రెచ్చిపోతున్న ఖలిస్తాన్‌వాదులు | Agitated Khalistanists

0
రెచ్చిపోతున్న ఖలిస్తాన్‌వాదులు | Agitated Khalistanists

జీవీపీ

పాకిస్తాన్‌ ‌సరిహద్దు రాష్ట్రం పంజాబ్‌లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. వేర్పాటువాదం జడలు విరబోసుకుంటోంది. తీవ్రవాదం రోజురోజుకీ పెట్రేగిపోతోంది. కొందరు అతివాదుల దుందుడుకు చర్యలు యువతను పెడదోవ పట్టిస్తున్నాయి. దీనికితోడు ప్రభుత్వ ఉదాసీనత పరిస్థితిని నానాటికీ క్షీణింపజేస్తోంది. అంతిమంగా పంజాబ్‌ ఉ‌ద్రిక్తతలకు ఆలవాలంగా మారింది. రాష్ట్రం ఎటువైపు ప్రయాణిస్తుందోనన్న ఆందోళన మేధావులను, సామాన్యులను కలచివేస్తోంది. పెడదోవ పట్టిన యువత వేర్పాటువాదంతో, విదేశీశక్తుల ప్రభావంతో రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తోంది.

ఇందుకు దారితీసిన పరిస్థితులను ఒక్కసారి అవలోకనం చేసుకుంటే ఆందోళన, ఆవేదన, ఆశ్చర్యం కలగక మానదు. 29 ఏళ్ల అమృతపాల్‌ ‌సింగ్‌ అనే యువకుడు ఇప్పుడు రాష్ట్రంలో కేంద్రబిందువుగా మారాడు. పరిస్థితి అంతటికీ అతనే కారణం. తన వేర్పాటువాద, ప్రత్యేక ఖలిస్తానీ ప్రసంగాలతో అమాయక యువతను అతను పెడదోవ పట్టిస్తున్నాడు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి పెద్ద సవాల్‌గా మారాడు. అధికార యంత్రాంగానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. అతని కార్యకలాపాలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఎంతవరకు అంటే అరెస్టయిన తన సహచరుడిని విడిపించుకునేందుకు ఏకంగా పోలీస్‌ ‌స్టేషన్‌పై దండెత్తే వరకు వెళ్లిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాడు. అమృత్‌సర్‌ ‌జిల్లా అజ్‌ ‌నాలాలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్నే సవాల్‌ ‌చేసింది. ఖలిస్తానీ సానుభూతిపరుడైన తన అనుచరుడు లవ్‌ ‌ప్రీతి తుపాన్‌ అరెస్టుకు నిరసనగా అమృత్‌పాల్‌సింగ్‌ ‌నాయకత్వంలో వందల మంది పోలీస్‌ ‌స్టేషన్‌పై దాడి చేశారు. చివరికి వెనక్కితగ్గిన పోలీసులు లవ్‌ ‌ప్రీత్‌ ‌విడుదలకు అంగీకరించారు. దీన్నిబట్టి సింగ్‌ ‌పోలీసులపై ఎంత ఒత్తిడి తీసుకువచ్చాడో అర్థమవుతుంది.

అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ఏడాది ముందు వరకు ఎవరికీ తెలియదు. అతనొక సాధారణ వ్యక్తి. మత సంప్రదాయాలను కూడా అంతగా పాటించేవాడు కాదు. ఆధునిక జీవనశైలిని అవలంబించేవాడు. కనీసం సిక్కుల సంప్రదాయ తలపాగాను కూడా ధరించేవాడు కాదు. కుటుంబ వ్యాపారాల నిమిత్తం కొంతకాలం దుబాయ్‌లో గడిపాడు. ‘వారిస్‌ ‌పంజాబ్‌ ‌దే’ సంస్థ వ్యవస్థాపకుడు, నటుడు దీప్‌ ‌సిద్ధూ మరణంతో అమృత్‌పాల్‌ ఒక్కసారిగా తెరపైకి వచ్చాడు. అతని జీవితమే మారిపోయింది. సిద్ధూ అనుచరులకు నాయకుడిగా కొత్త అవతారం ఎత్తాడు. వారిస్‌ ‌పంజాబ్‌ ‌దే సంస్థకు తానే నాయకుడినని ప్రకటించుకున్నాడు. ఖలిస్తాన్‌ ‌కార్యకలాపాల వేగం పెంచాడు. అనుచరులను కూడగట్టాడు. వారిలో వేర్పాటువాద భావోద్వేగాలను రగిల్చాడు. ఎంతో మంది ఖలిస్తానీవాదులు దేశ, విదేశాల్లో ఉన్నప్పటికీ అనూహ్య వేగంతో వారిని దాటి పోయాడు. కరడుగట్టిన ఖలిస్తానీవాదిగా తెరపైకి వచ్చాడు. దీంతో ఖలిస్తాన్‌ ‌సానుభూతిపరులు, మద్దతుదారులు, యువకులకు అమృత్‌పాల్‌ ఒక్కసారి ఆరాధ్య దైవంగా మారిపోయాడు. ఇది ఎంతవరకు వెళ్లిందంటే కొంతమంది అభిమానులు ఆయనను భింద్రన్‌ ‌వాలె-2గా పిలుచుకునే స్థాయికి చేరింది. అంతేగాక ప్రధాని, హోంమంత్రి వంటి వారిని మట్టుపెడతా మన్న హెచ్చరికలు వినపడుతున్నాయి. ఇందిరా గాంధీకి పట్టిన దుర్గతి వీరికీ పడుతుందన్న ప్రేలా పనలు చేస్తున్నారు. ఇది ఎంతమాత్రం క్షంతవ్యం కాదు. దేశ సమగ్రత, సార్వభౌమత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటనలు సూచిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని, నిఘా వ్యవస్థలను బలోపేతం చేసుకుని ఖలిస్తానీవాదుల పీచమణిచేందుకు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది.

నాడేం జరిగింది?

తాజా పరిణామాలు 1980ల నాటి పరిస్థితు లను తలపిస్తున్నాయన్న వ్యాఖ్యానాలు వినపడు తున్నాయి. అప్పట్లో పంజాబ్‌ ‌రావణ కాష్టాన్ని తలపించింది. హిందువులను ఊచకోత కోశారు. హిందువులు, సిక్కులన్న విభజన స్పష్టంగా కనిపించింది. కొంపాగోడూ వదిలి హిందువులు బతుకుజీవుడా! అంటూ పొట్ట చేత పట్టుకుని వలసపోయారు.

రాష్ట్రంలో హిందువుల జనాభా గణనీయంగా తగ్గింది. నాటి ఖలిస్తానీ నాయకుడు సంత్‌ ‌జర్నయిల్‌ ‌సింగ్‌ ‌భింద్రన్‌ ‌వాలె నాయకత్వంలో వేర్పాటువాద సిక్కులు సృష్టించిన మారణ హోమాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. నాటి కేంద్ర, రాష్ట్ర సర్కార్లు భింద్రన్‌ ‌వాలెను కట్టడి చేయలేక చేతులెత్తాయి. సిక్కుల పవిత్ర క్షేత్రమైన స్వర్ణ దేవాలయం సాక్షిగా, కేంద్రంగా జరిగిన అరాచకాలకు అంతే లేకుండా పోయింది. చివరికి స్వర్ణ దేవాలయంపై అనివార్యంగా సైనికచర్య జరిపే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన పంజాబ్‌ ‌చరిత్రలో, దేశ అధ్యాయంలో మాయనిమచ్చగా మిగిలిపోయింది. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన ఆ ఘటన మరకలు ఇంకా మాసిపోలేదు. ప్రజల మనసుల నుంచి చెదిరిపోలేదు. స్వర్ణ దేవాలయంపై సైనికచర్యకు కాంగ్రెస్‌ ‌మాజీ అధ్యక్షు రాలు క్షమాపణ చెప్పవలసి వచ్చింది. ఆ గాయాలు ఇంకా మానకముందే తాజాగా జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. సిక్కు సమాజం కూడా ఈ ఘటనలపై తన అసంతృప్తిని, ఆగ్రహాన్ని, ఆవేదనను వ్యక్తపరుస్తూనే ఉంది. కొందరి మూర్ఖత్వం వల్ల యావత్తు సిక్కు సమాజానికి చెడ్డపేరు వస్తుందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత

పంజాబ్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితికి కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వమూ కారణమన్న వాదనను పూర్తిగా తోసిపుచ్చలేం. ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఖలిస్తానీవాదం చాపకింద నీరులా విస్తరిస్తూ పోయింది. అధికార యంత్రాంగం కూడా చూసీచూడనట్లు ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. విస్తరిస్తున్న ఖలిస్తానీవాదం పట్ల భగవంత్‌ ‌సింగ్‌మాన్‌ ‌నాయకత్వంలోని ఆప్‌ ‌సర్కారు అచేతనంగా వ్యవహరిస్తోంది. పోలీసు స్టేషన్‌పై దాడి ఘటన పట్ల ముఖ్యమంత్రి నుంచి సరైన స్పందన కొరవడింది. తనని తాను జాతీయ నాయకుడిగా భావించు కుంటున్న ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌కు ఖలిస్తానీవాదాన్ని ఖండించ డానికి మాటలు రావడం లేదు.

భావి ప్రధానిగా తనను తాను ఊహించుకునే కేజ్రీవాల్‌ ‌రాష్టాన్ని కుదిపేస్తున్న సమస్యపై మౌనం వహించడం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి ఆప్‌ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ఖలిస్తానీవాదం పుంజుకోవడం, బలపడటం మొదలైంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన భగవంత్‌ ‌సింగ్‌మాన్‌ ‌ఖాళీచేసిన సంగ్రూర్‌ ‌పార్లమెంటు సీటుకు జరిగిన ఉపఎన్నికలో ఆప్‌ ‌భంగపడింది. 2019లో భారీ మెజార్టీతో మాన్‌ ‌గెలిచినప్పటికి మొన్నటి ఉపఎన్నికల్లో 5 వేలకు పైగా ఓట్ల తేడాతో ఆయన పార్టీ ఓడిపోయింది. గెలిచిన అభ్యర్థి ఎవరో అకాలీదల్‌ ‌లేదా కాంగ్రెస్‌ అభ్యర్థి కాదు. కరడుగట్టిన ఖలిస్తానీవాది సిమ్రన్‌జిత్‌ ‌సింగ్‌. 2019‌లో కనీస ఓట్లు సాధించలేకపోయిన ఈయన ఉపఎన్నికలో ఏకంగా విజయం సాధించారంటే ఖలిస్తానీవాదం చాపకింద నీరులా ఎలా విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితిని గమనించి అయినా ఆప్‌ ‌ప్రభుత్వం అప్రమత్తం కావాల్సి ఉంది. కానీ అలాంటి చర్యలేమీ చేపట్టలేదు. దొంగలు పడ•న ఆరు నెలలకు కుక్కలు మొరిగిన…అన్నట్లు తాజాగా భగవంత్‌ ‌సింగ్‌మాన్‌ అమృత్‌సర్‌ ‌ఘటనపై స్పందించారు. దీనివెనక పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ ‌హస్తం ఉందని ఆరోపించారు. తీవ్రవాదాన్ని అణచి వేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రభుత్వ సహనాన్ని చేతగానితనంగా భావించవద్దని పేర్కొన్నారు.

పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పై దాడి సందర్భంగా కొందరు యువకులు పవిత్రమైన గురుగ్రంథ్‌ ‌సాహిబ్‌ను తీసుకురావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. పవిత్ర మత గ్రంథంపై గల గౌరవంతో పోలీసులు సంయమనం ప్రదర్శించారని, అంతేతప్ప దానిని చేతగానితనంగా భావించవద్దని స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రంతో కలసి పనిచేస్తామని చెప్పారు. మాన్‌ ‌మాటలు వినడానికి బాగానే ఉన్నాయి. ఆచరణలో ఎంతమేరకు వ్యవహరిస్తారన్నది చూడాలి. ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి.

పాకిస్తాన్‌.. ‌పంజాబ్‌ ‌కన్నా గుజరాత్‌, ‌రాజస్తాన్‌ ‌తోనే ఎక్కువ సరిహద్దులు కలిగి ఉంది. కానీ ఆ రెండు రాష్ట్రాల్లో జరగని ఘటనలు పంజాబ్‌లోనే ఎందుకు జరుగుతున్నాయన్నది గమనార్హం. కేంద్రం విధానాలు, అభిప్రాయాలతో ఆప్‌కి, రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయంగా కొంత తేడా ఉండవచ్చు. దానిని కాదనలేం. సమాఖ్య, పార్లమెంటరీ విధానంలో ఇవి సహజం. కానీ దేశ రక్షణ, సమగ్రత, సమైక్యత విషయంలో ఒకేమాటపై నిలబడాలి. ముందుకుసాగాలి.

పార్టీలు, ప్రభుత్వాలు, రాజకీయాలను కాసేపు పక్కనపెట్టి వ్యవహరించాలి. దేశం కోసం కలసికట్టుగా పనిచేయాలి. ఖలిస్తానీ వాదం పట్ల దానికి దన్నుగా నిలుస్తున్న కొన్ని విదేశీ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాటి కార్యకలాపాలపై నిఘా ఉంచాలి. వాటిని నిర్వీర్యం చేయాలి. బ్రిటన్‌, ‌కెనడా, ఆస్ట్రేలియాలో ఖలిస్తాన్‌ ‌శక్తులు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా కెనడాలో అనేక సిక్కు సంస్థలు ఖలిస్తాన్‌కు అనుకూలంగా పనిచేస్తున్నాయి. ఆయా దేశాల్లో హిందూ ఆలయాలపై దాడులకు దిగుతున్నాయి. హిందువు లపై దాడులకు పాల్పడుతున్నాయి.

గత ఏడాది ధర్మశాలలోని హిమాచల్‌ ‌ప్రదేశ్‌ అసెంబ్లీ గోడలపై ఖలిస్తానీ నినాదాలు కనిపించాయి. ఖలిస్తాన్‌వాదం విస్తరణ వెనక పాకిస్తాన్‌ ‌గూఢచార్య సంస్థ ఐఎస్‌ఐ (ఇం‌టర్‌ ‌సర్వీస్‌ ఇం‌టలిజెన్స్) ‌పాత్ర స్పష్టంగా ఉంది. రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని ఉసి గొల్పేందుకు అది చేయని ప్రయత్నం లేదు. భారత్‌లో నిప్పులు పోయడమే ఐఎస్‌ఐ ‌పని అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇప్పటికైనా పంజాబ్‌లోని ఆప్‌ ‌సర్కారు కళ్లు తెరవాలి. వేర్పాటువాద కార్యకలా పాలపై నిఘా పెట్టాలి. ఆ శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి. మాటల్లో కాకుండా చేతల్లో పనితనం చూపించాలి. ఈ విషయంలో కేంద్రంతో కలిసి నడవటం ఆప్‌ ‌సర్కారు కర్తవ్యం.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్ - Jagruti weekly

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top