ఇకపై అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో భగవద్గీత పారాయణం తప్పనిసరి అని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 14 న ఈ ఉత్తర్వు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం భగవద్గీత శ్లోకాలను పారాయణం చేయాలని విద్యార్థులను ఆదేశించారు. ప్రతిరోజూ ఒక శ్లోకం పారాయణం చేయడమే కాకుండా ఒక శ్లోకాన్ని వారపు శ్లోకంగా ప్రకటించి దాని అర్థాన్ని నోటీసు బోర్డులో రాయాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అంతేాకాకుండా రామాయణాన్ని కూడా అందులో చేర్చింది. దీంతో ఇకపై విద్యార్థులు భగవద్గీత శ్లోకాలను, రామాయణాన్ని కూడా అధ్యయనం చేస్తారు.
సాంప్రదాయ భారతీయ జ్ఞానాన్ని ఆధునిక విద్యతో మిళితం చేయడం, విద్యార్థులలో స్వీయ క్రమశిక్షణ, నాయకత్వం, భావోద్వేగ సమతుల్యత వంటి విలువలను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రతిరోజూ ఒక గీతా శ్లోకాన్ని పఠించడంతోపాటు, దాని అర్థం, ఔచిత్యాన్ని విద్యార్థులకు వివరించాలని ఆదేశించింది.
క్లాస్‌రూం యాక్టివిటీలో భాగంగా వారంలో చివరలో ఆ శ్లోకంపై చర్చ, విద్యార్థుల అభిప్రాయం తీసుకోవాలని పేర్కొంది. ఇది భారతదేశ సాంప్రదాయ జ్ఞాన వ్యవస్థలను ఆధునిక విద్యా చట్రంలో ఏకీకృతం చేయడాన్ని నూతన జాతీయ విద్యా విధానం (NEP) ప్రోత్సహిస్తున్నదని వెల్లడించింది.
భారతీయ విద్యలో దశాబ్దాలుగా కొనసాగుతున్న సైద్ధాంతిక అసమతౌల్యాన్ని సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సిలబస్ లో రామాయణ, భగవద్గీతను చేర్చాలని ప్రభుత్వం ఇప్పటికే NCERT ని ఆదేశించింది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి ప్రకటించారు.
ఉత్తరాఖండ్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో తరగతి గదిలో తిరిగి భారత దేశ సంస్కృతి, జాతీయ ధోరణి పరిఢవిల్లినట్లైంది. కొన్ని సంవత్సరాలుగా విద్యా విధానంలో మార్క్సిస్టులు చొరబడి, భారతీయ మూలాలున్న విద్యా విధానాన్ని విద్యార్థులకు దూరం చేశారు. తాజా నిర్ణయంతో విద్యార్థులకు అసలైన పరంపర, సంస్కృతి తెలిసినట్లైంది. కానీ ఇప్పుడు NEP2020 కింద విద్యా విషయాలను పునర్నిర్మించానికి ఓ చేతనా ప్రయత్నం అద్భుతంగా జరుగుతోంది.

