ప్రపంచ వ్యాప్తంగా బురఖాలపై తీవ్ర వ్యతిరేకత, నిరసన వ్యక్తమవుతూనే వుంది. ఇరాన్ లో ముస్లిం మహిళలు రోడ్లపైకి వచ్చి, బురఖా ధరించడాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. అయితే... తాజాగా ముస్లింలు అధికంగా నివసించే కజకిస్తాన్ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాలలో నిఖాబ్, ముఖాన్ని కప్పివుంచే అన్ని రకాల దుస్తులను ధరించడాన్ని నిషేధించింది. దీనిపై ప్రధాన మంత్రి కాసిమ్-జోమార్ట్ టోకాయేవ్ ఒక చట్టంపై సంతకం చేశారు, దీని ప్రకారం దేశంలో ఏ వ్యక్తి కూడా బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించొద్దు. అయితే.. అనారోగ్య కారణాలున్నా.. వాతావరణం బాగో లేకపోయినా, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం ముఖం కప్పుకోవడానికి మినహాయింపు వుంటుందని ప్రభుత్వం తెలిపింది.
ఈ నిర్ణయం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది, ముఖ్యంగా హిజాబ్ వంటి వస్త్రధారణ ఇస్లామిక్ దేశాలలో చారిత్రక మరియు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది.
అయితే.. బుర్ఖా ధరించడం వల్ల ముఖ గుర్తింపు గానీ, ఇతరత్రా భద్రతా ప్రమాణాలను పాటించే విషయంలో గానీ, ఆధునిక సాంకేతికత ద్వారా మనుషులను గుర్తించే విషయంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నట్లు కజకిస్తాన్ సర్కార్ గుర్తించింది.ముఖాన్ని కప్పి ఉంచే దుస్తులు వ్యక్తులను గుర్తించడాన్ని లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు కష్టం చేస్తున్నాయని అధికారులు అంటున్నారు.
ఇది ప్రజల సెక్యూరిటీకే ముప్పు అని వాదిస్తున్నారు. దీని కారణంగానే బుర్ఖాపై నిషేధం విధించాలని డిసైడ్ అయినట్లు సమాచారం.మరోవైపు ఒకప్పటి సోవియట్ యూనియన్ లో కజకిస్తాన్ భాగం. ఇప్పటికీ దాని సాంస్కృతిక అంశాలతో ప్రభావితం అవుతూనే వుంటుంది. అయితే.. తాజాగా కజకిస్తాన్ లో ఓ డిమాండ్ తెరపైకి వచ్చింది. స్థానికంగా వుండే వారసత్వం, సంస్కృతిని, గుర్తింపును స్వీకరించాలన్నది డిమాండ్.
అయితే.. ఈ ఆలోచనను కొన్ని వర్గాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బుర్ఖాను నిషేధించడంపై మండిపడుతున్నాయి. సంప్రదాయం కొనసాగించాల్సిందేనని పట్టుబడుతున్నాయి. అయినా అక్కడి ప్రభుత్వం మాత్రం ముందుకే సాగుతోంది. మతం అనేది వ్యక్తిగత విషయమని, ప్రజా జీవితానికి వస్తే మాత్రం దేశ సాధారణ సంస్కృతిని, గుర్తింపును ప్రతిబింబించేలా వుండాల్సిందేనని తేల్చిచెబుతోంది.