సనాతనమైన ఆధ్యాత్మిక జ్యోతి ఇప్పటికీ వెలుగుతోంది | Sarvepalli Radhakrishnan |

Vishwa Bhaarath
0
సనాతనమైన ఆధ్యాత్మిక జ్యోతి ఇప్పటికీ వెలుగుతోంది | Sarvepalli Radhakrishnan | The Sanatana spiritual flame still burns
 Sarvepalli Radhakrishnan

ఉపాధ్యాయ దినోత్సవం

భారతదేశంలో తత్త్వశాస్త్రం ప్రధానంగా ఆధ్యాత్మికమైనది. గాఢమైన ఆధ్యాత్మికతే కాలంవల్ల కలిగే కడగండ్లను, చారిత్రక దుర్ఘటనలను ఎదుర్కొని నిలిచే సామర్థ్యాన్ని కలిగించింది కాని, ఈ దేశం అభివృద్ధి చేసిన ఏ రాజకీయ వ్యవస్థ, సాంఘిక నిర్మాణం ఆ పని చేయలేదు. సుదీర్ఘ చరిత్రలో పలుమార్లు విదేశీ దండయాత్రల వలన, అంతఃకలహాల వలన దేశ నాగరికత దాదాపు నాశనమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రీకులు, సిథియన్లు, పర్షియనులు, మొగలులు, ఫ్రెంచివారు, ఇంగ్లీషువారు ఈ దేశ నాగిరకతను ధ్వంసం చేయడానికి తమవంతు ప్రయత్నమైతే చేశారుగాని జయప్రదం కాలేదు. దేశం తల యెత్తుకొని నిలబడిరది. పాదాక్రాంతం కాలేదు. సనాతనమైన దాని ఆధ్యాత్మికజ్యోతి ఇప్పటికీ వెలుగుతూనే ఉన్నది. ఒకే లక్ష్యంతో ఈ దేశం జీవిస్తున్నది. అధర్మాన్ని ప్రతిఘటిస్తూ సత్యం కోసం నిష్ఠగా పోరాడుతున్నది. కొన్నిసార్లు పొరపాట్లు చేసి ఉండవచ్చు కాని తాను చేయగలననుకొన్నది, కర్తవ్యమని భావించినదాన్ని చేసింది. భారతీయ తత్త్వచింతనా చరిత్ర నిత్యనూతనమూ, సనాతనమూ అయిన అంతులేని మానసిక అన్వేషణను తేటతెల్లం చేస్తున్నది.

భారతీయుల జీవనంలో పారమార్థిక భావన ప్రధాన పాత్ర పోషిస్తున్నది. భారతీయ తత్త్వశాస్త్రం మానవ నివాసాలనే ఆపేక్షిస్తుందిగాని, మనిషి మసలని లోకాతీత ఏకాంత స్థలాన్ని కాదు. జీవితం నుంచి పుట్టి, వివిధ సంప్రదాయాల గుండా పయ నించి, తిరిగి జీవితంలో ప్రవేశిస్తుంది. భగవద్గీతగాని, ఉపనిషత్తులుగాని సామాన్య జన విశ్వాసాలకు అందరాని దూరంలో లేవు. అవి దేశ సాహిత్యంలో ఎంత ఉన్నత స్థానం పొందాయో అంత గొప్ప భావవాహికలు కూడా. అధిక సంఖ్యాకులైన సామాన్య ప్రజల అవగాహనాశక్తి చిన్నది కాబట్టి వారికి తగినట్లుగా పారమార్థిక సత్యాన్ని అద్భుతమైన కల్పనలతో కథలల్లి చెప్పినవే పురాణాలు. ఆ విధంగా తత్త్వజ్ఞానాన్ని జనబాహుళ్యానికి అందించడమనే కష్టసాధ్యమైన పనిని భారతదేశం సులభంగా సాధించింది.

తత్త్వశాస్త్రకర్తలు దేశంలో సాంఘిక – ఆధ్యాత్మిక పరివర్తన తీసుకొని రావడానికి కృషిచేస్తారు. భారతీయ నాగరికతను బ్రాహ్మణ నాగరికతగా వర్ణించారంటే ఈ నాగరికతా ముఖ్య లక్షణాన్నీ, దాన్ని శాసించే భావజాలాన్నీ రూపొందించిన తత్త్వవేత్తలు, ధర్మజ్ఞులు అందరూ బ్రాహ్మణు లుగా జన్మించకపోయినా ఆ నాగరికతకు ప్రభవించినవారేనని అర్థం చేసుకోవాలి. తత్త్వవేత్తలు, దేశ పాలకులు సమాజ నిర్దేశకులు కావాలని ప్లేటో చేసిన భావన భారతదేశంలో ఆచరణలోకి వచ్చింది. ఆధ్యాత్మిక సత్యాలే పరమ సత్యాలు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని వాస్తవ జీవితాన్ని మెరుగుపరచాలి.

భారతదేశంలో మతమంటే మూర్ఖమైన పిడివాదం కాదు. అది తత్త్వశాస్త్ర పురోగమనంలో వెలువడే క్రొత్త భావనలను తనలో ఇముడ్చుకొంటూ పోయే హేతుబద్ధమైన సంయోగం. అనుభవజ్ఞానంతో పరిణామం చెందటం దాని స్వభావం. మారుతున్న భావాలకనుగుణంగా మార్పు చెందుతుంది. మతానికివ్వవలసిన స్థానంలో తత్త్వశాస్త్రాన్ని పెట్టి బుద్ధికి ప్రాధాన్యమిస్తుందని భారతీయ భావజాలాన్ని సాధారణంగా వ్యాఖానిస్తుంటారు. దీనివల్ల భారతదేశంలో మతానికి హేతుబద్ధమైన లక్షణం ఉందని స్పష్టమౌతున్నది. తన వాదానికి ఆధారంగా ఒక తాత్త్విక అంశాన్ని రూపొందించకుండా మత శాఖలు, ఉద్యమాలు ఏవీ ఇక్కడ ఎప్పుడూ ప్రభవించలేదు.

భారతదేశంలో ఆర్యుల పాలన అనే గ్రంథంలో హేవెల్‌ యిలా అంటాడు : ‘ఇండియాలో మతం ఒక మూఢ సిద్ధాంతం కాదు. మానవుని నడవడికను నిర్దేశించే కార్యాచరణ ప్రణాళిక. జీవితంలో వివిధ ఆధ్యాత్మిక స్థాయిలలో, భిన్న పరిస్థితులలో ఉన్నవారికి సరిపోయేటట్లు అది మలచుకుంటుంది.’’ ఎప్పుడైనా అది స్ఫటికంలా గడ్డ కట్టుకొనిపోయేటట్లు కనబడితే సత్యాన్ని రుజువు చేసి బూటకమైన దాన్ని తోసిపుచ్చడానికి, నమ్మకాలను విమర్శ అనే అగ్నిపరీక్షకు గురిచేసి నిగ్గు తేల్చటానికి ఆధ్యాత్మిక ఉద్యమాలు పుడుతుంటాయి. తాత్త్విక మథనం ఆరంభమౌతుంది. కాలంలో వచ్చిన మార్పులవల్ల సంప్రదాయ సిద్ధమైన నమ్మకాలు అసమగ్రంగా ఉన్నాయని, బూటకమైనవని తేలినప్పు డల్లా అనేక పర్యాయాలు ఒక కొత్త బోధకుడు బుద్ధుడో మహావీరుడో వ్యాసుడో శంకరుడో ఉదయించి తన విజ్ఞాన బలిమిచేత ఆధ్యాత్మిక జీవనాన్ని ఆసాంతం మథించివేయడం మనం తరచుగా చూస్తుంటాం. భారతీయ చింతనను చారిత్రకంగా పరిశీలిస్తే అందులో ఆత్మపరీక్ష, భవిష్యత్‌ దర్శనం చేసుకొన్న మహిమాన్వితమైన ఘట్టాలు అనేకం కనిపిస్తాయి. తత్త్వశాస్త్రం వెల్లడిరచే సత్యానికీ, ప్రజల దైనందిన జీవితానికీ మధ్య అన్యోన్యమైన సంబంధం ఉన్నప్పుడే మతం సజీవంగా సత్యస్వరూపంగా ఉంటుంది.

మతంలో వచ్చే సమస్యలు తాత్త్విక చింతనను ప్రోత్సహిస్తాయి. జీవాత్మ పరమాత్మల సంబంధాలు, జీవన మరణాలు, దైవ స్వరూప స్వభావాల వంటి ప్రశ్నలకు సమాధానాల కోసం అనాదికాలం నుంచి భారతీయుని మనసు ఆరాటపడుతున్నది. భారత దేశంలో తత్త్వశాస్త్రం పూర్తిగా మతపరమైన ఊహా గానాల నుంచి వైదొలగకపోయినప్పటికి, మతశాఖల భిన్నత్వం వలన తాత్త్విక చర్చలకు అంతరాయం కలుగలేదు. రెండిరటినీ కలగాపులగం చేసి తికమక పడలేదు. ఊహకు, ఆచరణకు మధ్య, సిద్ధాంతానికి జీవితానికి మధ్య, సన్నిహిత సంబంధం ఉండటంవల్ల జీవిత పరీక్షలో నెగ్గలేకపోతే తత్త్వశాస్త్రం సజీవంగా మిగిలే అవకాశం లేదు. జీవితానికీి, సిద్ధాంతానికీి మధ్య ఉన్న నిజమైన బాంధవ్యాన్ని గ్రహించినవారికి తత్త్వజ్ఞానం జీవన విధానం అవుతుంది. ఆత్మ సాక్షాత్కారానికి మార్గమవుతుంది. సాంఖ్యం సహా ఏ దర్శనమూ కేవలం వాక్కుగా, పిడివాదంగా మిగిలిపోలేదు. హృదయాన్ని కదిలించి, ఆవేశాన్ని కలిగించే ప్రగాఢ విశ్వాసంగా ప్రతి సిద్ధాంతమూ పరివర్తన చెందింది.

భారతదేశంలో తత్త్వశాస్త్రం ఎన్నడూ ఆత్మపరిశీలనగాని విమర్శగాని చేసుకోలేదని చెప్పడం యథార్థం కాదు. ప్రాథమిక స్థాయిలో కూడా మతవిశ్వాసాలను సరిదిద్దడానికి తర్కసహిత విచారణ జరిగేది. వేదమంత్రాల నుంచి ఉపనిషత్తుల వరకు జరిగిన పురోగతిలో మతం సాధించిన అభివృద్ధి నిబిడీకృతమై ఉన్నది. బౌద్ధం దగ్గరకు వచ్చేటప్పటికి తాత్త్వికశక్తి ఆత్మవిశ్వాసం గల మానసిక దృక్పథంగా ఎంతగా మార్పు చెందిందంటే అది బుద్ధికి సంబంధించిన విషయాలలో ఏ వెలుపలి అధికారానికి లొంగనంతగా ఎదిగింది. తన కార్యకలాపాలకు ఏ పరిమితినీ అది గుర్తించలేదు. తన వాదం ఎక్కడకు దారితీసినా నిర్భయంగా అనుసరించి పోవడం, అన్ని విషయాలను పరీక్షించడం, లోతుగా పరిశీలన చేయడం అనే తర్కబద్ధమైన విచారణకు నిలబడితేనే అటువంటి అధికారాన్ని పరిమితిని గుర్తించడం జరిగేది. అనేకమైన దర్శనాల వద్దకు చేరేటప్పటికి ఒక క్రమపద్ధతిలో ఆలోచన చేయడానికి శక్తిమంత మైన నిరంతర కృషి జరిగినట్లు కనిపిస్తున్నది. ఈ దర్శనాలు సాంప్రదాయక మతానికి, పక్షపాతానికి అతీతంగా ఎంత దూరం పోయాయో స్పష్టమయ్యేం దుకు తోడ్పడే సత్యాలను పరిశీలిద్దాం. సాంఖ్యం భగవంతుని అస్తిత్వాన్ని గురించి మౌనం వహించింది. అయితే సిద్ధాంతంగా దాన్ని నిరూపించలేమని అంగీకరిస్తుంది. వైశేషిక, యోగదర్శనాలు పరమాత్మ ఉన్నాడని ఒప్పుకొన్నా ఆయన్ను ఈ విశ్వానికి సృష్టికర్తగా భావించవు. జైమిని రుషి దేవునికి ముందుచూపుగాని, నీతిబద్ధమైన విశ్వపాలనగాని లేవని చెప్పడానికే ఆయనను ప్రస్తావించాడు. తొలి బౌద్ధ శాఖలు భగవంతుని గురించి పట్టించుకోనేలేదు. భౌతికవాదు లైన చార్వాకులు కూడా మనకున్నారు. వారు దేవుడే లేదంటారు. అర్చకులను అవహేళన చేస్తారు. వేదాలను దూషిస్తారు. సుఖసంతోషాలే జీవిత పరమావధిగా భావిస్తారు.

మత ఔన్నత్యమూ సామాజిక సంప్రదాయమూ తత్త్వజ్ఞాన సముపార్జనకు అడ్డురావు. ఒక మనిషి సాంఘిక జీవితం కఠోరమైన కులాచారాలకు కట్టుబడి ఉన్నప్పటికీ, అభిప్రాయాల విషయంలో అతడు స్వేచ్ఛగా సంచరించవచ్చుననేది పరస్పర విరుద్ధంగా కనిపించినా, అది సత్యం. మనుషులకు జన్మతః ప్రాప్తించిన మత విశ్వాసాలను వివేకం ప్రశ్నిస్తుంది, విమర్శిస్తుంది. అందువల్లనే భారతభూమిలో మతభ్రష్టుడు, సంశయాళువు, నమ్మకంలేనివాడు, హేతువాది, స్వతంత్ర ఆలోచనాపరుడు, భౌతికవాది, ఆనందవాది ` అందరూ క్షేమంగా వర్థిల్లుతున్నారు. ‘తన సొంత అభిప్రాయమంటూ లేని ముని ఎక్కడా లేడు.’ అంటున్నది మహాభారతం. మానవ కార్య కలాపాలను అన్ని కోణాల నుంచి శాసించేదేమిటో, లోనున్న సత్యమేమిటో తెలుసుకోవాలని కోరుకొనే భారతీయుని మస్తిష్కంలోని బలమైన వివేచనాశక్తికి ఇదంతా నిదర్శనం. ఈ బౌద్ధిక ఉత్సాహం తత్త్వశాస్త్రానికి, దైవజ్ఞానానికి మాత్రమే పరిమితం కాలేదు. తర్కం, వ్యాకరణం, ఛందస్సు, భాష, అలంకారశాస్త్రం, వైద్యం, ఖగోళశాస్త్రం వంటి అన్ని కళలకు, విజ్ఞానశాస్త్రాలకు విస్తరించింది. జీవితంలో ఉపయోగకరమైనది, మనసుకు ఆసక్తి కలిగించేది ఏదైనా విచారణకు, విమర్శకు తగిన అంశంగా భావించడం కనిపిస్తుంది. బౌద్ధిక జీవనం ఎంత సమగ్రమైనదంటే గుర్రాలను ఎలా పెంచాలి, ఏనుగులకు ఎలా శిక్షణ ఇవ్వాలి అనే విషయాలపై కూడా శాస్త్రాలు, సాహిత్యం సృజించారు.

సత్యస్వరూపాన్ని నిర్ణయించడానికి తత్త్వశాస్త్రం చేసే ప్రయత్నం ఆలోచించే ఆత్మతోగాని, ఆలోచనా విషయాలతోగాని ఆరంభమౌతుంది. భారతదేశంలో తత్త్వశాస్త్రం మానవాత్మపై ఆసక్తి చూపుతుంది. ఆత్మను తెలుసుకో ` ‘‘ఆత్మానం విద్ధి’’ అనేది యిక్కడి ప్రవక్తల బోధనల సారాంశం. అన్నిటికీ కేంద్రస్థానమైన ఆత్మయే మానవుని లోపలా ఉన్నది. మనోవిజ్ఞానం నీతిశాస్త్రం, మౌలికశాస్త్రాలు. చిత్తవృత్తుల వైవిధ్యం, సూక్ష్మమైన వెలుగునీడల సయ్యాట మొదలైన వివరాలతో మానసిక జీవనం చిత్రితమైంది. భారతీయ మనోవిజ్ఞానం ఏకాగ్రత విలువను గుర్తించింది. సత్యాన్ని దర్శించడానికి అది మార్గమని భావించింది. మన తలపులను, ప్రజ్ఞను ఒక పద్ధతిలో నడిపిస్తే జీవితంలోగాని, మనస్సులో గాని మనం చేరలేని దూరతీరాలు ఉండవని ఈ శాస్త్రం నమ్ముతుంది. మనసుకు, శరీరానికి మధ్య సన్నిహిత సంబంధం ఉందని అది గుర్తించింది. దూరదర్శనం, దూరశ్రవణం వంటి ఇంద్రియాతీత శక్తులు అసాధారణమైనవిగా, అద్భుతమైనవిగా పరిగణిం చదు. అది మానసిక రోగ ఫలితమో లేక దేవతా వరప్రసాదమో కావు. మానవుని మనసు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఈ శక్తులను ప్రదర్శించ గలదు. అధోచేతన, చేతన, అతిచేతన అని మనసుకు మూడు అవస్థలు ఉంటాయి. అసాధారణమైనవిగా భావించే అమానుష ప్రజ్ఞలు ` పారవశ్యం, ఉన్మాదం, ప్రేరణ, అమేయ బుద్ధి కుశలత వంటివన్నీ మనసు అతిచేతనావస్థ నుంచి సంక్రమిస్తాయి. యోగదర్శనం ప్రత్యేకంగా ఈ అనుభవాలను గురించి చెబుతుంది. ఇతర దర్శనాలు కూడా వాటిని ప్రస్తావించి అవసరం మేరకు వాడుకొంటాయి.

పాశ్చాత్య మనస్తత్వశాస్త్రం మనసు జాగ్రదావస్థ పైనే దృష్టిపెడుతుంది. కాబట్టి అది సమగ్రమైనది కాదనే విమర్శ సబబమైనదే. మెలకువ ఒక్కటే కాక మనసుకున్న ఇతర అవస్థలను కూడా పరిశీలించాలి. భారతీయ చింతన జాగ్రత్‌, స్వప్న, సుషుప్తావస్థలను కూడా పరిగణిస్తుంది. మెలకువలో ఉన్న చైతన్యాన్ని పూర్తిగా పరిశీలిస్తే వస్తుతత్త్వం వాస్తవికంగా ద్వైతంగా, బహుళంగా ఉన్నట్టు భావన కలుగుతుంది. స్వప్నావస్థలోని మనసును ప్రత్యేకంగా అధ్యయనంచేస్తే మనం ఆత్మాశ్రయ సిద్ధాంతాలవైపు మళ్ళుతాం. కలులు లేని నిద్రావస్థ సుషుప్తి. అది అతీంద్రియ మార్మిక సిద్ధాంతాలకు దారితీస్తుంది. సత్యం సమగ్రం కావాలంటే చైతన్యావస్థలన్నిటిని లెక్కలోకితీసుకోవాలి.

ఆత్మగతమైన వాటిపై అధికాసక్తి వుందంటే దాని అర్థం వస్తుగత విజ్ఞానశాస్త్రాల గురించి భారతదేశం చెప్పేదేమీ లేదని కాదు. వాస్తవిక విజ్ఞానరంగంలో ఈ దేశం సాధించిన ప్రగతి దాన్ని రుజువు చేస్తున్నది. ప్రాచీన భారతీయులు గణిత, యాంత్రిక విజ్ఞానానికి పునాదులు వేశారు. వాళ్లు భూమిని కొలిచారు. కాలాన్ని విభజించారు. ఆకాశ పటం గీచి రాశీచక్రం గుండా గ్రహాలు, సూర్యుడు ఎలా పరిభ్రమించేది తెలియజెప్పారు.

– డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ - (సెప్టెంబర్‌ 5 జయంతి సందర్భంగా, ‘భారతీయ తత్త్వశాస్త్రం’ నుండి) ... జాగృతి సౌజ‌న్యంతో…

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top