మహాత్మా గాంధీ హత్య – ఆరెస్సెస్ : అపోహలు, వాస్తవాలు | Assassination of Mahatma Gandhi – RSS : Myths, Facts

Vishwa Bhaarath
0
మహాత్మా గాంధీ హత్య – ఆరెస్సెస్ : అపోహలు, వాస్తవాలు | Assassination of Mahatma Gandhi – RSS : Myths, Facts
మహాత్మా గాంధీ హత్య
 
మహాత్మాగాంధీ హత్యకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను బాధ్యురాలిగా చేస్తూ ఆర్ఎస్‌ఎస్‌ విరోధులు తరచుగా ఆరోపణ చేస్తుంటారు. కానీ వాస్తవాలు చెప్పే అసలైన కథ మాత్రం వేరే ఉంది. అదేంటి?

1948 జనవరి 30న మహాత్మా గాంధీ హత్య జరిగిన సుమారు అరగంటకు ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదయింది. అందులో నందలాల్ మెహతా అనే వ్యక్తి ప్రకటన ఉంది. నందలాల్ మెహతా కన్నాట్ ప్లేస్ నివాసి. గాంధీని కాల్చినప్పుడు ఆయన పక్కన నించుని ఉన్నది మెహతాయే.

పోలీసులకు మెహతా చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘ఇవాళ నేను బిర్లాహౌస్‌లో ఉన్నాను. సాయంత్రం సుమారు 5.10 అయింది. మహాత్మాగాంధీ బిర్లాహౌస్‌లోని తన గది నుంచి ప్రార్ధనా స్థలానికి బయల్దేరారు. ఆభా గాంధీ, సన్నో గాంధీ ఆయనతో పాటు ఉన్నారు. ఆ ఇద్దరు అక్కచెల్లెళ్ళ మీదా చేతులు వేసుకుని మహాత్ముడు నడుస్తున్నారు. ఆ సమూహంలో మరో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. నేను, లాలా బ్రిజ్‌కిషన్, సర్దార్ గుర్బచన్ సింగ్ అనే మరో ఇద్దరు ఢిల్లీ నివాసులు కూడా ఉన్నాము. మేము కాకుండా, బిర్లా కుటుంబానికి చెందిన మహిళలు, బిర్లాహౌస్ సిబ్బందిలోని ఇద్దరుముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారు. మహాత్మాగాంధీ తోటని దాటాక ప్రార్థనా స్థలం వైపు దారితీసే కాంక్రీట్ మెట్లు ఎక్కారు. మెట్లకు రెండువైపులా జనాలు నిలబడి ఉన్నారు. మహాత్ముడు వెళ్ళడానికి సుమారు మూడు అడుగుల ఖాళీ స్థలం ఉంది. ఆనవాయితీ ప్రకారం మహాత్మా గాంధీ తన చేతులు జోడించి ప్రజలకు నమస్కారాలు చెబుతున్నారు. ఆయన గట్టిగా ఆరో ఏడో మెట్లు ఎక్కి ఉంటారు, అంతలో ఒక వ్యక్తి దగ్గరకు వచ్చాడు. అతను పుణే నగరానికి చెందిన నారాయణ్ వినాయక్ గాడ్సే అని నాకు తర్వాత తెలిసింది. ఒక పిస్టల్‌తో మహాత్మా గాంధీ మీద కాల్పులు జరిపాడు. అతను మహాత్ముడికి 2-3 అడుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. అతను గాంధీని పొట్టలోనూ, ఛాతీ మీదా కాల్చాడు. గాంధీజీ శరీరం మీద రక్తం పారింది. గాంధీజీ రామ్‌రామ్‌ అంటూ వెనక్కి పడిపోయారు. దాడి చేసిన వ్యక్తిని ఘటనా స్థలంలోనే ఆయుధంతో సహా పట్టుకున్నారు. స్పృహ తప్పిన మహాత్ముణ్ణి ఆ స్థితిలోనే బిర్లాహౌస్ రెసిడెన్షియల్ యూనిట్‌కు తీసుకువెళ్ళారు. ఆ దారిలోనే మహాత్ముడు ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడికి పాల్పడిన యువకుణ్ణి పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు…..’’

ఎఫ్ఐఆర్ నమోదయ్యే సమయానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మాధవరావు సదాశివ గోళ్వాల్కర్ చెన్నైలో (అప్పటి మదరాసు నగరం) ఆర్ఎస్ఎస్ సమావేశంలో పాల్గొంటున్నారు. నగరంలోని ప్రముఖ వ్యక్తులు చాలామంది ఆ సభకు హాజరయ్యారు. ఆ సభలో పాల్గొన్న ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాల మేరకు, గోళ్వాల్కర్ అప్పుడే తేనీరు సేవించబోతుండగా గాంధీ మరణవార్త ఎవరో వెల్లడించారు. వెంటనే ఆయన తన చేతిలోని కప్పును కింద పెట్టేసారు. గాద్గదిక స్వరంతో ‘‘దేశానికి ఇదెంతో దురదృష్టకరం’’ అన్నారు.

ఆయన వెంటనే అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవాహర్‌లాల్‌ నెహ్రూ, కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, గాంధీ కుమారుడు దేవదాస్ గాంధీలకు టెలిగ్రామ్ ద్వారా సంతాపసందేశాలు పంపించారు.తర్వాత గోళ్వాల్కర్‌ తన దేశవ్యాప్త పర్యటనను రద్దు చేసుకుని నాగపూర్‌లోని సంఘ కేంద్రకార్యాలయానికి చేరుకున్నారు.

గాంధీకి మృతికి సంతాపసూచకంగా ఆర్ఎస్ఎస్ శాఖలు అన్నింటినీ 13 రోజుల పాటు మూసివేయమని ఆదేశించారు. సంఘ చరిత్రలో అన్నినాళ్ళు శాఖ జరగకుండా నిలిచిపోవడం అదే మొదటిసారి. 1925లో సంస్థ స్థాపించిన నాటినుంచీ సంవత్సరంలో 365 రోజులూ శాఖలు జరుగుతూనే ఉన్నాయి. అది సంస్థ విధించుకున్న స్వీయ నియమం. అయితే మహాత్ముడి మరణం ఒక్క సందర్భంలో మాత్రమే శాఖల నిర్వహణకు మినహాయింపు ఇచ్చారు. గాంధీజీ అంటే ఆర్ఎస్ఎస్‌కు ఉన్న గౌరవానికి నిదర్శనం అది.

గోళ్వాల్కర్ నాగపూర్ చేరుకున్నాక పండిట్ నెహ్రూకు లేఖ రాసారు. ‘‘దేశానికి చుక్కాని వంటి వ్యక్తి మీద దాడి జరిగింది. విభిన్న స్వభావాలు కలిగిన వారందరినీ ఒక దారంలా కలిపి ఉంచి, అందరినీ సరైన దారిలో పెడుతున్న అలాంటి వ్యక్తి మీద దాడి చేయడమంటే ఆ వ్యక్తికి మాత్రమే కాక దేశం మొత్తానికీ ద్రోహం చేయడమే. అలాంటి ద్రోహానికి పాల్పడిన వ్యక్తి మీద మీరు, అంటే ప్రభుత్వ అధికారులు, కఠినమైన చర్య తీసుకుంటారు అనడంలో సందేహమే లేదు. కానీ ఇది మనందరికీ పరీక్షా సమయం. ఈ కష్టకాలంలో దేశాన్ని సురక్షితంగా ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత మనందరి మీదా ఉంది.’’

ఆర్ఎస్ఎస్ చీఫ్ అప్పటి ఉపప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు రాసిన లేఖలో ‘‘అందరినీ కలిపి ఉంచే గొప్ప వ్యక్తి అకాల మరణం కారణంగా పడిన బాధ్యతను మనందరం పంచుకుందాం. వేర్వేరు లక్షణాలు కలిగిన మనందరినీ ఒక బంధంతో దగ్గరకు తీసుకొచ్చి, అందరినీ ఒకే బాటలో నడుపుతూ వచ్చిన ఆ మహానుభావుడి పవిత్ర జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకోవాలి. ఈ కష్టకాలంలో మనందరం మన భావాలను అదుపు చేసుకోవాలి, మన శక్తిని కాపాడుకోవాలి. జాతి జీవితాన్ని ఐకమత్యంతో బలోపేతం చేసుకోవాలి’’ అని రాసుకొచ్చారు.

అయితే ప్రభుత్వం మాత్రం మరోలా స్పందించింది. 1948 ఫిబ్రవరి 4న ఆర్ఎస్ఎస్‌ను నిషేధించింది. గోళ్వాల్కర్‌ను అరెస్ట్ చేసారు. దురదృష్టం ఏంటంటే గోళ్వాల్కర్‌ను అరెస్ట్ చేయడానికి బెంగాల్ స్టేట్ ప్రిజనర్స్ యాక్ట్ అనే చట్టాన్ని ప్రయోగించారు. అదే చట్టాన్ని నల్లచట్టం అంటూ నెహ్రూ అంతకంటె చాలాముందే విమర్శించాడు. గోళ్వాల్కర్‌ను ఆరు నెలల తర్వాత విడుదల చేసారు, కానీ మరికొన్నాళ్ళకే మళ్ళీ అరెస్ట్ చేసారు. దాంతో ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు సత్యాగ్రహం చేసారు. 77వేలమందికి పైగా స్వయంసేవకులు అరెస్ట్ అయ్యారు. అయినప్పటికీ ఆనాటి ప్రభుత్వం సంఘానికి వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యమైనా చూపలేకపోయింది.

నిజానికి గాంధీ హత్య జరిగిన నెల రోజుల తర్వాత సర్దార్ పటేల్ ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూకు లేఖ రాసారు. ‘‘బాపూ హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు పురోగతిని నేను వ్యక్తిగతంగా నేనే ప్రతీరోజూ పర్యవేక్షిస్తున్నాను. ప్రధాన నిందితులు అందరూ తమ కార్యకలాపాల గురించి సుదీర్ఘమైన, సవివరమైన ప్రకటనలు ఇస్తున్నారు. వాటిని బట్టి ఈ కేసులో ఆర్ఎస్ఎస్‌కు ఎలాంటి ప్రమేయమూ లేదని స్పష్టంగా తెలుస్తోంది’’ అని ఆ లేఖలో రాసారు.

ఆర్ఎస్ఎస్ చీఫ్ గోళ్వాల్కర్‌కు రాసిన ప్రతిలేఖలో కేంద్ర ఉపప్రధానమంత్రి సర్దార్ పటేల్ ఇలా చెప్పారు. ‘‘సంఘం మీద విధించిన నిషేధాన్ని ఎత్తివేయడంతో నేను ఎంత సంతోషంగా ఉన్నానో కేవలం నా దగ్గరున్న కొద్దిమందికి మాత్రమే తెలుసు’’ అంటూ రాసుకొచ్చారు.

సంఘం మీద నిషేధం 1949 జూన్ 12న తొలగించారు. అయినప్పటికీ సంఘ్ విద్వేషులు గాంధీ హత్యలో సంఘం పాత్ర ఉందంటూ దుష్ప్రచారాన్ని ఆపలేదు.

1966లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, గాంధీ హత్య కేసును క్షుణ్ణంగా అధ్యయనం చేయాలంటూ కొత్త జ్యుడీషియల్ కమిషన్‌ను నియమించింది. విశ్రాంత సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జెఎల్ కపూర్ ఆ కమిషన్ నాయకుడు. ఆ కమిషన్ మొత్తం 101 మంది సాక్షులను, 407 పత్రాలనూ పరీక్షించింది. కమిషన్ ఎట్టకేలకు 1969లో తమ నివేదికను ప్రచురించింది. అందులో ముఖ్యాంశాలు…
  • (అ) నిందితుడు ఆర్ఎస్ఎస్‌లో సభ్యుడని కానీ లేదా దాని సభ్యులతో సంబంధం ఉందని, లేదా ఆ హత్యలో ఆ సంస్థకు ప్రమేయం ఉందనీ నిరూపణ అవలేదు.
  • (ఆ) మహాత్మా గాంధీ, లేదా ఇతర ప్రధాన కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ హింసాయుత కార్యక్రమాలకు పాల్పడిందనడానికి ఆధారాలు లేవు
  • (ఇ) నిందితుడు ఆర్ఎస్ఎస్‌ సభ్యులని లేదా నేతల హత్యల వెనుక ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉందనీ నిరూపణ కాలేదు.
అయినా నేటికీ కాంగ్రెస్ నాయకులకు గాంధీ హత్యను సంఘానికి ముడిపెడుతూ వ్యాఖ్యలు చేయడం, కోర్టుల్లో మొట్టికాయలు వేయించుకోవడం అలవాటైపోయింది.

__Vskteam

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top