‘పురాణ’ పురుషుడు… బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర‌శేఖరశాస్త్రి - Brahmashri Malladi Chandrasekhara Sastry

0
‘పురాణ’ పురుషుడు… బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర‌శేఖరశాస్త్రి - Brahmashri Malladi Chandrasekhara Sastry
Brahmashri Malladi Chandrasekhara Sastry

ప్రముఖ పురాణ వేదశాస్త్ర పండితులు, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శాశ్వత ఆస్థాన పండితుడు, ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖరశాస్త్రి (96) శివైక్య‌మ‌య్యారు. వ‌యోభారంతో బాధ‌ప‌డుతూ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. మల్లాది కన్నుమూతపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారు 1925 ఆగస్టు 28న గుంటూరు జిల్లా క్రోసూరులో జన్మించారు. తల్లిదండ్రులు దక్షిణామూర్తి, అదిలక్ష్మ మ్మ. అప్పట్లో హైదరాబాద్ సంస్థానాధీశుడైన కిషన్ ప్రసాద్ వద్ద పెద్ద ఉద్యోగి అయిన మల్లాది లక్ష్మీనారాయణ, సుందరీబాయి దంపతులకు పిల్లలు లేకపోవడంతో వీరి తాతగారైన రామకృష్ణ చయనుల వారిని దత్తత తీసుకున్నారు. అప్ప‌టి నుంచి వీరికి హైదరాబాద్ మల్లాదివారని పేరొచ్చింది. వీరి తాతగారు రామకృష్ణ చయనుల గారు గొప్ప వేద పండితులు. పదిభాషలలో అనర్గళంగా మాట్లాడ‌గ‌ల‌వారు. ఆచార వ్యవహారాల విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండేవారు. ఆయన ముగ్గురు మగసంతానంలో చంద్ర‌శేఖ‌ర శాస్త్రీ గారి నాన్నగారు రెండోవారు. మళ్లీ వీరందరి సంతానంలో శాస్త్రీ గారు పెద్దవారు. అందువల్ల తాతగారికి ఆయ‌నంటే చాలా ఇష్టం ఉండేది. నాలుగు నెలల వాడిగా ఉన్నప్పుడే తాతగారు ఆయ‌న్ని తనవెంట తీసుకెళ్లేవారు. నాయనమ్మ కృష్ణవేణి సోమిదమ్మ గారే ఆయ‌న్ని సాకింది. తాత‌గారి వద్దనే తర్క ప్రకరణాలు, శ్రౌతస్మార్తాలు అభ్యసించారు. చంద్ర‌శేఖ‌ర శాస్త్రి గారి తండ్రి దక్షిణామూర్తి శాస్త్రి పుష్పగిరి ఆస్థాన పండితులు. పెత్తండ్రి వీరరాఘవ శాస్త్రిగారు తర్కవేదాంత పండితులు. పినతండ్రి హరిశంకరశాస్త్రిగారు తెనాలిలో వేదవిద్యాపరీక్షాధికారిగా పని చేసేవారు. కంభంపాటి రామ్మూర్తి శాస్త్రిగారి వద్ద పూర్వమీమాంస, వ్యాకరణం నేర్చుకున్నాన్న శాస్త్రీ గారు.. తెలుగు మాత్రం వీధిబడిలో చదువుకున్నారు.
‘పురాణ’ పురుషుడు… బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర‌శేఖరశాస్త్రి - Brahmashri Malladi Chandrasekhara Sastry
చంద్రశేఖర శాస్త్రి గారు తన 15వ ఏట నుంచే ప్రవచన యజ్ఞాన్ని ప్రారంభించారు. 17వ యేట తాతగారు కాలం చేశారు. ఆయనందించిన స్ఫూర్తితో ప్ర‌వ‌చ‌నాలు చేయ‌డం కొన‌సాగించాడు. శాస్త్రి గారు అమరావతిలో ఉండేప్పుడు త‌మ ఎదురింట్లో ఉండే జాగర్లమూడి రామశాస్త్రిగారికి కంటిలో శుక్లాలు వచ్చి చూపు తగ్గిపోవడంతో శాస్త్రి గారిని పిలిచి రోజూ సాయంత్రం పద్యాలు చదివించుకుని వినేవారు. వారు ప‌ద్యాలు చ‌ద‌వ‌డం గ‌మ‌నించిన‌ గోళ్లమూడి ప్రసాదరావు అనే వైద్యుడు తన ఇంటి వసారాను కడిగించి పురాణ ప్రవచనం జరిగే విధంగా పీఠం, ఫొటో, పుస్తకాన్ని ఏర్పాటు చేశారు. శాస్త్రి గారు ఉత్తరీయం ధరించి విభూతి రేఖలు దిద్దుకుని భాస్కరరామాయణాన్ని గ్రామస్థుల ముందు చెప్ప‌డం ప్రారంభించారు. అలా నెల రోజుల పాటు ప్ర‌వ‌చ‌నాలు చెప్పారు. కొన్నాళ్ల త‌ర్వాత బెజవాడ వెళ్లి వేదాంత శాస్త్రం చదవాలనే కోరికతో శాస్త్రి గారు అమరావతి నుంచి గుంటూరు వ‌చ్చారు. అక్క‌డ కొంత మంది ప‌రిచ‌య‌స్థుల‌తో పుష్పగిరి పీఠాధిపతులు నరసరావుపేటలో ఉంటున్నార‌ని తెలుసుకుని వారిని క‌లుసుకున్నారు. ప్ర‌వ‌చ‌నాలు చ‌క్క‌గా చెబుతున్నాడ‌ని తెలుసుకున్న స్వామి గారు త‌న ఎదుట పురాణం చెప్ప‌మ‌ని అడ‌గ‌డంతో వారి మాట‌ను ఆదేశంగా తీసుకుని శాస్త్రి గారు వాల్మీకి రామాయణాన్ని చెప్పారు. స్వామివారు చాలా సంతోషించి నెలకు రూ.40 గ్రాసం మీద పుష్పగిరి ఆస్థానంలో పురాణ పండితునిగా నియమించారు. అప్ప‌టి నుంచి వారితోపాటే ఊరూరూ తిరుగుతూ ఏడాదిన్నరపాటు పురాణ ప్రవచాలు చెప్పారు.

ఆ తర్వాత పెత్తండ్రి మల్లాది వీరరాఘవశాస్త్రిగారు బెజవాడలో బ్రహ్మసత్రయాగం జరుపుతుంటే ఆయన కోరిక మేరకు అక్కడ సుమారు సంవత్సరంపాటు ప్రవచనం చేశారు. అలా రాష్ట్రమంతా త‌న ప్ర‌వ‌చ‌నాలు చేస్తూ ఉండేవారు. బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావు వంటి రాజకీయ ప్రముఖులతోబాటు చిత్తూరు వి.నాగయ్య, ఘంటసాల, ఎస్వీరంగారావు, కన్నాంబ వంటి వెండితెర ప్ర‌ముఖులు శాస్త్రి గారి ప్ర‌వ‌చ‌నాల‌ను ఇష్టపడేవారు. కొంత మంది సినిమా ద‌ర్శ‌కులు త‌న‌ని సినిమాలలో నటించమని అడిగేతే త‌న‌కు ఇష్టం లేక తిర‌స్క‌రించిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఎన్నో గంటలపాటు ప్రవచనాలు చెప్పినా, గొంతు తడారిపోవటం, కంఠశోష వంటివి ఎప్పుడూ జ‌ర‌గ‌క‌పోవ‌డం శాస్త్రి గారి ప్ర‌వ‌చ‌నాల విశేషం. ఇప్పటి వరకూ శాస్త్రి గారు 300 దాకా రామాయణ ప్రవచనాలు, 350 మహాభారత ప్రవచనాలు, 250 భాగవత ప్రవచనాలూ చెప్పారు. ఇవేగాక ప్రతియేటా ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవారు, దూరదర్శన్‌లోనూ, సప్తగిరి చానల్‌లోనూ ప్రవచనాలు చెబుతుండేవారు.

వారు ఒక నడిచే పురాణ విశ్వవిద్యాలయము. ధర్మానికి సందేహము తీర్చటం మాత్రమేకాక, ధర్మద్రోహాన్ని ఎక్కడా సహించే లక్షణం వారిలో లేదు. పురాణవిద్యకి ఒక ప్ర‌త్యేక సెల‌బ‌స్‌ను తయారుచేసి దానికి ఒక కళాశాలను ప్రారంభించి ఎందరో పౌరాణికులను తెలుగువారికందించిన పౌరాణిక బ్రహ్మ మ‌ల్లాది మల్లాది చంద్ర‌శేఖరశాస్త్రి గారు.

పురాణ కాలక్షేపం అన్న మాట చాలాకాలం విస్తృత వినియోగంలో ఉండేది. కానీ.. అది తప్పని, పురాణ ప్రవచనం అనాలి కానీ పురాణ కాలక్షేపం అనకూడదని, కాలక్షేపం అనడమంటే పురాణాలకున్నటువంటి ప్రాశస్త్యాన్ని తగ్గించినట్లేనని మల్లాది అనేవారు. పురాణం వినటం కాలక్షేపం కోసం కాదు, జీవన గమనాన్ని మార్చుకునేందుకన్న విషయాన్ని గుర్తించాలని చెప్పేవారు. పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాల సారాన్ని జీవితానికి అన్వయించుకోవాలని ఆయన బలంగా చెప్పేవారు.

96 ఏళ్ల పరిపూర్ణ జీవితాన్ని గడిపిన ఆయన చివరివరకు నిత్యం ఏదో ఓ గ్రంథాన్ని పఠిస్తూ ఉండేవారు. పురాణాలతోబాటు నేను జంధ్యాల పాపయ్యశాస్త్రి, గొట్టిముక్కల, ధూళిపాళ వంటి వారి పద్యకావ్యాలు, గుర్రం జాషువా గబ్బిలం, ఫిరదౌసి వంటి ఖండకావ్యాల‌ను ఆయ‌న చ‌దివారు. వేదం, తర్కం, వేదాంతం, మీమాంస, వ్యాకరణం, వేదాంత భాష్యంలో విశేష ప్రవేశం ఉన్న ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులుగా సామాజిక హితం కోసం విశేష కృషి చేశారు. ఉపన్యాసం, హరికథ, నాటకం, పురాణం కలిపి శ్రోతలను ఆకట్టుకునేలా ప్రవచనం చేయడంలో మల్లాది సుప్రసిద్ధులు.

___Vishwa Smavada Kendramu (full-width)

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top