపంచ యుద్ధంలో అనుభవం ఉంది. అప్పటికి మన్యం మీద ప్రయోగించిన బలగాల సంఖ్య దాదాపు వేయి. రాజుదళం సంఖ్య వంద. అస్సాం రైఫిల్స్ అధిపతే మేజర్‌ ‌గుడాల్‌. ఆ ‌సంవత్సరం ఏప్రిల్‌లో గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న థామస్‌ ‌జార్జ్ ‌రూథర్‌ఫర్డ్‌ను విశాఖ మన్యంలో పోలీసు చర్యకు స్పెషల్‌ ‌కమిషనర్‌గా నియమించారు.ఏప్రిల్‌ ‌నుంచి జూన్‌ 24 ‌వరకే అతడి అధికారం. అంతలోనే ఉద్యమం అణగిపోవాలి. మరికొంత అస్సాం రైఫిల్స్ ‌బలగం వచ్చింది. మన్యం పోలీసు హింసతో, అత్యాచారాలతో తల్లడిల్లిపోయింది. ఆ సమయంలోనే మే ఆరంభంలో రేవుల కంతారం అనేచోట రాజు దళం సమావేశమైంది. బ్రిటిష్‌ ‌పంచన చేరినా భారతీయులను చంపరాదన్న  నియమంతో నష్టం జరుగుతున్నదని ఒక వర్గం విన్నవించింది. అదే అంశం మీద చీలిక వచ్చింది. ఆ సమావేశం జరుగుతూ ఉండగానే పోలీసులు దాడి చేశారు. రామరాజు ఒక్కడు రాత్రివేళ మంప చేరుకుని, ఒక చేనులోని మంచె మీద పరున్నాడు. తెల్లవారితే మే 7వ తేదీ. రాజు వేకువనే మంచె దిగి అక్కడి కుంటలో స్నానం చేస్తుండగా ఈస్ట్‌కోస్ట్ ‌దళానికి చెందిన కంచుమేనన్‌, ఇం‌టెలిజెన్స్   ‌పెట్రోలింగ్‌ ‌సబిన్స్‌పెక్టర్‌ ఆళ్వార్‌నాయుడు బలగంతో చుట్టుముట్టి అరెస్టు చేశారు.

అంతిమ ఘడియలు
   అరెస్టు చేసిన రాజును ఒక నులక మంచానికి కట్టి, యథాప్రకారం గిరిజనుల చేతనే మోయిస్తూ కృష్ణదేవిపేటకు పయనమయ్యారు. దారిలోనే ఉంది కొయ్యూరు. అక్కడే ఉన్న మేజర్‌ ‌గుడాల్‌ ‌రాజును కట్టిన మంచాన్ని బలవంతంగా దింపించాడు. మాట్లాడతానని గుడారంలోకి తీసుకువెళ్లాడు. అక్కడే ఇద్దరికీ వాగ్యుద్ధం జరిగింది. ఆగ్రహించిన గుడాల్‌ ఒక చెట్టుకు కట్టి కాల్చి చంపాడు. సజీవంగా రాజును అప్పగించాలంటూ కృష్ణదేవిపేట వచ్చి కూర్చున్న రూథర్‌ఫర్డ్ ఈ ‌సంగతి తెలిసి గూడాల్‌ ‌మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరికి రాజు ఎక్కడైతే ఉద్యమకారునిగా రూపొందాడో ఆ కృష్ణదేవిపేటలోనే తాండవ ఒడ్డున అంత్యక్రియలు జరిపారు.

ఆ మే 6న అగ్గిరాజు దొరికిపోయాడు. మే 26న ఎండుపడాలును స్థానికులే హత్య చేశారు. జూన్‌ 7‌న గాం గంతన్నను పోలీసులు కాల్చి చంపారు. ఈ మధ్యలో ఎందరో ఉద్యమకారులను గ్రామస్థులు, బంధువులు పోలీసులకు అప్పగించారు. మల్లుదొరకి, బోనంగి పండుపడాలుకి మొదట ఉరిశిక్ష పడింది. తరువాత ద్వీపాంతర శిక్షగా మారింది. నిజానికి ఉద్యమకారుల ‘యుద్ధ నేరాలు’ విచారించడానికి 1922లోనే విశాఖపట్నంలో స్పెషల్‌ ‌ట్రిబ్యునల్‌ ఏర్పాటయింది. ఎల్‌హెచ్‌ అరంట్‌ అడిషనల్‌ ‌సెషన్స్ ‌జడ్జి. 270 మంది వరకు ఉద్యమకారులను ట్రిబ్యునల్‌ ‌విచారించి రకరకాల శిక్షలు విధించింది. 12 మందిని అండమాన్‌ ‌కాలాపానీకి పంపారు.

మొదటి ప్రపంచ యుద్ధ విజయంతో విర్రవీగుతున్న బ్రిటిష్‌ ‌ప్రభుత్వం రామరాజు నాయకత్వంలో సాగిన ఉద్యమాన్ని అత్యంత కఠినంగా అణచివేసింది. కానీ రామరాజు అమరుడిగా నిలిచిపోయాడు. ఆయన ఖద్దరు ధరించాడు. ప్రధాన స్రవంతి పోరాటాలతో తన పోరాటాన్ని అనుసంధానం చేస్తాడేమోనని పోలీసులు భయపడ్డారు. కొమురం భీం వంటివారికి స్ఫూర్తిగా నిలిచాడు. రామరాజు భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో అమేయమైన స్థానం సాధించుకున్నాడు. అట్టడుగున ఉన్నవారిలో కూడా జాతీయతా భావాన్ని నింపి దేశం కోసం పోరాడేటట్టు చేసిన రామరాజు చిరస్మరణీయుడు.

జూలై 4 అల్లూరి జయంతి.......గోపరాజు .....జాగృతి సౌజన్యంతో  

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top