ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందిన పూరీ జగన్నాథుని రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది. ఈ సందర్భంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులు ఈ సమయంలో నిస్వార్థంగా సేవలందిస్తూ, తమ నిబద్ధతను చాటుకున్నారు. రథ యాత్ర సందర్భంగా దాదాపు 1,560 మందికి పైగా స్వయంసేవకులు పూర్తి అంకిత భావంతో సేవలందించారు. భక్తులకు అవసరమైన ప్రతి సేవలనూ అత్యంత చురుగ్గా, అంకిత భావంతో సేవలందించడంతో ప్రజల నుంచి ప్రశంసలను అందుకుంటున్నారు.
సంఘ స్ఫూర్తికి అనుగుణంగానే స్వయంసేవకులు అవసరాలకు అనుగుణంగా స్పందిస్తూ వచ్చారు. భారీ జన సమూహం వున్నప్పటికీ, ఎక్కడా తొందరపడకుండా, గాబరా కాకుండా, జాగ్రత్తగా, అత్యంత క్రమశిక్షణతో సేవలందించారు. వైద్య సహాయం మొదలు..భక్తులకు ఏ అవసరం వచ్చినా, తక్షణమే స్పందించారు. ప్రధానంగా 9 రకాల సేవలను స్వయంసేవకులు విస్తృతంగా అందించారు. అంబులెన్సుల కోసం కారిడార్ నిర్మాణం, అంబులెన్స్ సహాయం, స్ట్రెచర్ల సహాయం, ట్రాఫిక్ నియంత్రణ, నీటి వ్యవస్థ, ఆస్పత్రిలో సౌకర్యాలు, శుచి, శుభ్రత, ప్రాథమిక వైద్య సహాయం విషయంలో తమ సేవలను అందించారు.
రథ యాత్ర ప్రారంభమైన రోజు ఉదయం 8:30 గంటలకే స్వయంసేవకులు తమ సేవలను ప్రారంభించారు. భోలానాథ్ స్కూల్ సమీపంలోని ఉత్కల్ బిపన్న సహాయత సమితి ప్రాథమిక కేంద్ర వద్ద ఈ సేవలను ప్రారంభించారు. ఈ సేవలను ప్రారంభించే ముందు సంప్రదాయం అనుసారంగా సంఘ పెద్దలు, విశ్వహిందూ పరిషత్ ప్రముఖ నేతలు అక్కడికి చేరుకొని, జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత స్వయంసేవకుల సేవలు ప్రారంభమయ్యాయి.
అయితే.. రథ యాత్ర సేవా సంయోజక్ రుద్ర నారాయణ మహాపాత్ర ఆధ్వర్యంలో పక్కా ప్రణాళిక ప్రకారం స్వయంసేవకులు సేవలందించారు. రద్దీ అధికంగా వుండటం, విపరీతమైన వేడి వల్ల భక్తులు తరుచూ మూర్ఛపోవడం లేదా గాయపడటం వంటి సంఘటనలు జరిగాయి. ఈ విషయంపై కూడా ఆరెస్సెస్ స్వయంసేవకులు వెంటనే స్పందించి, వారికి ప్రాథమిక చికిత్స చేసి, అంబులెన్సుల్లో వారిని జాగ్రత్తగా ఆస్పత్రికి తరలించే బాధ్యతలను భుజాలకెత్తుకున్నారు. గాయపడిన, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన భక్తులను స్ట్రెచర్లు, అంబులెన్సులను ఉపయోగించి ఆస్పత్రులకు తరలించారు కూడా.
దీనికి కోసం ప్రత్యేకంగా వున్న బృందాలకు స్వయంసేవకులు పూర్తిగా సహకరించారు. అంతేకాకుండా రథయాత్రకు విపరీతంగా భక్తులు రావడంతో.. రోగులను తరలించడానికి ఇబ్బందులు కలుగుతాయని ముందే గ్రహించిన స్వయంసేవకులు.. అత్యవసర కారిడార్ ను ఏర్పర్చడంతో పాటు, మానవ గొలుసులుగా ఏర్పడి, రోగులు సమయానికి ఆస్పత్రికి చేరేలా ప్రయత్నాలు చేశారు. వైద్యులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ.. తగిన వైద్య చికిత్స అందేలా చేశారు. దీని కోసం స్వయంసేవకులు బృందాలు, బృందాలుగా విడిపోయి, షిప్టుల వారీగా సేవలందించారు.
వైద్య కేంద్రాలలో సుమారు 200 మంది చొప్పున స్వయంసేవకులున్నారు. మరో 200 మంది బడాదండాను శుభ్రం చేయడంలో నిమగ్నమయ్యారు. అలాగే వైద్యులు, ఫార్మసిస్టులకు కూడా స్వయంసేవకులు సహాయకులుగా వుంటూ సహాయపడ్డారు. అలాగే మరో 100 మంది స్వయంసేవకులు ట్రాఫిక్ నియంత్రణ కోసం, మరో 884 మంది స్వయంసేవకులు అంబులెన్స్ కారిడార్ కోసం, ఇతర సేవల్లో పాల్గొన్నారు. వీరందరికీ ప్రాంత ప్రచారక్, సహ ప్రాంత ప్రచారక్, ఇతర జ్యేష్ఠ ప్రచారకులు తగిన మార్గనిర్దేశనం అందించారు.
@vskts