‘సాని, సానులు’ అంటే ‘వేశ్య’ కాదు - ‘Sani, Sanulu’ does not mean ‘whore’

0
‘సాని, సానులు’ అంటే ‘వేశ్య’ కాదు - ‘Sani, Sanulu’ does not mean ‘whore’

-బొల్లోజు బాబా
ఆరవ శతాబ్దం నుంచి పదిహేనో శతాబ్దం వరకూ  ఆంధ్రప్రాంతంలో గుడిసానుల వ్యవస్థ ఉండేది.  ఈ సాని అనే పదం స్వామిని అనే పదం నుంచి వచ్చింది. గుడిలో ఉంటూ నాట్యము, సంగీతము లాంటి కళలను ప్రదర్శించే స్త్రీలను సానులు, సాని సంప్రదాయమువారు, గుడిసానులు అని పిలిచేవారు.  వంశపారంపర్యంగా నాట్యవృత్తిని కొనసాగిస్తున్న వారిని ‘సాని’ సంప్రదాయమువారంటారు.

వీరు చిన్నతనం నుంచి సంగీత, నాట్య విద్యలను నేర్చుకొని దేవుని సేవకు, ఆలయంలో ఇతర కైంకర్యాలకు భక్తితో అంకితమైనవారు. ఆలయములలో జరిగే అంగరంగ భోగములను గుడిసానులే జరిపించేవారు. (అంగభోగము అంటే దేవతా విగ్రహములకు చేసే అలంకారాలు నివేదనలు. రంగభోగము అంటే గుడిని శుభ్రపరచి ముగ్గులతో అలంకరించటం). నాట్యము, గానము షోడశోపచారాలలో భాగం కనుక ఆ ఉపచారాలకొరకు గుడిసానుల వ్యవస్థ ఆవిర్భవించింది.

‘సాని, సానులు’ అంటే ‘వేశ్య’ కాదు - ‘Sani, Sanulu’ does not mean ‘whore’

1. గుడిసానులు వ్యభిచారులు కాదు.

అప్పట్లో  వేశ్యావృత్తి వ్యవస్థాగతమైన వేరే పరిశ్రమ. వేశ్యావృత్తిని సాగించే స్త్రీలను వేశ్య, వారాంగన, వెలయాలు, లంజియ అనే పేర్లతో వ్యవహరించేవారు. ఈ వృత్తిని చేపట్టిన స్త్రీలు ఊరిలో వేశ్యావాటికల పేరుతో కేటాయించబడిన ప్రాంతాలలో ఉండేవారు. వేశ్యావృత్తిలో ఉన్న వారాంగన నెలలో రెండు రోజుల ఆదాయాన్ని పన్నుగా కట్టేది.  శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాజ్యాదాయంలో  వేశ్యలు కట్టే పన్నులు పెద్దమొత్తమే.
 • హనుమకొండలోని వేయిస్తంభాల గుడి శాసనాలలో ఓరుగల్లులో ఉన్న అలాంటి వేశ్యావాటిక వర్ణన కలదు.  ప్రతాపరుద్రచరిత్రలో ఓరుగల్లులోని వేశ్యావాటిక వర్ణన కలదు. వేములవాడ భీమకవి వ్రాసిన ఒక చాటువులో కూడా ద్రాక్షారామంలోని వారాంగనల వర్ణన కనిపిస్తుంది. దీనిని బట్టి ఈ గుడిసానులు, వారాంగన వ్యవస్థలు  వేరువేరుగా ఉన్నట్లు అర్ధమౌతుంది.
 • శ్రీనాథుడు భీమేశ్వర ఆలయంలోని గుడిసానులను వర్ణించేటపుడు శృంగారరసం కాక భక్తిరసం పలికించాడు. “వారంతా తమ అందంతో, చామరసేవలతో, అపురూపమైన నాట్యకౌశలంతో, గాన మాధుర్యంతో ప్రతిసంధ్యలో, భోగసమయములలో భీమేశ్వరునిని రంజింపచేస్తున్నారని అంటాడు” .
 • మరోచోట – “చక్కని వెన్నెల కాయగా దక్షవాటికా వేదికల మీద కూర్చుండి బంగారు వీణలు మీటుతూ అప్సరసలు తీయనిమత్తుతో, మోదంతో, మిక్కిలి నేర్పుతో శివుని మీది పాటలు భువన మోహన విగ్రహుడైన బీమనాథుని గూర్చి పాడారు” అంటాడు శ్రీనాథుడు గొప్ప మైమరపుతో”.(5-103)
 • అప్పట్లో రాజవంశ కన్యలు, కులీనవర్గాల స్త్రీలు స్వచ్చందంగా వచ్చి ఆలయసేవకు అంకితమయ్యేవారు. క్రీ.శ 1047 లో కుందరాజ తన సోదరి బిక్కబ్బరసి ని మల్లేశ్వరునికి అంకితమిచ్చాడు. క్రీ.శ 1271 లో మంకిశెట్టి అనే వ్యక్తి తన ఇద్దరు మనుమరాండ్రను ఏలేశ్వరుని ముందు నాట్యం చేసే సానులుగా అంకితమిచ్చాడు.
 • అప్పటి సమాజంలోని రాజులు, ధనవంతులు తాము ఇష్టపడిన ఈ గుడిసానులను వివాహమాడటం కూడా జరిగేది. వెలనాటి గొంక III చందవోలు పాందీశ్వరాలయానికి చెందిన కామిదేవి అనే గుడిసానిని వివాహమాడాడు. 1225 లో వీరశేఖర వర్మ అనే వేనాడు రాజు ఉన్నికాల్త్రం అనే గుడిసానిని వివాహమాడాడు.
పాందీశ్వర ఆలయానికి చెందిన సొక్కమ, బయ్యాంబిక పేర్లు గల గుడిసానిలకు పుట్టిన కొడుకులు గొంక II వద్ద ఉన్నతపదవులలో పనిచేశారు.

‘సాని, సానులు’ అంటే ‘వేశ్య’ కాదు - ‘Sani, Sanulu’ does not mean ‘whore’

2. గుడిసానులు ఆలయ ఉద్యోగులు

గుంటూరు జిల్లా కొప్పరం ఊరిలోని కోదండరామస్వామి ఆలయంలో  క్రీశ 1114 లో వేసిన ఒక శాసనముద్వారా ఆలయం గుడిసానులు చేసే పన్నెండు విధులను గుర్తించవచ్చు.

అవి వరుసగా  నర్తకాచార్య (నట్టువాంగి), నర్తకి,  నటీమణి (పాత్ర), గాయని, వేణువు, మృదంగము, శంఖము, నాదస్వరం ఊదుస్త్రీలు, వింజామర వీచే సాని, పరిచారిక, ఎరుకచెప్పే సాని.  పై పనులన్నీ నాట్యము, సంగీతము లకు సంబంధించిన విద్యలు.  ఆలయానికి వచ్చే భక్తులకు భవిష్యత్తు చెప్పటానికి ఎరుకచెప్పేసాని ఉండేదని అనుకోవచ్చు.

శ్రీకూర్మంలో 1250 నాటి ఒక శాసనములో గుడిసానులకు ఇచ్చే జీతభత్యాల వివరాలు ఉన్నాయి :
 • సాని ఒక్కింటికి = ఏడాదికి 42 పుట్ల ధాన్యం (ఒకపుట్టి = ఇరవై కుంచాలు) ప్రతిరోజు రెండు తాంబూలాలు, మూడు అప్పాలు.
 • నాట్యం నేర్పే సానికి = ఏడాదికి నాలుగు మాడలు, 4 కుంచాల ప్రసాదం, రోజు 1 తాంబూలం, నెలకు నాలుగు అప్పాలు.
 • వాద్యకారిణికి = ఏడాదికి  మూడు మాడలు, రెండున్నరకుంచాల ప్రసాదం, రోజూ 1 తాంబూలం, నెలకు నాలుగు అప్పాలు, మృదంగం, శంఖం, బాకా వాయించే సానులకు ఒక్కింటికి ఏడాదికి రెండు కుంచాల ప్రసాదం, రోజూ అర తాంబూలం.  (?)
పైనచెప్పినవి వస్తురూపంలో కానీ సమానమైన ధనం రూపంలో కానీ ఆ సానులు పొందవచ్చు.

3. గుడిసానులు గౌరవ పాత్రులు

మధ్యయుగాలలో ఈ గుడిసాని వ్యవస్థ కళలను పోషించింది.  పవిత్రంగా ఉంది.  స్వామినులుగా  గుడిసానులు సమాజంలో గౌరవం పొందారు. వివాహాలు చేసుకొన్నారు. పిల్లల్ని కన్నారు.  ఆలయానికి ఇచ్చిన వివిధ దానాలు అమలయ్యేలా చూసే అధికారం కలిగి ఉండేవారు.

కొన్ని శాసనాలలో కనిపించే జ్ఞానసాని, సూరసాని, దొడ్డసాని లాంటి పేర్లలో ఆయా వివాహితుల పేర్లకు చివర సాని అనే పదం స్వామిని (భార్య) అనే అర్ధంలో వాడబడిందని అర్ధం చేసుకోవాలి.  కొన్ని ఉదాహరణలు
 • * వేమారెడ్డి తన తండ్రి కాటమరెడ్డి, తల్లి దొడ్డ“సాని” అమ్మకు శుభం జరగాలని పిఠాపురం కుంతీమాధవ ఆలయంలో క్రీశ. 1391 లో ఒక మంటపము కట్టించినట్లు ఆలయ స్తంభంపై శాసనము కలదు. ఈ దొడ్డసాని  రాజమాత.
 • * క్రీ. శ 1450 ప్రమోదూతనామ సంవత్సరం శ్రావణమాసంలో శ్రీకుమారారామ భీమేశ్వర ఆలయంలో దక్షిణపు దిక్కున ఒక భక్తుడు తన తల్లి అన్నయసాని, తండ్రి భీమాభక్తుని పేరిట ఒక గుడి కట్టించి అనభీమలింగమును ప్రతిష్ట చేశాడు.
 • * 1424 క్రోధినామ సంవత్సరం, కార్తీకమాసమందు వేమారెడ్డి సేవకుడైన భక్తుని కూనయనెనిం తమ తల్లి మనుమసానికి పుణ్యముగాను తిరువళికంభము (దీపస్తంభము) నిర్మించి తిరువళికి చమురుకొరకు తొంభై గోవులను, స్వామివారికి పట్టువస్త్రాలను, కొంతభూమిని, నలభైఒక్క టంకాలను సమర్పణ చేసి ఆ విషయాన్ని దక్షిణ గోడకు శాసనము వ్రాయించాడు.
గుడిసానులకు సమాజంలో గౌరవం ఉండేది.  భక్తులు ప్రత్యేకంగా గుడిసానులకొరకు బహుమతులు ఇచ్చేవారు. ఆంధ్రదేశంలో వివిధ ఆలయాలలోని సానులకు ఇచ్చిన దాన శాసనాలు మొత్తం 74 కలవు.  వీరి ఆదాయం గణనీయంగా ఉండటంచే వీరు కూడా ఇతర భక్తులలా దేవుడికి అనేక మాన్యాలు, దానాలు సమర్పించుకొన్నట్లు వివిధ శాసనాలలో కన్పిస్తుంది.

1263 లో ద్రాక్షారామ భీమేశ్వరునికి వాససాని అనే మున్నూరు సాని ఒక గ్రామాన్ని దానం చేసింది. అదే విధంగా చందోలు, పాందీశ్వర గుడిసాని అయిన బానమామ్మ ద్రాక్షారామ భీమేశ్వరునికి దానాలు ఇచ్చింది.

తిరుపతిలో ఆలయంలోని తిరువెంకట మానిక్కం  అనే గుడిసానికి పల్లకిపై రావటానికి అచ్యుతరాయలు అనుమతినిచ్చాడు. అచ్యుతరాయని కాలంలో తిరుమల గుడిసాని అయిన ముద్దుకుప్పయి తల్లి కుప్పసాని విశేషమైన  పాండిత్యప్రతిభ కనబరచి “విద్వత్సభారాయరంజక” అనే బిరుదును పొందింది.  తిరుపతి గుడి శాసనాలలో లింగసాని, హనుమసాని, తిప్పసాని, నాగసాని అనే గుడిసానుల పేర్లు కనిపిస్తాయి.

4. కోల్పోయిన ప్రాభవం

పంతొమ్మిదో శతాబ్దంనుండి గుడిసానులంటే వ్యభిచారులన్న అర్ధంలో వాడబడటానికి అన్యమత పాలనలలో హిందూ ఆలయాలకు ఆదరణ తగ్గటమే కారణం.
 • 12 వ శతాబ్దంలో ద్రాక్షారామ ఆలయానికి దీపారాధన నెయ్యి, క్షీరాభిషేకాల కొరకు 9500 పశువులు దానంగా ఇవ్వగా, పదిహేనో శతాబ్దానికి వచ్చేసరికి ఈ సంఖ్య 250 మాత్రమే ఉండటాన్ని బట్టి రాజకీయ కారణాలవల్ల ఆలయవ్యవస్థ ఏమేరకు ప్రభావితమైందో అర్ధమౌతుంది.
 • ఒకప్పటి సమాజానికి ఆర్ధికకేంద్రాలుగా ఉండిన దేవాలయాలు ఎప్పుడైతే పతనమయ్యాయో, అంతవరకూ దేవుని ఎదుటమాత్రమే నాట్యం, గానం చేస్తూ ఆలయాన్ని ఆశ్రయించుకొని ఉండిన గుడిసానిలు ప్రత్యామ్నాయ ఆదాయమార్గాలు వెతుక్కొనే పనిలో పెళ్ళిళ్ళకు, విందులకు  కూడా నాట్యం చేయటం ప్రారంభించారు.  అది క్రమేణా గుడిసానులను ఉత్త “Dancing girls” స్థాయికి దిగజార్చింది.
 • మధ్యయుగానికి చెందిన గుడిసానులకు పంతొమ్మిదో శతాబ్దపు “Dancing girls” మధ్య వ్యత్యాసం తెలియని బ్రిటిష్ చరిత్రకారులు గుడిసానులంటే “Temple Prostitutes” గా జమకట్టారు.  Abbé Dubois (1765 – 1848) లాంటి కొంతమంది మాత్రం Professional Prostitutes and  Dancing girls అనే విభజనను గుర్తించారు.
 • జమిందారీ యుగంలో  గుడిసానులకు, వేశ్యలకు మధ్య ఉండే సాంస్కృతిక విభజన చెరిగిపోయింది.
 • గుడిసాని వ్యవస్థకు చెందిన చివరితరపు ప్రతినిధిగా బెంగుళూరు నాగరత్నమ్మ- ముద్దుపళనిని కందుకూరి వీరేశలింగం వేశ్యగా సంబోధించటాన్ని తీవ్రంగా పరిగణించి కోర్టుకు వెళ్ళింది.
 • ఇరవయ్యోశతాబ్దం ప్రారంభంలో  ఉవ్వెత్తున ఎగిసిపడ్డ Anti Nautch ఉద్యమం ద్వారా పునరుజ్జీవనం పేరిట సాంప్రదాయ నృత్యం, సంగీతం, వేరే సామాజికవర్గాల చేతుల్లోకి పోతున్నాయని వీణా ధనమ్మాల్, నాగరత్నమ్మ, బాలసరస్వతి లాంటి వారు అప్పట్లో ఎలుగెత్తారు.

5. ముగింపు

గుడిసానులు సంగీతం, నాట్య శాస్త్రాలను అభ్యసించి పోషించిన వర్గంగా చెప్పుకొంటున్నప్పుడు, నేటికీ దేశవ్యాప్తంగా గ్రామాలలో ఇంకా మనుగడలోనే ఉన్న మాతంగి, బసివిని, జోగిని లాంటి ఆచారాలగురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ ఆచారాలుకూడా ఆరోశతాబ్దం నుంచీ ఉన్నాయి. వీరు ఎక్కువగా శివాలయాలకు, గ్రామదేవతల ఆలయాలకు అనుబంధంగా ఉండే… దేవుడికిచ్చి పెళ్ళిచేయబడిన దళితబహుజన స్త్రీలు. ఒకప్పుడు వీరు నుదుట పెద్దబొట్టుపెట్టుకొని చేతిలో వెదురుకోల, గోపాలం(భిక్షాపాత్ర) తో  గ్రామంలో ప్రజలను ఆశీర్వదిస్తూ వారు ఇచ్చినవి స్వీకరిస్తూ జీవించేవారు. ఊరిలో జరిగే శుభకార్యాలలో, ఉత్సవాలలో వీరికి అగ్రపీఠం ఉండేది. ఇది ఒకరకంగా Matriarchial సమాజపు అవశేషంగా బావించవచ్చు. వీరు గ్రామంలో ఆయా గుడుల పూజారిణిలుగా గౌరవం పొందారు.

క్రమక్రమంగా  గుడిసానుల లాగే వీరుకూడా వేశ్యలుగా మార్చబడ్డారు. బాలికలను దేవుళ్ళకిచ్చి పెళ్ళి చేసే దేవదాసి వ్యవస్థను 1924 బ్రిటిష్ ప్రభుత్వం రద్దుచేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1982 లో ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేసింది.

ఓ వెయ్యేళ్ళక్రితం ఏదో ఆలయంలో దేవదేవుని  ఎదుట తన్మయత్వంతో గానం చేసిన ఎవరో ఓ గుడిసాని గాత్రమాధుర్యం ఎమ్మెస్ పాడిన సుప్రభాతంలో లీలగా నేటికీ తారాడుతుంది.

తమపూర్వీకులు నృత్యంచేసిన ఆలయానికి ఏడాదిలో ఒకరోజు వెళ్ళి దేవుని ఎదుట నృత్యంచేసి ఆ సంప్రదాయ పరంపరను భక్తితో కొనసాగించే వ్యక్తులు ఇంకా ఈ నేలపై ఉన్నారు.

Courtesy: Vishwa Samvada Kendramu

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top