ఆధ్యాత్మిక విప్లవకారుడు పూజ్య విద్యా ప్రకాశానందగిరి - Vidya Prakashanandagiri

Vishwa Bhaarath
0
ఆధ్యాత్మిక విప్లవకారుడు పూజ్య విద్యా ప్రకాశానందగిరి - Vidya Prakashanandagiri
Vidya Prakashanandagiri
న దేశంలో సుదీర్ఘ కాలం పాటు సాగిన పరదేశీయుల పాలన, విదేశీ విద్య, ఆ సమయంలో పెచ్చరిల్లిన వివిధ భావజాలాలు, ప్రజలలో ప్రబలిన బీదరికం, అవిద్య, అంటరానితనం, మూఢ నమ్మకాలు వంటి వివిధ కారణాల వల్ల కునారిల్లిపోతున్న హిందూ సంస్కృతిని పునరుజ్జీవింపజేయడానికి ఎందరో సాధుపుంగవులు ఈ నేలపై ఉద్భవించారు. సమాజంలో ధార్మిక, ఆధ్యాత్మిక జ్యోతులను వెలిగించి, సమాజంలో అలముకుని ఉన్న అజ్ఞానాంధకారాన్ని, అసమానతలను తొలగించారు. తమ బోధల ద్వారా, ఆచరణ ద్వారా, రచనల ద్వారా లక్షలాది మందిని ప్రభావితం చేసి సమాజాన్ని ఆధ్యాత్మిక, ధార్మిక చైతన్య పథంలో నడిపిన అట్టి మహనీయులే నిజమైన సంఘ సంస్కర్తలు. ఆ మహనీయుల కోవలోని వారే పూజ్య విద్యా ప్రకాశానందగిరి స్వామి.

సుగుణశీలి, దైవభక్తి సంపన్నుడు

విద్యా ప్రకాశానందగిరి స్వామి ఆనంద నామ సంవత్సర చైత్ర బహుళ తదియ (13-4-1914) నాడు బందరులో రామస్వామి, సుశీలా దేవి అనే పుణ్య దంపతులకు మూడవ పుత్రుడుగా జన్మించాడు. తండ్రి రామస్వామి న్యాయవాది. దేశభక్తుడు. హైందవ సమాజాన్ని సంస్కరించాలనే దృఢ సంకల్పంతో పనిచేసిన సంఘసంస్కర్త. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలను భాష్యంతో సహా అధ్యయనం చేశాడు. శిష్టాచార సంపన్నులైన రామస్వామి దంపతుల ఇంటికి తరచుగా విద్వాంసులు, సాధు మహాత్ములు వచ్చేవారు. వేదాంత గోష్టులు జరుగుతుండేవి.

విద్యాప్రకాశానంద బాల్యనామం ఆనంద మోహన్. చిన్నతనంలోనే ఆ బాలుడు ఎంతో ప్రజ్ఞా ప్రాభవం ప్రదర్శించేవాడు. పసితనం నుంచే దైవభక్తి మెండుగా ఉండేది. రామస్వామి ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ప్రాపంచిక విషయాల పట్ల తీవ్ర విరక్తి ఏర్పరచుకున్నాడు. వకీలు వృత్తి మానేసి చిన్న పర్ణ కుటీరంలో జీవిస్తూ, ధ్యానం, జపం, భజన, పారాయణం, అర్చన, ఆత్మవిచారణ, వేదాంతగోష్టులతో కాలం గడపసాగాడు. ఆదర్శ గృహిణి సుశీలాదేవి భర్తకు అన్ని విధాలా సహకరించేది. సహజంగానే ఆధ్యాత్మిక సంస్కారం గల ఆనంద మోహనుని చిత్త వృత్తి దైవ మార్గంలో పురోగమించటానికి ఆ వాతావరణం అనుకూలించింది.

Vidya Prakashanandagiri
Vidya Prakashanandagiri
ఆనంద మోహనుడు తన తండ్రితో పాటు “పంచదశి”, “జీవన్ముక్తి”, “ప్రకాశిక ” గ్రంథాలను పఠించేవాడు. “భర్తృహరి సుభాషితం”, “ప్రశ్నోత్తర”, “గాయత్రీ రామాయణం”, “ఆత్మబోధ” గ్రంథాలన్నీ కంఠస్థం చేశాడు. తండ్రి రామస్వామి ఆంగ్లాంధ్ర భాషల్లో ప్రవీణుడవడంతో వివిధ సంస్థల వారు భగవద్గీతపై ఉపన్యసించవలసినదిగా ఆయనను ఆహ్వానించేవారు. ఆనందమోహన్ కూడా ఆయా సందర్భాల్లో తండ్రి గారితో వెళ్ళి శ్లోకాలను చదువుతూ ఉంటే, రామస్వామి వ్యాఖ్యానం చేసేవారు. ఆ విధంగా బాల్యం నుంచి ఆనందమోహన్ కు భగవద్గీతతో అనుబంధం ఏర్పడింది. దేశభక్తి ప్రభావితుడైన రామస్వామి ఇంట్లోనే నూలు వడికి ఖద్దరు వస్త్రాలనే ధరించేవాడు. దీపావళినాడు108 జ్యోతులతో ఓంకార రూపాన్ని వెలిగించేవాడు.

శాస్త్ర విధులననుసరించి ఉపనయన సంస్కారం పొందిన ఆనందమోహన్, ఒకసారి వేటపాలెంలోని సారస్వతనికేతనంలో ఆనాటి ప్రభుత్వ ఆస్థాన కవి శ్రీ కాశీకృష్ణాచార్యుల అధ్యక్షతన జరిగిన సమావేశంలో వేద ప్రతిపాదితాలైన బ్రహ్మచర్య ధర్మాల గురించి అనర్గళంగా తన వాక్పటిమతో సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషల్లో ఉపన్యసించి సభలోని విద్వాంసులను పెద్దలను ఆశ్చర్యచకితుల్ని చేశాడు. బ్రహ్మశ్రీ కాశీకృష్ణాచార్యులవారు ” ఈ బాలబ్రహ్మచారి భవిష్యత్తులో గొప్ప యతీశ్వరుడు కాగలడు. ఇతని కీర్తి నలుదెసలా వ్యాపిస్తుంది.” అంటూ ఆశీర్వదించారు.

ఆయన చదువు అందరిలాగే సాధారణంగా సాగింది. మెట్రిక్యులేషన్ వరకు విజయవాడలోనూ, డిగ్రీ మచిలీపట్నంలోనూ పూర్తి చేశాడు. 1933 లో బి.ఎ.పట్టా పుచ్చుకొన్న ఆనందుడు కళాశాలలో చదివే రోజుల్లోనే రాష్ట్ర స్థాయిలో ఎన్నో బహుమతులు సాధించాడు. ఉన్నత చదువుల కోసం ఆ రోజుల్లో అందరిలానే వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. అక్కడే ‘కోవిద’ పరీక్ష పూర్తి చేశాడు.

ఆధ్యాత్మిక పరిమళం

లౌకిక విద్య నుండి అలౌకిక విద్య వైపుకు ఆనంద మోహనునికి ఆసక్తి మళ్ళింది. ఒకసారి ఆయన గంగానదీ తీరంలోని పుణ్యక్షేత్రమైన హృషీకేశ్ ను దర్శించి గంగలో స్నానమాచరించాలని వెళ్ళారు. మూడు మునకలు వేయడానికి గంగానదిలో దిగి, రెండు మునకలు పూర్తి చేసి మూడో మునక పూర్తి చేయగానే ఆయన చేతిలోకి తాళపత్రాల్లో లిఖించబడిన భగవద్గీత ప్రత్యక్షమయింది.

ఆ తాళపత్రాలు పూలు, పసుపు, కుంకుమలతో అర్చింపబడి ఉన్నాయి. తన కర్తవ్య దీక్షను ప్రబోధించిన సంఘటనగా ఆయన దానిని భావించారు. గీతాసారాన్ని అందరికీ అందజేయాలని సంకల్పించాడు. వంద గీతా మహాజ్ఞాన యాగాలను పూర్తి చేశారు.
   వివేకానందస్వామి సారస్వతాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయటం ద్వారా ఆనంద మోహనుడు ఆధ్యాత్మిక వికాసాన్ని పొందారు. జాతీయోద్యమంలో భాగంగా సూత్ర యజ్ఞమనే పేరుతో రాట్నం నుండి నూలు తీసి దుస్తులు నేయించి ధరించటమనే మహా యజ్ఞంలో పాల్గొని అందులోనూ స్వర్ణపతకాలు సాధించారు. ఆనందమోహనుని తండ్రి శ్రీ మలయాళస్వాముల వారిని తమ గురువుగా నిర్ణయించుకున్నారు. వారు రచించిన “శుష్క వేదాంత తమోభాస్కరం” వారిని ఎంతగానో ఆకర్షించింది.

మలయాళస్వామి అనుగ్రహ దృష్టి ఆనందమోహనుడిపై పడింది. అప్పుడే స్వామి ఆయనకు పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించారు. ఆ విధంగా గురుశిష్యులిద్దరికీ అనుబంధం ఏర్పడింది. హిందీ భాషలో పరిజ్ఞానం అవసరమని భావించి రాష్ట్ర విశారద పరీక్షల్లో ఉత్తీర్ణుడైన ఆనందమోహనుడిని మరింత ఉత్తమమైన ప్రజ్ఞ సంపాదించటానికి తండ్రిగారు కాశీ విద్యా పీఠానికి పంపారు. అక్కడి విద్యార్థులు నడిపే ఇంగ్లీషు మాసపత్రికకు, “తపోభూమి” అనే హిందీ పత్రికకు ఆనందుడు సంపాదకత్వం వహించారు.

ఆశ్రమ ప్రవేశం

ఏర్పేడు వ్యాసాశ్రమం

Vidya Prakashanandagiri
Vidya Prakashanandagiri

1936, మే 17 వ తేదీన ఆనందుడు ఆశ్రమ ప్రవేశం చేశారు. శ్రీవారి నిష్టాశ్రమానికి దక్షిణ దిశలో ఏకాంతంగా గుహాలయంలో తపోనిష్టతో కూడిన సాధనానుష్టానాలు ప్రారంభించారు. అపక్వాహారాన్ని స్వీకరిస్తూ గురు సన్నిధిలో 12 సంవత్సరాలు తపస్సాధనలో అనేక గ్రంథాలను రచించారు. యోగవాశిష్టం అనువాదం చేశారు. “ధర్మపథం” ఆంధ్రానువాదం చేశారు.

గురుదేవులు ఓంకార సత్రయాగంలో చెప్పిన దివ్యప్రబోధాలను గ్రంథ రూపంలో అందించారు. ఒక సంవత్సరం మౌననిష్ఠ సాగించారు. శిష్యుని పురోగతిని గమనించిన గురుదేవులు అతనికి మహావాక్యాలను ఉపదేశించి సన్యాస స్వీకారానికి ఏర్పాటుచేశారు. 1947లో గిరి సంప్రదాయానుసారంగా శ్రీ విద్యాప్రకాశనందగిరి అని నామకరణం చేసి ఉపదేశ ప్రబోధాలకు

అధికారమిచ్చారు. తాను సన్యాసం స్వీకరించిన మూడు సంవత్సరాలకు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి శ్రీ శుకబ్రహ్మాశ్రమాన్ని స్థాపించారు. గురువు శ్రీ వ్యాసాశ్రమం స్థాపిస్తే శిష్యుడైన విద్యాప్రకాశానంద వ్యాసుని కుమారుడైన శుకముని పేరు మీదుగా ఆశ్రమం స్థాపించారన్నమాట. 1950వ సంవత్సరంలో శ్రీ శుకబ్రహ్మాశ్రమానికి సద్గురుదేవులు శ్రీ మలయాళ స్వామి వారి ఆధ్వర్యంలో ప్రవేశోత్సవం జరిగింది.

శుకబ్రహ్మాశ్రమ కార్యక్రమాలు

Vidya Prakashanandagiri
ఆశ్రమం
ఆశ్రమం స్థాపించాక స్వామివారు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. శుకబ్రహ్మాశ్రమం యొక్క ముఖ్యమైన సందేశం “నిర్భయుడై ఉండుము. భగవంతుడు మీ చెంతే ఉన్నాడు.” ఈ ఆశ్రమం చిత్తూరు జిల్లా ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తిలో సువర్ణముఖీ నదీ తీరాన వెలసి ఉంది. ఆశ్రమం స్థాపించినది మొదలు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. వేదాంత సంబంధ అంశాలమీద, అలౌకిక విషయాల మీద చర్చలు జరిపారు. అపార జ్ఞానాన్ని సంపాదించారు. భగవద్గీతా పారాయణం చేశారు.

ఆశ్రమంలో గీతా పారాయణ ప్రవచనాలకై ఒక ప్రార్థనా మందిరం నిర్మించబడింది. సాధకుల నివాసానికీ, వంటకు, భోజనాదులకు కుటీరాలు నిర్మించారు. 1954వ సంవత్సరంలో శ్రీ శుక బ్రహ్మాశ్రమంలోనే శ్రీ వ్యాసాశ్రమం వారు నిర్వహించే 28 వ సనాతన సభ దిగ్విజయమయింది.1955 లో జరిగిన ఆశ్రమ పంచమ వార్షికోత్సవానికి వ్యవస్థాపకులు శ్రీ శివానంద సరస్వతీ మహారాజ్ గారు తమ దివ్య సందేశాన్ని పంపించారు.

Vidya Prakashanandagiri
గురువులు
మానవ జాతి సముద్ధరణకై వారు సాగిస్తున్న ఉద్యమం విజయవంతమగుగాక!” అంటూ లేఖ వ్రాసి పంపారు. 1956 సంవత్సరం నుండి శ్రీ సనాతన వేదాంత సభలకు శ్రీ విద్యాప్రకాశనందగిరి స్వామి వారు అధ్యక్ష స్థానం వహించారు. శ్రీ మళయాళ స్వాముల వారి అనుజ్ఞతో, ఆశీస్సులతో శ్రీ స్వాములవారు 1957వ సంవత్సరంలో గీతాజ్ఞాన యజ్ఞాలను ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో మొదటి గీతాజ్ఞాన యజ్ఞాన్ని నిర్వహించారు. పండితులు, పామరులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, బాలకులు తన్మయులై స్వామివారి ప్రవచనాలు శ్రద్ధగా వినేవారు. అలా మొదలైన ఈ యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగింది. హైదరాబాదులో తితిదే వారి సౌజన్యంతో నూరవ గీతాయజ్ఞాన్ని పూర్తి చేశారు. వివిధ వార్తాపత్రికలు స్వామిని ప్రశంసిస్తూ వారి వారి పత్రికల్లో ప్రకటనలు వేసేవారు. ఆశ్రమంలో విశేష కార్యక్రమాలు జరిగే రోజులలో భక్తులకు అన్న, వస్త్ర దానాలు జరిగేవి. ఆశ్రమం చుట్టుప్రక్కల నివసించే గిరిజనుల కోసం ‘ఆనంద వైద్యాలయం’ స్థాపించబడింది.

ఆశ్రమాన్ని స్థాపించిన పదమూడు సంవత్సరాలకు ‘మౌక్తికోత్సవం’ నిర్వహించారు. ఆ తరువాత స్వర్ణోత్సవం కూడా జరిగింది. ‘వేదాంతభేరి’ అనే ఆధ్యాత్మిక మాసపత్రికను ప్రారంభించి వేదాంతపరమైన అనేక విషయాలపై వివరణ ఇచ్చారు. అనేక కథల ద్వారా ప్రజలను ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్ళించారు. అదే సమయంలో ‘గీతామకరంద’మనే గ్రంథాన్ని వెలువరించారు.

Vidya Prakashanandagiri
Vidya Prakashanandagiri

స్వామీజీ రచనలు

విద్యా ప్రకాశానందగిరి స్వాములవారు సైతం తమ గురువుగారి వలే అనేక రచనలు చేశారు. గీతామకరందం, వశిష్ఠగీత,జ్ఞానపుష్పం, ఆత్మ విద్యా విలాసము, యమలోక వార్తలు, వివేకానంద సింహనాదం, ఆధ్యాత్మిక జడ్జిమెంట్, మోక్షసాధన రహస్యము, తత్త్వసారము, మానసబోధ, పరమార్థ కథలు,భజన – కీర్తనలు,మోక్ష ద్వార పాలకులు, బ్రహ్మానంద వైభవం, అమృత బిందువు, వైరాగ్య సాధన, మట్టిలో మాణిక్యం, ఆత్మ తత్వ విచారణ, ధ్యాన పద్ధతి, యోగవాశిష్ట రత్నాకరము, రామాయణ రత్నాకరము, ఉపనిషద్రత్నాకరము, భారత రత్నాకరము, పాండవగీత, బ్రహ్మచర్య విజయము, వాసిష్ట మహా రామాయణము, ఆత్మానుసంధానము గ్రంథాలను వ్రాశారు.

సేవా కార్యక్రమాలు

విద్యా ప్రకాశానందులవారు కేవలం వేదాంత కార్యక్రమాలతో సంతృప్తి చెందకుండా మానవసేవయే మాధవసేవగా భావించి ప్రభుత్వానికి సైతం ఎంతో సహాయం చేశారు. ఆశ్రమం అందించిన విరాళంతో ప్రభుత్వం డిగ్రీ కళాశాలను, తదుపరి జూనియర్ కళాశాలను స్థాపించి వాటికి స్వామీజీ పేరు పెట్టారు. అంతటితో ఆగకుండా చుట్టు పక్కల ఉన్న పేద ప్రజలకోసం ఒక కంటి ఆసుపత్రిని నిర్మించాలనుకున్నారు. భక్తకన్నప్ప పేరుతో అక్కడే ఒక ఉచిత కంటి వైద్యశాలను నిర్మించారు.

స్వామి వారి సందేశాలు (పంచామృతాలు)

  1. తప్పు దారిలో పోతున్న యువకులను సక్రమ మార్గంలో పెట్టడానికి వారికి భగవంతునిపై పరిపూర్ణమైన విశ్వాసం కలిగించాలి. యువత భోగ విలాసాలపై మనస్సు మళ్ళించటానికి కారణం వారికి సరైన ఆధ్యాత్మిక బోధన లేకపోవటమే.
  2. మితిమీరిపోతున్న హింసను అరికట్టాలి. సృష్టిలోని ఏ ప్రాణిని బాధించినా భగవంతునికి అపకారం చేసినట్లవుతుంది.
  3. మన మతం పట్ల సరైన అవగాహన లేకపోవటం వల్లనే మతమార్పిడులు జరుగుతున్నాయి. మన మత ధర్మాలను తెలియజేసి తగిన సదుపాయాలు కలుగ జేసినట్లయితే ఒక మతంలో నుండి మరొక మతంలోకి మారవలసిన అవసరం రాదు.
  4. మానవ జీవితంలో ఎన్నో చిక్కు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని మరొక రకంగా తీర్చలేని పరిస్థితులలో ఆధ్యాత్మిక పరిజ్ఞానంతోనే పరిష్కరించుకోవాలి. చిత్తవృత్తిని పరమాత్మ వైపు మళ్ళించి నిర్భయులై ఉండండి. బ్రహ్మానుభవం మానవ జన్మను సార్థకం చేస్తుంది.
  5. జాతి, మత, కుల, వర్గ, భాషా విభేదాలు మనం సృష్టించుకున్నవే. ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని ప్రచారం చేయడం ద్వారా శాంతి, సుఖం, ఆనందం ఏర్పడతాయి. ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను జన సమూహంలోనికి తీసుకెళ్ళి ప్రచారం చేస్తే ప్రజలకు ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుంది.

నిశ్శబ్ద విప్లవకారుడు

తన శిష్యుడైన విద్యాస్వరూపానంద స్వామిని తన వారసుడిగా నియమించి చైత్ర శుద్ధ చతుర్దశి నాడు (10-4-1998) శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి మహాసమాధి పొందారు. ఆయన సమాధి చుట్టూ ఒక ధ్యానమందిరాన్ని నిర్మించి పైన శివలింగాకారంలో గోపురం ఏర్పాటు చేశారు.

ఎలాంటి హడావుడి లేకుండా ఆజన్మాంతమూ ధర్మోద్ధరణ కార్యాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వర్తించారు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాములు. ఎంతటి మహాత్కార్యాలను, మహోన్నతిని సాధించినా, ఎలాంటి ప్రచారాన్నీ కోరుకోలేదు. ప్రజలలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించడం, సమాజంలో పాతుకుపోయిన అంథ విశ్వాసాలను, అసమానతలను తొలగించడం, ప్రజల జీవన స్థితిగతుల మెరుగుదలకు కృషి చెయ్యడం, పేదవారికి, సామాన్యులకు విద్య, వైద్యం, ఆహారం, వస్త్రాలు అందించడం యావత్ సమాజోద్ధరణ కార్యం తమ కర్తవ్యమని భావించారు. అందు కోసం సమాజంలో నిశ్శబ్దంగా పనిచేశారు. తన రచనలతో, బోధలతో సమాజంలో, ప్రజలలో అనూహ్య పరివర్తనను తీసుకొచ్చారు. ఇందుకోసం వారు ఏ ఉద్యమాలూ నిర్మించలేదు. తుపాకులూ పట్టలేదు. సమాజంలో జ్ఞాన జ్యోతులను వెలిగించారు. ఆ విధంగా సమాజంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు సాధించిన నిజమైన నిశ్శబ్ద, ఆధ్యాత్మిక విప్లవకారులు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి. వారి మాట, బాట యావత్ హిందూ సమాజానికీ అనుసరణీయం, ఆచరణీయం, ఆదర్శనీయం. భారత్ మాతాకీ జయ్.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి - విశ్వసంవాద కేంద్రము (ఏ-పి)

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top