హిందువు ఆత్మవిస్మృతి వీడాల్సిన సమయం ఆసన్నమైందని ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ జీ భాగవత్ అన్నారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా ముచ్చింతల్‌లోని భవ్య రామానుజ మూర్తిని వారు బుధవారం సందర్శించారు. ధర్మాచార్యుల సమ్మేళనం అనంతరం భక్తులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా హిందువుల ఆత్మవిస్మృతి ఎంతటి స్థాయికి వెళ్ళిందో వివరిస్తూ వారు చెప్పిన కుందేలు కథ అందరినీ ఆలోచనలో పడవేసింది. కథలోని కుందేలు లాగే హిందువులకు కూడా దేనికీ తక్కువ లేకున్నా అందరికీ భయపడిపోతున్నారని అన్నారు.
వేల ఏండ్ల నుండి విధర్మీయుల ఆక్రమణలను, పాశవిక అత్యాచారాలను సహించి కూడా హిందువులు ఇప్పటికీ ఈ దేశంలో 80శాతం ఉన్నారనీ, ఈ దేశాన్ని నడిపెవారూ హిందువులేననీ, రాజకీయ పార్టీలలో అధికులు హిందువులేననీ, ఉద్యోగుల్లో సైతం అధికులు హిందువులేననీ, ఈ దేశంలో మనకు ఏమి కరువైందని హిందువు ఆత్మవిస్మృతిలోకి జారుకుంటున్నాడని ప్రశ్నించారు. ఇది మన దేశం, మన సంస్కృతి, మన వారసత్వపరంపర మనకు నేర్పినది శాశ్వతం. మొత్తం ప్రపంచం సాంఘిక విప్లవం గూర్చి ఆలోచిస్తోంది. ఇది వెయ్యేళ్ళ నాడే మనదగ్గర సాధ్యమైంది. ఇంకా ఇప్పటికీ ఇతర దేశాల్లో వర్ణవివక్షత కొనసాగుతోంది… కానీ మన దగ్గర వెయ్యేళ్ళ నాడే సమతావాదం ఉందని, రామానుజ సహస్రాబ్ది మూర్తి ఇదే సందేశం ఇస్తోందని అన్నారు.
మనం మనను మరచిపోవడమే నేటి మన దౌర్భల్యానికి కారణం అని అన్నారు. సమస్యలపై సంఘర్షణ చేస్తూ వాటి పరిష్కారానికి ఉపాయాలు ఆలొచించాలి అని అన్నారు. ఇలా సమస్యలను ఎలా సాధించుకోవాలో చెబుతూ కేరళకు చెందిన ఉదయానందుడు అనే యువరాజు కథను ఉదహరించారు. మనం వసుధైక కుటుంబం భావనను ప్రభోధించేవారమంటూ చేతులు ముడుచుకు కూర్చోవాల్సిన అవసరం లేదు అని అన్నారు.
మన హిందువుల ముందు ఏ శక్తీ నిలువలేదని, కేవలం మన లోపలి భయం మాత్రమే మనను నిలువరిస్తుందని అన్నారు. వెయ్యేళ్ళ నాడు ఇలా హిందువు భయపడి ఉంటే ఆరోజే హిందుత్వం పరిసమాప్తి అయ్యెదనీ మనను నష్టపరచాలనుకున్న వారే నాశనమయ్యారని అన్నారు. 5వేల ఏళ్ళ పూర్వం మన సంస్కృతి ఎలా ఉండెనో ఇప్పుడూ అలాగే ఉందనీ, ఎన్నో అత్యాచారాలకు గురైనా మన సంతుల మార్గదర్శనం కారణంగా మన మాతృభూమి ఇంకా మిగిలి ఉన్నది అని అన్నారు. ఒకవైపు ఖనిజ సంపదలో, మరోవైపు విఙానంలో, ఇంకోవైపు యువశక్తి లో ప్రపంచంలో మనం ప్రథమ స్థానంలో ఉన్నామని, మనం ఎందుకు భయపడాలి? కేవలం మనల్ని మనం మరవడం కారణంగానే భయం మనలో ప్రవేశించిందని అన్నారు. దేశంలో వైవిధ్యం ఎంత ఉన్నా మనందరి అస్తిత్వం ఒకటేననీ ఇప్పుడు అందరికీ సమతా సమరసత చెప్పాల్సిన అవసరం ఎందుకొచ్చింది అంటే… కేవలం మనలను మనం మరవడమే కారణం అని అన్నారు.
మన ధర్మం కేవలం అందరినీ సమానంగా మాత్రమే చూడమనదు. అందరినీ ఆత్మస్వరూపులుగా చూడమంటుందని, మార్గాలు భిన్నమైనా కర్తవ్యం, లక్ష్యం ఒకటే కావాలి అన్నారు. ధర్మమార్గంలొ అర్థ కామాలను నియంత్రించి మోక్షం సాధించుమని చెప్పేది కేవలం మన ధర్మమే అన్నారు. ఆట్మవత్ సర్వభూతేశు అని చెప్పె శ్లోకంలో హిందూ ధర్మ సారం ఇమిడి ఉందన్నారు. మన సంస్కృతి పర్యావరణ పరిరక్షణను, అందరి సౌఖ్యాన్ని కోరుతుందని, దీన్ని మనం ఆచరణలో చూపాలనీ అన్నారు. సమాజంలోని అన్నివర్గాల కులాల, వర్ణాల వారిని మిత్రులుగా చెసుకోవాలనీ, వాళ్ళతో మన కుటుంబాలకు మిత్రత్వం సాధించాలనీ పిలుపునిచ్చారు.
ఇక్కడ అఖిల భారత స్థాయిలో సాధుసంతులు కలిసినట్లే నెలకోసారి జిల్లా స్థాయిలో కలిసి సమాజ హిత ప్రభొధాల గూర్చి చర్చించాలని అన్నారు. సామాజిక కష్టాలను దూరం చేసేలా సమతామూర్తి మనకు ప్రేరణనివ్వాలని అన్నారు. కుటుంబంలో కూడా అందరూ వారానికొకసారి కలిసి శ్రద్ధతో భజన చేయాలనీ, 2, 3 గంటలు కుటుంబ పూర్వజుల గూర్చి, వంశ పూర్వీకుల గూర్చి, దేశ పూర్వీకుల గూర్చి చర్చ చేయాలి అని అన్నారు. మన ఇంట్లో చిత్రాలు కూడా మనకు ప్రేరణను అందించేవిగా ఉంచాలన్నారు. మనం మన కుటుంబం కోసం పని చేసినట్లే సమాజం కోసం పని చేయాలి అని అన్నారు. మనం సంపాదించే దానిలో 1/6సొంతానికి , 1/6కుటుంబానికి, 1/6సమాజానికి, 1/6గుడులకు, 1/6నిల్వకు, 1/6ప్రభుత్వానికి ఉపయోగించాలి అని అన్నారు. ఇలా ఉపయోగించటంలో హిందూ సమాజం రెండడుగులు వేస్తే మనం సర్వశక్తివంతులం అవుతామనీ, దేశం, ధర్మం ముందు… తర్వాతే.. నేను, నా కూటుంబం, నా భాష, నా ప్రాంతం, నా వర్గం అనే భావన ఉండాలన్నారు. మనం స్వాభిమానం తో జీవించాలనీ, దీనితోనె సమాజ పాలన పోషణ జరగాలనీ సమతామూర్తి ఇదే సందేశం ఇస్తుందని అన్నారు. కుటుంబంలో మంచి వాతావరణం నిర్మాణం చేస్తే ఇవన్నీ సాధ్యమవుతాయని వారు పిలుపునిచ్చారు.
.....విశ్వసంవాద కేంద్రము (తెలంగాణ)