గోండుల దండారి ఉత్సవాల విశిష్ట‌త - The Gondla Dandari festival

Vishwa Bhaarath
0
గోండుల దండారి ఉత్సవాల విశిష్ట‌త - The Gondla Dandari festival

 -ఆకారపు కేశవరాజు 
దసరా నుండి దీపావళి వరకు  రాజగోండులు శ్రీకృష్ణుడి వలె నెమలి పించములు ధరించి తమ సాంప్రదాయ గుస్సాడి నృత్యం చేస్తూ ఆనందంతో తరించి పోతారు.

ఆదిలాబాద్ జిల్లాలో  పెద్ద సంఖ్యలో ఉన్న గోండులు ఇప్పటి తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గడ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ , ఒరిస్సా లోని అనేక భూభాగాలను కొత్త కొత్త సామ్రాజ్యాలుగా  రూపొందించి  అవసరానికి తగినట్లుగా మార్చి ప్రత్యేక నాణాలను కూడా ముద్రించి  గొప్పగా పరిపాలించిన గోండు రాజవంశాలు.  మొగలుల దురాక్రమణలు, కపట యుద్ధాల కారణంగా సర్వస్వం కోల్పోయి రాజప్రాసాదాలను వదిలిపెట్టి అడవులలో, గిరులలో సంచరిస్తూ నివసిస్తూ నేడు గిరిజనులుగా పిలవబడుతున్నారు.

గోండులు, సాంస్కృతిక మూలాలు: 

గోండులు మూలతః ప్రకృతి  ఆరాధకులు శాంతి కాముకులు. ఈ దేశ ప్రజలందరి సాంస్కృతిక మూలాలే… గోండుల సాంస్కృతిక మూలాలు. సాధారణ సనాతనులైన భారతప్రజల దైవాలే వీరి దైవాలు.  పంచభూతాలైన  గాలి, భూమి, అగ్ని, నీరు, ఆకాశాలను పూజిస్తారు. రాయి రప్ప చెట్టు చేమ పాము పలుగు ఆకు పువ్వు అన్నిటినీ దైవ సమానంతో భావిస్తారు.  వారినే పేన్, పెర్సాపేన్ (దేవుడు, పెద్ద దేవుడు)  పేర్లతోనే పిలిచి కొలుచి ఆరాధిస్తారు.

నమ్మకాలు, పూజలు, జాతరలు  వంటివి గోండు సమాజంలో ముఖ్య భాగం వహిస్తాయి. గోండులను కోయతూర్ లు, అని కూడా గౌరవంగా పిలుస్తారు.

పురాణకాలంలో కోయతూర్ దేవతలను పార్వతీదేవి సాకుతుండగా.. ఒకసారి “శంభుపేన్” కు కోపం వచ్చి దేవతలందరినీ ఒక గుహలో బంధించాడు. కోయతూర్  దేవతలు మాయం కావడంతో కోయ రాజ్యమంతా అస్తవ్యస్తమైంది. అప్పుడు పహంది కుబార్ లింగాల్ అనే ధర్మ గురువు గుహలో ఉన్న దేవతలను వెతికి తెచ్చే బాధ్యతను తీసుకుంటాడు.

అతడు జంగు బాయి (పెద్ద దేవత) ఆశీస్సులు సహాయమును తీసుకొని ఒకసారి నలుగురు దేవతలను తీసుకువస్తాడు. అలాగే మరోసారి  ఐదుగురు దేవతలను, మరోసారి ఆరుగురు దేవతలను ఆ తర్వాత ఏడుగురు దేవతలను బయటకు తీసుకు వచ్చారని ఆ దేవతల రాకతో కోయ రాజ్యమంతా ప్రశాంతత నెలకొన్నది అని గోండు పెద్దలు కథల రూపంలో, పాటల రూపంలో చెప్పే చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు.

     గోండుల లిఖిత చరిత్ర ప్రత్యేకంగా వ్రాయబడి లేనందున, గోండుల పండుగలలో తప్పనిసరిగా  చెప్పబడే మౌఖిక మైన కథా రూపకాలు, పాటలు కథలు మొదలైనవి వారి చరిత్రను అవగాహన చేసుకోవడం కోసం ఉపకరిస్తాయి.

    నాగోబా జాతర, జంగుబాయి జాతర, ఖండోబా, భీమ్ దేవ్ జాతర వంటి అనేకా అనేక జాతరలు నిర్వహించుకొని దూరదూరంగా చిన్న చిన్న గూడేలలో ఉండే వీరు జాతరల సమయంలో వేలాది మంది ఒక్కచోట చేరి తమ పూర్వీకుల పట్ల, తమ జీవన విధానం పట్ల, వైభవోపేతమైన తమసాంస్కృతిక మూలాలపట్లా గౌరవాన్ని చాటుకుంటారు. తమ జీవన విధానాన్ని సమీక్షించుకుంటారు, బాగోగులను,  మంచి చెడ్డలను చర్చించుకుంటారు. అభివృద్ధిని ఆకాంక్షిస్తారు.

కౌరవ పాండవుల వారసులమని 5156 సంవత్సరాల క్రితం ద్వాపర యుగంనాటి మహాభారత సంగ్రామంలో విజయం సాధించి భారతదేశ చక్రవర్తిత్వాన్ని సాధించిన పాండవులలోని  భీముడి ధర్మపత్ని హిడంబి, ఆమె కుమారుడు అతి పరాక్రమవంతుడు ఘటోత్కచుని వంశానికి చెందినవారమని కొందరు ఆదిలాబాద్ గోండులు ప్రకటించారు.

“తమది చంద్రవంశం” అని ప్రాచీన కథా రూపాలలో ఉల్లేఖించిన తమ చరిత్రను గర్వంగా చెప్పుకుంటారు, అందుకే కాబోలు జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుని పోలిన విధంగా నెమలి పించాలు ధరించి నల్లని బూడిదను ఒంటికి రాసుకుని కృష్ణతత్వాన్ని, పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ శ్రీకృష్ణుడు నరకాసురుని వధించి  16,000 మంది  గోపికలను విడుదల చేయించి ద్వారకకు చేరుకున్నప్పడు ప్రజలు జరుపుకున్న ఆనంద దీపావళి పరంపరను కొనసాగిస్తూ విజయదశమి నుండి దీపావళి వరకు గోండు సమాజం చేసే ధార్మిక క్రతువులు, వారి పూజా విధానము మొదలైనవి గుస్సాడి నృత్య ప్రదర్శన సందర్భంగా ప్రదర్శించబడుతున్న టాయి వీనులవిందుగా కన్నుల పండువగా కనబడుతుంటాయి.

గోండుల దండారి ఉత్సవాల విశిష్ట‌త - The Gondla Dandari festival

గోండు రాజ్యాల పరాక్రమ చరిత్ర :

గోండ్ రాజు గఢా మండలేశ్వర్ దళపత్ షా ధర్మపత్ని రాణి దుర్గావతి. భర్త మరణానంతరం తమ రాజ్యంపైకి దురాక్రమణకు వచ్చిన మొగలాయి పాలకులను ఎదిరించి ఓడించింది, అనేకసార్లు తరిమి తరిమి కొట్టింది. చివరికి 1564 సంవ‌త్స‌రంలో అక్బర్ సైన్యాధిపతి అసఫ్ ఖాన్ నాయకత్వంలో వచ్చిన వేలాదిమంది తురక సైన్యం దుర్గావతి సైన్యాన్ని వెన్నుపోటు పొడవడం రాణిదుర్గావతి పైన నాలుగు వైపుల నుండి  బాణాలను కురిపించి అధర్మ యుద్ధానికి పాల్పడి  హత్యచేశారు.  అప్పటి నుండి క్రమంగా పరాక్రమోపేతులైన గోండుల రాజ్యాలు తురకల వశమౌతూ వచ్చాయి. భారతదేశ భూమి బిడ్డల పూజా పద్ధతులను వ్యతిరేకించే ఇస్లాం అనుయాయులు రాజ్య విస్తరణ కాంక్షతో దాడులు చేసి ధర్మ యుద్ధాలు చేసే గోండులను అధర్మంగా, నీతి లేక వెన్నుపోటు పొడుస్తూ గోండు సైన్యాలను, గోండు రాజులను హత్యలు చేస్తూ రాజ్యాలను హస్తగతం చేసుకున్నారు.

గోండు సామ్రాజ్యాల పతనానంతరం వారి ధార్మిక స్థలాలను దేవతా చిహ్నాలను, రాజ ప్రసాదాలను, కూల్చివేయడమే కాకుండా  వారి జీవన విధానాన్ని  చిన్నాభిన్నం చేశారు,  సహజంగానే మానధనులైన రాజగోండులు ఇస్లాంమతాన్ని స్వీకరించడంగానీ, ఇస్లాం మతరాజ్యపు పాలనను స్వాగతించడానికి  ఇష్టంలేనివారై, తమ భవ్యమైన రాజ ప్రాసాదాలను వదిలిపెట్టి, తమ మంత్రులను( పరదాన్) మిగిలిన సైన్యాన్ని,  ప్రజలను తీసుకొని అడవుల్లోనే మకాం పెట్టారు. అనేక కష్టాలను అనుభవిస్తూ  అక్షరాస్యతకు దూరమైనప్పటికీ, స్వాభిమానంతో అడవులలోనే తమ జీవన విధానాన్ని, సాంస్కృతిక మూలాలను రక్షించుకుంటూ గౌరవంగా జీవిస్తూ వచ్చారు.

శత్రువులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన “బల్లాల్ షాహ” వంటి వీరుడు ప్రాణహిత నది గోదావరి తీరం నుండి ఢిల్లీ వరకు గోండు సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు ( ఇతని పేరు మీదనే బల్లార్ష రైల్వే స్టేషన్.) వీరి పాలన కాలం నాటి అనేక  భవనాలు కోటలు బురుజులు రాజ ప్రసాదాలు, శీలావశేషాలు ఎన్నో ఇప్పటికీ మహారాష్ట్ర చత్తీస్ఘడ్ ప్రాంతాల్లో సజీవ సాక్ష్యాలు.

గోండుల దండారి ఉత్సవాల విశిష్ట‌త - The Gondla Dandari festival

గోండురాజుల రాచరికపు చరిత్ర

భారతదేశ చరిత్రలో మౌర్యులు, గుప్తులు, పీష్వాలు, మరాఠాలు, కాకతీయులు, పల్లవులు. చాళుక్యులు, రాష్ట్రకూటులు. విష్ణు కుండినులు శాతవాహనులు రాజ వంశాల చరిత్రకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అదే స్థాయి ప్రాధాన్యత గోండురాజులకు ఉంది. 11వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు సుమారు ఆరు రాష్ట్రాలలో విస్తరించింది ”గోండ్వానా” సుమారు 280 సంవత్సరాల పాటు అప్రతిహతంగా మహావైభవోపేతంగా పలువురు గోండు చక్రవర్తులు ఖేర్లా, మాండ్లా, నాగపూర్‌, దేవ్‌ఘర్‌, చంద్రపూర్‌, సిర్పూర్‌, జున్‌గాం, కేంద్రాలుగా తమ పరిపాలన కొనసాగించారు.

ఆ సమయంలో ”జున్‌గాం” రాజ్యాన్ని బీర్‌షా, అనే రాజు పాలించేవాడు సిర్పూర్‌ కోటనుండి కొంత కాలం పాటు పాలన కొనసాగించిన బీర్‌షా, అనంతరం రాజధానిని ”జునుగాం”కు మార్చాడు. ఆ తర్వాత ”బల్లాల్‌షా” చంద్రపూర్‌ నదికి దక్షిణం వైపు కొత్త రాజధానిని నిర్మించాడు. ప్రస్తుతం ఆ నగరమే ”బల్లార్‌షా” గా పిలవబడుతోంది. భీంబల్లాల్‌షా గోండ్వానా రాజ్య విస్తరణలో భాగంగా పలు చోట్ల కొత్త నగరాలు నిర్మించాడు. కోటలు కట్టించాడు ఎక్కడికక్కడ అడవుల్లో తండాలుగా ఉన్న గోండు వీరులను ఏకం చేసి గోండ్వానా రాజ్యాన్ని దేశంలోని ఇతర రాజ్యాల మాదిరి విస్తరించడానికి నడుంబిగించాడు.

ఆయా ప్రాంతాలలోని చిన్న చిన్న రాజ్యాలను, మండలాలను, కలిపి ఒక పెద్ద రాజ్యాన్ని పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేశారు. అలాంటి రాజ్యాలే తాండూర్‌, ఉల్లిపిట్ట, కోట పరందోలి, ఉట్నూర్‌, గోయెన, ఉండుంపూర్‌, మానిక్‌ఘడ్‌, నార్నూర్‌, కోట రుద్రంపూర్‌, దేవదుర్గం మొ||లైనవి. జున్‌గాం రాజ్యంలో 16 చిన్న రాజ్యాలు ఉండేవి. దేవదుర్గం క్రింద 6 రాజ్యాలు, 9 మండలాలు ఉండేవి. రాజూరా రాజ్యంలో 22 మండలాలు 8 రాజ్యాలు ఉండేవి. ఉట్నూర్‌ క్రింద 6 రాజ్యాలు 12 మండలాలు ఉండేవి. 900 సంవత్సరాల క్రితం ”జున్‌గాం” అంటే ఆసిఫాబాద్‌లోని ప్రాంతం.  దట్టమైన అడవులు కొండలతో నిండి ఉండేది, ఇక్కడ మైదాన ప్రాంతం చాలా తక్కువ. కేరామేరి, ఝరి, జోడేఘాట్‌ కొండల్లో విస్తరించిన అలనాటి గోండు రాజ్యం ”దేవదుర్గం”.

      ”దేవదుర్గం” క్రింద సుమారు 180 గ్రామాల పాలన సాగేది. 900 సంవత్సరాల క్రితం ”భీంబల్లాల్‌షా” ఇక్కడ పటిష్ఠమైన కోటను ”జున్‌గాం” లోని కంచు కోటకు ధీటుగా 1600 అడుగుల ఎత్తయిన కొండపై శత్రు దుర్భేద్యంగా నిర్మించాడు. ”దేవదుర్గం” ఎత్తయిన కొండపై నిర్మించటం వల్ల శత్రు రాజులకు ఈ దుర్గాన్ని జయించాలంటే చాలా కష్ఠంగా ఉండేది. ఇప్పటికి ఈ కొండను చేరుకోవాలంటే చాలా కష్ఠం.

    ఆసిఫాబాద్‌ నుండి 32 కిలో మీటర్ల దూరంలోని మొవాడ్‌కు వెళ్ళి అక్కడి నుండి 12 కిలో మీటర్లు నడక ద్వారా అడవిలో ప్రయాణిస్తే ఈ కొండ వస్తుంది. కొండపైనున్న వనదేవతకి ఇప్పటికి దసరా సమయంలో మొవాడ్‌ చుట్టు ప్రక్కల గోండులు 9 రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. కోటకు రక్షణగా  “వనదేవతను” ప్రతిష్ఠించారని గిరిజనుల నమ్మకం. నిలువైన కొండపైకి ఎక్కటం అంత సులువు కాదు. దట్టమైన అటవీ ప్రాంతం. కొండకి తూర్పువైపున ”సవతుల గుండం” జలపాతం కన్నుల పండుగగా ఉంటుంది. ఉత్తరాన పెద్ద వాగు ఉధృతి విపరీతంగా ఉంటుంది. దట్టంగా ఉండే చెట్ల మధ్యగా కనీసం 10 నుండి 15 మంది బృందంగానే వెళ్లగలం.

ఇక కొండపైకి ఎక్కితే అపూర్వమైన రీతిలో నిర్మించిన రాతి కోట ఆనవాళ్ళు ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా మనకు దర్శనమిస్తాయి. సాంకేతికంగా ఇంత ప్రగతి సాధించిన ఈ రోజుల్లోనే అత్యంత కష్ఠ సాధ్యంగా భావించే ప్రయాణం ఆ రోజుల్లోని వారు ఎలా సుసాధ్యం చేశారో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. అంత ఎత్తయిన కొండపైకి రాజ గోండులు కోట గోడలకు. ఇతర నిర్మాణాలకు కావాల్సిన రాళ్ళు ఎలా మోసారో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.

ఈ ”దేవదుర్గం” కోటని ”వోటే ఘడ్‌” అని ప్రస్తుతం స్థానికులు పిలుస్తారు. ఎందుకంటే మొఘలాయిల కాలంలో ఇంతటి దట్టమైన అటవీ ప్రాంతంలోకి కూడా వేలాది మంది ముస్లీం సైనికులు ప్రవేశించి అమాయక గోండు వీరులను పాశవికంగా చంపి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ఇష్టారీతిన దౌర్జన్యాలు కొనసాగించారు. 16,17 శతాబ్దాలలో గోండ్వానాలో ముస్లిం రాజుల దండయాత్రల దరిమిలా గోండు ప్రాంతాల్లో ముస్లింలు ప్రవేశించి స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు ఇక్కడి నుండి పారిపోయిన కొంత మంది గోండు రాజులు అనంతర కాలంలో చిర్ర కుంట సమీపంలో సరికొత్త ”దేవదుర్గాన్ని”, మరి కొంత మంది గోండులు రాజురా సమీపంలో ”మానిక్‌” ఘడ్‌”ని నిర్మించుకొని పాలన కొనసాగించినట్టు చెప్తారు.

గోండు రాజుల సమగ్ర చరిత్ర లిఖిత పూర్వకంగా అందుబాటులో లేకపోవటం వల్ల వారి పాలనా సమయంలో సరి అయిన సారూప్యత సాధించటం కష్టసాధ్యమే. భీం బల్లాల్‌షా తర్వాత ఖర్జాబల్లాల్‌ సింగ్‌, హీర్‌ సింగ్‌, ఆండియా బల్లాల్‌ సింగ్‌, తల్వార్‌ సింగ్‌, కేసర్‌ సింగ్‌, దిన్‌ కర్‌ సింగ్‌, రాం సింగ్‌, సూర్జాబల్లాల్‌ సింగ్‌, ఖండ్యకా బల్లాల్‌షా, హీర్‌షా, భూమాలతోపాటు లోకాబా, కొండ్యాషా,బాబ్జీ బల్లాషా, దుండియా రాంషా, క్రిష్ణషా, బీర్‌షా-2, రాంషా-2, నికంత్‌షా చక్రవర్తుల పాలనలో 870 సంవత్సరం నుండి 1751 వరకు దేవదుర్గం రాజ్యాన్ని ”మడావి రాజులు” అవిచ్ఛిన్నంగా పాలించారు.

దేవదుర్గం కోటలో అక్కడక్కడా పడి ఉన్న రాతి శిలలు, కొన్ని గుర్తు పట్టలేని విధంగా ఉన్న శిల్పాలు ఎన్నో విపత్తులను ఎదుర్కొని నేటికి నిలిచి ఉన్న రాతి దర్వాజాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. సుమారు రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొండపై నిర్మించిన కోటలో చాలా చోట్ల మనకు అనేక రాతి శిథిలాలు కనిపిస్తాయి.  దసరా, సంక్రాంతి పర్వదినాలలో వచ్చి ”దండారి” జరిపి వెళ్ళిపోతారు. మడావి వంశానికి చెందిన రాజ వంశీకులు దసరా సమయంలో దండారి జరిపి నాటి ”తల్వార్‌కి” పూజ చేస్తారు. అపూర్వమైన గిరి దుర్గం ”దేవదుర్గంలో” ఆసక్తికరమైన గోండు రాజుల చరిత్రను సమగ్రంగా  పరిశోధిస్తే  మరింత చరిత్ర వెలుగులోకి వస్తుంది.

గోండుల దండారి ఉత్సవాల విశిష్ట‌త - The Gondla Dandari festival

ప్రాచీన సాంస్కృతికధార గుస్సాడి నృత్యం:

లయ బద్దమూ, క్రమబద్ధమూ అయిన దండారి నృత్యం గుసాడి నృత్యంలో భాగం. దండారి నృత్యం చేస్తున్న బృంధంలోకి గుసాడి బృందం అకస్మాత్తుగా ప్రవేశిస్తారు. గోండు భాషలో గుసాడి అంటే అల్లరి అని అర్థం. దండారి నృత్యం గుమేలా అనేది బుర్రకథ డిక్కి శబ్దాలకు అనుగుణంగా లయ బద్ధమై ఉంటుంది.

వలయాకారంగా చేరే దండారి బృందం లోపలి వైపుకు తిరిగి నిలుచుంటారు. ఎడమ వైపుకు నెమ్మదిగా అడుగులు వేస్తూ, అడుగులు వేసి నప్పుడల్లా కుడి పాదాన్ని ఎడమ కాలు మీదికి వూగిస్తుండడంతో నృత్యం ప్రారంభమౌతుంది. ప్రతి నర్తకునికి చేతిలో రెండు కోలాటం కర్రలు వుంటాయి. నర్తకులు తమ చేతుల్లోని రెండు కర్రలను ఒకదానితో మరొక దానిని తాకిస్తారు. తరువాత కుడి వైపున వున్న నర్తకుని కర్రను కొడతారు. ఇలా అడుగులు వేస్తూ కోలాటమాడుతూ నర్తకులందరూ వంగి కర్రలను నేలకి తాకించి నాలుగు దిక్కులకూ అడుగులు వేస్తారు. దేవతలందరికీ ప్రణమిల్లడానికి ఇలా నాలుగు దిక్కులకూ అడుగులు వేస్తారు. దేవతలకు మ్రొక్కిన తరువాత వలయాన్ని సరి చేసుకుని కర్రలను పాదాల వద్ద వుంచి, పాటకు అనుగుణంగా చేతులతో చప్పట్లు కొడతారు. ఒక బృందం చరణాన్ని ముగ్తించగానే రెండవ బృందం రెండవ చరణాన్ని అందు కుంటూ బృంద గానం చేస్తారు.

     పై విధంగా దండారీల నృత్యం కొనసాగుతుండగా నలుగురైదుగురు గుసాడీలు హఠాత్తుగా దండారీల వలయంలోకి చొచ్చుకుని వస్తారు. తలకు నెమలి పించాలను ధరించి, కృత్రిమ గడ్డాలు మీసాలు, శరీరంపై మేకచర్మమూ ధరించి వచ్చే గుసాడీల చేతుల్లో కర్రలుంటాయి. మెడలో గవ్వల హారాలూ, తుంగ కాయల హారాలూ వుంటాయి. నడుముకు మణి కట్టుకూ – చిరు గజ్జెలు వుంటాయి. కంటి చుట్టూ తెల్ల రంగు పూసుకుంటారు. మొలకు త్యాగానికి చిహ్నమైన కాశాయపురంగు లంగోటీలు  అడవి తత్వాన్ని  గుర్తుచేసే ఆకుపచ్చని రంగు  వస్త్రం తప్పించితే శరీరం పై మరే ఇతర అచ్ఛాదన ఉండని గుసాడీల వేషం వింతగా వుంటుంది. శరీరం పైన నలుపు చారల చుక్కలతో వింత వింత అలంకరణాలు వుంటాయి. గుసాడీలు ప్రవేశించగానే దండారీలు చెల్లా చెదురౌతారు. ఇది ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని కలిగిస్తుంది.

గుస్సాడీ నృత్యానికి పద్మశ్రీ పురస్కారం:

భారత ప్రజా ప్రభుత్వం శాస్త్రీయ  భరతనాట్యం కూచిపూడి నృత్య రీతులకు వలె  ప్రాధాన్యతనిచ్చి  గౌరవించింది. తెలంగాణ కుమురంభీం జిల్లా మర్లవాయి గ్రామానికి చెందిన 60 ఏళ్ల గుస్సాడీ కనకరాజుకు పద్మశ్రీ  పురస్కారం  ఇచ్చి  గోండులను, గోండు  సంప్రదాయ గుస్సాడీ నృత్యాలనూ గౌరవించింది, గుస్సాడీలో ప్రావీణ్యం పొందిన కనకరాజు ను “గుస్సాడీ రాజు” గా పిలుస్తారు. ఢిల్లీ ఎర్రకోటలో గణతంత్ర వేడుకల్లో రాజు గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించారు. 55 ఏళ్ళుగా గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శిస్తూ, నేర్పుతూ వస్తున్న ‘రాజు’, ఈ నృత్యానికి దేశవ్యాప్తంగా ‘గుర్తింపు’ను తెచ్చారు. కనకరాజుకు పద్మ పురస్కారంతో ఎనిమిది రాష్ట్రాలలో ఉన్న గోండి నృత్యానికి, వంటవానిగా’ పనిచేసే అతనికి గొప్ప గౌరవం దక్కినట్లైంది.


గోండులు ఉపయోగించే వాయిద్యాలు:
  • తుడుము : అర్థ గోళాకారంలో వుండే మట్టితో తయారు చేయ బడ్డ వాయిద్య మిది. పైన మేక చర్మాన్ని భిగించి కడతారు. అర్థ గోళం పైభాగం పైన తోలు పట్టీలు చర్మాన్ని బిగించి వుంచుతాయి. తాళ్ళ చుట్టుపైన ఈ వాయిద్యాన్ని వుంచి, తోలుపట్టలతోవాయిస్తారు. ముఖ్యంగా దింసా నృత్యాలలో దినిని ఉపయోగిస్తారు. గోండులు ఈ వాయిద్యాన్ని ప్రజలందరినీ పిలిచేందుకు, ఒక్క చోట కలిపేందుకు మరియు నృత్యాల సమయంలో ఎక్కువగా వాడుతారు.
  • వెట్టె లేక, తురుబులి : అదిలాబాదు జిల్లా గోండులు ఉపయోగించే వాయిద్యమిది. దీనిని తురుబులి అనీ, వెట్టె అనీ అంటారు. కుండ మట్టితో గాని ఇనుముతో గాని, కొయ్యతో గాని దీనిని పళ్ళెం తయారు చేసి పైన చర్మాన్ని బిగిస్తారు. ఈ చర్మం వ్వాసం సారణంగా పది అంగుళాల కంటే ఎక్కువే వుంటుంది. సన్నని రెండు పుల్లలతో దీనిని వాయిస్తారు.
  • డోలు : దారువుతో డొల్లగా చేసిన ఈ వాయిద్యానికి రెండు వైపులా జింక చర్మాన్ని గాని మేక చర్మాన్ని గాని ఉపయోగిస్తారు. వెదురు ముక్కలూ, తాళ్ళతో ఈ చర్మాన్ని బిగువుగా వుంచుతారు.
  • తూర్యం :  రాజుల కాలం లో స్వాగతం పలకడానికి ఉపయోగించే నాటి పొడవాటి శంఖనాదంని పోలిన శబ్దాన్ని సృష్టించే వాయిద్యం.
  • పిల్లనగ్రోవి : ఇలాంటి ఎన్నో వాయిద్యాలను ఉపయోగించి సాంస్కృతిక సంబరాలను నిర్వహించుకుంటారు ఇలా తన్మయులై శారీరక మానసిక ఆత్మిక ఆనందాన్ని పొందుతూ ప్రశాంత జీవనాన్ని గడుపుతూ జీవిస్తారు గోండులు.
....విశ్వసంవాద కేంద్రము 

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top